Wednesday, January 26, 2022
Home > కథలు > పచ్చటి సంబురం – హుమాయున్ సంఘీర్

పచ్చటి సంబురం – హుమాయున్ సంఘీర్

కనుచూపు మేర కనిపిస్తున్న పొలిమేరనంతా తేరిపారా చూస్తూ ఉద్వేగానికి లోనవుతున్నాడు మేదరి దుర్గయ్య. అది నిజామాబాదు జిల్లా గోపాల పేట గ్రామం. ఆ వూరి పడమటి దిక్కున వున్న శివారును ‘లంబడి గడ్డ’ అంటారు. “ఎన్ని కర్వులచ్చినా లంబడి గడ్డ మీదున్న పొలాలకు ఎసోంటి జోకం గాదు ఎందుకంటే ఆ గడ్డ మీద గంగమ్మ తల్లి, ధాన్య లచ్చిమమ్మలు కొలువై వున్నరు గన్క..” ఆ శివారు మీద పొలం వున్న వారందరి ప్రగాఢ విశ్వాసం. “ఆ గడ్డ మీద గుంట భూమున్నా ఆడు దొరక్కొడ్కే” అన్కుంటారు చాలామంది. ఆ గడ్డని ఆనుకొని దట్టమైన అడవి అలుముకొని ఉంది. అక్కడ బోరువేస్తే మూడు, నాలుగు ఇంచుల కన్నా తక్కువ నీళ్ళు అస్సలు పడవు. నలభై అడుగుల నుండే నీళ్ళు ఊరుతాయి. అంతా నల్లరేగడి భూమి. యాసంగి, వానా కాలం సిరుల పంటలు పండే లంబడి గడ్డ శివారు ఎప్పుడూ పచ్చని ముత్తైదువలా కళకళలాడుతుంటుంది.

దుర్గయ్యకు కూడా ఆ గడ్డ మీద మూడెకరాల పొలం వుండేది గతంలో. చిన్న కూతురి పెళ్ళికని కూడని పరిస్థితుల్లో పొలాన్ని తెగమమ్మక తప్పలేదు తనకి. కోడెడ్లను కట్టి నాగలి గొర్రును భుమిలో దించితే నా సామిరంగ.. బంగారంలా సాలువారే ఆ పొలాన్ని అమ్ముకున్నందుకు దుర్గయ్య ప్రతి రోజూ కుమిలిపౌతూ బాధపడని రోజు లేదు. కనుసన్నల్లో పసి పాపల్లే దాచుకొని పొద్దనకా, రాత్రనకా ‘పొలమే బలం’ అనుకొని ఎనుప కష్టం చేసి ఆ పొలంలో పసిడి పంటలను పండించి గడచిన రోజుల్ని జ్ణాపకం చేసుకుంటూ.. ప్రతిరోజూ తప్పకుండా పొద్దు పొడవక ముందైనా, పొద్దు పోయాకైనా ఎవరూ చూడరని లంబడి గడ్డ మీదకొచ్చి పొగిలి పొగిలి ఏడుస్తూ కన్నీటి చుక్కలు రాల్చటం అతనికిప్పుడు ఒక దినచర్యలాగా అయిపోయింది.

