Tuesday, November 24, 2020
Home > కథలు > అసలు రహస్యం! -నామని సుజనాదేవి

అసలు రహస్యం! -నామని సుజనాదేవి

‘ఏమండీ…..ఇదిగొండీ … బాక్స్ మర్చిపోయారు…’ ఫోన్ లో మాట్లాడుతూ సూట్ కేస్ తో పొద్దున్న 7 గంటలకే కారిడార్ లోని కారేక్కుతున్న వంశీ కృష్ణ దగ్గరకు టిఫిన్ బాక్స్ పెట్టిన బాగ్ తో పరుగెత్తు కొచ్చి అందిస్తూ అంది సుధ.

బ్రీఫ్ లోపల పెట్టి,ఆ బాగ్ కూడా లోపల పెట్టి ఫోన్ మాట్లాడుతూనే కారెక్కాడు వంశీ. రెండు నిమిషాల్లో ఫోన్ ముగించి, కార్ స్టార్ట్ చేసుకుని వెళుతున్న భర్తని చూసి నిట్టూర్చింది సుధ. ఎం ఉద్యోగాలో…. ఏమిటో… క్షణం తీరిక లేదు. గట్టిగా ఊపిరిరి తీసుకునే సమయం లేదు. ఇక భార్యా పిల్లలతో ఎం గడుపుతారు?… ఎంత మేనేజర్ ఉద్యోగమైతే మాత్రం.. ప్రొద్దున్న సూర్యోదయానికన్నా ముందే ఈయన జాబ్ మొదలవుతుంది. మేనేజర్ ఉద్యోగంలో అటు మార్కెటింగ్ వ్యాపారం చూసుకోవాలి..ఇటు అడ్మినిస్ట్రేటివ్ విషయం చూసుకోవాలి. వ్యాపారంలో బాగంగా కస్టమర్ లను కలవాలంటే వారు వారి వారి డ్యూటీ లకు వెళ్ళకముందే వెళ్ళాలి. కాబట్టి వారు ఇంటి దగ్గర పొద్దుటే ఉంటారు కాబట్టి, కాస్సేపయితే ఎవరి పనులపై వారు వెళ్ళిపోతారని ఆరున్నరాకే బయల్దేరతారు. అందుకే అంత పొద్దుటే తానూ మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఒక్కోసారి టిఫిన్ బయట తింటారు…ఒక్కోసారి అదీ తనే బాక్స్ లో పెడుతుంది. అలా వెళ్ళిన వ్యక్తీ కస్టమర్స్ ని కల్సి డైరెక్ట్ గా ఆఫీస్ కెల్లి పోతాడు. మళ్ళీ రాత్రి అయితే గాని బయటకు రాడు. మాడరన్ ఆఫీస్ కాబట్టి లోన లైట్స్ ఏసీ అన్నీ ఉంటాయి. కిటికీలన్నింటికి కర్టెన్లు ఉండటాన బయట పిడుగులు పడినా, వర్షం వచ్చినా లోనకు తెలియదు. అంతా కార్పోరేట్ కల్చర్. అప్పుడో ఇప్పుడో తను, పిల్లలు సరదాగా ఎ సినిమాకో వెళదామని మారాం చేసినా ఎదో ఒకనాడు మొక్కుబడిగా తీసుకెలతాడు. ఎందుకంటే సెలవు రోజయిన ఆదివారం కూడా పై ఆఫీసులనుండి, ఈ పని చేయి…ఆ పని చేయి… వీళ్ళను కలువు, వాళ్ళను కలువు …టార్గెట్ త్వరగాపూర్తీ చేయాలని ఫోన్లె ఫోన్ లు మనిషి ప్రశాంతంగా ఉండడు. ఆలోచనలోనే లోన కెళ్ళింది సుధా.

