Wednesday, July 6, 2022
Home > పుస్తక పరిచయం > “ హైదరాబాద్ ! ఓ ! హైదరాబాద్ !” ( దీర్ఘ కవిత) , పరిచయ కర్త: సంకేపల్లి నాగేంద్ర శర్మ.

“ హైదరాబాద్ ! ఓ ! హైదరాబాద్ !” ( దీర్ఘ కవిత) , పరిచయ కర్త: సంకేపల్లి నాగేంద్ర శర్మ.

హైదరాబాద్ నగరంపై సబ్బని దీర్ఘ కవిత “ హైదరాబాద్ ! ఓ ! హైదరాబాద్ !”
తెలంగాణ సాహితీ సంస్కృతులు , వెనుకబాటుతనంపై అధ్యయనం చేస్తూ వివిద సాహితీ ప్రక్రియల్లో 2001 సంవత్సరం నుండి నాణ్యమైన రచనలను వెలువరించారు సబ్బని లక్ష్మీనారాయణ. ‘తెలంగాణ ఒక సత్యం ‘ వచనకవితా సంపుటి, “ హైదరాబాద్ ! ఓ ! హైదరాబాద్ !” ( దీర్ఘ కవిత), “చారిత్రక తెలంగాణ” ( గేయ కవిత), ‘తెలంగాణ రెక్కలు’, ‘తెలంగాణ నానోలు’, ‘తెలంగాణ హైకూలు’, ‘తెలంగాణ నానీలు’ అనే పుస్తకాలను విలక్షణ రీతిలో ప్రచురించారు.
హైదరాబాద్ అంటే తెలంగాణ గుండె కాయ. 400 ఏళ్ళ తెలంగాణ సాహితీ కళా వైభవ ప్రతిబింబ చిత్రం. కులీకుతుబ్ షాహీల నుండి, మొగలాయిలు, బహమనీలు, నిజాం ప్రభువులు హైదరాబాద్ ను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. 1947,అగస్ట్ 15 భారత స్వాతంత్ర అనంతరం 17 సెప్టెంబర్ 1948 నాడు పోలీసు చర్యతో నిజాం ఫ్యూడల్ పాలన నుండి విముక్తిపొందిన తరువాత ఒకే భాష పేరుతొ పెద్దమనుషుల ఒప్పందం మేరకు హైదరాబాద్ విశాలాంధ్రకు రాజధానిగా వ్యవహరించబడ్డ ఈ అరువై ఏళ్లలో తన మూలమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఇమిడ్చుకొని చెక్కుచెదరకుండా ఉండడం గమనార్హం. తెలంగాణ టాంక్ బండ్ పై వెలసిన తెలంగాణేతర విగ్రహాలను కూల్చడంతో తెలంగాణ ఉద్యమం యొక్క చివరి దశ విరోచిత ప్రభావం అభివ్యక్తమవుతుంది. హైదరాబాద్ ను కేంధ్ర పాలిత ప్రాంత రాజధానిగా, ఫ్రీ జోనుగా మార్చడానికి జరుగుతున్న కుట్రల్ని నిరసిస్తూ హైదరాబాద్ పై లోతుగా అధ్యయనం చేసి సబ్బని సహస్ర వచనాలతో పురివిప్పిన మయూరిలా ఈ దీర్ఘ కవితను డిసెంబర్ 2009, జనవరి 2010 లలో రాసి డిసెంబర్ 2010 లో పుస్తక రూపంలో వెలువరించారు.

