Sunday, October 2, 2022
Home > కథలు > చెర వీడిన బాల్యం…? -వి.సునంద

చెర వీడిన బాల్యం…? -వి.సునంద

“సహా సాకేత్ ఏం చేస్తున్నార్రా?.. ముందు హోమ్ వర్క్ కానీయండీ…ఆ తర్వాతే ముచ్చట్లు….”
“మమ్మీవి స్నేక్ యియర్స్ రా, మనమెంత స్లోగా మాట్లాడుకున్నా ఇట్టే పసిగడుతుంది” గుసగుసలాడారు అక్కా తమ్ముడు…

బాగా పేరున్న కాన్వెంట్ లో సహజ సెకండ్ క్లాస్,సాకేత్ యూకేజీ చదువుతున్నారు….వాళ్ళమ్మ చందనకు పిల్లలు బాగా చదవాలని తను కన్న కలలన్నీ వాళ్ళ ద్వారా నిజం చేసుకోవాలని కోరిక…భర్త పవన్ ప్రైవేట్ కంపెనీలో పనికి కుదిరేదాకా పట్టు వదల లేదు…డిగ్రీ వరకు చదువుకున్న పవన్ కు పై చదువులు ఇష్టం లేక తండ్రి తన వాటాకు ఇచ్చిన పదెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ హాయిగా జీవితం గడపాలనుకున్నాడు… కానీ పిల్లల చదువులంటూ వేధించి సిటీకి లాక్కొచ్చింది….మొదట్లో వ్యతిరేకించినా ఆ తర్వాత అలవాటు పడిపోయాడు.

పిల్లలను క్షణమైనా ఊపిరి మెసలనీయదు చందన.. హోం వర్క్ పూర్తి కాగానే ఆడుకుంటామనగానే.. కథల పుస్తకాలు జీకే బుక్స్ చదువుకోండి ఆటల వల్ల ఒరిగేదేం లేదు.టైం వేస్ట్ తప్ప అని లెక్చరిస్తుంది.. మమ్మీ లెక్చర్ వినలేక చదవాలనిపించక పోయినా వాటిని పట్టుకొని అలాగే నిద్రాదేవి ఒడిలోకి జారిపోతుంటారు…