ఆ రోజు సాయంత్రం ఆరున్నరకే ఇంటికొచ్చి సూట్ కేస్ సోఫాలో గిరాటేసి అలాగే సోఫాలోనే కళ్ళు మూసుకుని వెనక్కి జారగిలబడి కూర్చుండి పోయిన భర్తను చూస్తూ, ‘ఆహా..ఏమి మా భాగ్యము…మేమేమిటి….పతిదేవులను సూర్యాస్తమయానికి ముందే చూడడమేమిటి….ఏమి ఈ విపరీతము…..ఏమి ఈ అకాల హటాత్పరిణామము…’ అంటూ అల్లరిగా హాస్యంగా ఇంకా ఎదో అనబోయినదల్లా అతను కూర్చున్న పొజిషన్ చూసి, ఆపేసి, ‘ఏంటండీ…ఏమయ్యింది…ఏమైనా ప్రాబ్లమా…ఒంట్లో బాలేదా….’ అంటూ అడిగింది ఒకింత ఆదుర్దాగా.
ఎందుకంటే ఇటీవల అన్ని స్పెషల్ మెడికల్ టెస్ట్ లు చేయించింది. ఆఫీస్ తరఫున ఉచితంగా రెండు సంవత్సరాల కొకసారి ఐదు వేలకు సరిపడా స్పెషల్ మెడికల్ పరీక్షలు చేసుకునే వెసులు బాటు తమ సిబ్బంది ఆరోగ్యం కోసం కల్పించింది. కానీ సమయం తీరక ఆ అవకాశం వచ్చి మూడు సంవత్సరాలయినా ఒక్కసారి కూడా పరీక్షలు చేయించుకోవడానికి వెళ్ళలేదు. ’45 వయస్సు దాటాక తప్పక మెడికల్ పర్యవేక్షణ లో ఉండాల్సిన అవసరం ఉంది’ అని ఆమెంత పోరినా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చ్చాడు. అయితే ఇటీవల సుదకి కాళ్ళు విపరీతంగా లాగుతున్నాయని ప్రతిరోజూ కాళ్ళకి తాళ్ళు కట్టుకుని, వంశీని కాళ్ళపై కూర్చోమంటూ సుధ పడే బాధలు చూడలేక ఆమెను ఒక రోజు రాత్రి హస్పిటల్ కి తీస్కెల్లాడు. అక్కడ అన్ని పరీక్షలు చేసాక, రక్తం తక్కువగా ఉందని తేల్చి, మందు బిళ్ళలు, టానిక్, పాలల్లో కలుపు కునే పౌడర్ రాసారు. అయితే సుధా తానూ అవన్నీ వేసుకోవాలంటే అతను మెడికల్ ప్పరీక్షలు చేసుకోవాలనే కండీషన్ పెట్ట్టింది. కారణం ఆ పరీక్షలు చేసుకోవాలంటే ఒక రోజు లీవ్ పెట్టాలి. కానీ ఆఫీస్ లో అతనికి ఏరోజు కారోజు ఎదో ముఖ్యమైన పని అని, పై ఆఫీస్ నుండి ఎవరో వస్తున్నారని, ఆడిట్ అని, ఇన్స్పెక్షన్ అని, ఆఫీస్ లో తను తప్పక ఉండాల్సిన అవసరం ఉందని అలా ఎదో కారణం చెప్పి పరీక్షలు చేయించుకోవడానికి అసలు వెళ్ళడం లేదని ఆమె ఆ కండీషన్ పెట్టింది. ఈ లోగా అంబేద్కర్ జయంతి రోజు, ఆఫీస్ కి సెలవు మరియు ఆరోజు హాస్పిటల్ ఉంది అని బలవంతాన తీసుకుని వెళ్ళింది.

