Sunday, October 2, 2022
Home > కథలు > మజా సజా! – హుమాయున్ సంఘీర్

మజా సజా! – హుమాయున్ సంఘీర్

ఉత్తేజ్ :
లైఫ్ లో మజా లేకుండా చప్పగా బతకటం ఒక బతుకేనా ?
బతుకంటే బ్రహ్మాండంగా వుండాలి అలాంటి లైఫ్ నే లీడ్ చెయ్యాలి.
బతికినంత కాలం ఎంజాయ్ చెయ్యాలి !
అదీ ఆఫ్టర్ విలేజ్ విడిచి హైదరాబాద్ వచ్చాకే ఉత్తేజ్ స్థితి !!
రాజు :
మెహ్ నత్ తో పైకి రావాలి.
సంపాదించిన దాన్ని మనకోసమే కాకుండా ప్రాబ్లెమ్స్ లో వున్నవాళ్ళ కోసం కూడా కేటాయించాలి.
తేరగా తిని బలాదూరుగా తిరగటం లైఫ్ కాదు.
సాధ్యమైనంత వరకు తోటివారికి హెల్ప్ ఫుల్ గా వున్నప్పుడు వారి కళ్ళల్లో కన్పించే ఆనందం కన్నా గొప్ప ఆనందం, ఎంజాయ్ మెంటు ఎందులోనూ దొరకదు అని గట్టిగా విశ్వసించినవాడు !

ఇవి ఉత్తేజ్ -రాజుల మనస్తత్వాలు.
వాళ్ళిద్దరిదీ ఒకే వూరు. ఒకే వాడకట్టు, ఒకే స్కూలు, ఒకే బెంచీ, ఇంటర్ వరక్కూడా ఇద్దరివీ మ్యాచయ్యే అభిరుచులూ, అభిమతాలు. ఉత్తేజ్ వాళ్ళ కుటుంబం ఫస్ట్ నుండీ ఉన్నోళ్ళే. ఒక్కడే కొడుకని చాలా గారాభం చేసారు. రాజు వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. కష్టపడి ఎదగాలని వాళ్ళ నాన్న డైలీ చెప్పేవాడు. వాళ్ళిద్దరి నేపథ్యాలు వేరైనా మనస్తత్వాలు ఒక్కటే !అంతవరకూ చదువుకున్న చదువులోని సారం, సంస్కారాన్ని ఒంట బట్టించుకొని సమాజానికి తమ వంతుగా ఏదైనా మంచి చెయ్యాలనే సంకల్పాలను దిల్లో దించుకొని పై చదువుల నిమిత్తం హైదరాబాదు వచ్చారు.

హైదరాబాదులో అడుగు పెట్టారు గంపెడన్ని ఆశలతో, నిక్కచ్చైన ఆశయంతో సిటీకొచ్చి బ్యాచ్ లర్ రూం తీస్కున్నారు.  రాజు ఎలా వచ్చాడో అలాగే చెక్కుచెదరకుండా వున్నాడు. కానీ.. ఉత్తేజ్ సిటీకి రావడంతోనే తనలోకి ప్రవాహం లాంటి మార్పుని ఆహ్వానించుకున్నాడు. మజా టేస్ట్ అతణ్ణి ఉక్కిరి బిక్కిరి చేసింది.
పోష్ స్నేహాల పవళింతలు, హాయ్ హల్లోల పులకరింతల్లో అతను నెమ్మదిగా రాంగ్ రూట్లోకి డైవర్ట్ అవసాగాడు. అంతవరకూ అతను ఫాలో అయిన లైఫ్ స్టైల్ ని, అనుకున్న ఆశయాన్ని, నిస్వార్థాన్ని, నిజాయితీని.., అన్నింటి అన్ ఫాలో చేసి ఎంజాయ్ మెంట్ తో రీప్లేస్ చేయసాగాడు. రూంకి రావడం కూడా తగ్గించాడు. అవసరాలు అత్యంతగా పెంచుకొని వూళ్ళో నాన్నకెప్పుడు ఫోన్ చేసినా డబ్బులు పంపిస్తున్నాడు. తన బిహేవియర్ తో సహా డ్రెస్సింగ్ స్టైల్, క్రాఫ్.., టోటల్ చేంజింగ్ ! కాలేజికి నచ్చితే వెళ్ళాలి లేదంటే బంక్ కొట్టి మ్యాటనీలు లేదంటే పార్కుల్లో డేటింగులు, ఇంకా పబ్బులూ, క్లబ్బుల్లో మందూ చిందూ… వహ్వారే లైఫ్… క్యా మజా ఆరహా హై… అని ఉత్తేజ్ తనువూ, మనసు మజాకి పూర్తిగా అడిక్టైపోయాయి!