ఆ పొలంతో అతనికున్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. అతని పంచ ప్రాణం, ఆత్మబంధువు అది. దాని మీద బెంగతో మనిషి ఈ ఐదేళ్ళ నుండి కృంగీ కృషించి పోసాగాడు. ముగ్గురు కూతుళ్ళ తర్వాత ఒకే ఒక్క కొడుకు కలిగాడు. అటు భార్య నర్సవ్వ, ఇటు తిను కలిసి పొలం మీదే గాకుండా కులవృత్తి అయిన మేదరి పనికి కూడా వారి రెక్కలకు ఇత్మారం లేకుండా చేస్కున్నారు. వెదురు బొంగులను పలుగజీరి బుట్టలు, చేటలు, చిబ్బీలు … అల్లి వారానికొకసారి జరిగే ఎల్లరెడ్డి ప్యాట అంగట్లో అమ్ముకొని కుటుంబాన్ని డక్లాయించుకుంటూ వస్తున్న పుణ్య దంపతులు వాళ్ళు. అలా ఇద్దరు కలిసి బాగా పని చేసి పైసా పైసా కూడబెట్టి ఇద్దరు కూతుళ్ళ పేళ్ళిళ్ళు బాగానే చెయ్యగలిగారు. మధ్యలో నర్సవ్వ పానం ఉషారు లేక గుండె ఆపరేషన్ కని చాలా డబ్బులు ఖర్చయి. సరిగ్గా చిన్న కూతురి పెళ్ళప్పటికి వారి చేతిలో చిల్లి గవ్వా లేని దుస్థితి ఏర్పడింది. మంచి సంబంధం, అబ్బాయి గురించి ఎంక్వైరీ చేస్తే ‘బుద్దిమంతుడని’ తేలింది. తన బిడ్డకు మంచి ఈడు జోడని ఈ సంబంధాన్ని ససేమిరా వదులుకోవడం ఇష్టంలేక “ఎసోంటి తంటాలైనా పడి, లేకుంటే ఏ శెరవోయైనా సరే నా శిన్న బిడ్డె పెండ్లి జెయ్యాలె” అని ధృఢంగా నిర్ణయించుకున్నాడు దుర్గయ్య. చేతిలో చిల్లిగవ్వా లేకుండా పెళ్ళి ఎలా అవుతుంది? ఉన్న ఆరెండు గదుల పెంకుటిల్లును ఆవూళ్ళో ఎవరు కొంటారు? కొన్నా ఆ డప్పులతో పెళ్ళి అవుతుందా? సమయానికి నోరు తెర్చి అడగ్గానే అప్పిచ్చే అంజయ్య సేటు సచ్చిపోయిండు. ఇక అప్పు పుట్టే ఆశ ఎక్కడా లేదు! చివరికి పొలమే తనకి ఆపద్పంధువులా కన్పించింది. “మొగ పెండ్లోల్లు అడ్గినంత కట్నమిచ్చి శిన్నబిడ్డె పెండ్లి మాఘనంగా జెయ్యాలె” అని చాలా గట్టిగా నిశ్చయించుకున్నాడు దుర్గయ్య.

అనుకున్నట్టుగానే పొలం అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగానే చేసాడు. “పెండ్లి జేస్కున్నంక నా బిడ్డె అత్తగారింట్లె మంచిగ సుకవడ్తె అదేజాలు. అల్లుడు బిడ్డెను కంటిపాప లెక్క జూస్కుంటే అంతకన్న ఎక్క ఏంగావాలె మాకు. ఒగింటికిచ్చిన ఆడివిల్లలు అత్తగారిండ్లల్ల సల్లగ బత్కుతే మాకదే పదివేలు” అనుకుని కూతురి పెళ్లి చేసిన దుర్గయ్య కిప్పుడు దుఖ్ఖమే మిగిలింది. పొలం పోగొట్టుకున్నాననే బాధ అతని అంతరాన్ని నిత్యం రంపంతో కోస్తూనే వుంది. “పొలం అమ్మి శాన పెద్ద తప్పు జేశిన్నేమో” అనుకుంటు పదే పదే చేజార్చుకున్న పొలాన్ని తల్చుకుంటూ దుర్గయ్య బాధపడని రోజు లేదు.

తనకా పొలం పెద్ద కొడుకుతో సమానం, కులవృత్తేమో కుడి భుజంతో సమానం…, కాలం కాటేసినట్టు పెద్దకొడుకు లాంటి పొలం పరుల పరుల సొంతమైపోయింది. పనుల్లేక కుడి భుజాన్నెవరో నరికేసినటు్టగా అయింది. అంతరాన్ని మెలి పెడుతున్న బాధతో అతని ధైర్యం మెల్లగా సన్నగిల్ల సాగింది. ఒంట్లో నీరసం తిష్ట వేయ సాగింది, నిత్యం అంతులేని దిగులుతో గుండె బరువెక్కిన క్షణాలు చాలా.. “సాడెసాతి పరిచ్చితులకు లా పొలం బలైందని” ఆ పొలాన్ని చూస్తూ గెట్టు మీద కూర్చొని పాతనైన పచ్చటి జ్ఞాపకాలను తలుచుకుంటుంచే లోలోపల్నుండి ఉబికొస్తున్న దుఖ్ఖాన్ని కన్నీళ్ళ ధారగా ఆ భూమి నెగళ్ళలోకి ఇంకిస్తున్నా అతని బాధ తీరేదేనా?

