Sunday, January 17, 2021
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం! – శ్రీ విజేత

అతని ప్రేమ కోసం! – శ్రీ విజేత

అతడు మళ్ళీ వస్తాడని, నన్ను కలుస్తాడని నేను కలలో కూడా ఊహించలేదు . కొన్ని సంఘటనలు జీవితములో ఎందుకు జరుగుతాయో తెలియదు. నా జీవితమే ఒక ఉదాహరణ . నలుపై ఎనిమిదేళ్ళ జీవితం గడిచి పోయింది. జీవితం లోని అతి ముఖ్యమైన బాల్యం, యవ్వనం గడిచిపోయింది . ఎలా గడిచిందో కాలానికి తెలుసు , ఇక మిగిలిన జీవితం అది ఎట్లయినా గడుస్తది. ఇష్టమున్నా, ఇష్టంలేకున్నా కాలాన్ని ఈదుతూ వచ్చిన , ఇప్పడిప్పుడే కొంత సేద దీరుతున్న. పిల్లలు కొద్దిగ ఎదిగిండ్రు , వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని , చేసుకొనే దశకు వచ్చిండ్రు కాబట్టి ఇక బాధేమి లేదు. జీవితముల ఎప్పుడూ నేను ఎవరినీ ఏమీ కావాలని అడుగలేదు, కాలమిచ్చింది తీసుకుంటూ వచ్చిన , ఇప్పుడూ అంతే ! ఇంత ఆలోచన ఎందుకూ అంటే, ఈ రోజు కొద్ది సేపటిలో అతడు వస్తున్నాడు అని తెలిసింది మా యింటికి అన్నయ్యతో కలిసి. అదే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది !

మద్యాహ్నం పూట అన్నయ్య ఫోన్ చేసి చెప్పిండు, “నేను, కృష్ణ అర గంటలో ఇంటికి వస్తున్నం ” అని. విని విస్మితురాలినయిన . దాదాపుగా ముప్పయి ఏండ్ల కింద కలుసుకున్న జ్ఞాపకం అతన్ని. ఆ ముప్పయి ఏండ్లల్ల అతను నన్ను గాని, నేను అతన్ని గాని కలువలేదు, కనీసం మాట్లాడుకోలేదు ఒక్కసారైనా. అందుకే మనసులో గాబరా ! సరే రానివ్వు అనుకున్న. ఇల్లు సర్డిన వస్తువులు చిందరవందరగ పడి ఉంటే. ఏముంటాయి మా ఇంట్లో పెద్దగా ! ఉన్నవే మాకు రెండు రూములు వరండతో కలిసి అదనంగా . రెండు కుర్చీలు, చిన్న టేబుల్ , పక్కన బెడ్ , కిచెన్ రూమ్, ముందట చిన్న వరండా.
వాళ్ళు పిల్లల ఫోటోలు చూస్తారేమో అని ఆల్బం తీసి ఉంచిన. అర గంట గడిచింది.
నేను వాళ్ళ రాక కోసం చూస్తున్నాను, కొంత సేపటి తరువాత ఒక తెల్ల రంగు కారు వచ్చి మా చిన్న ఇంటి ముందట ఆగింది. ఇంటి కిటికీ లోంచి తొంగి చూసిన , అతను, అన్నయ్య ఇంట్లోకి వస్తున్నారు.
అతని ముఖం మీద కొద్దిగా చిరునవ్వు, వారు ఇంట్లోకి వచ్చి కుర్చీల్లో కూర్చున్నరు.
అతను నన్ను చూస్తూ అడిగిండు, “బాగున్నరా?” అని చిరు నవ్వుతో
“బాగున్నాను ” అని చెప్పిన అనునయంగా
ముప్పై ఏళ్ళ కింద చూసిన అతన్ని, అప్పుడు బక్క పలుచగా ఉండేవాడు, ఇప్పుడు కొద్దిగా దొడ్డుగా కనిపిస్తున్నడు.
అతను మళ్ళీ నన్ను అడిగిండు కొద్ది సేపటికి, , “మీరు బక్కబడ్డరు “ అని ,
“లేదు, నేను బాగానే ఉన్నాను “ అని సమాధానమిచ్చిన.
అతను మళ్ళీ అన్న డు, , “లేదు, బక్కబడ్డరు, అప్పటి రోజులతో పోల్చి చూస్తె “ ,
“లేదు, ఇంతే నా శరీరం“ అన్న
వేసవి ఎండలో వచ్చిండ్రు , తాగడానికి నిమ్మరసం షర్బత్ చేసి ఇచ్చిన ఇద్దరికీ.