“ అరువై యేండ్ల సుదీర్ఘ దుఃఖానికి సబ్బని దీర్ఘ కవిత ఒక సమాధానం, ఒక రవ్వంత ఓదార్పు, ఐతే అక్కడే ఆగిపోకుండా చదువరులను ఈ కవిత్వం, కార్యోన్ముఖం గావించాలి” అని ఈ దీర్ఘ కవితకు ముందు మాట రాసిన ప్రముఖ చరిత్రకారులు, కవి పరవస్తు లోకేశ్వర్ గారు ఆకాంక్షించారు.
‘నేటి నిజం’ దిన పత్రికలో ఈ కవిత పూర్తిగా అచ్చయి సాహితీవేత్తలు, తెలంగాణ వాదులే కాకుండా ఎందరెందరో ప్రశంసలకు నోచుకోంది. ఇందులో జలపాతధారల్లాగా ప్రవహించే కవిత్వమే కాక, హైదరాబాద్ నగర సంస్కృతి, సౌందర్యం ఆవిస్క్రుతమౌతుంది. ఉర్దు, తెలుగు మిశ్రమ భాషలకు చెందిన పదబందాలు, నుడికారాలు, పాటకుల్ని అలరిస్తాయి.

“ హైదరాబాద్! ఓ! హైదరాబాద్!
భాగమతికీ భాగ్యనగర్ !
చార్ సౌ సాల్ కా సుందర్ షహర్
ఎవరు నిర్మించారమ్మా, నిను ఎపుడు నిర్మించారు?
చార్మినార్ నీ గుండెలపై ఎగసి నిలుచున్న
నిలువెత్తు సుందర హర్మ్యం
హుస్సేన్ సాగర్ నీ నడుముకు
సుందర కాంతివంతమైన బంగారు ఒడ్దాణం
సుల్తాన్ బాజార్ నీ నాజూకు మెడపై
మెరిసే రవ్వల నెక్లస్ హారం
గోల్కొండ నీ నివాస రక్షణ దుర్గం
నీ ముఖ సౌందర్యంపై చెముక్కున మెరిసే
ముక్కుపుడక బిర్లామందిర్ ను హుందాగా మోస్తున్న నౌబత్ పహాడ్
ఎప్పటిదమ్మా, ఏనాటిది?
బాగొంకీ సుందర్ షహర్ హైదరాబాద్”
అంటూ మొదలైన ఈ దీర్ఘ కవిత హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, నిర్మాణం,సౌందర్యం, అభివృద్ధి, జీవనవిధానంల గురించి వివిద కోణాల్లో విశ్లేషిస్తూ రమణీయంగా , కవితాత్మకంగా సాగిపోయిన రచన ఇది.
హైదరాబాద్ నగరమంటే ఎవరు ఇష్టపడరని? హైదరాబాద్ నగరాన్ని ఎవరు ప్రేమించరని? హైదరాబాద్ నగరంలో , వివిద రాష్ట్రాల వివిధ భాషల మతాల ప్రజలున్నారు, ఇంకా ప్రపంచప్రజలున్నారు. హైదరాబాద్ ఎవర్నయినా ఎప్పుడైనా పోమ్మన్నదా ? అని ప్రశ్నిస్తూ,
“హైదరాబాద్! ఓ! హైదరాబాద్ !
నువ్వంటే అందరికీ ప్రేమ కదా !
అయినా నువ్వు ఎవర్నయినా ఎప్పుడైనా పోమ్మన్నావా చెప్పూ?
నీపై ఉట్టి అబాండాలు వేయడం కాదా?
…………………………………….
అందర్ని అణకువతో అక్కున చేర్చుకొని
చల్లగా సేద దీర్చే కడుపు చల్లని తల్లివి కదా నువ్వు! “ అంటాడు.
నేటి చారిత్రక సందర్భంలో హైదరాబాద్ రాజధానిగా పదిజిల్లాలతో కూడుకొని తెలంగాణ ఏర్పాటు ప్రకటించిన తరుణంలో, హైదరాబాద్ మాదని, అందరిదని, హైదరాబాద్ ను వేరుగా ఉంచాలని,యు.టి. చెయ్యాలని, హైదరాబాద్ పై పెట్టుబడులు పెట్టినమని అంటున్న తరుణములో,