ప్రతిరోజులానే ఆ రోజు కూడా పొలంలో బాధపడి విచారంతో భారంగా ఊరివైపు కదిలాడు. గంటచుట్ట కాలుస్తూ త్రోవ సాగుతున్న అతనిప్పుడు శూన్యంతో దోస్తీ కట్టినట్టుగా వుంది. తలకు చుట్టుకున్న రుమాలు తీసి భుజం మీద వేస్కొని ఈ ప్రపంచంతో తనకి పని లేనట్టు దారి సాగుతున్నాడు. పడమటి పొద్దు ఎర్రబారి దుర్గయ్యను చాలా ధీనంగా చూస్తున్నట్టుగా వుంది. ఊళ్ళోకి జంగిడి గోజలల్ల ఆవులూ, బర్రెలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, … మందలు మందలుగా వస్తూ ఎర్రని దుమ్ము రేపుతున్నాయి. రేగుతున్న ఆ దుమ్ములోంచి తను శూన్యాన్నే చూస్తున్నాడు. నైరాశ్యం నిండి పోయింది అతని రెండు కళ్ళ నిండా!

“పచ్చటి నా పొలాన్ని పోడగొట్టుకున్న నేనెందుకు పుజూల్గ బత్కాలె. తాతల కాలం నుంచి నిశాని లెక్క అస్తున్న బంగారమసొంటి నేలతల్లిని అర్వంద్రం జేశి సచ్చి సర్గానున్న పెద్ద మన్సుల ఆత్మలను బాధవెట్టిన నేను అసలు మన్షినేనా? భూమిని వోగొట్టుకున్న నా అసొంటి నసీబ్ కరాబ్ రైతు ఈ భూమికే బర్వు. థూ. థూ.. ఎసొంటి కర్మ వట్టెనాకు?” అంటూ రకరకాల ప్రశ్నలు అతని మనస్సును ఎర్రగా తాల్చిన సూదితో పొడుస్తున్నట్టుగా వుంది. ఓడిపోయి నేల రాలుతున్న యుద్ధ విమానపు శకలంలా వుందతని నిలువు దృశ్యం. “ఏమే దుర్గన్నా … యాడికి వొయ్యస్తున్నవు?” ఎదురొస్తూ గొల్ల మల్లన్న పలకరించుకుంటూ పోతున్నా పట్టనట్టు అడుగులు భారంగా వేస్కుంటూ ఇంటివైపు వెళ్ళుతున్నాడు. అలా… తనెప్పుడు ఇంటికి చేరాడో, నర్సవ్వ పెట్టిన రెండు ముద్దలు ఎలా మింగాడో, సీస కల్లుతో గొంతెలా తడుపుకున్నాడో, గంటసుట్ట వెలిగించి గుండెల నిండా పొగని ఎలా పీల్చి వదిలాడో, … తెలియకుండానే, తన చర్యలు తన పరిధిలో లేకుండానే తనదైన అంతుచిక్కని ఆలోచనల ప్రవాహంలో తల మునకలౌతూ, బెంగతో బిక్క చచ్చిపౌతూ, అదిరి పడుతున్న ఆత్మ సాక్షిని ఎలా ఓదార్చాలో తెలియక, అంతరంగంలో అలజడులు రేపుతున్న క్షుద్భాధతో …., ఏ రాత్రికో కను రెప్పల్ని భారంగా మూసి నిద్ర పోయాడు దుర్గయ్య.

