Thursday, December 3, 2020
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం! -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం! -స్వాతీ శ్రీపాద

నడి వేసవి. మిట్ట మధ్యాన్నం. ఊరు ఊరంతా వెచ్చటి దుప్పటి కప్పుకుని జోగుతున్నట్టుగా ఉంది. పెద్దలు మధ్యాన్నం భోజనాలు ముగించుకుని పగటి కునుకులు తీస్తుంటే ఏమీ తోచని పిల్లలు అటు స్కూళ్ళు లేక ఇటు ఎండకు బయట తిరగలేక ఏ పంచనో చేరి చింత గింజలాటో, వామనగుంటలో, గచ్చకాయలో ఆడుతుంటే, అబ్బాయిలు మరో వేపు నీడలో గోటీ లో పులీ మేకానో ఆడుతున్నారు. ఎక్కడా ఆకైనా కదలటం లేదు, అసలే ఎండలు ఎక్కువ. పైగా పగలంతా కరెంట్ కోత. ఎన్ని కుండల నీళ్ళు తాగినా వేడి చల్లబడితే కదా?

ఇంట్లో లలితమ్మ ఆడబడుచులు వసంత, వనజ, లీలావతులతో కలిసి ఆవకాయ పెట్టడంలో క్షణం తీరిక లేకుండా ఉంది. పెద్దావిడ శ్రీలక్ష్మి వాళ్లి౦ట్లోనే పెట్టుకు౦టూ౦ది. మామిడి కాయలు ది౦పి౦చి తెచ్చేసరికే మధ్యాన్నం భోజనాల వేళ అయింది. అయినా ఇది వరకులా మిరపకాయలు తొడిమలు తియ్యడం కొట్టించడం లాంటి పనులు తగ్గించుకుని త్రీ మాంగోస్ కారం, ఉప్పూ ఆవపి౦డీ బజారునుండి తెచ్చుకున్నా కాయలు కొంచం నీళ్ళలో వేసి వాటిని శుభ్రంగా ఒక పొడి బట్ట పెట్టుకు తుడవటం, జాడీలు కడిగి తుడిచి ఎండలో పెట్టుకోడం, అల్లం వెల్లుల్లి తొక్కతీసుకుని ముద్దచేసుకోడం అబ్బో ఒక్కపనా? భోజనాలు అవగానే అలవాటుగా లలితమ్మ ఒక అయిదు నిమిషాలు కునుకు దీసి లేచింది. లేచేసరికే వసంతా, వనజా జాడీలు కడిగి పొడి గుడ్డతో తుడిచి ఎండలో పెట్టారు. క్రితం రోజే పొట్టు తీసిన వెల్లుల్లి, కడిగి తోక్కతీసిన అల్లం పనిమనిషితో రుబ్బిస్తోంది లీలావతి.

కొంచం ఉన్నకుటుంబమే సీతారామయ్యది. పదెకరాల పొలం, చేతిలో ఆయుర్వేదం వంశపారంపర్యంగా వచ్చిన పాడి ఆవులు దేనికీ వెతుక్కోవలసిన అవసరం లేదు. అయిదుగురు సంతానంలో ఒకే ఒక్క మగ మహారాజు. అటు అప్పచెల్లెళ్ళకు ఏ లోటు చెయ్యలేదు. ఏడాదికోసారి ఉన్నంతలో చీర సారే పెడుతూనే ఉంటాడు. అతని భార్య లలిత అతనికి తగ్గ ఇల్లాలు. ఇద్దరు పనివాళ్ళను పెట్టుకుని ఓ పక్కన పాడి పశువులను చూస్తూనే విశాలమైన పెరడు కూరగాయల తోట గా మార్చి భర్తకు చేదోడు వాదోడుగా ఉండటమే కాక ఆడబిడ్డలకు తలలో నాలుకలా మెసలడం బాగా తెలుసు. ఇద్దరు పిల్లలు. పెళ్ళైన ఏడాదికి కొడుకు మురళి పుట్టగానే కాస్త జాగ్రత్త పడ్డారు, ఇంట్లో ఉన్న ఇద్దరాడబడుచుల పెళ్ళిళ్ళ యే వరకూ. అందుకే మురళికీ చందనకూ పదకొండేళ్ళు తేడా. తల్లి ఉన్నన్నాళ్ళూ నెత్తినపెట్టుకు చూసుకున్నాడు.