అతను చూస్తాడని, మా కుటుంబం అల్బం ఇచ్చిన , అల్బం పేజీలు తిరిగేస్తూ,
“పిల్లలు ఏమి చేస్తున్నరు” అని అడిగిండు, పిల్లల ఫోటోలు చూస్తూ.
“పట్నంలో పెద్దోడు ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డడు ఇంకా పెండ్లి కాలేదు , చిన్నోడు డిగ్రీ చదువుతున్నడు” అని చెప్పిన.
అతను నన్ను చూస్తూ నవ్వుతున్నడు గుంభనంగా, ఎందుకో తెలియదు.
“మీ పిల్లలు ఏమి చేస్తున్నరు “ అని అడిగిన అతని పిల్లల గురించి తెలుసుకోవాల్నని .
“పెద్దోడు సాఫ్ట్ వేర్ ఇంజనియర్ గా హైదరాబాద్ లో పని చేస్తున్నడు, చిన్నోడు డిగ్రీ చదువుకుంటున్నడు” అని చెప్పిండు.
కొద్ది సేపు అన్నయ్య వాళ్ళ ఇంటి కుశల సమాచారం చెప్పిండు, బిడ్డ పెళ్లి, కొడుకు చదువు గురించి. మాటల్లో ఓ అరగంట గడిచిపోయింది.

తర్వాత, మా ఇంటి వెనుక, ఇంటి ముందట తిరుగుతూ బావి, కూరగాయల చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్టు, నిమ్మ చెట్టు, ఇంటి చుట్టూ ఫెన్సింగ్, పశువులు,కోళ్ళు, పక్షులు,పశువుల గుడిసె, పక్షుల గూళ్లు అన్నీ చూపించిన ఇద్దరికీ.
“మీ ఇల్లు బాగుంది, పచ్చని చెట్లు, పశువులు, పక్షులు..” అని మెచ్చుకుంటూ అన్నడు అతను .
“బర్లు పాలు ఇస్తున్నయా “ అని అడిగిండు .
“ఒకటి ఇస్తుంది, మాకు సరిపోంగ, కొన్ని డైరీకి పోస్తం, ఇంకోటి కొద్ది రోజులకు ఈనుతుంది. మాకు పాడి, పశువులకు కొదువేమి లేదు” అని చెప్పిన
“పాడి పశువులకే కాదు, కోళ్ళకు, పావురాలకు కూడా మీకు కొదువ లేదు “ అన్నడు మెచ్చుకుంటూ
“మాతో పాటు అవి, పల్లెటూరు కదా పెంచుకోవచ్చు , పాలు నీళ్ళ లాగా మాకు ఖర్చులకు అక్కరకస్తయి “ అని చెప్పిన .
“కోళ్ళనంటే పెంచుకోవచ్చు, మీరు పావురాలను కూడా పెంచుతున్నరు, విచిత్రం“ అన్నడు వారండాల ఎగురుతున్న పావురాలను చూస్తూ,
“పావురాలను పెంచడం, చిన్నోడికి బాగా ఇష్టం, వాడు చూసుకుంటడు, ఇవన్ని “ అని చెప్పిన
వరండాల పావురాల జంటలు గోడకు పెట్టిన డబ్బ పెట్టె గూట్లోకి వెళ్ళుతూ మళ్ళీ బయటకి వస్తూ అటూ, ఇటూ తిరుగుతున్నయి.
పావురాలకు కొన్ని విత్తులు పోసిన, అవి నా మీదనే వచ్చి వాలుతూ, కిందకు దిగుతూ విత్తులు ఏరుకొని తింటున్నయి. అతనికి, అన్నయ్యకు కొన్ని విత్తులు పెడితే వాళ్ళు కూడా పావురాలకు విత్తులు నేలపై చల్లిండ్రు, పావురాలు గుంయి , గుంయి శబ్దాలు చేస్తూ వాళ్ళపై వాలుతూ విత్తులు ఏరుకొని తింటున్నయి. విత్తులు పెడుతుంటీ ఒక పావురం వచ్చి అతని భుజంపై వాలింది. అతను చిన్న పిలగాడిల సంబురపడి పోతున్నడు. అన్నయ్యను సెల్ఫోన్ తో ఒక ఫోటో కూడా తియ్యమన్నడు.
కొద్ది సేపటికి వారండా లోంచి ఇంట్లోకి వచ్చి కుర్చిలో కూర్చుంటూ,
“ మీకు కాలక్షేపానికి కొదువే లేదులే “ అన్నడు
“నిజమే, మా బతుకులో అవ్వొక భాగం “ అని చెప్పిన చిన్నగా నవ్వుతూ.