“హైదరాబాద్! ఓ! హైదరాబాద్ !
ఎవరి ప్రేమ ఎంత నీపై ?
ప్రేమకు పెట్టుబడులు పెట్టి ప్రేమిస్తారా?
ప్రేమ తల్లికి బిడ్డకు ఉండే బంధంలా ఉండాలి .
ప్రేమ నీటికి చేపకు ఉండే బంధంలా ఉండాలి
ప్రేమ తనువుకు, ఆత్మకు ఉండే బంధంలా ఉండాలి
ప్రేమ పూవుకు, తావికి ఉండే సంబంధంలా ఉండాలి” అని ఎవరి ప్రేమలో నిజాయితీ ఎంత అని ప్రశ్నిస్తారు.
ఇక హైదరాబాద్ నగరంలో ఉండేవారి గురించి, నగరం గురించి చెపుతూ,
“హైదరాబాద్ నగర అడుగడుగుకో చరిత్ర ఉంది
బస్తి బస్తీకి, వాడవాడకు, బజార్ బజారుకు
ఒక పేరు ఉంది , చారిత్రిక నేపథ్యం ఉంది
విలక్షణమైన జీవన విదానం ఉంది “ అని చెపుతూ,
హైదరాబాద్ లో పంజాబీలు, సిక్కులు, బెంగాలీలు, తమిళులు, మరాటీలు, కన్నడిగులు,సింధీలు, పార్సీలు, ఆంగ్లో ఇండియన్స్, రోహిలఖండ్ రోహిల్లాలు, బుందేల్ఖండ్ బొందిలోల్లు, గుజరాత్ లోథాల్ లోథీలు, బంజారాలు, పటానులు, ఆఫ్ఘనులు, టర్కీలు, అరబ్బులు, కాబూలీలు, ఇథియోపియా, అబిసీనియా ఆఫ్రికన్ నీగ్రోలు, హబ్సిగూడ హాబ్సిలు, ఒకటేమిటి, హైదరాబాద్ నగరంలో లేని ప్రపంచ జాతి ప్రజలున్నారా అని తెలియ చేస్తున్నాడు సబ్బని తన దీర్ఘ కవిత ద్వారా.
హైదరాబాద్ కు తెలంగాణ కు ఉన్న అనుబంధాన్ని ఇలా చెపుతున్నాడు సబ్బని,
“హైదరాబాద్! ఓ! హైదరాబాద్ !
తెలంగాణకు గుండెకాయవు కదా నువ్వు!
తెలంగాణకు ఆత్మవు కదా నువ్వు
తెలంగాణ కరకమలములలో కోటి రత్నాల వీణవు కదా నువ్వు!”
అలనాడు తెలంగాణ బోయిలు మోసుకవచ్చిన ముత్యాల పల్లకివి కదా నువ్వు!
తెలంగాణకు ప్రాణసఖివి కదా నువ్వు!
తెలంగాణకు ఆత్మసాక్షివి కదా నువ్వు!” అని
ప్రేమకు చిహ్నంగా ప్రపంచంలో నిర్మించబడిన ఒకే ఒక్క నగరం హైదరాబాద్ అని తెలియ చేస్తూ,
“ నాలుగు కోట్ల ప్రజల వాణి
ఆత్మ త్యాగాల ఫలం
…………………….
భాగమతీకి భాగ్యనగర్
కులికుతుబ్ షా ప్రేమ రాణి
హైదరాబాద్ ..హైదర్.. ఆబాద్
Long live Hyderabad !” అంటూ వేయి లైన్లకు పైగా ఉన్న దీర్ఘ కవితను ముగిస్తాడు సబ్బని . హైదరాబాద్ నగరంపై తెలుగులో వచ్చిన తొలి దీర్ఘ కవిత ఇది. హైదరాబాద్ ను ఎవరు ఎంతవరకు ఏయే కాలాలలో అబివృద్ధి చేశారు తెలుసుకోవాలనుకొనే వారికి కరదీపిక ఈ పుస్తకం. మంచి పుస్తకం అందించిన సబ్బని అభినందనీయుడు.

– సంకేపల్లి నాగేంద్ర శర్మ , కరీంనగర్. ఫోన్: 9441797650.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!