ఆ రోజు స్కూల్ కు అనుకోకుండా సెలవొచ్చింది…తల్లి చెప్పినట్టు ఎంత చేసినా టైం గడవట్లేదు ఇద్దరికి…గేటుకు తాళమేసి తను వచ్చే వరకు ఇంట్లోంచి కదొలద్దంటూ వెళ్ళింది చందన…తనూ ఈ మధ్య దగ్గరలో వున్న కన్సల్టెన్సీ ఆఫీసులో పనికి కుదిరింది..ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు.. పిల్లిద్దరూ పంజరంలో చిలకల్లా వుండీ వుండీ బోరు కొట్టి డాబా మీదికి చేరారు..వాళ్ళంటి ప్రక్కన కొద్ది దూరంలో అపార్టుమెంటు కడుతున్నది చూసి ఎంత ఎత్తుగుందో కదక్కాఅన్నాడు సాకేత్…కానీ సహజ చూపులన్నీ అక్కడ రాశిగా పోసిన ఇసుకలో ఇద్దరు పిల్లల మీదే వుంది. తమ వయసు వాళ్ళే కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు… “ఒరేయ్ తమ్ముడూ! అటు చూడు వాళ్ళను” అనగానే.. “అక్కా! అక్కా! మనమూ వెళ్ళి ఆడుకుందామా”…ఉత్సాహంగా అడిగాడు సాకేత్..”అమ్మో మమ్మీకి తెలిసిందంటే వీపు చీరేస్తుందిరా..ఇలాగే చూద్దాం” అంది. సాకేత్ కు అక్క మాటలు నచ్చలేదు..వాళ్ళను ‘హాయ్ గయ్స్!’ అని గట్టిగా పిలవగానే. ‘ఏయ్! మేం గయ్యాళోళ్ళం కాదూ…కోపంగా తలెత్తి వీళ్ళ వైపు చూస్తూ అన్నారు…
ఆ మాటలకు కిలకిలానవ్వుతూ సహజ గయ్స్ అంటే పిల్లలూ అని అర్థం…మీ పేరేంటీ చెప్పరా అంది…
అదిగో మళ్ళీ రా అంటున్నారు..”అరేయ్ ఒరేయ్ రా అని దోస్తులు అను కోవాలి మీరు కాదుగా” అనే సరికి మరెలా అడగాలో అర్థం కాక బిక్కమొకం వేసింది సహజ. ఆ అమ్మాయి నవ్వుతూ నా పేరు మాలతి మా తమ్ముడి పేరు మహేష్ అంది.  బాగున్నాయి మీ పేర్లు అంటూ తమ్ముడి పేరు తన పేరు చెప్పింది సహజ.
మీరే క్లాస్ అనగానే మాలతి “”నేనేమో రెండు.. తమ్ముడేమో అంగన్ బడిలో చదువుకుంటున్నం” అంది..
‘మరి మీరిలా ఆడుతుంటే మీ మమ్మీ ఏమనదా?ఆరా తీసింది సహజ.. హోం వర్క్ చేసుకున్న కదా ..మా తమ్ముడికైతే ఇంక హోమర్కే ఇవ్వరు తెలుసా” అనగానే” భలే భలే అక్కా! మమ్మీని అందులో పంపమంటా” అన్నాడు సాకేత్… “ఒరేయ్! వీళ్ళ గురించి చెప్పావంటే మమ్మీ డాబా కూడా ఎక్కనివ్వదు అనగానే బుద్ధిగా చెప్పనని తల వూపాడు సాకేత్…
“పైకి చూసీ చూసీ మెడకాయ నొప్పి లేస్తుందబ్బా! కిందికి రండి నల్గురం ఆడుకుందాం..” పిల్చింది మాలతి.
అమ్మో! వద్దులే అబ్బా మా మమ్మీ చూసిందంటే… అంటూ రోడ్ వైపు చూసింది.. వస్తున్న చందన కనిపించేసరికి…ఇంకా వుంటామబ్బా! తమ్ముడూ రా! అంటూ గబగబా కిందికి లాక్కెళ్ళి బుక్స్ ముందేసుకుని కూర్చుంది….
లోపల హాల్లో చదువుకుంటున్న ఇద్దరిని తృప్తిగా చూసుకుంటూ వంట పనిలో జొరబడింది…
సాయంత్రం రాగానే తల్లి చెప్పకుండానే గబగబా స్నానం చేసి స్నాక్స్ తిని డాబా మీద చేరుతున్నారు వర్క్ చేసుకుంటున్నామని…ఒకరికొకరు కాపలా పెట్టుకొని మాలతి వాళ్ళతో వెలుతురున్నంత వరకు సైగలు గుస గుసగా మాట్లాడుకోవడం.ఆ తర్వాత వర్క్ చేసుకోవడం థ్రిల్లింగ్ గా వుంది ఇద్దరికీ…
సాకేత్ కు ఇవన్నీ వాళ్ళ మమ్మీతో షేర్ చేసుకోవాలని వుంది.. తల్లి సాకేత్ చిన్నవాడని కొద్దిగా అప్పుడప్పుడు ముద్దు చేస్తుంది..అందుకే వాడికి ఇవన్నీ తల్లికి చెప్పాలనే ఉబలాటంగా వుంది.. అక్క వద్దన్నా వినకుండా ఓ రోజు తల్లికి మెరిసే కళ్ళతో ముద్దు ముద్దు మాటలతో ఒళ్ళో కూర్చొని చెబుతుంటే తండ్రి పవన్ తన బాల్యం గుర్తు రావడంతో ఆనందంగా వినసాగాడు.