ఎట్లాగూ అతను అన్ని పరీక్షలు చేసుకుంటున్నాడు అంటే అదే సమయంలో తను కూడా డబ్బులు కట్టి చేయించుకుంటే మంచిది అని ఇద్దరికీ అన్ని పరిక్షలు చేయమన్నాడు వంశీ. అక్కడ రక్తం ఇచ్చి ఒక దాని తర్వాత ఒక పరీక్ష చేయించుకున్నారు. అన్నింటి ఫలితాలు సాయంత్రం ఇస్తామన్నారు. అన్ని పరీక్షలు అయ్యేసరికే మూడయి పోయింది. ఆ హాస్పిటల్ వారుండే చోటికి ఎంత లేదన్నా అరవై కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. ఒక డివిజన్ కి చెందిన వారంతా ఆ కంపనీ నిర్ణయించిన రెండో మూడో హాస్పిటల్ లలో మాత్రమె ఆ పరీక్షలు చేయించుకునే అవకాశం ఉండడం తో ఆ హాస్పిటల్ కి వచ్చారు. మరో గంట లో అన్ని టెస్ట్ ల విశేషాలు ఒక ఫిజీషియన్ వచ్చి చేబుతాదంటే చూస్తూ కూర్చున్నారు. అయితే మధ్యలో ఒక నర్స్ వచ్చి ‘వంశీ’ అని పిల్చి లోపల రూమ్ లోకి తీసుకెల్లింది అతన్ని. లోపల నలుగురైదుగురు డాక్టర్ లు కూర్చుని ఉన్నారట. వంశీని ఏవో ఏవో ప్రశ్నలు అడిగారట, ఆరోగ్యానికి సంబంధించి, అలవాట్ల గురించి అలా. ఆయన కెందుకో భయమయ్యిందట. అసలు ప్రాబ్లం ఏమిటని అడిగాడట. ‘మరేం లేదు మీకు 2డి ఎకో లో కొంచెం ప్రాబ్లం ఉంది …ఏ విషయమైనా తెలియాలంటే వెంటనే ఆన్జియోగ్రం చేయాలి…. మీకు సంబంధించి ఎవరు వచ్చారు అని అడిగారట. ఆయన ‘సుధా’ అని చెప్పగానే ఆమెను లోపలి పిలిచారు. అంతా అయోమయంగా అనిపించింది సుధకు. మామూలుగా రిపోర్ట్లలో ఎం వచ్చ్సింది చేబుతారనుకుంది. కానీ లోన అంత మంది డాక్టర్లనుచూడగానే మనసెందుకో ఆందోళనకు గురయ్యింది. ‘అమ్మా…కూర్చోండి’. అంటూ పేరు, ఎక్కడుంటారు, ఎం చేస్తుంటారు లాంటి సాదా సీద మాములు ప్రశ్నలు వేసి ఆయనకు హార్ట్ లోని గుండె నాలాలలో క్రొవ్వు పేరుకు పోయిందని…ఇంకా నాలాలలో ఎక్కడయినా ప్రాబ్లం ఉందో తెలియాలంటే ఆన్జియోగ్రం చేయాలని అప్పుడు ఆ నాళాలలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందొ లేదో తెలుస్తుందని అది వెంటనే చేసుకుంటే మంచిదని చెప్పారు. నిర్ఘాంత పోయారిద్దరూ. వంశీకి అన్నీ ఆరోగ్యకరమైన అలవాట్లే తప్ప ఒక్కటీ దురలవాటు లేదు. మాంసాహారం తినడు. పూర్తిగా శాఖాహారమే తింటాడు. నూనె పదార్ధాలు ఎక్కువ తినడు, ఇష్టపడడు, పైగా తాగే అలవాటు లేదు. కనీసం సిగరెట్ లాంటి పొగ పీల్చే అలవాటు కూడా లేదు. రాగుల జావా, పండ్లు లాంటివే ఎక్కువ ఇష్పడతాడు. ఇంట్లోనే పొద్దున్న 6 గంటలకు యోగ చేయడమో పొద్దుటే వాకింగ్ చేయడమో చేస్తాడు. మరి ఇలా ఎలా జరిగి ఉంటుందని ఇద్దరూ మధన పడ్డారు. నిమ్స్ లో అల్లుడు డాక్టర్ గా పని చేస్తుండడం వల్ల అతని సలహా తీసుకున్నాక ఏవిషయం చెబుతామని వచ్చేసారు. వేలేప్పుడు ఎంత సరదాగా నవ్వుతూ వెళ్ళారో, ఇప్పుడంతా భయం భయంగా మౌనం రాజ్య మేలుతుంటే ఎవరి ఆలోచనలలో వారుండి పోయారు. మౌనం గా కార్ డ్రైవ్ చేస్తునాడు వంశీ.