ఇది రాజు వూహించని పరిణామం. తను మాత్రం ఎలాంటి మార్పుని తనలోకి ఆహ్వానించలేదు. అదే గట్టి వ్యక్తిత్వాన్ని ఈ సిటీ కల్చర్లో అస్సలు పొల్యూటవనీయలేదు. తాను తానుగానే మిగిలున్నాడు. ఇక్కడికొచ్చాక తను ఇంటి మీద అస్సలు ఆధారపడకుండా మార్నింగ్ టెన్ టు ఫోర్ వరకు కాలేజికి వెళ్ళి సాయంత్రం పిల్లలకి ట్యూషన్లు చెప్తూ తన ఖర్చులు తను వెళ్ళదీస్కుంటూ మంచి స్కెడ్యూల్డ్ తో, పక్కా ప్లానింగ్ తో సాగిపోతున్నాడు. అత్యవసరం అనిపిస్తే తప్ప కాలేజికి ఏ ఒక్కరోజూ బంకు కొట్టలేదు రాజు. చదువులో ఉజ్వల భవిష్యత్తుని చూస్కుంటున్నాడు. ఉత్తేజ్ లోని ఛేంజెస్ రాజుని తీవ్ర కలవరానికి గురి చేసాయి. కళ్ళ ముందు ప్రాణ స్నేహితుడు చెడిపోవడాన్ని అస్సలు సహించలేకపోయాడు రాజు.
చెడు సావాసం మంచిది కాదని వారించాడు. వినలేదు రివర్స్లో రాజుని ఉత్తేజ్ అపార్ధమే చేస్కున్నాడు. అంతవరకు రాజు తర్వాతే ఎవరైనా అనుకున్న ఉత్తేజ్ ఎవరి తర్వాతో రాజు అనుకుంటున్నాడు. నెమ్మదిగా రూంకి రావడం మానేసాడు. బలిసిన ఫ్రెండ్స్ తో బలిసిన ఏరియాకి తన మకాం మార్చుకున్నాడు రాజుకి మాట మాత్రం కూడా చెప్పకుండా!

రాజు అస్సలు వూహించలేదు ఉత్తేజ్ ఇలా మితిరిపోతాడని. చాలా బాధ పడ్డాడు. తనెక్కడున్నా సేఫ్ గా డాలని కోరుకున్నాడు. కంటికి కన్పించకుండా విలాసాల మత్తులో జోగుతున్న ఫ్రెండుకి చాలా సార్లు ఫోను కూడా చేసాడు. కానీ ఇప్పుడిక రాజు ఫోనుక్కూడా రెస్పాండ్ అవనంత దూరంగా, సుదూరంగా తనదైన మజా దునియాలో మత్తుగా, చిత్తుగా!!

ఈ విషయమై రాజులో చాలా టెన్షన్. మెంటల్ గా డిస్టర్బ్ కూడా అయ్యాడు. ఏం చేసి తన దోస్తును సేవ్ చేస్కోవాలని ఆలోచించాడు. వాళ్ళ నాన్నక్కూడా ఉత్తేజ్ విషయం చెప్పాడు. కానీ ఉత్తేజ్ తెలివిగా నాన్నని తన మాయ మాటలతో బురిడీ కొట్టించాడు. రాజుని వాళ్ళ నాన్న దృష్ఠిలో ఓర్వలేనివాణ్ణి చేసాడు. అలా రోజులు తమ పని తాము చేస్కుంటూ పోతూనే చేస్కున్నవాళ్ళకి చేస్కున్నంత రిజల్ట్స్ ఇస్తూ గడిస్తున్నాయి గతమౌతూ!!

ఈ టైం అనేది చాలా మందికి చాలా పాఠాలు నేర్పుతుంది. ఈ టైంని రాజు చక్కగా పక్కా పర్ ఫెక్టుగా ప్లాన్ చేస్కొని పీజీ చేస్తున్నాడు. రాజు టైంని మజాగా మార్చుకుందామని తత్తర పడ్డాడు, తడబడ్డాడు…, జిందగీకి అయిన రాసపుండును మాన్పెయ్యాలని లేపనాల వేటలో పడ్డాడు. ఆ అన్వేషణలో ఫస్ట్ లేపనంగా అతని కంటికి కన్పించింది రాజూయె! ఆఫ్టర్ లాంగ్ టైం రాజును వెతుక్కుంటూ వచ్చాడు ఉత్తేజ్. రాజు అదే రూంలో వున్నాడు. గట్టిగా అలుముకొని పొగిలి పొగిలి ఏడ్చాడు. ఉత్తేజ్ అంతగా కరిగి కన్నీరవడానికి గల కారణ ‘భూతం’ ఏంటి? అతనికెదురైన సంఘటనలు వాటి తాలూకు సమాహారాలేంటి? ఈ క్వశ్చన్స్ ని వేలసార్లు తన మదిలో వేస్కున్నాడు రాజు? రకరకాల ఉపనయనాలు దర్శనమిస్తున్నాయి… ఉత్తేజ్ నోరు తెరవాలి… తెరిచాడు… ఈ గ్యాప్ లో అతను ఫేస్ చేసిన మజా ఫలితమేంటనేది,
అనుభవించిన, ఎదుర్కున్న పర్యవసానాల సమాహారాన్ని కన్నీటి ధారల్తో మిళితం చేసి చెప్పనారంభించాడు! ఏం జరిగింది?