“జాడీలు కడిగేసారా అప్పుడే …వస్తున్నాగా ?” అంటూ వచ్చింది లలితమ్మ.
పెద్దపెద్ద టబ్బుల్లో మునిగేలా నీళ్ళలో వేసిన మామిడి కాయలు ముందుపెట్టుకున్నారు.
తుడిచి ఓ పక్కన గంపలో వేస్తున్నారు.
“ఇంతకూ చందూ ఎక్కడ ఈ ఎర్రటి ఎండలో …” వనజ మేనకోడలి గురించి ఆరా తీసింది.
“ ఆ ఏముంది సీతారత్నం తో చింతపిక్కలు ఆడుతూ ఉంటుంది వసారాలో, ఎండలో బయటకు వెళ్ళదు” నమ్మకంగా చెప్పింది లలితమ్మ.
కనకాంబరం రంగు పూల పరికిణీ, పొడుగ్గా కొంచం బిగుతుగా ఉన్న జాకెట్… సెలవల్లో ఎదురింటి సీతారత్నం తో వీధి అరుగు మీద కూచుని చింత గింజలు ఆడటం మామూలే చందనకు. అత్తల౦దరూ గారాబంగా చూసుకుంటారు. మొగపిల్లలకన్నా ఆడపిల్లలంటేనే ఇంటి ఆడబడుచులకు ప్రేమ ఎక్కువ. అది సర్వ సాధారణమే కావచ్చు. సీతారత్నం ఎదురింటి వెంకట్రావు నాలుగో కూతురు. వెంకట్రావు తండ్రీ సీతారామయ్య తండ్రీ అన్నదమ్ములు. ఇద్దరూ ఎదురెదురుగా ఇళ్ళు కట్టుకుని ఉన్నన్నాళ్ళూ కలిసి కట్టుగానే ఉన్నారు. వెంకట్రావుకూ సీతారామయ్యకూ ఏడాదిన్నరే తేడా. ఇద్దరూ ఒకే స్కూల్ కి వెళ్ళారు. ఒకేసారి పెళ్ళిళ్ళయినా ఇద్దరి రాతలూ ఒకలాగాలేవు.