కొడుకు మాటలు వింటున్న చందనకు కోపం తారా స్థాయికి చేరింది..వణికిపోతూ మూలకు నిలబడిన సహజను లాక్కొచ్చి పటాపటా వాయిస్తూ “ఇదా మీరు రోజూ చేసే నిర్వాకం.. వాడంటే చిన్నోడు నీ బుద్ధేమైంది.. సర్కారు స్కూల్లో చదివే పిల్లలతో మీకు స్నేహమా.. వాళ్ళకు మీ కున్నన్ని బుక్స్ వుండవు మీ అంత గొప్ప చదువుండదు..ఇంకోసారి తెలిసిందా ఒళ్ళు చీరేస్తా..ఎన్నాళ్ళ నుండిరా మీరిలా చేసేది..డాబా మెట్లెక్కారో కాళ్ళిరగ్గొడతా..” అని తిట్టే సరికి సాకేత్ అక్క కళ్ళలోకి చూసి తప్పుచేసినందుకు సారీ అని సైగలతో చెప్పి తలొంచుకున్నాడు….
“ఏమిటోయ్ పసిపిల్లలు ఆడుకునే వయసు ఎందుకలా వాళ్ళమీద విరుచుకు పడతావ్” అనగానే గయ్యిమంటూ మీకూ తెలియట్లే నా బాధ..”మొక్కయి వంగనిది మానై వంగుతుందా ఆటలకు అలవాటు పడ్డారంటే చదువు సున్నా పెడతారు” అంది. భార్య నోట్లో నోరు పెట్టామంటే ఇక తన చదవు గురించి దొండాకు పసరుతో సహా కక్కించి పరువు తీస్తుంది అందుకే సైలెంటయి పోయాడు…

సహజ సాకేత్ లు తల్లి చెప్పనట్టే హాల్లో తల్లికి కనబడేలా చదువుకుంటున్నారు..కానీ ఇంతకు ముందులా ఏవీ చేయాలనిపించడం లేదు.. మాలతి వాళ్ళు రెండు మూడు రోజులు వీళ్ళ కోసం డాబా వైపు చూసి ఓ రోజు అక్కా తమ్ముడు కూడ బలుక్కొని, ధైర్యం చేసి సహజ వాళ్ళ గేటు తీసుకొని లోపలికి వచ్చారు…సాకేత్ అలికిడి విని పరుగెత్తుకుంటూ వెళ్ళి మా మమ్మీ మిమ్మల్ని చూసిందంటే కొడుతుంది వెళ్ళండంటూ చెవిలో చెప్పాడు..ఇదిగో మా అమ్మమ్మ బొంగుండలు తెచ్చింది మీ కోసం తెచ్చామంటూ కవర్ చేతికిచ్చి గబగబా వెళ్ళిపోయారు…వాటిని నిక్కర్ జేబులో దాచి నెమ్మదిగా అక్క దగ్గరకు వచ్చాడు..అక్కకొకటి ఇచ్చి తను బాత్రూమ్ లోకెళ్ళి తినేసి, రాగానే అక్కకు సైగ చేసాడు..సహజ కూడా తినేసి వచ్చింది…వాటి రుచి గురించి ఇద్దరూ పుస్తకాలడ్డు పెట్టుకొని మాట్లాడుతుంటే చూడనే చూసింది చందన…ఇద్దరికీ చివాట్లు లెక్చర్లతో వార్నింగ్ ఇచ్చింది…

వీళ్ళమీద నమ్మకం కుదిరిన చందన ఇంట్లో సరుకుల కోసం భర్తతో వెళుతూ పిల్లలకు లక్ష జాగ్రత్తలు చెప్పి గేటుకు తాళం వేసి పోయింది….సహజకు సాకేత్ కు ఎప్పుడెప్పుడు వాళ్ళతో ఆడుకుందామా అనుకున్న టైం వచ్చేసరికి ఆనందంతో ఎగిరి గంతేసారు..డాబా ఎక్కి పిలిచారు..వాళ్ళు వీళ్ళనే రమ్మన్నారు… నెమ్మదిగా గేటు ఎక్కి బయటకు వచ్చారిద్దరు..నలుగురు కలిసి ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టారు.. చెమ్మచెక్క, కాళ్ళగజ్జా, అచ్చన గిల్లలు ఆటలు నేర్పిస్తే బుద్దిగా నేర్చుకుని ఆడారు…మధ్య మధ్య వాళ్ళ అమ్మమ్మ వచ్చి నలుగురికి పప్పుండలు., జీడీలు ఇచ్చి తల నిమిరి మురిపెంగా చూస్తూ కాపలా వుంది…వాళ్ళమ్మ విషయం విని బాధ పడింది..కాపలా వుండి వాళ్ళొచ్చే టైంకు గేటెక్కించి లోపలికి పంపింది…..