***

తూర్పు దిక్కు ఇవాళ చాలా కొత్తగా పొద్దు పొడిచినట్టుగా వుంది. పక్షుల కిల కిలా రావాల్లో ఏదో తెలీని ఆనంద పారవశ్యం కనిపిస్తోంది. పొద్దున్నే నర్సవ్వ చేతిలో ఏదో పుస్తకం పట్టుకొని వాకిట్లోంచి ఇంట్లోకి ఒకటే దౌడు తీసింది. ఇంకా నిద్ర లేవకుండా పడుకొని వున్న భర్త దెగ్గరికొచ్చి దమ్ము ఎగబీలుస్తూ “ఓ పెద్దమన్షి పొద్దువొడ్శి ఏ కాలమాయె ఇంకెంతశేపు పంటవే లేవ్ లేవ్.. జల్దిన లేస్తినంటే నీకొగ కుష్ కబర్ జెప్పాలె లేవ్వూ..” అంటూ కంగారు కంగారుగా భర్త భుజాన్ని పట్టి వూపుతోంది నర్సవ్వ. రాత్రంతా ఆలోచించీ ఆలోచించీ ఏ రాత్రికో నిద్ర పోయిన దుర్గయ్యకు అకంా నిద్ర సరిపోయినట్టు లేదు. భార్య తోపుకి చాలా ఇబ్బందీగా కళ్ళు తెర్చి అసహనంగా నర్సవ్వ ముఖం చూసాడు. కోటి కాంతులీనుతున్న ఆమె ముఖం చూసి ఏమీ అర్థంకాక ప్రశ్నావదనంతో లేచి కూర్చున్నాడు.

నర్సవ్వ మరో మాటకు ఆస్కారం లేకుండా తన చేతుల్లోని పుస్తకం దుర్గయ్య చేతులలో పెట్టింది. ఆపుస్తకాన్ని చిత్రంగా చూస్తూ పేజీలు తిరగేసాడు మరింత విచిత్రంగా మారిపోయిందతని ముఖం. క్షణాల్లో అతని నిద్ర మబ్బంతా తేలిపోయింది. “అరె ఇది మన భూమి పట్టా పాసుబుక్కూ, ఇది నీ దెగ్గర్కి ఎట్లచ్చింది? ఎవరిచ్చిర్రే నర్శీ?” ఉబికి వస్తున్న ఆనందాన్ని అదుముకోలేనట్టు అడుగుతున్నాడు దుర్గయ్య. ఎన్ని రోజుల తర్వాత తన భూమి పట్టా పాసుబుక్కులము చూస్తున్నాడో దుర్గయ్య. “అసలు అవిట్ని మల్లా ఈ జన్మల జూస్తనా” అనుకున్న దుర్గయ్య తనని తాను నమ్మలేకపోతున్నాడు. కలా నిజమా అనే డైలమాలో పడిపోయాడు. అలా కొంత సేపు ఆబుక్కులను చూస్తూ మైమరిచిపోసాగాడు. ఇంతలో అతని భుజాన్ని వూపుతూ “ఈ పట్టా పాసు బుక్కులు ఎట్లచ్చియోననే ముచ్చట మన ఆకిట్ల నిలవడ్డ శెంకరన్నను అడుగుదువుపా ముందుగాల్ల” అంటూ హడావిడిగా దుర్గయ్య రెక్క పట్టుకొని వాకిట్లోకి లాక్కొచ్చింది నర్సవ్వ. దుర్గయ్య కూడా ఒక్క ఉదుటున లేచి వాకిట్లోకి పరుగులాంటి నడకతో వెళ్ళాడు. దుర్గయ్యను చూడగానే వాకిట్లో నిల్చున్న శెంకరయ్య ప్రసన్నవదనంతో దుర్గయ్యకు ఎదురొస్తూ “ఆ.. ఆ.. దుర్గన్నా.. మంచిగున్నావె? ఇయాలటి సంది గ లంబడిగడ్డ పొలం నీది నీకే అయిందిగ. గది నీ సొంతమైందంటే నువ్వు మున్పటి తెయ్యునాడే దుర్గన్నవు అయితవిగ…” అంటున్న అతని మాటలు వింటున్న దుర్గయ్యకు ఒకవైపు ఆనందం, మరొకవైపు ఆశ్చర్యం తోడు అనుమానం కలుగుతున్నాయి. మళ్ళీ తనే చెప్తున్నాడు నీ పానం కన్న ఎక్క జూస్కన్న గా పొలం నాకప్పుడు నీ అక్కరకు అమ్ముకుంటివి గానీ.. మాయల పక్కీరోని పానం శిల్కలున్నట్టు నీ పానమంత అన్లనే వుండె. గందుకే నువ్వు వెట్టుకున్న కుదెంను సూడజాలక సాచ్చాత్తు ఆ భగవంతుడే నీ శిన్నల్లుని మనస్సుల దయపుట్టిచ్చి ఈ పని జెశిండే దుర్గన్నా..” అంటూ చెప్పుకుపోతున్న శెంకరయ్య మాటలు వింటూ ఇద్దరు ఆలుమగలు ఒకరి ముకాలు ఒకరు చూస్కుంటూ ఆశ్చర్య పోతున్నారు.