‘నా కెందుకో భయంగా ఉందండీ… ఆ దైవ కృప వలన అన్నీ మంచి అలవాట్లే ఉన్న మీకు ఇలా రావడం భయంగా ఉందండీ….’ అంటూ ఏడ్చేసింది సుధ. వంశీ పరిస్థితి కూడా బాగా లేదు. ఇది ఊహించని విషయం, అందుకే, ‘పైన ఆ దేవుడున్నాడు. చూద్దాం నువ్వేం బాధ పడకు …’ అంటూ అన్యమనస్కంగానే అనునయయించాడు. ఇంటికి రాగానే నిమ్స్ లో ఉన్న మేనల్లుడికి స్కాన్ చేసిన రిపోర్ట్ లన్నీ పెట్టాడు. అవి చూసి అతను వెంటనే హైదరాబాద్ కి రమ్మన్నాడు.

తెల్లవారే వెళ్ళారు. ఆ రోజు హాస్పిటల్ లో జాయిన్ చేసుకుని తెల్లవారి పొద్దుటే ఆన్జియోగ్రం చేస్తామని భయపడాల్సింది ఏమీ లేదని చెప్పారు. ఇక సుధ అయితే అప్పటి నుండి విడవకుండా దైమనామస్మరనే, ఏమీ నెగటివ్ కాకూడదని. ‘మేనల్లుడు తిరుమల్ ఎంత ధైర్యం చెప్పినా ఏడవడమే. ‘ఒకవేళ ఆన్జియోగ్రం లో ఏమైనా రక్త ప్రసరణలో అడ్డంకులు తేలితే అప్పుడు స్టంట్స్ వేయాల్సి రావచ్చు అన్నారు. ఆ విషయమే భరించలేక పోతోంది. చివరికి ఆమె పూజల ఫలితమో, అతని ఆరోగ్యకరమైన అలవాట్ల ఫలితమో గాని కేవలం టాబ్లెట్స్ వాడితే చాలు, అనడంతో ఊపిరి పీల్చుకుంది. ఆ విషయాలన్నీ గుర్తు రావడంతో భయం వేసింది ఆమెకు.

ఓరోజు ఆఫీస్ నుండి తొందరగా వచ్చేసారు. ‘ఏమైంది ‘అని అడగ్గా ‘ఎదో జ్వరంగా వొళ్ళంతా విపరీతంగా నొప్పులున్నాయి… అందుకే వచ్చేసాను’ అన్నాడు. ‘బాగా అలిసి పోయారు…రెస్ట్ లేకుండా చేస్తే ఇలాగే ఉంటుంది. సెల్ లాంటి ప్రాణం లేని వస్తువుకైనా చార్జింగ్ ఉండాలి మళ్ళీ పని చేయడానికి…. మీరు వినరే…రెస్ట్ తీసుకోండి…’ అంది అతని షూస్ విప్పేస్తూ. బాత్రూం లో గీజర్ ఆన్ చేసి టవల్ తెచ్చిచ్చింది. ‘ఇదంతా అలసట వల్లనే నెమో…అలా స్నానం చేసి ఫ్రెషప్ ఐ రండి… వేడి వేడిగా ఏమైనా చేసిస్తాను…’ అంటూ లేపి పంపించింది. స్నానం చేసి వచ్చాడు. వేడి వేడిగా అతనికిష్టమైన దోసెలు వేసి ఇచ్చింది.తిన్నతర్వాత ‘కొంచెం ఫరవాలేదా…..’ అడిగింది. ‘లేదు..నొప్పులు అలాగే ఉన్నాయి….’ ‘రెస్ట్ లెస్ గా చేస్తున్నారు. విపరీతమైన స్ట్రైన్ వల్ల వచ్చి ఉంటుంది’.

