Wednesday, July 6, 2022
Home > స్పెషల్ ఫీచర్ > నాన్నకు ప్రేమతో!

నాన్నకు ప్రేమతో!

“ఓ నాన్న నీ మనసే వెన్న .. అమృతం కన్నా .. అది ఎంతో మిన్న” అంటూ ‘ధర్మదాత’ చిత్రం లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా|| సి. నారాయణ రెడ్డి గారు నాన్నను ఉదాత్తంగా ఆవిష్కరించారు. అమ్మభూమి అయితే… నాన్న ఆకాశం! ‘అమ్మ మమతల పంట-నాన్న బాధ్యతల జేగంట” అంటూ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ఆచార్య ఎన్. గోపి గారు ఓ వ్యాసంలో నాన్న యొక్క గొప్ప తనాన్ని చాటి చెప్పారు.

ముళ్ల పొదల మార్గాన్ని అర చేతులతో చదును చేసి… ముడుచుకు పోయిన బ్రతుకు మొగ్గ మీద ఒక ప్రభాత కిరణమై ప్రసరించే వాడు నాన్న! నాన్న దేహాన్ని ఇచ్చే బీజ ప్రదాత. హితుడిగా, స్నేహితుడిగా, రక్షకుడిగా, కుటుంబ సంరక్షకుడిగా, అడిగినదే తడవుగా ఆప్యాయంగా సమకూర్చుతూ… అనుభవాల సారాన్ని అమూల్య నిధిగా అందించే దాత నాన్న! డా|| వడ్డేపల్లి కృష్ణ గారు ఓ కవితలో పేర్కొన్నట్లు… అమ్మా-నాన్న ప్రతి జీవితపు నాణానికి బొమ్మా-బొరుసు లాంటి వారు. ముఖం లాంటి అమ్మ ముందుగా బొమ్మలా అందరికీ గుర్తుండి పోతుంది! కానీ బోలెడు కష్టాలన్నీ భరిస్తూ… బొరుసులా వెనక వెన్నముకలాగున్న నాన్నను అందరం విస్మరిస్తాం ఇదెం వింతో మరి!

“నాన్న”… రెండక్షరాలే అయినా… నిర్వచించడానికి నింగి- నేల చాలదు. ఎందుకంటే.. సంసార సౌధానికి నిత్యం రాళ్లెత్తే కూలి నాన్న.. ‘నాన్న’ అనే శబ్దం అందరి అణువులోనూ చేరి పలికిన ప్రతిసారి విదుత్ తరంగమై ఉత్తేజాన్ని నింపుతుంది! తన సర్వస్వాన్నీ తృణ ప్రాయంగా అర్పించి తరళమైన చిరునవ్వుతోనే తాపాలను దాచుకునే శశాంకుడు నాన్న! జీవన కావ్యాన్ని రంగస్థలంపై చేతనతో… ప్రదర్శించే దర్శకుడు అయన! ప్రతి ఒక్కరి జీవిత నావకు చుక్కానిలా వ్యవహరించేది నాన్నే! అందరి ఎదుగుదలకు నిచ్చెనలా నిలిచేది నాన్నే! వెన్నెల లాంటి మనసు.. సాగరమంత గాంబీర్యం కలగలిపితే కనిపించేది నాన్న! అమ్మ మమతల ఓడ అయితే… నాన్న నీడనిచ్చే మేడ! కరిగిపోతూ… వెలుగు నిచ్చే కొవ్వొత్తిలా… అన్ని వేళల్లో ఆదరించి ఆదుకునేదీ నాన్నే! బుడి బుడి అడుగులతో తడబడు వేళ… నడక నేర్పి నడిపించేదీ నాన్నే కదా!

పురిటి మంచం పై తల్లి పక్కనే ఒదిగి మురిపెంగా చుసిన క్షణం నుంచి పోషణ, ఆరోగ్యం, విద్యాబుద్ధులు, వివాహాది బాధ్యతల నిర్వహణలో తనను గురించి ఎన్నడూ ఆలోచించని… నాన్న త్యాగానికి నిలువెత్తు సంతకం! మన గెలుపును చూసి మురుస్తాడు నాన్న.. మన ఓటమిలో బాసటగా నిలిచేదీ నాన్నే! గెలుపు ఓటములే జీవితమని విడమరిచి చెప్పేదీ నాన్నే!

నాన్నంటే అందరికి అభయమే కానీ భయం కాదు! కష్టాలకు కృంగక… సుఖాలకు పొంగక… అను నిత్యం శ్రమిస్తూ… హక్కుల గురించి ఆలోచించక… బాధ్యతలను నెరవేర్చే నిత్య శ్రామికుడు నాన్న! సాధారణంగా నాన్న కోపతాపాలు మనలో కలిగించే భయం… అనురాగంతో పిలవగానే మటు మాయమవ్వడం ఖాయం. జీవిత నిర్దేశకుడిగా… జీవిత అన్వేషకుడిగా నాన్న ప్రతి ఒక్కరి జీవన యానంలో ప్రముఖ పాత్రను పోషిస్తాడు. తండ్రి బిడ్డల అంతరాన్ని తొలగించి.. రక్తాన్ని బ్రతుకు ప్రమిదల్లో కుమ్మరించి అందరినీ ఆత్మదీపంలా పెంచే నాన్న త్యాగం ఎప్పటికీ మరువలేనిది! అమ్మ తొమ్మిది నెలలు మోసి కన్నప్పటికీ… తన కనురెప్పలే కాపుగా కాసి.. తన గుండెలనే పట్టు పరుపుగా మార్చి… తన సందిటనే ఊయల చేసి… నిదుర బుచ్చే నాన్న కూడా తక్కువేం కాదు. జీవన పరుగు పందెం లో తన బిడ్డలు సదా ముందుండాలని కాంక్షించే… ప్రత్యక్ష దైవం నాన్న! పిల్లల ఔన్నత్త్యాన్ని చూసి మురిసి పోయే అల్ప సంతోషి నాన్న! నాన్న లోని ప్రతి కష్టం బిడ్డలా జీవితానికి ఆదర్శం! ఉనికికి జీవం పోసి.. చిన్నప్పుడు నాన్న భుజాలపైకి ఎత్తుకున్నప్పుడు… ఆకాశాన్ని అందుకున్నంత ఆనందం పొందిన మధుర స్మృతులు ప్రతి ఒక్కరి జీవిత పుస్తకంలో నెమలీక వోలె భద్రంగా ఉంటాయన్నది వాస్తవం!