సీతారామయ్యకున్నట్టే వెంకట్రావ్ కూ నలుగురు అక్కజెల్లెళ్ళు – “ మా వంశమే అంత నలుగురు ఆడపిల్లలూ ఒక మొగనలుసూ, తరతరాలుగా అంతే” అనుకునేవారు.
వెంకట్రావు భార్య జానకి పేరుకే జానకి కాని స్వభావం లో కాదు. ఒక్కగానొక్క పిల్ల అని అపురూపంగా పెంచారు పుట్టింట్లో. ఒంటికాయ శొంఠికొమ్ములా పెరిగిన జానకికి మమకారాలూ అనుబంధాలూ అంతగా తెలియవు. వెంకట్రావు అక్కచెల్లెళ్ళతో ప్రేమగా మాట్లాడినా అలిగి కూచుంటు౦ది. పెళ్ళైన కొత్త లో ఒకసారి అలాగే అక్కలతో చెల్లెళ్ళతో మాట్లాడుతూ కూచున్నాడు రాత్రి భోజనాల తరువాత. సరదాగా తనూ వచ్చి కూచు౦టు౦దనుకున్నాదు, చూసి చూసి గదిలోకి వెళ్లి ధడాల్న తలుపు వేసుకుని పడుకుంది. ఉలిక్కిపడ్డ అమ్మాయిలూ బిత్తరపోయి తేరుకుని ఎక్కడి వారక్కడ సర్దుకున్నారు. అయినా ఆ రాత్రంతా తలుపే తియ్యలేదు. హాల్లోనే పడుకున్నాడు. ముందు మిగతావారి ముందు ఎంత అవమానం అది. చిలికి చిలికి గాలివానలూ, పెద్దపెద్ద తుఫానులూ అన్నింటికీ జానకి దగ్గర ఘాటైన ఔషధం ఉండనే ఉంది. రెండు సార్లు ఇ౦టివారినందరినీ నడివీధిలోకి లాగినంత పనిచేసింది. ఒకసారి కూల్ డ్రింక్ లొ బెగాన్ స్ప్రే కలుపుకుని తాగితే పోలీసులకు లంచం ఇచ్చి బయట పడ్డాడు. మరో సారి డాబాపై నుండి దూకేసి కాలు విరిగి మూడు నెలలు సేవలు చేయిమ్చుకున్నది కాక నా మాట జవదాటితే నువ్వే తోసేసావని చెప్తానంటు బ్లాక్ మయిల్.
ఆపైన వెంకట్రావు తల్లితో కూడా మాట్లాడటం తగ్గించుకున్నాడు. నెమ్మది నెమ్మదిగా అక్క చెల్లెళ్ళు రావడం తగ్గి౦చుకున్నారు. మొత్తానికి వస్తూనే తన ఆధిపత్యం స్థిరపరచుకుంది. ఎవరైనాఎంత పనికి వస్తారనేది అంచనా వేసుకుని మాట్లాడుతుంది. అందుకే అందరూ అంటీ ముట్టనట్టే ఉంటారు.
“అవును వదినా జానకి వదిన పిల్లను రానిస్తుందా? ఎవరూ సొక్కరు గదా ఆవిడ గారికి ..” మామిడి కాయలు తుడుస్తూ అడిగింది వసంత.
“ ఒకరి సంగతి మనకెందుకులే వసంతా, సీతారత్నంమన చందనతో బాగానే ఉంటుంది.మెంతులు పళ్ళెం లొ పోసుకుని ఒక్కోగి౦జ పట్టిపట్టి చూస్తూ అంది లలితమ్మ.
“ అన్నట్టు ఈ సారి టెంత్ కదూ ఎలారాసి౦ది పరీక్షలు? ఆ తరవాతేమిటి?”
“ఏముంది? మీ అందరికీ చెప్పినమాటే, చాడువుకున్నంత వరకూ చదివిస్తాం” లలితమ్మ అలా అనేసింది కాని చందన నిజానికి చదువుల తల్లి. ఏక సంతాగ్రాహిలా ఏది చదివినా ఇట్టే పట్టేస్తుంది. కనిపించిన పుస్తకమల్లా చదివెయ్యడమే. దానికి వాళ్ళు పెద్ద శ్రమ పడలేదు కూడా.
పని చేసి వచ్చిన తండ్రి సీతారామయ్య పడకమీద మేను వాల్చి “ ఏదీ ఆ పుస్తకం తీసి చదువు “ అనేవాడు.
ఉత్తర క్షణం ఆయన నిద్రలోకి జారుకున్నా పుస్తకం ఆసాంతం చదివేసేది చందన. ఆ అలవాటే పెద్దవరం అయింది చందనకు. తెల్లారి స్కూల్లో చెప్పబోయే పాతం ముందే చదువు కోడం, టీచర్ కన్నా ఎక్కువ తెలిసిఉండాలన్న తహతహ ఆ పిల్ల చదువుకు దోహద పడ్డాయి. చింతగింజలు ఆడుతూ వీధిలోకి ఆటో రాగానే ఆట ఆపి చూసారిద్దరూ. ఆగిన ఆటో లోంచి సూట్ కేస్ పట్టుకు దిగాడు మురళి. ఆ వైపున మరో వ్యక్తీ దిగడం గమని౦చ కుండానే “అమ్మా అన్నయ్య “ అంటూ ముందుకు పరుగెత్తబోయి హరిని చూసి ఆగిపొయి౦ది.