కానీ చిత్రంగా నాలుగు రోజులయినా ఆ నొప్పులలాగే ఉన్నాయి. ఒకవేళ మొన్ననే ఆన్జియోగ్రం చేయించుకోవడం వల్ల ఇలా వచ్చాయేమో అని డాక్టర్ ని, ఇంతకు ముందు అది చేయించుకున్న వాళ్ళని అడిగింది. కానీ ఎవరూ అలా ఎం ఉండవన్నారు. కానీ నొప్పులు రోజు రోజుకు పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు. అలాగే ఆఫీస్ కి వెలుతున్నాడు వస్తునాడు. యాభై అయినా కాకముందే తను ఇలా అయిపోవడం ఎంత మంది డాక్టర్ లు ఉన్నా తన నొప్పులు తగ్గక పోవడం తో మానసికంగా ఒక లాంటి డిప్రెషన్ వస్తోందతనికి. అతని బాధలు చూసి సుధ కూడా భాద పడి బయట ఆ ఓర్లో ఉన్న వేరే డాక్టర్ దగ్గర అపాయింట్ మెంట్ తీసుకుని కూడా చూపించింది. కానీ ఏమీ తగ్గలేదు.

ఈ లోగా సుధ అక్క కొడుకు పెళ్లి ఉండడం తో తప్పని సరి కాగా మూడు రోజుల లీవ్ పెట్టాడు వంశీ. అసలు ఆ నొప్పులతో వెళ్లాలని లేక పోయినా వారు చూసిన సంబంధమే కాబట్టీ పైగా దగ్గరి వారు కావడంతో ఇద్దరూ వెళ్ళారు. రాత్రి ట్రైన్ ఎక్కి తెల్లవారి 6 గంటలకు దిగారు. మళ్ళీ అక్కడ మరో రెండు గంటల వ్యవధిలో మరో ట్రైన్ ఉంది. పిల్లలిద్దరూ వారు ఉండే హైదరాబాద్ కి అది దగ్గర కావడంతో ఆటే వస్తామన్నారు. అయితే మరో ట్రైన్ ఎక్కాలంటే మరో కిలోమీటర్ పైగా ఉన్న మరో స్టేషన్ లో ఎక్కాలి. ఆరు గంటలకు దిగగానే ఆటో లో వేలదామంది సుధ.

‘రెండు గంటలు అక్కడ మాత్రం కూర్చుని ఎం చేస్తాం. కొత్త ప్రదేశం కదా చుట్టూ సరదాగా చూసుకుంటూ నడుద్ద్దాం.. నాకెలాగూ దారి తెలుసు.. పైగా వాకింగ్ కూడా చేసినట్లు ఉంటుంది. లగేజ్ కి వీల్స్ ఉన్నాయి కనుక పెద్ద శ్రమేం కాదు’ అన్నాడు వంశీ. ఇద్దరూ నడక మొదలు పెట్టారు. చీకట్లు విచ్చుకుని అప్పుడప్పుడే పడుతున్న లేలేత సూర్య కిరణాలు హాయి గోలుపుతుంటే సరదాగా ఇద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటూ నడిచిన ఆ ప్రయాణం ఇద్దరికీ ఆహ్లాదాన్ని మిగిల్చింది. చిరుచెమటలు పట్టాయి. ఒక కిలోమీటర్ అనుకున్నది రెండు కిలోమీతర్లవడంతో కొంచెం ఎక్కువ సమయం పట్టినా ఇద్దరికీ శ్రమ తెలియలేదు. ఆ తర్వాత ట్రైన్ ఎక్కిగంటలో ఊర్లో దిగారు. వెళ్ళగానే వచ్చి రిసీవ్ చేసుకున్న బావమరిది శివ, కొడుకులతో వెల్లి గంటలో తయారయిపోయారు, పెళ్లి వేడుకల్లో పాలుపంచుకున్నారు.