కొద్ది సేపటికి అడిగిండు.
“ఎన్ని రోజులవుతుంది , ఇల్లు కట్టుకొని “ అని.
“ఒక్క ఏడాది అవుతుంది , ఈ మధ్య లోనే గృహ ప్రవేశం చేసినం “ అని చెప్పిన
“సంతోషం, చిన్నదో పెద్దదో ఒక ఇల్లయితే కట్టుకున్నరు “ అన్నడు.
“ఎప్పుడు తీసుకున్నరు జాగ ఇంటికి ” అడిగిండు.
“ మూడేండ్ల కింద తీసుకున్నం, అప్పుడు అగ్గువనే, ఇప్పుడు రేట్లు డబులయినయి”అని చెప్పిన
“ఏడాది కింద ఎక్కడ ఉన్నరు” అడిగిండు మళ్ళీ
“పది కిలోమీటర్ల దూరం టౌన్లో ఉండెటోల్లం, కిరాయిలు ఎక్కువ, అందుకే ఇక్కడ జాగ తీసుకొని ఇల్లు కట్టుకున్నం పల్లెటూల్లో ప్రశాంతంగా ఉంటుందని”
“మీరే మంచి పని చేసిండ్రు, ప్రశాంత వాతావరణములో బతుకుతున్నరు “ అన్నడు మళ్ళీ చిన్నగ నవ్వుతూ
మాటల్లోనే గంట గడిచి పోయింది.
మద్యాహ్నం వచ్చిండ్రు , ఏమి తిన్నరో, తినలేదో అని ఇద్దరికీ, ఉప్మా చేసి పెట్టిన, చెట్నీ వేసి.
“చెట్నీ బాగుంది” అంటూ టిఫిన్ చేసిండ్రు ఇద్దరు .
రెండు గంటలు నిమిశాల్లానే గడిచిపోయినయి మాటల్లో.
“ఇక వెళ్తం ఇంటికి, వెళ్ళేటప్పటికి సాయంత్రం అయితది, మధ్యలో ఒక మిత్రున్ని కలిసేదుంది ఇంకా, చీకటి కాక ముందు ఇల్లు చేరుకోవాలె, కారు ప్రయాణం కదా “ అని లేచిండ్రు ఇద్దరు
“ఎప్పుడన్నా ఊరికి వస్తే తెలియచేయండి, పుస్తకాల్లో నా ఫోన్ నంబర్ ఉంటది “ అని చెప్పిండు

“సరే , మంచిది “ అన్నాను
వెళ్లేముందు అతను కొన్ని పుస్తకాలు తన బ్యాగ్ లోంచి తీసి ఇచ్చిండు నాకు,
“నేను రాసిన పుస్తకాలు చదువుకొండి” అని.
అతను పుస్తకాలు రాస్తడని తెలుసు, కని ఇన్నిపుస్తకాలు రాసిండని మాత్రం తెలియదు., తీసుకోవాల్నా,వద్దా అని వెనుకాముందు అయితూనే తీసుకున్నాను .
వెళ్తస్తమని చెప్పి కారు దగ్గరికి కదిలిండ్రు. అన్నయ్య కూడా వెళ్తమని చెప్పిండు.
అతను కారును మలిపి బై చెప్పిండు నా వైపు చూసి చెయ్యి ఊపుతూ . నా చెయ్యి కూడా గాలిలోకి అనుకోకుండా లేచింది బై చెపుతున్నట్టు. అతని కళ్ళల్లో నాపై అభిమానంతొంగి చూస్తుంది. కారు కళ్ళ ముందటి నుంచి కదిలి రోడ్డు మలిగి కనుచూపు మేరలో కనుమరుగై పోయింది .
అంత కలలా అనిపించింది, గుండెల్లో కొద్దిగ సంతోషం, కొద్దిగా బాధ, ఎందుకో తెలియదు!
బతుకు కండ్ల ముందు బరువుగ కనిపిస్తుంటే, తేలిగ్గా గాలిలో తేలిపోతూ ఇంట్లోకి అడుగు పెట్టిన.
సాయంత్రం నాలుగున్నర దాటి అయిదు అవబోతుంది , గంట సేపటికి చిన్నోడు టౌన్ కాలేజి నుంచి వస్తడు. ఆయన రాత్రి ఏడు, ఎనిమిది గంటల వరకు టౌన్లో దుకాణం పని చూసుకొని వస్తడు. చిన్నోడిని టౌన్ నుంచి రాంగా కొన్ని ఇంటి సామానులు తెమ్మని ఫోన్ చేయాలె అని, చిన్నోడికి ఫోన్ చేసి చెప్పిన.
