Monday, January 18, 2021
Home > పుస్తక పరిచయం > ‘తెలంగాణ బతుకమ్మ పాట’ – డా. మచ్చ హరిదాస్, కరీంనగర్.

‘తెలంగాణ బతుకమ్మ పాట’ – డా. మచ్చ హరిదాస్, కరీంనగర్.

సామాజిక సామాజిక స్పృహకు, వర్తమాన రాజకీయ అవగాహనకు నిలువెత్తు నిదర్శనం సబ్బని శారద గారి
‘తెలంగాణ బతుకమ్మ పాట’ – డా. మచ్చ హరిదాస్, కరీంనగర్.

మొత్తం 30 పూటల ఈ చిన్ని పుస్తకములో ఇతివృత్తం తెలంగాణ బతుకు గాథ. సాధారణంగా బతుకమ్మ పాటల్లో జాతి , సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పే రామాయణ, భారత, భాగవత ఘట్టాలు, సతీ ధర్మాలు, ఉమ్మడి కుటుంబ ప్రయోజనాలు, ఆరోగ్య సూత్రాలు- వీటికి సంభందించిన అంశాలే చోటు చేసుకుంటాయి. శ్రీమతి సబ్బని శారద గారు తెలంగాణ వెనుకబాటు తనాన్ని వస్తువుగా స్వీకరించి, అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం, పాలకులు చూపుతున్న వివక్షతపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తుతూనే వాటిని కళ్ళకు కట్టినట్లుగా తన రచనలో చూపించారు. అంతే కాకుండా న్యాయం కోసం పోరాడాల్సిందిగా పిలుపునిచ్చారు. అయితే ఈ పోరాటం అహింసా మార్గములోనే కొనసాగాలని అభిలషించారు. గాంధీ గారి అహింసా మార్గములో, అంబేడ్కర్ ఆశయాలతో కృషి చేస్తూ గమ్యాన్ని చేరాలన్నారు.

అందుకే కాబోలు ‘ గాంధీ లాగ మీరు ఉయ్యాలో/
గమ్యాన్ని చేరాలి ఉయ్యాలో’ హితబోధ చేశారు. కావ్యారంభంలో ఇష్ట దేవతా ప్రార్థన లాగే శారద గారు ఈ పాటలో ముందుగా తెలంగాణ సాధనను సుకరం చేయవలసిందిగా దేవతలందరికి ప్రణతులు చేశారు. ముఖ్యంగా తెలంగాణ పల్లె ప్రజలు ఆరాధించే ముక్కోటి పోశవ్వ, సమ్మక్క సారక్క, కొమ్రెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, కొత్త కొండిరన్న, ఓదెల మల్లన్న, ఎములాడ రాజన్న, ఐలేని మల్లన్నతో పాటు భద్రాద్రి రామన్న, ధర్మపురి నర్సిములు, యాదగిరి నర్సిములును పేరుపేరునా స్మరించారు. మానవ ప్రయత్నానికి దైవ అనుగ్రహం కూడా తోడైతే ఎంతటి కార్యమైనా సుకరమవుతుంది అనేది విదితం. తెలంగాణ కన్నీటి కడలిగా మారడానికి గల కారణాలను ఎకరువు పెట్టిన తీరు హృద్యంగా ఉంది. ” అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని, సొమ్మొకరిది షోకొకరిది’ లాంటి సామెతలు సందర్బోచితంగా ప్రయోగించారు. చాల సకృత్తుగా కొన్ని పదాలు మహా ప్రాణోచ్చారణ స్పోరకంగా వాడినప్పటికీ ( ఉదా: భాసిల్లిన చోట – పుట-౯ ,పంక్తి-౧౦. వ్యాధుల భాదలు, పుట-౧౦, పంక్తి-౧౩ ) పాట అంతా తెలంగాణ మాండలిక పదజాలముతో ప్రజల యాసలోనే సాగిపోవడం ఔచిత్యంగా ఉంది. ఉదా: భాసర క్షేత్రం భాసిల్ల్లిన చోట సదువు సందె లు లేక బతుకు సట్టువడిందని, నాగార్జున సాగరున్నా, తాగు నీళ్ళకు తండ్లాట కావట్టేనని.. ప్రత్యేక తెలంగాణ కావాలంటూ అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఆలోచిస్తున్న తరుణములో ముఖ్యంగా బతుకమ్మ పండుగ సందర్భంగా ‘తెలంగాణ బతుకమ్మ పాట’ పుస్తకాంగానే కాకుండా ఆడియో క్యాసెట్ గా కూడా వెలువడడం ముదావహం. సామాజిక స్పృహకు, వర్తమాన రాజకీయ అవగాహనకు ఈ పాట నిలువెత్తు నిదర్శనం. ఇందుకు రచయిత్రి సబ్బని శారద గారూ అభినందనీయులు.