పెళ్ళయిన తెల్లవారి పొలాలు చూడువు రా బావా అంటూ పొద్దున్న 6 గంటలకు బావమరిది శివ వంశీని బయల్దేరదీసాడు. పోలంగట్ల వెంబడి స్వచ్ఛమైన చెట్లనుండి వచ్చే గాలిలో నడుస్తుంటే హాయిగా అనిపించింది. పల్లెవాల్లెంత అలవోకగా కాయకష్టం చేస్తారో అతనికి తెల్సి వచ్చింది. ముందు వెళ్ళే శివ నడక వేగాన్ని అందుకోవడం కష్టమయ్యింది. అతనికన్నా 7 సంవత్సరాలు పెద్ద అయినా ఎంత హుషారుగా నడుస్తున్నాడు అని అనుకోకుండా ఉండలేక పోయాడు. అలా వెళ్లి రావడానికి ఎంత లేదన్నా రెండు గంటలు పట్టింది. వచ్చేసరికి విపరీతమైన ఆకలీ అయ్యింది. ఉప్మా అంటే అస్సలు తినక పోయేవాడు, ఈ రోజు అదయినా స్నానం చేయగానే తినేసాడు. ఏంటో మధురంగా అనిపించింది.

తెల్లవారి అబ్బాయి వారింటిలో రిసెప్షన్. అంతా 4 గంటలకు బస్ ఎక్కి 7 గంటల వరకల్లా దిగారు. దిగగానే అంతా వాళ్ళ పొలాలు చూడడానికి బయల్దేరారు. అక్కడి నుండి రాగానే వాళ్ళిచ్చిన విడిదిలో తయారయి టిఫిన్లు చేసి రిసెప్షన్, ఆతర్వాత విందు భోజనం చేసారు. రాత్రి విందుకి కరెంట్ పొతే రసాభాస అవుతుందని ఫంక్షన్ మధ్యాన్నమే చేసారు. లీవ్ లేదని ఆ రాత్రికే చేయించుకున్న రిజర్వేషన్ లో పిల్లలతో కల్సి వంశీ, సుధలు ట్రైన్ ఎక్కేసారు. తెల్లవారి 6.30 కి దిగగానే స్టేషన్ నుండి ఇంటికి 20 నిమిషాల నడకే నని పిల్లలతో మాట్లాడుతూ వెల్లారింటికి.