పిల్లలకు తమ నాన్నమ్మ గుర్తొచ్చింది… అచ్చం తను కూడా ఇలాగే ప్రేమగా తల నిమిరి వచ్చేటపుడు ఎందుకో బాగా ఏడ్చింది గుర్తొచ్చింది…

ఆ రోజు ఆదివారం ..మమ్మీ డాడీ మంచి మూడ్ లో వుంది చూసి డాడీ! మన నాన్నమ్మను పిలువు డాడీ! మనింటికి అన్నారిద్దరు.. పక్కనే బాంబ్ పడినంత ఉలిక్కిపడ్డారిద్దరు…తల్లిని తలచు కోగానే కళ్ళు చెమ్మగిల్లాయి పవన్ కు…ఆమెతో గొడవ పడి వచ్చింది చందన. తను వెళ్ళి రావడమే గానీ చందన మళ్ళీ ఆయింట్లో అడుగు పెట్టనని శపథం చేసి మరీ వచ్చింది…అక్కడి నుండే కాన్వెంటుకు బస్ లో పంపుదామని బతిలాడినా ఆమె గారాబం వల్ల పిల్లలు చెడిపోతారని చెప్పి..భర్తను తీసుకొని వచ్చింది…. మళ్ళీ ఇన్నాళ్ళకు పిల్లల నోట్లోంచి ఆ మాట రావడంతో ఏం చెప్పాలో అర్థం కాక తడబడింది..గద్దించి నోరు మూయించింది.

కానీ పిల్లలలో రోజు రోజుకి నానమ్మను చూడాలనే కోరిక పెరుగుతోంది…మాలతి వాళ్ళలా నాన్నమ్మతో బోలెడు కథలూ చెప్పించుకోవాలని, గారాలు పోతూ గోరుముద్దలు తినిపించుకోవాలని వుంది…మాలతి వాళ్ళను చూసినప్పటి నుండి వాళ్ళలా తామెందుకు లేమనే ఆలోచన వచ్చింది..పంజరంలో బంధించిన చిలుకల్లా అయ్యారిద్దరు..ఆటలు లేవు పాటలు లేవు .గట్టిగా మాట్లాడుకున్నా టైమ్ వేస్ట్ చేస్తున్నారని తిట్టే అమ్మంటే కోపంగా వుంది. పుస్తకాలు ముందేసుక్కూర్చుంటున్నారు కానీ చదువులో ఏకాగ్రత తగ్గిపోయింది.ఈ టైమ్ లో మాలతి వాళ్ళు ఇలా చేస్తుండొచ్చని ఊహించుకోవడం, తాము వెళ్ళలేక పోయినందుకు బాధ పడటం దినచర్యగా మారింది.