“చందనా సెలవలా? అప్పుడే ఇద్దరూ చింత గి౦జలాట మొదలెట్టారా? ఎన్ని గింజలు పోగేసారేమిటి ?”
మురళి ఎప్పటిలానే అడిగాడు. మొన్న మొన్నటి వరకూ వాళ్ళిద్దరితో కూచుని అతనూ వామన గుంటలూ చింత గింజలూ ఆడే వాడు. ఇద్దరికీ పదేళ్ళ తేడా అయినా చెల్లెలితో ఏ ఒకటి రెండేళ్ళు ఎడం ఉందో అన్నట్టుగా ఆత్మీయంగా ఉ౦డేవాడు. కొత్త వ్యక్తి ముందు సిగ్గుపడింది చందన.

“అవునూ, ఇప్పుడు మేమిద్దరం కూడా మీతో ఆడవచ్చా ? వీడు హరి. హరి ప్రసాద్. నాతో హాస్పిటల్ లో పనిచేస్తాడు. రా రా ఈ రోజు చింత గింజలన్నీ మన అకౌ౦ట్ లోకి వచ్చెయ్యాలి.”
సూట్ కేస్ పక్కన పెట్టి అరుగు మీద కూర్చోబోయే లోగా లోపలి నుండి వచ్చిన తల్లి లలితమ్మ అతన్ని వారిస్తూ,

“చాల్లే చింత గింజలు ఆడేందుకా ఇంత దూరం వస్త, పదండి లోపలికి చందనా ఇక ఆటలు చాలు వీళ్ళకు మ౦చి నీళ్ళు కాఫీ పట్టుకురమ్మని” పురమాయించడంతో గింజలన్నీ ఎత్తి లేచారు ఇద్దరూ. గుమ్మందాకా వెళ్ళాక కొ౦చ౦ తలతిప్పి హరి వంక చూసి౦ది చందన. మంచి పొడగరి, సన్నగా, చురుగ్గా కనిపిస్తూ, కళ్ళద్దాల నుండి తననే గమనించడం చూసి చటుక్కున తలతిప్పుకుని లోనికి వెళ్ళింది. ఆ వారమంతా ఇద్దరూ అక్కడే ఉన్నారు. పండగ రోజు రాత్రి బయలు దేరారు.

“కనుము రోజు కాకి కూడా బయలు దేరదు. వెళ్తే ఈ రోజు వెళ్ళండి లేదూ ఎల్లుండి “ నమ్మకం లేకపోయినా లలితమ్మ మాట కాదనలేక ఆ రాత్రే ప్రయాణం అయ్యారు ఇద్దరూ.
“ఇహ చింత గింజలు మానేసి బాగా చదువుకోరా తల్లీ నా కంటే పెద్ద డాక్టర్ వి కావాలి నువ్వు” వెళ్తూ వెళ్తూ చందనకు చెప్పాడు మురళి.
“ మీ ఇద్దరూ డాక్టర్లు అయి౦ది చాలక ఇహ దీన్ని కూడా ఇంటి పట్టున ఉ౦డనివ్వరా ఏమిటి?” కొంచం అయిష్టంగా అంది లలితమ్మ .
అవును మేనత్త కూతురు ప్రియతో మురళి పెళ్లి నిశ్చయమే. ఇంకా ఆ పిల్ల మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతో౦ది. నిజానికి ప్రియ కూడా సంక్రాంతికి రావలసిన మాటే. కాని ప్రైవేట్ క్లాస్ లు ఉన్నాయని ఆగిపోయి౦ది.
“ జనాలకు సేవ చేసే భాగ్యం కోరుకు౦టే వస్తుందా అమ్మా, ఎవరూ డాక్టర్లు అవకపోతే ఇహ లేడీ డాక్టర్లు ఎక్కడి నుండి వస్తారు. అమ్మ అలాగే అంటుంది కాని నువ్వు డాక్టర్ వి అవాలి, ఏరా హరీ ?” అంత వరకు దిక్కులు చూస్తున్న హరి అవునవును అన్నాడు.
‘నేను ఏమయితే ఇతనికేమిటటా?” అనుకుంది చందన. అదే ఒకరినొకరు చూసుకోడం. తనకు నచ్చినట్టు కళ్ళద్దాలు పెట్టుకోడం , నాజూకుగా ఉండటం బాగున్నాడని అనుకుంది తప్ప మరో భావనే కలగలేదు ఇంకా టీనేజిలో ఉన్న చందనకు. ఇంటర్ చదివిన రెండేళ్ళలోనూ అడపా దడపా వస్తూ పోతూ ఉండే వాడు మురళితో పాటు. అన్నయ్యతో పాటు హరితోనూ అరమరికలు లేకుండా మాట్లాడటం వాదించటం అలవాటయింది చందనకు. మురళి లానే “హరీ” అనే పిలిచేది.

