Wednesday, July 18, 2018
Home > బాల సాహిత్యం > పని – ఆనందం

పని – ఆనందం

పూర్వము ఒక సాధువు కాలి నడకన ప్రతి ఊరు తిరుగుతూ అందరికి మంచి మాటలు చెబుతూ ఉండేవాడు. ఒక నాడు ఆలా నడిచి నడిచి అలిసిపోయి వచ్చే ఊరిలో విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాడు. ఊరిలోకి ప్రవేశించగానే ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది, దాని క్రింద హాయిగా నిదురపోయాడు.

కొంత సమయం తరువాత అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి దాని వాళ్ళ నిదుర భంగం అయింది. లేచి చూస్తే అతనికి కొద్దీ దూరంలో ఇంకో చెట్టు క్రింద ఒక వ్యక్తి ఉలితో ఒక పెద్ద రాయిని చెక్కుతున్నాడు చూడడానికి అది ఒక స్తంభంలా ఉంది.

సాధువు అతని దెగ్గరికి వెళ్లి “ఏమి చేస్తున్నావు నాయన?” అని అడిగాడు.

సాధువు ప్రశ్నకు బదులుగా ఆ వ్యక్తి, “ఈ రాయిని చెక్కుతున్నాను” అని అన్నాడు.

సాధువు అది విని, “అది తెలుస్తుంది నాయన, కానీ చెక్కి ఈ రాయిని ఏ ఆకారం ఇస్తున్నావు ?” అని అడిగాడు.

అప్పుడు ఆ వ్యక్తి, “ఏమో స్వామి ఏమి ఆకారం వస్తుందో నాకు తెలీదు” అని అన్నాడు.

సాధువు ఆ జవాబు విని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లి పోయాడు. ఊరిలోకి ఇంకొంచం నడిచాక ఆయనకు ఇంకొక వ్యక్తి శిల్పాన్ని చెక్కుతూ కనిపించాడు సాధువు అతని వద్దకు వెళ్లి “ఏమి చేస్తున్నావు?” అని ప్రశ్నించాడు.

ఆ వ్యక్తి, “తెలీదు స్వామి నాకు తెలిసిన పని ఇది ఒకటే, అక్కడ ఉన్న వ్యక్తి నాకు పని చెప్పాడు దాని చేస్తున్నాను” అని చెప్పి ఇంకొక వ్యక్తిని చూపించాడు.

సాధువు ఆ వ్యక్తి దెగ్గరకు వెళ్లి, “నాయన నీవు ఏమి చేస్తున్నావు?” అని అడిగాడు.

“ఓ మహాత్మా నేను ఒక ఆలయ స్తంభాని చెక్కుతున్నాను, ఈ ఊరిలో ఒక పెద్ద ఆలయం కట్టాలి అని కోరిక ఉంది. పండగలు వచ్చినప్పుడు ఈ ఊరి ప్రజలు పక్క ఊరికి వెళ్తారు, ఎందుకంటే ఈ ఊరిలో పెద్ద ఆలయం లేదు.

దేవుడు నాకు మంచి శిల్పి అయ్యే యోగం ఇచ్చాడు, దానిని నేను మంచి పనికి ఉపయోగించాలి అనుకుంటున్నాను. ఉలితో నేను ఈ రాయి పైన చెక్కడానికి దెబ్బ వేసినపుడు నాకు గుడి గంటల చప్పుడు వినపడుతుంది. ఆ చప్పుడు విన్నపుడు నాకు ఎదో తెలియని ఆనందం కలుగుతుంది, ఈ లోకం మరిచిపోయి ఈ పనిని చేస్తాను అని అన్నాడు.

సాధువు ఆ వ్యక్తి జవాబు విని అతనిని ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్లి పోయాడు.

నీతి:

నీవు చేసే పనిని ఎప్పుడైతే ఆనందంగా చేస్తావో, అప్పుడు ఎలాంటి కష్టము నీకు ఎదురైనా బాధ అనిపించదు. ప్రేమతో పని చేస్తే ఎంతో తృప్తి కలుగుతుంది కావున నీవు చేసే పనిని ప్రేమించాలి.

-శ్రావణ్ నాగ శేఖర్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!