Monday, February 17, 2020
Home > కవితలు > నాతో పాటు నడిచి చూడు -స్వాతీ శ్రీపాద

నాతో పాటు నడిచి చూడు -స్వాతీ శ్రీపాద

నాతో పాటు నడిచి చూడు
నాతో పాటు మూడడుగులు కలిసినడవ రాదూ
సమస్త జీవకోటి ఆవాసం ఈ పృధ్వి మీద ఒకడుగూ
వ్యక్తావ్యక్త స్వప్న సౌందర్య సీమలతివాసీ పై మరో అడుగు
ఆత్మఅనంత సువిశాల వారధి నీలాకాశంముంగిట్లో మరో అడుగు
నాతో పాటు నడిచి చూడు
చెమర్చిన మబ్బులు వెన్నెట్లో మెరుగుపెట్టినట్టున్న
తళతళ మెత్తగా వికసించే వేళ
నీకోసం ఎదురు చూస్తూ నేను
క్షణం ఓరగా తెరుచుకున్న కిటికీ పరదా అలికిడిలో
అంతలోనే గుప్పున విచ్చుకున్న బాల్కనీ కుండీలో
మల్లెమొగ్గలో నువ్వే అనిపిస్తావు
చటుక్కున జిగేల్మన్న మెరుపుతీగా
ఆగి ఆగి గుసగుసలాడే గాలి
అన్నీ నువ్వేనేమో …
నేనూ నా తెరిచిన గుండెల మీద వాలిన పుస్తకమూ
నేనూ నా నిశ్శబ్దంగా కళ్ళప్పగించి చూస్తున్న సెల్ ఫోన్
నీ కోసమే ఎదురు చూపు
శిశిరం ముడుచుకు పడుకున్న వేళ కలల గొంగడి
కప్పుకునీ
వసంతం బుక్కా చల్లుతున్న తలపుల్లో
ప్రతి కుసుమం రంగులు అద్దుకునీ
జల్లులు జల్లులుగా కురుస్తున్న వర్ష ఋతువులో
ఆకు చివర మీటి పలికే నీటి సంగీతంలో
ఎక్కడ చూసినా నువ్వేకదా
అందుకే
నాతో పాటు నడిచి చూడు

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!