ఉత్తేజ్ నేల మీద కన్నా గాల్లోనే ఎక్కువగా తేలిపోతున్నాడప్పుడు… మందు, చిందు, పొందుల మజానే లైఫ్ అని గట్టిగా నమ్ముకున్నాడు. జల్సాల జీవనంలో ఓ కుదుపు ముంచెత్తుకొస్తోందని మత్తు వదలని అతని కళ్ళు ఎప్పటికీ పసిగట్టలేకపోయాయి? ఆరోజు… ” ముంబయి నుండి ముగ్గురు మిల్కీ బ్యూటీలు ఫలానా ఫైవ్ స్టార్ హోటల్ కి వస్తున్నారు. ఆన్ లైన్లో బుక్ చేసానని ” భుజాలెగరేస్తూ చెప్పాడు తన ఫ్రెండు. ఇంకే ఎగిరి గంతేసాడు ఉత్తేజ్. కొత్త కొత్త రుచుల కోసం అతని అణువణువూ కుతకుతలాడుతోంది. “దీనమ్మ లైఫు.. పోయిందంటే మళ్ళీ రాదు.. లైఫ్ కి మజాల పరుపులు పరిచి మస్తు పరమాన్నాలను వడ్డించే జవానీని దివానీగా యూజ్ చేసి లైఫ్ కి సంతృప్తినిద్దాం, ఫుల్ ప్లెడ్జుగా ఎంజాయ్ చేద్దామనే ” యావలో మునిగిన ఉత్తేజ్ సంబరానికి హద్దే లేకుండా పోయింది !?

ఆ రాత్రి ఆ నార్త్ అమ్మాయిల్తో ముగ్గురూ ముచ్చటగా ఫుల్ ఎంజాయ్ చేసారు. కట్ చేస్తే అర్లీ మార్నింగ్ షాట్ లో ముగ్గురూ మత్తుగా నిద్ర లేచారు. అప్పటికి ఆ అమ్మాయిలు రూంలో లేరు. వాళ్ళ షర్ట్ జేబుల్లో చీటీలున్నాయి. పర్స్ లు, ఏటియంలను తన్నుకుపోయారు. ఆ చీటీలో వున్న రాతలు వాళ్ళ మతులు పోగొట్టడమే కాదు కన్ ఫ్యూజన్ కి గురి చేసాయి!?

” Welcome to aids world ” అని ఇంగ్లీష్ లో రాసి వుంది. దాని కిందే వాళ్ళ సెల్ నెంబర్లు కూడా వున్నాయి. ఉండబట్టలేక వెంటనే కాల్ చేసారు. అటు వైపు నుండి అమ్మాయి చాలా స్వీటుగా మాట్లాడుతోంది. ” ఏంటిదంతా ? ” అన్న క్వశ్చన్ కి
” యస్.. మా ఎయిడ్స్ వరల్డ్ లోకి మీకు స్వాగతం, సుస్వాగతం ” అన్నారు.
ఏం అర్థంకాక తలలు పట్టుకున్న వీళ్ళకి క్లారిటీ ఇస్తున్నారు వాళ్ళిలా…
” మేము HIV బాధితులం.
మాకీ పాపాన్ని ఎవరో అంట గట్టారు. మూసుకున్న మా కళ్ళ ముందు విధి చూపించిన కరాళ నృత్యం ఇది. ఇప్పుడు మేము ఈ సమాజం దృష్ఠిలో పాపాత్ములమయ్యాం. కుక్క కన్నా హీనంగా ఛీత్కరిస్తోంది ఈ వ్యవస్థ మమ్మల్ని. ఆవారాలుగా తిరిగి చెడిపోయాం ఇక బాగుపడే సిట్యుయేషన్ లేదని మమ్మల్ని వదులుకొని చేతులు దులుపుకున్నారు కన్నవాళ్ళు. అఫ్ కోర్స్ వాళ్ళంతా కరెక్టే మేమే రాంగ్.. కానీ మేమీ రాంగ్ పని చేయడం వెనుక ఒక బలమైన కారణం వుంది. అదేమిటంటే… మేము సమూహపు శక్తిగా ఏర్పడాలనుకుంటున్నాం. ఒంటరిగా వున్న దున్నని వెంటాడి చంపుకు తింటాయి కౄరమృగాలు. అదే అవి గ్రూపుగా వుంటే సింహాలకి వాటి జోలికెళ్ళాలంటే ఉచ్చే!