“పెద్దా చిన్నా లేకు౦డా ఏమిటా పిలుపు…” లలితమ్మ మందలి౦చబోయినా హరి వారి౦చాడు.
“నాకు అలా పిలవడమే ఇష్టంగా ఉంది, ప్లీజ్ అలాగే పిలవనీయండి” అన్నాడు. మురళి చెప్పినట్టుగానే మెడిసిన్ లో సీటు సంపాదించింది చందన.

ఆ ఇంట్లో ఆనందాలకు హద్దులేదు. పల్లె పిల్లలంటే అల్లరి చిల్లరిగా ఉండే వాళ్ళే గుర్తుకు వచ్చేరోజుల్లో ఇద్దరికిద్దరూ ఆణిముత్యాలని అందరూ మెచ్చుకునే వారు. చందన మెడికల్ కాలేజీలో చేరి పట్నం వెళ్తే ఊళ్ళో ఒక్కత్తీ ఉండటం అనవసరం అని అందులో కొడుకు డాక్టరీ హౌస్ సర్జన్ పూర్తయి రెండేళ్ళు దాటింది ఇహ కాపురం నగరానికి మార్చడం మంచిదని అక్కడే ఒక అపార్ట్మెంట్ కొన్నాడు సీతారామయ్య ఊళ్ళో ఇల్లూ వాకిలీ అక్కగారిని చూసుకోమన్నాడు. ఇల్లు మారకముందే కొడుకు పెళ్లి జరగాలనీ అనుకున్నాడు.
“ ఇంకా చదువు కాలేదని” ప్రియ నసిగినా,
“నిన్నేం చదువు మానమని అనడం లేదుగా కోడలా, పెళ్ళయ్యాక చదువుకో .. ఒకరి కిద్దరు చందన కూడా తోడు” అని పెళ్లికి ముహూర్తాలు పెట్టి౦చాడు.
సరిగ్గా పెళ్ళికి నాలుగు రోజుల ముందు దిగారు మురళీ . హరీ.
“ఇంత ఆలస్యంగానా రాడం , ఇక్కడ పనులెవరు చూడాలి?” క్షణం తీరిక లేకుండా అష్టావధానం చేస్తూ అంది చందన.
సెలవలని ఇంటి పట్టున ఉందేమో రంగు తేలి మిలమిలలాడిపోతో౦ది. అప్పుడే మెరుగుపెట్టిన బంగారం తీగలా. ఓణీ వేసుకుని ముద్దుగుమ్మలా చూడ ముచ్చటగా వుంది.
“ నా పెళ్ళని ఎవరికీ జబ్బులు రావద్దని ఎలా చెప్పనే తల్లీ .. మనదే౦ ఆషామాషీ నౌకరీనా? ఎప్పుడంటే అప్పుడు ఎగ్గొట్టి రాడానికి? అందుకే హరిని పట్టుకొచ్చా, ఈ నాలుగు రోజులూ కావలసినన్ని పనులు చేయి౦చుకో ఇక్కడే వీధి గుమ్మం లోనే అప్పజెప్తున్నా “ అన్నాడు.
“ఇంకా నయం నన్ను దానమిచ్చేశా అనలేదు” నవ్వాడు హరి
“ నిన్నెలా దానం ఇవ్వగలం? ఇస్తే గిస్తే మా చెల్లిని ఇవ్వగలం గాని” అనేసాక గాని ఏమన్నాడో అర్ధం కాలేదు హరికి.
అర్ధం అయ్యాక కంగారుపడి మాట తప్పి౦చా’లని కంగారుపడ్డాడు. చందన మొహం ఎర్రబారింది.
ఏదో పని ఉన్నట్టు హడావిడిగా లేచి “మీకు కాఫీ పంపుతాను” అంటూలోనికి వెళ్ళిపోయి౦ది.
“ నీకు గుర్తుందా చందనా, సరిగ్గా ఆ నిమిషంలోనే పైన తదాస్తు దేవతలు మనను ఆశీర్వదించినట్టున్నారు. అప్పుడే నా మనసు ఒక నిర్ణయానికి వచ్చేసింది. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నేననీ నా జీవితానికి సహచరివి నువ్వేననీ”
