Saturday, February 22, 2020
Home > కవితలు > “దండిపోరడు” – టి. నర్సింహారెడ్డి

“దండిపోరడు” – టి. నర్సింహారెడ్డి

ఎగిలివారకముందే ఆగమాగం..
ఎడ్లబర్లను మంచిగ శుద్ధిజేసి
పాతబకీట్ల పచ్చికుడ్తివెట్టి
వెండిమెరుపుల సరువ నిండ
దండిగ పాలువిండినంక…
పిల్లనగొయ్యతీరు నోట్లే యాపపుల్ల
పాతతువ్వాలకిరీటం వెట్టి ..
ఎండపొడవడకముందే ఎగిర్తం..
గోజలనుకొట్కపోతు
శేన్ల చేరుతున్న మురిపము…
చినిగినబనీనుతో
చిన్నారి కిట్టయ్య!

ఎవలేమన్నరో సూరీన్ననీ ….. కోపానికచ్చిన
ఆయన తాపాన్నిజూసి …
గోజలకింతగడ్డికోసేయ్యాలనే..
దూరమెంతున్న నీళ్లుతాపాలనే..
మూగజీవాలసేవముందు..
మండేఎండకూడ మల్సుకపన్నట్లుంది!!
ఏటికెదురీదే మొనగాళ్లనుమించి
ఎండనే లెక్కజేయని మొండిపోరడు..!!

వచ్చే శెమటనుతుడ్వాలన్నా …
ఉడుకపోత తగ్గించాలన్నా …
తువ్వాలనే రెక్కలపంకయితది!!
చెలిమెల సల్లటి నీళ్లముందు
ఫ్రిజ్ కూడా మూస్కోనికూసుంటది!
శెట్టుకింద తువ్వాలమెత్తపై కునుకు
ఏసి గీసిలను కూడ పండవెడ్తది!!

గోజకు కడుపునిండడానికి తాను
ఎండడానికైనా మండడానికైనా
యెనుకాడని భూదేవిబిడ్డడు.. !
మూడుపూటలుతానెన్నడుతినలే.. ఐనా నాల్గుపూటలు గోజలకు తినవెడ్తూ ..
శేనుచెలకలన్ని తిరిగి తిరిగి
అలుపెరుగుని సూరీడైతడు!!
ఎండకే యాష్టచ్చి పొద్దుగుంకినా
యాష్టలేని హుషారుతో
యింటి గడపచేరుతడు!
మళ్లోసారి గోజలనర్సుకుని
పయిలంగ జూసుకుంటూ
కునుకుదీసే దండిమంచిపోరడు!!
సూరీడుకూడా చిన్నబోయిండు
వానిపరుగులముందు… !
వాని పనితనం ముందు!!
గిసోంటిపోరగాండ్లే
గోజల జీవేశ్వరులు! ప్రాణేశ్వరులు!!

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!