అందుకే మేము ఎయిడ్స్ గ్రూప్ గా ఏర్పడి ఈ దునియా మీద రివేంజ్ తీర్చుకోవాలని కాదు మాకు మా బాధల్ని అర్థం చేస్కొని మాతో కలిసిపోయే మాబోటి ఆత్మీయులు దొరికారని మాకు సంఘటిత ఆనందం అంతే. ఒంటరిగా వుంటే వీళ్ళంతా కాకుల్లా పొడుచుకు తింటారు కాబట్టి గ్యాదర్ అవుదామని మాలాంటి మిమ్మల్ని ఎన్నుకున్నాం. ఇలా చేయడం తప్పే కానీ… ఒక కార్యవర్గం ఏర్పడటానికి తప్పదు కదా.. సో మనకి ఇప్పుడే మన అమ్మానాన్నలు, ఆత్మీయులు కూడా కన్పిస్తారు. అందుకే ఈ పని చేసాం. మనమంతా ఇప్పుడొక వర్ణం. మనమంతా కలిసుంటే ఎవరూ మనల్ని మనడానిక్కూడా సాహసించరు” అంటూ నాన్ స్టాపుగా వివరణ ఇచ్చి ఫోన్ కట్ చేసింది.

అంతా విన్నాక వీళ్ళు స్థాణువుల్లా బిగుసుకు పోయారు. మజా వెనుక సజా(శిక్ష) కన్పిస్తోంది. ఆ నిర్వేదిస్తున్న నైనాలకి. దిద్దుకోలేని తప్పు చేసామని తలలు బాదుకొని ఏడ్చారు, సొమ్మసిల్లారు, వాస్తవం వైపు మొగ్గు చూప సాగారు.

ఇలాంటి ఘటనలు సిటీలో అక్కడక్కడా జరిగాయని టీవీల్లో న్యూస్ కూడా వస్తోంది. బెంగూళూరు, ముంబయి, హైదరాబాదు, ఢిల్లీ, కలకత్తా వంటి నగరాలే వాళ్ళ టార్గెట్ అని ప్రచారం సాగుతోంది. అనామకులుగా లిఫ్ట్ అడిగి వారి ఒంటికి సూది గుచ్చుకొని వెనకనుండి లిఫ్ట్ ఇచ్చినతని వీపులో చీమ కరిచిందేమో అన్నట్టు గుచ్చి దిగిపోతున్నారు. వాళ్ళ సంఘటితం కోసం ప్రపంచాన్నంతటికి ఎయిడ్స్ ని ప్రసాదంలా పంచాలని కంకణం కట్టుకున్నారా ? అనే కోణంలో దర్యాప్తులు మొదలయ్యాయి!!

రాజు ఉత్తేజ్ పరిస్థితిని అర్థం చేస్కొని ముందుగా హాస్పిటల్ కు వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించారు. రిపోర్ట్స్ నెగెటివ్ గానే వచ్చాయి కానీ… వెంటనే హెచ్ఐవీ లక్షణాలు కన్పించవని ఉత్తేజ్ కి బాగా తెలుసు! తన స్థితిని తలుచుకొని, తను కలుషితమైన తీరుని గుర్తు చేసుకొని ఏడ్చాడు… ఏడుస్తూనే వున్నాడు… అది లైఫ్ లాంగ్ అనుకుంటూ… ఏమనుకుంటే ఏం జరిగిందని తర్జనభర్జనలు పడుతున్నాడు.

ఇలాంటి బాధితులను తయారుచేసి రెచ్చ గొడుతున్నది మనమే. ఎయిడ్సున్నవాళ్ళంతా తప్పు చేసినవాళ్ళు కాదు. వాళ్ళని రెచ్చగొట్టకుండా వుంటే అందరం బాగుంటాం. కానీ ఆ పని చెయ్యం మనం? ఎప్పుడు చూసినా ఎదుటివాళ్ళని వెక్కిరించి వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తుంటాం. చాప కింద నీరులా పొంచుకొస్తున్న ఈ ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఎవరో ఏదో అన్నారని వాళ్ళు కూడా అలా చెయ్యకూడదు. ఉత్తేజ్ లాంటి వాళ్ళెందరో మజా కోసం పాకులాడి లైఫ్ ని కంగాళి చేస్కుంటున్నారనేది రాజు వాదన. లైఫ్ లో మజా కావాలంటే ముందు మెహెనత్ చెయ్యాలి. అది లేకుండా మజానే ముందు కోరుకుంటే కొన్ని సిట్యుయేషన్లు సజాను తోఫాలా ఇస్తాయి.

So.. be care full !!

– హుమాయున్ సంఘీర్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!