ఎన్ని సార్లు ఆ మాటలు చెప్పాడో ఈ పాతికేళ్లలో … పాతికేళ్ళకు ముందు …
మురళి పెళ్లి లో ఇద్దరికీ దగ్గరితనం పెరిగింది.
పెళ్లి తఱువాత మురళి అత్తగారింటికి , హనీమూన్ కి తిరిగే సమయంలో హరి చందనతోనే ఉండి పెళ్లి తరవాయి సర్డుకోడాల్లో సాయపడ్డాడు.
“ హరి గారూ మీకెందుకు శ్రమ? హాస్పిటల్ వదిలేసి ఇక్కడ ఇలా ఈ సర్దటాలు… మేం చూసుకు౦టా౦ కదా … “
“చూసుకోరని అన్నానా? మళ్ళీ నెలరోజుల్లోగా అందరూ వచ్చెయ్యాలి, కాలేజీ మొదలవుతుంది. అయినా నీకేమిటి బాధ నేనేమైన జీతమడిగానా? నాకు అన్నం పెట్టడం ఇబ్బందిగా ఉందా?” హాస్యమాడాడు.
మొత్తానికి అతని సాయంతో షిప్ట్ చెయ్యవలసిన సామాను పాకింగ్ ఉంచవలసిన సామాను భద్రపరచడం పూర్తయింది.
తెల్లవారి నగరానికి వెళ్ళిపోయే ముందు రాత్రి, పెరట్లో వెన్నెల వెలుగులో బావిగట్టున కూచుని పనిమనిషి ఉతికి ఆరవేసిన బట్టలు మడత పెడుతున్న చందనను చూస్తూ అప్రయత్నంగానే కూని రాగం తీసాడు హరి.
“ఏ దివిలో విరిసిన పారిజాతమో … “
“ఊ .. పాటలు కూడా పాడతారన్నమాట … ఆపేశారేం, పాడండి”
మరీ బతిమాలించుకోకు౦డానే పాడాడు హరి.
“ఈ పాట నచ్చిందా?”
“బాగా నచ్చింది , మీకు పాతపాటలే ఇష్టమా?”
“అవును అవి లోలోపలి నుండి ఉబికి వచ్చి మన మాటలే పాడుతున్నట్టు ఉంటాయి”
“నిజమే…”
“రేపు ఉదయం ఆరింటికి కదూ మీ బస్… అలారం పెట్టుకున్నారా ?”
“అలారమా? అదెందుకు అసలు నిద్రపోతే కదా?”
“అదే౦?”
“ మళ్ళీ ఈ పల్లె ఎన్నాళ్ళకు చూస్తామో, మీరూ చదువుకని అక్కడికే మారుతున్నారుగా?”
“ఓహో ఊరి మీద బెంగా ?”
“ఊరిమీదా మనుషుల మీదా”
లేచి చందన మడత పెట్టి బాస్కెట్లో పెట్టిన బట్టలు తీసుకుని లోనికి కదిలాడు.
చందనకు ఏదో అర్ధం అయ్యీ కాకు౦డా ఉన్నట్టు అనిపించింది.
కొ౦పదీసి “నువ్వంటే నాకిష్టం” అంటాడా? ఏమో అలాగే ఉంది వాలకం. అన్నీ అమ్మా నాన్నల ఇష్టం అంటాను.
ఆ అనుకోడం స్థిరంగా నిలిచిపోయింది చందనలో.
పట్నం మారాక, అడపాదడపా ఇంటికి వచ్చినా, చదువులో సాయపడినా ఎవరి హద్దుల్లో వారు ఉండే వారు.

(2వ భాగం వచ్చేవారం)

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!