ఎందుకో తెలియదు కాని మనసులో కొద్దిగా అయోమయం అనిపించింది , అతను వచ్చి వెళ్లినందుకేమో! అతను నాకు ఇచ్చిన పుస్తకాల కట్ట బరువుగా అనిపించింది. వాటిని విప్పి చూద్దాం అనే సాహసం చెయ్యలేక పోయిన , రాత్రి పండుకునేటప్పుడు చూస్తాలే తీరికగా అని అనుకున్న. వాటిని వంటింట్ల చెక్క అల్మారాలో దాచి పెట్టిన. ఇంటి పని , వంటపనిలో మునిగి పోయిన. పని చేస్తున్నా కాని మనసంతా అతనే, అతని స్మృతులే కదులుతున్నాయి లీలగా! కలలోలా ఇంటిపనులన్నీ చేసుకుంటున్న. అరగంట తర్వాత చిన్నోడు వచ్చిండు. వస్తూ వస్తూనే , ఆకలయితుంది అన్నడు. అన్నం పెట్టిన పళ్ళెముల, అన్నము తిన్నడు. తిన్నంక కోళ్ళను గూటిలో కమ్మేసి, పశువులను దొడ్డిలో కట్టేసి, పావురాలను చూసుకొని, పరీక్షలున్నయని వరండల చదువుకుంటనని లైటేసుకుని టేబుల్ ముందట కుర్చేసుకుని కూర్చున్నడు. చిన్నోడికి చదువంటే ప్రాణమే! పెద్డోడికి చదువబ్బలేదు కాని.
రాత్రి ఎనిమిది గంటలు కొడుతుంది గడియారం. టీవిల ఆ రోజు వచ్చే పాటల ప్రోగ్రాం వస్తుంది. బాగున్నయి పాటలు, పిల్లలు మంచిగ పాడుతున్నరు, కొద్ది సేపు పాటలు చూసిన. పాటలు వింటే మనసుకు ఆనందం నిజంగా ! అప్పుడప్పుడు అలసిపోయిన మనసు కుదుట పడుతది, ఒక్కొక్కప్పుడు బతుకు తీయగా జ్ఞాపకం వస్తది. ఎందుకు అట్ల రాస్తరు కవులు నిజంగా బతుకును కండ్ల ముందట పెట్టినట్లు అని అనిపిస్తది. పాటల్లో లీనమై పోయిన, పావుగంటకు ఆయన పని మీది నుంచి వచ్చిండు. ఆయనకు అన్నం పెట్టాలె అని లేసిన, వంటింట్లకు పోయిన. ఆయన కాళ్ళు చేతులు బాయికాడ కడుక్కొని వచ్చి పీటమీద కూర్చున్నడు. అన్నం పెట్టిన, పొద్దున తొమ్మిది గంటలకు వెళ్తడు షాపుకు, పగటీలికి ఇంత అన్నమే టిఫిన్ పెట్టి పంపిస్తా, షాప్ ల పనికి అలిసిపోయి వచ్చిండేమో ఆవురావురుమని అన్నం తింటున్నడు. అన్నం తిని చేయి కడుక్కొని వచ్చి కొద్ది సేపటికి మంచం వేసుకొని మంచముల వోరిగిండు, అలసిపోయి ఉన్నడేమో అయిదారు నిమిషాల్లోనే నిద్ర పోయిండు.
తర్వాత నేను అన్నం పెట్టుకుని తిన్నాను, వంట బోల్లు కడిగేసిన అర గంటల, రాత్రి పది గంటలు అవుతుంది. టీవి బందు చేసిన. చిన్నోడు వేసవి కాలం కనుక వరండా లోనే మంచం వేసుకొని పండుకున్నడు. టీవి ఉన్న రూమ్ లోనే ఆయన మంచం పక్కకు నేను ఒక మంచం వేసుకున్న పండుకోవటానికి. రూమ్ లో ట్యూబ్ లైట్ వెలుగుతంది తెల్లారినట్టు. ఒక్కసారి అతను నాకు ఇచ్చిన పుస్తకాలను చూడాలనిపించింది. పక్కన చూస్తే ఆయన గుర్రు పెట్టి నిద్ర పోతున్నడు. ఎప్పుడింతే అనిపించింది ! వంటింట్ల చెక్క అల్మారల పెట్టిన పుస్తకాల కట్టను తెచ్చి విప్పి చూసిన. ఒకటా రెండా ఇరువై పుస్తకాలున్నాయి అతనివి . ( మిగితా వచ్చే వారం)

– శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!