సహజ వాళ్ళ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ చందనను పిలిపించి “సహజ ఈమధ్య చదువులో చాలా వెనుక బడుతోందని, ముందులా ఉత్సాహంగా ఉండటం లేదని చెప్పి, మీరు ఇంతకు ముందులా శ్రద్ధతీసుకోవడం లేదా? అని ప్రశ్నించేసరికి చందనకు తలకొట్టేసినంత అవమానంగా అనిపించింది. సహజ రాగానే గొడ్డును బాదినట్టుగా ఇష్టమొచ్చినట్టు కొట్టి, పరువు తీసావంటూ తిట్టింది చందన..అక్కను కొడుతుంటే అడ్డం వెళ్ళిన సాకేత్ కు రెండు తగిలించింది…బుగ్గలు వీపు ఎర్రగా కంది పోయిన అక్కను చూసి ఏడవడం మొదలు పెట్టాడు సాకేత్..తల్లి గట్టిగా అరిచేసరికి నిక్కరు తడుపుకున్నాడు.
తల్లి కొట్టిన దెబ్బలకు జ్వరం వచ్చింది సహజకు.. మూడు రోజులు మూసిన కన్ను తెరవలేదు..సారీ అమ్మా నాకు చదువొద్దు..అంటూ పదే పదే కలవరింతలు. డాక్టర్ కు చెబితే పసిమనసు మీద ఒత్తిడి ఎక్కువైంది. మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యింది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనడంతో.. .చందనకు పవన్ కు కాళ్ళూ చేతులు ఆడలేదు..ఏం చేయాలో అర్ధం కాలేదు..సాకేత్ కూడా స్కూల్ కు వెళ్ళనని మొరాయించి అక్క దగ్గరి నుండి కదలడం లేదు….

పవన్ చందనలకు వారం రోజుల సెలవు అయిపోయింది కానీ సహజ ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదు…మధ్య మధ్య మాలతి వాళ్ళు వీళ్ళ కోసం గేటు దగ్గర తారట్లాడటం చూసాడు పవన్. సాకేత్ ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళ వివరాలు అడిగాడు..చందన పనిలో వున్నది చూసి వాళ్ళూ, వాళ్ళ అమ్మమ్మ ముచ్చట్లన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు..పవన్ కు తనిప్పుడు ఏం చేయాలో అర్ధమయ్యింది. వెంటనే అక్కను నేను చూసుకుంటా మాలతి వాళ్ళను పిలుచుకు రమ్మని సాకేత్ కు చెప్పాడు..వాడి కళ్ళలో భయం..మమ్మీ అక్కను కొట్టిన దెబ్బలు మరిచి పోలేదు..తండ్రి ఏం కాదని ధైర్యం చెప్పడంతో తూనీగలా పరుగెత్తి వెళ్ళాడు.

మాలతి మహేష్ లతో పాటు వాళ్ళ అమ్మమ్మ తానూ వస్తానంటే తీసుకొచ్చాడు. మంచం మీద గువ్వపిట్టలా పడుకున్న సహజను చూడగానే మాలతి వాళ్ళకు అమ్మమ్మకు దుఃఖం ఆగలేదు. సాకేత్ అక్క దగ్గరకు వెళ్ళి ‘చెవిలో గుసగుసగా అక్కా! ఎవరొచ్చారో చూడు అంటూ పిలవగానే నీరసంగా కళ్ళు తెరిచింది..ఎదురుగా మాలతి మహేష్..ఉలిక్కిపడి ‘మా మమ్మీ కొడుతుంది వెళ్ళి పోండి’ అని బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టింది..చందనలో పశ్చాత్తాపం..తనెంత పసిమనసును గాయపరిచిందో అర్ధమయ్యింది…మాలతి వాళ్ళ అమ్మమ్మ వెంటనే..” బంగారు తల్లీ! మీ యమ్మే నన్ను పిలుచుకొచ్చిందిరా! ఇగదా నా ఒల్లె కూసుందువురా” అని తల నిమిరింది.

వారం నించీ ఎవరినీ చూడటానికి ఇష్టపడని ఆ కన్నుల్లో కోటి పున్నముల కాంతులు విరిసాయి. భయంగా తల్లి వైపు చూస్తూ అమ్మమ్మకు చేతులందించింది. మిగిలిన ముగ్గురు అమ్మమ్మ ఒళ్ళో కూచున్న సహజ చుట్టూ చేరి, అమ్మమ్మకు వైజ్జం కూడా తెలుసు నీ జరం సూది మందు లేకుండనే తగ్గిస్తది అంటున్న స్వచ్ఛమైన మనసున్న ఆ పిల్లలను, సహజలో పుంజుకుంటున్న చైతన్యాన్ని చూసి తన తప్పేంటో తెలిసింది చందనకు. వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకుంది.

-వి.సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!