“ఏందీ నా శిన్నల్లుడా?” అన్నాడు స్వరం పెగలనట్టు. “అవునే దుర్గన్నా .. నీ శిన్నల్లుడే గీ పొలం నాతాన ఇప్పటి ధరకు ఇంకిన్ని పైశలు ఎక్కనే గట్టిచ్చి కొని, నీ పేరు పొంట పట్టా చేపిచ్చిండు. పాసుబుక్కు నీ శేతుల వెట్టిందాక ఈ ముచ్చట నీ ముంగట శెప్పద్దని నా తోని ఒట్టేపిచ్చుకున్నడు. నీ శిన్నల్లుడు నిజంగా మన్సున్న మారాజేయన్నా. దినాం ఆయినయి రొండు కాళ్ళు గడ్గీ నెత్తి మీద సల్లుకున్నా తప్పులేదే. ఇగ నేనచ్చిన పని అయిపోయింది గావట్టి నేను నడుస్త మరి అవుతల గోజలకు పచ్చిగడ్డి కోస్కచ్చే యాల్ల దాటి పోతున్నది. ఎండపొల్లు ఎక్కైతే గడ్డి ఎద్గి పాడుగాదు అస్తనే మల్ల..” అంటూ శంకరయ్య అక్కడినుండి వెళ్ళి పోతున్నాడు. అలా స్థానువుల్లా బిగుసుకుపోయారిద్దరు. వారిద్దరిలో ఆనందం, ఆశ్చర్యం తారాస్థాయిలో వుంది.

***

అదొక ఖరీదైన అందమైన భవనం. ఇంద్రభవనాన్ని తలపిస్తున్న ఆ బంగళా సిటీలోనే ఇప్పుడు చాలా ఫేమస్ అయిన జయదీప్ రియలిస్టేట్ కంపెనీ యజమాని రవివర్మది. ఒక సాధారణ మార్కెటింగ్ జాబ్ నుండి ఒక సంస్థనే నెలకొల్పేంత స్థాయికెదగడంలో అతని కఠోర శ్రమ చాలా వుంది. ఎవరైనా కష్టపడి పని చేస్తే తప్పకుండా ఎదుగుతారు అని నమ్మాడు గాబట్టే అతనివాళ ఒక ధీటైన సక్సెస్ ఐకాన్ గా నిలబడ్డాడు. సూటు బూటులో దొరబాబులా మెట్లు దిగుతూ వస్తూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు రవివర్మ. హాల్లోకొచ్చి ఎదురుగా కూర్చొని వున్న అత్తా మామలను చూసి పోన్ కట్ చేసి వారికి గౌరవంగా నమస్కరించాడు. వారి పక్కనే తన భార్య లలిత కూర్చొని వాళ్ళతో కబుర్లు చెబుతోంది. దుర్గయ్య కొంత సేపటి వరకు అల్లుడి మీద నుండి తన దృష్ఠిని మరల్చుకోలేక పోయాడు. అల్లుడిలో అతనికిప్పుడు ప్రత్యక్ష దైవం కన్పిస్తున్నాడు. రవివర్మ ఎదురు సోఫాలో కూర్చుంటూ మావయ్యతో మాట కలప బోతుండగా దుర్గయ్య అందుకున్నాడు. “అల్లుడా .. నేను ఆడివిల్ల సొమ్మును ముట్టుమన్నా ముట్టెటోన్ని గాదు. అమ్ముకున్న నా పొలంను నువ్వు మల్లగొని నా పేరు మీద పట్ట జేపిచ్చినవు గదా అట్ల నాకిష్టం లేదల్లుడా.. అది నీ పైశవెట్టి కొన్నవు గావట్టి ఆ భూమి నీదే అయితది. ఇవి దీస్కోని నీ పేరు పొంటనే పట్ట జేపిచ్చుకో. బటాయికి జేయుమంటే శేస్తగనీ ఇట్ల పుక్కటుకు నాకద్దు కొడ్కా…” అంటూ దుర్గయ్య రవివర్మ చేతికి పాసుబుక్కులు ఇవ్వబోయాడు. రవివర్మ వాటిని తీస్కోకుండా చిన్నగా నవ్వేసి “మామా ఆ పొలం మీదే నా దెప్పటికి గూడ గాదు…” అంటున్న అల్లుడి ముఖంలోకి చూస్తున్న దుర్గయ్య భృకుటి ముడి పడింది. ప్రక్కన కూర్చున్న నర్సవ్వ కూతురు లలితలు వీళ్ల మాటలు వింటున్నారు.

