Saturday, February 22, 2020
Home > కవితలు > || ఒక చిన్న కదలిక || -స్వాతీ శ్రీపాద

|| ఒక చిన్న కదలిక || -స్వాతీ శ్రీపాద

ఒక చిన్న కదలిక
నునులేత ఆకు చివరలు వెన్నెల సోకి వణికినట్టు
హరితవనం కప్పుకున్న ప్రవాహం కాస్త తొణికినట్టు
కాస్త విశ్రమించిన మలయపవనం ఉలికిపాటుతొ చెదిరినట్టు
ఒక అదృశ్యఆగమనం తొలిసారి పాదముద్ర అజరామరంగా
ముద్రి౦చినట్టు ఒక చిన్నకదలిక
శిశిర వసంతాల నడుమ స్వప్నసీమ విహారంలో
వాలిన కనురెప్పల వెనక స్పష్టాస్పష్టంగా
ఉప్పొ౦గుతున్న అలల శిఖరాలపైన
పూరెక్కల పుప్పొడి గాజుపల్లకీ సౌకుమార్యం ఎక్కి
రెక్కలు విప్పుకున్న ఊహ
ఒక చిన్న కదలిక
కంటి రెప్పల చివర తేమను మొలిచే జ్ఞాపకాల కొసన
సుతారంగా వేలాడుతున్న సీతారత్నం పలుచని
పెదవులపై తడబడుతూ ఓ చిన్న కదలిక
ఎప్పుడూ స్థిరత్వం తెలియని కదలికే
వర్తమానం ను౦డి గతానికీ
గతం నుండి భవిష్యత్తుకూ
వర్తమానం ఒక ఊగే ఊయలే
సుఖదుఃఖాలు వికసించే ఈ జీవన వృక్ష౦
ఓ పక్కన వెన్నెల పులుగుల్లా వికసిస్తున్న మందహాసాలు
మరో కొమ్మపై వాడి వేలాడుతున్న చీకటి విషాదాలు
ఎప్పుడూ ఒక ఆశ్చర్యార్ధకమే
ఎప్పుడూ ఓ చిన్న కదలికే

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!