పితృదేవోభవ అన్నమాటకి బతుకు అర్దాన్ని చేతల్లో జోడిస్తూ.. పిల్లల భవిషత్తును వెలుగు రేఖలతో ఆశాజనకంగా మలిచే అపురూప శక్తి నాన్న! ఎర్రగా పండిన పరిమళాల తాంబూలం మనమైతే… అందులోని ఆకు, వక్క, సమస్తం నాన్నేనని ఒప్పుకోక తప్పదు! ఇంతటి ప్రాశస్త్యంతో… దైవ సమానంగా పరిగణింపబడే నాన్నలు నేడు చాలా మంది పండుటాకు ప్రాయానికి చేరుకోగానే పిల్లల నిరాదరణకు గురై… వృద్దాశ్రమాల్లో.. కాటికి కాళ్ళు చాపి బిక్కు బిక్కు మంటూ.. దిక్కు లేని వారిగా కాలం నెట్టుకొస్తున్నారు. పిల్లల ఉన్నతికే తమ జీవితాలను త్యాగం చేసిన నాన్నలు ఎంతోమంది నేడు నా అన్నవారు కరువై.. దుర్భరమైన జీవితం కొనసాగిస్తున్నారు. ఇంత అత్భుతమైన జీవితాన్నిచ్చిన నాన్నకు కృతజ్ఞతగా ఆయనకు ఆసరాగా నిలవాల్సింది పోయి… స్వార్థంతో నాన్నను వృద్దాశ్రమాల్లోకి నెట్టివేయడం జరుగుతున్నది. ఏనాడూ ప్రతిఫలం ఆశించని నాన్నకు కనీసం చివరి మజిలీలో అయినా ప్రశాంతత చేకూర్చాలి. గారాబంగా పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన నాన్న సేవలను నేడు చాలా మంది విస్మరించడం విచారకరం! బతుకంతా కొండంత అండగా నిలిచిన ఆయనకు చివరి అంకంలో అందరం ఆసరాగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది! నాన్నంటే… నారాయణుడే అని భావించి ‘పితృదేవోభవ’ అంటూ పూజించే మనదేశంలో… పితృ ఋణం తీర్చుకోవడానికి వృద్ధాప్యంలో అండగా ఉండి ఆదుకోవాలి! ఈసృస్టిలో నాన్న పాత్రను ఎవరూ నిర్వర్తించలేరన్న వాస్తవాన్ని గ్రహించి… వయసు పైబడి నాన్న అడుగులు తడబడువేళ.. మలి అడుగులమై.. నాన్నని ముందుకు నడిపించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉంది!

మరుజన్మలో నా కొడుకుగా పుట్టాలని… తండ్రి పాత్రలో నాన్న నీ ఋణం తీర్చుకుంటానని దేవుడిని ప్రతిఒక్కరు వేడుకోవాలి. వృద్ధాశ్రమాలకు పంపకుండా.. పెద్ద మనసుతో చేరదీస్తానని అందరు ప్రమాణాలు చేయాలి. ‘ఫాదర్స్ డే’ నాడే తండ్రులను గుర్తు చేసుకొని.. మిగితా సంవత్సరమంతా మరిచి పోవడం మంచిది కాదని గ్రహించాలి.

ప్రతికూల పరిస్థితులను గుండె నిబ్బరంతో ఎదుర్కొని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన నాన్న ఓ కర్మయోగి! నాన్నను ఆదరించుకోవడం లేదా స్మరించుకోవడం అంటే… మన జన్మల్ని స్పృశించుకోవడమే మరి! అందుకే అందరం నాన్నకు కృతజ్ఞతగా… ఆయన నడిచిన ప్రతి పాదానికి నమస్కరిద్దాం.. మట్టి కణాల మీద ఆయన పాద ముద్రల్ని నిత్యం ముద్దాడుదాం.. నాన్న అంటే అంతులేని ఆదరణ చూపి… అందరికి ఆదర్శనంగా నిలుద్దాం! జీవితమున్నంత వరకు ఆయన పాదాలకు ప్రణమిల్లుదాం.. రెక్కలు రాగానే… ఉపాధి పేరుతో.. ఏ దేశమేగినా.. అనుక్షణం కన్నవారిని… కంటికి రెప్పలా కాపాడుకుందాం! అమ్మతో పాటు నాన్న కూడా గొప్పవాడని గుర్తిద్దాం.

-దాస్యం సేనాధిపతి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!