“నీ పైశల్తోని కొన్న పొలం నాదెట్లైతది బిడ్డా?” అన్నాడు గుంభనంగా. “నీ పైశలతోని కొన్న గావట్టి అది నీ పొలమే..” అంటున్న రవివర్మను ఆశ్చర్యపోయి చూస్తున్నారు దుర్గయ్య, నర్సవ్వలు. వాళ్ళకేం అర్థంగాక ఒకరి ముఖాలు ఒకరు చూస్కున్నారు. లలిత వైపు కూడా తలతిప్పి చూసారు. లలిత ఆయనే చెప్తారన్నట్టు వీరిని చూసింది. మళ్ళీ తనే చెప్పడం ప్రారంభిస్తూ “అవును మామా… నేను మీ బిడ్డెను లగ్గం జేస్కునేటప్పుడు భికారిగాణ్ణి, సదువుంది గానీ సరైన కొల్వు లేదప్పుడు. ‘ఏం లేనోన్కే ఏతులు లావన్నట్టు’ నాకు అందరి లెక్కట గాకుండ ఆదర్శంగా బత్కాలె.. నల్గురు మెచ్చే తొవ్వల నడ్వాలని పీర్తాయె! బత్కినంత కాలం ఇమానంతోని బత్కాలె అన్కున్న. కానీ నా గరీబ్ తనం నన్ను ఎన్కకు గుంజవట్టె, గందుకే పెండ్లపుడు మీ దగ్గర నా మన్సు ఒప్పుకోకవోయినా కట్నం ఇంత ఎక్కనే తీస్కొని పెండ్లి జేస్కున్న. బండి, పది తులాల బంగారం, నాలుగు లచ్చల రూపాలె గాకుండా మీ దగ్గర్నుంచి నాకు కట్నకానుకల క్రింద ముట్టిన చిన్న చెమ్చె కాడ్నుంచి అన్నీ నా డైరీల రాశి వెట్టుకున్న. కొందర్కి లైపుల పెండ్లి టర్నింగ్ పాయింటు అయితదని నమ్మి మీ ఇంటికి అల్లున్నైన. నిజంగానే మీ బిడ్డె నా లైపులకు రాంగానే నా కిస్మతే మారిపోయింది. ఈ పిరెం జమానల ఆడివిల్లల లగ్గాలు జేసుడు శాన తక్లీవ్ అయిపోయింది. ఎంతో మంది ఆడివిల్లలు, వాల్లను కన్న తల్లిదండ్రులు మొగపిలగానోల్లు అడిగినంత కట్నం ఇయ్యజాలక ఎన్కటిసంది ఇప్పటిదాంక అన్యాలంగ సచ్చిపోయిర్రు. వరకట్నం అనే రాక్షశి గుడ్లు పీకి పారేశి గుడ్డిదాన్ని జేశేద్దామన్కున్న. అట్ల .. గవన్ని జూశి నా మన్సుల ఎప్పట్నించో బుడ్డ పైశ కట్నం తీస్కోకుంట పెండ్లి జేస్కోవాల్నని అన్కున్న గనీ… నా దెగ్గర్కి అచ్చెటాకల్ల పరిస్థితులు కుద్రకపాయె! మీరిచ్చిన కట్నం పైశనే గాకుంట మీ బిడ్డె మెడల బంగారం, బండి అమ్మి మెల్లగ రియలిస్టేట్ల వెట్టిన, మీ శేయి బర్కతితోని ఇయ్యాల్ల మాస్తు సంపాంచిన. ఇదంతా మీరిచ్చిన పైశనే గదా..” అంటూ చెప్పుకు పోతున్న అల్లుడి ముఖంలోకి చూస్తూ బీరిపోయారిద్దరు. రవివర్మే కొనసాగిస్తూ “అప్పుడు మీరు నాకు కట్నం సగవెట్ట ఎన్ని తిప్పలు వడ్డరో నాకు ఎర్కనే మామా.. శివర్కి నీ పానం కన్న ఎక్క జూస్కున్న పొలంను అమ్మినవు. పెద్ద మన్సులు శెప్పిపోయిన సిద్దాంతాలను ఒంటవట్టిచ్చుకున్న నేను అవిట్నిఅమలు జేశి నా జన్మ ధన్యం జేస్కునాల్నని మీ దెగ్గర్నుంచి నాకు ముట్టిన ప్రతి వస్తువుకి ఇప్పటి రేటు గట్టి మీ పొలం కొని మీ శేతుల్ల వెట్టిన. ఇన్నొద్దుల సంది నేను వరకట్నం తీస్కొని శాన పెద్ద తప్పు జేస్తిగదా అని నిమిషం నిమిషం ఎంత బాధవడ్డనో ఆ మీదున్నోన్కే తెలుసు. ఇప్పుడు నా మన్సు శాన అల్కగ అయినట్టు అన్పిస్తున్నది. ఇప్పుడు నాకు దునియ సంబురంగ ఉంది మామా.”. హుందాగా అంటున్న అల్లుడిలో గీతాసారం బోధిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి చూస్తున్నారు దుర్గయ్య దంపతులు. ఇంక ఏం మాట్లాడాలో తోచక కూతురి ముఖంలోకి చూసారు. లలిత కూడా వీరిని సూస్తూ హుందాగా నవ్వింది.