‘తెలంగాణ బతుకమ్మ పాట’

రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాలో
హరి హరి ఓ రామ ఉయ్యాలో
హరియ బ్రహ్మ దేవ ఉయ్యాలో
నెత్తి మీది సూర్యుడా ఉయ్యాలో
నెల వన్నెకాడ ఉయ్యాలో
పాపట్ల చంద్రుడా ఉయ్యాలో
బాలకోమారుడా ఉయ్యాలో
ముందుగా నినుదల్తు ఉయ్యాలో
ముక్కోటి పోచవ్వ ఉయ్యాలో
భక్తితో నినుదల్తు ఉయ్యాలో
బాసర సరస్వతి ఉయ్యాలో
ధర్మపురి నరసింహ ఉయ్యాలో
దయతోడ మముజూడు ఉయ్యాలో
కాళేశ్వరం శివ ఉయ్యాలో
కరుణతో మముజూడు ఉయ్యాలో
సమ్మక్క సారక్క ఉయ్యాలో
సక్కంగ మముజూడు ఉయ్యాలో
బద్రాద్రి రామన్న ఉయ్యాలో
భవిత మనకు జెప్పు ఉయ్యాలో
యాదితో నినుదల్తు ఉయ్యాలో
యాదగిరి నరసింహ ఉయ్యాలో
కోటి లింగాలకు ఉయ్యాలో
కోటి దండాలురా ఉయ్యాలో
కోర్కెతో నినుదల్తు ఉయ్యాలో
కొమురెల్లి మల్లన్న ఉయ్యాలో
కొండగట్టంజన్నఉయ్యాలో
కోటి దండాలురా ఉయ్యాలో
కోర్కెమీర దల్తు ఉయ్యాలో
కొత్తకొండీరన్న ఉయ్యాలో
ఎరుకతో నినుదల్తు ఉయ్యాలో
ఎములాడ రాజన్న ఉయ్యాలో
ఓర్పుతో నినుదల్తు ఉయ్యాలో
ఒదెలా మల్లన్న ఉయ్యాలో
ఐలేని మల్లన్న ఉయ్యాలో
ఐకమత్యమియ్యి ఉయ్యాలో
తల్లడిల్లుతుంది ఉయ్యాలో
తల్లి తెలంగాణ ఉయ్యాలో
ఆర్తితో బతుకులు ఉయ్యాలో
ఆగమయ్యె సూడు ఉయ్యాలో
అన్నలార మీరు ఉయ్యాలో
అక్కలార మీరు ఉయ్యాలో
తెలంగాణ మనది ఉయ్యాలో
తెలంగానం మనది ఉయ్యాలో
గాంధీలాగ మీరు ఉయ్యాలో
గమ్యాన్ని చేరాలె ఉయ్యాలో
అంబేత్కరుని ఉయ్యాలో
ఆశయాల మేర ఉయ్యాలో
మంచికోరి మనం ఉయ్యాలో
మనుగడ సాగిద్దాం ఉయ్యాలో
కష్టాల కడలి ఉయ్యాలో
కన్నీటి కావ్యం ఉయ్యాలో
తెలంగాణ బతుకు ఉయ్యాలో
తెలంగాణ బతుకమ్మ ఉయ్యాలో

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!