ఆ రోజు కొంచెం ఆలస్యంగా వస్తానని ఫోన్ చేసాడు వంశీ. ‘అవునూ… ఈ ౩ రోజులు హడావుడిలో మీకు నేను టాబ్లెట్లు ఇవ్వడం మర్చాను. నా బాగ్ లోనే ఉండిపోయాయి. ఈ ప్రయానాలల్లో ఇంకా బాగా స్ట్రైన్ అయ్యారు. మీ వోల్లునోప్పులేలా ఉన్నాయి’ అంది సుధ, ఇంటి తాళం చెవులు తీస్తున్నప్పుడు కనబడ్డ టాబ్లెట్లను చూస్తూ.
‘అరె… నువ్వనే వరకూ నాకూ గుర్తు రాలేదు. చిత్రంగా ఈ మోడు రోజులు వోల్లునోప్పులు మొత్తం మాయమై పోయాఎంటో’ ఇంటి ముందు పడిన న్యూస్ పేపర్ తీసి చదువుతూ అన్నాడు వంశీ. ‘నిజమా..నా పూజలు ఫలించాయి. అర్జంట్గా గుడి కెళ్ళి కొబ్బరి కాయలు కొట్టి రావాలి.. చూసారా స్థల మార్పు ఉంటె అన్ని రోగాలు తీరతాయని మన పూర్వీకులు ఊరకే అన్నారా.. ఎప్పటికీ ఆఫీస్ నే కాదు.. ఇలా అప్పుడప్పుడు బంధు మిత్రులతో సరదాగా ఉండటం కూడా అవసరమే అని నేనన్నది నిజమే.. చూసారా’ కళ్ళు మిల మిల మెరుస్తుంటే అంది సుధ. కానీ వంశీ అది వినడం లేదు. తదేకంగా ఏంటో ఆసక్తిగా పేపర్ చదువుతున్నాడు.
‘ఏమిటీ …అంత సుదీర్ఘంగా చదువుతున్నారు….. ఈ వేల ఆఫీస్ కెళ్ళరా…’
‘యురేకా……నా రోగానికి మందు బోధపడింది……..’
‘ఏంటి నాన్నా అంత గట్టిగా అరిచావు….ఏమైంది’ పెద్దబాబు అడిగాడు.
‘ఏంటీ….యాంత్రిక జీవనంలో టానిక్ లా ఫామిలీ తో కలిసి ప్రయాణం చేయడమా…’ నవ్వుతూ అంది సుధా.
‘నో..నో…మనం అక్కడ ట్రైన్ దిగాక ఎం చేసాం…’
‘మరో ట్రైన్ కోసం నడిచి వెళ్లాం..’
‘ఆ తెల్లవారి ఎం చేసాను ..’
‘పొలం చూస్తానని నడిచి వెళ్ళారు.’
‘ఆ తెల్లవారి…….’
‘వియ్యంకుల పొలం చూడడానికి నడిచి వెళ్ళారు……అంటే ఇదంతా నడక వాళ్ళ నాయమయిందనా.. ఓ పెద్ద..యురేకా అని అరిచారు. అంతకు ముందు మాత్రం రోజూ నడవడం లేదేంటి..’
‘పిచ్చి మొహమా….. అందుకే నీది మట్టి బుర్ర అన్నారు…’
‘అవును అందుకే మిమ్మల్ని కట్టుకున్నానని చెప్పాగా…’నిట్టూర్చింది.
‘ఆ తెలివితేటలకేం తక్కువలేవు………’
‘అబ్బా….నాన్న ఇంతకీ విషయం చెప్పలేదు…టెన్షన్ తో చస్తున్నాం….’ పిల్లలన్నారు.
‘ఎం లేదురా… అక్కడ నడక కాదు ముఖ్యం. ఎండలో అదీ 6-30 నుండి 8 గంటల లోపు ౩ రోజులు లేత ఎండ ఒంటికి తగిలింది. అందులో ‘డీ’ విటమిన్ ఉంటుందిగా… ఈ ఉద్యోగాలవల్ల ఎండ కాకముండు ఆఫీస్ కి వెళ్లి ఏసీ లో కూర్చుని రాత్రయ్యాక బయట కొస్తే సహజ సిద్ధమైన ఎండ ఎక్కడ తగులుతోంది చెప్పు… బాయిలర్ కొల్లలా పెరుగుతున్నం… అనుకోకుండా ఈ ౩ రోజులు లేత ఎండతగలడం వల్ల ‘డీ’ విటమిన్ లభించి ఒల్లునోప్పులు వాటంతటవే పోయాయి. చూసావా…. ఏ డాక్టర్ చూపలేని ఔషదం ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు చూపించాడు’.
‘అరె…నిజమేనండీ… అయినా ఇంట సడెన్ గా మీకీ జ్ఞానోదయమేన్డుకయ్యిందో…’
‘డీ’ విటమిన్ లోపం వల్ల వచ్చే అనారోగ్యాల గురించి ఈ పేపర్ లో ‘మీ ఆరోగ్యం’ శీర్షికన ఇచ్చారు. అన్నీ నా లక్షణాలే కనిపించడంతో చదివాను. చూసావా… ఎప్పటికీ ఆ పేపర్ లో తలదూర్చుతావంటావు..ఎవరూ చెప్పని ఎన్ని విషయాలు ఈ రీడింగ్ అలవాటు చెబుతుందో…’
‘చెబితే చాలదు కదా…. అప్పుడప్పుడైనా రొటీన్ కి భిన్నంగా ఉండాలని మిమ్మల్ని ప్రయాణానికి బలవంత పెట్టాను. చూసారా….మన జీవన శైలి మన జీవితాల్నెంత ప్రభావితం చేస్తుందో’!

-నామని సుజనాదేవి
7799305575.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!