***

పచ్చటి తన పొలం గెట్టు మీద దర్జాగా నిలబడ్డ దుర్గయ్య ఆనందం అంతా ఇంతా కాదు. ఈ ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించినంత ఆనందం అది. పోడగొట్టుకున్న, ఇగ రాదు నా పొలం అనుకున్న తనకి అచ్చినా … “నేనెప్పటికి నీ గుండె మీద శెర్గిపోని పచ్చబొట్టు అసోంటి దోస్తునే” అన్నట్టు ఆ పొలం అందిస్తున్న సంబురమది. మానవత్వం ఇంక సచ్చిపోలేదు అది అల్లుని రూపంలనే వున్నది అనుకుని మనసులో రవివర్మకి వేనవేలసార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటూ అక్కడున్న బురద గుంటలో చిన్నపిల్లాడిలా గెంతులెయ్య సాగాడు. ఒంటినిండా బురదమయం. ‘లంబడి గడ్డ’ మీది పచ్చని ఆ పొలాలన్నీ అతని ఆనందాన్ని చూస్తూ “ఈ పచ్చటి సంబురం నువ్వు బతికినన్ని రోజులు నీతోనే వుండాలె” అన్నట్టుగా గాలి తరంగాల్లో తమ సందేశాల ద్వారా పైనున్న దేవుణ్ణి విన్నవించుకుంటున్నాయి. ఆ శివారంతా ఇప్పుడు సంబురంతో అంబరాన్ని ముద్దాడుతున్నట్టుగానే వుంది.

-హుమాయున్ సంఘీర్

Facebook Comments

One thought on “పచ్చటి సంబురం – హుమాయున్ సంఘీర్

  1. అన్నా ! పచ్చటిసంబురం ను మస్తు మంచిగ పండించినవన్నా ! శాన మంచి మనుసున్న మారాజు కతను జెప్పినవే ! ఆత్మగల్లగుణంను సూపెట్టిన నీకు నమస్తే వెడుతున్ననే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!