Wednesday, January 26, 2022
Home > కథలు > పూలజడ! -వి.సునంద

పూలజడ! -వి.సునంద

మల్లికకు చాలా ఆనందంగా వుంది. పట్టలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది!

మల్లికను చూసి “ఏమిటో ఈ కాలం పిల్లలు…పెళ్ళనగానే ఎగిరెగిరి పడుతున్నారు! అదే మా కాలంలో అయితే.. కొత్తకోడలుగా అత్తారింట్లో ఎట్లవుండాలో ఎవరెసుమంటి వారో ,ఇంగ పుట్టింటికి సుట్టాన్నే గదా అని దిగులు మొహాలేసుకుని గుబులు పడుతుండే వాళ్ళం”.

వచ్చిన అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకుకుంటు చెవులు కొరుక్కుంటున్నారు…

ఇవన్నీ చెవుల బడుతున్నా వినీవిననట్టుగా వుంది. అసలు విషయం తెలిస్తే వీళ్ళంతా నవ్వుకొని “ఓసి..ఇంతేనా అని ఏడిపించరు! అమ్మో అస్సలు తెలియ నీయొద్దు” అనుకుంది మల్లిక.

మల్లిక దోస్తురాళ్ళకు గూడా మల్లిక వ్యవహారం అంతుబట్టడం లేదు..”ఏమిటో జర చెప్పరాదే మల్లీ! గింత కుషీ గున్నవు! వచ్చే మొగుడేమన్న రామ సక్కని అందగాడా! మహేష్ బాబు లాగుంటడా !ఉద్దోగం సేత్తుండా…” అంటే.. “అదేం లేదే! ఎన్నాళ్ళనుండో అనుకున్న సంబంధమే…మేనత్త కొడుకే ..మధ్యస్థంగా వుంటడు…!

“అయినా గాయిన్ని సూసి గంత మురవాల్సిందేముందబ్బా..!” ఎంత బతిలాడినా ముసిముసిగా నవ్వుద్దే తప్ప చెప్పదు.

తల్లి మంగమ్మకు గుండె మీది నుండి ఓ బారం దిగిపోతున్నందుకు సంతోషంగా వుంది. ఇంత కాలం ఒంటిచేత్తో చిన్న మడిచెక్కలో పూల తోటేసి, సీజన్ల వారీగా పూలమ్మగ వచ్చిన డబ్బులను…అటు రోగిష్టి మొగుడి మందులకు, ఇటుపిల్లల సదువులు ,తిండి తిప్పలు అన్నీ సూసుకుంట పిల్లపెళ్ళికి నాలుగు రాళ్ళు ఎనకేసింది. కష్టం సుఖం తెలిసిన ఆడబిడ్డ ..మంగమ్మ కోరికను కాదనలేక ,సక్కని సుక్కలాంటి మల్లిక కోడలుగా వస్తున్నందుకు,వదిన పెట్టుబోతలకు ఏం తక్కువ సెయ్యదని అర్ధమయ్యి అడగ్గానే ఒప్పేసుకుంది..

ఇంగ పెళ్ళికొడుకు ‘మాధవ’ అత్తెసరు మార్కులతో డిగ్రీ సదివాననిపించి, ఉన్న ఎకరం పొలం తండ్రితో పాటు చూసుకుంటు,టౌనుకెళ్ళి మెకానిక్ షెడ్డులో పని చేస్తున్నడు….”ఇవి జాలుగదా బిడ్డ భవిష్యత్తు కోరే ఆడపిల్ల తల్లికి….

మల్లిక గూడా ఎప్పుడూ ఊహల్లో ఊరేగలేదు”ఎవరో రాజకుమారుడు వచ్చి కీలు గుర్రంపై ఎత్తుకు పోతాడని”…….ఊహ దెలిసిన కానుండి అమ్మ కష్టం సూస్తనే వుంది..వానలు పడనప్పుడు ..కరెంట్ లేక ,మోటర్ పనిచేయనప్పుడు, వాడిపోతున్న పూలమొక్కలకు బాయిలోంచి నీళ్ళు తోడి పోసి సంటిబిడ్డల్లెక్క సూసుకునేది… “గవే బిడ్డ మన ఆస్తి” అనేది…అందుకే అమ్మ ఎట్లాగూ తన మంచి కోసమే గదా చూసేదని..తన కంటే రంగు తక్కువ..మామూలుగా వున్నా ……బావను పెళ్లి చేసుకోవడానికి కాదనకుండా ఒప్పేసుకుంది…

“మరి ఇంగ గంత సంబరపడాల్సిన దేముందబ్బా” అనిపించొచ్చు చూసే వాళ్ళకు….

పందిట్లో పెళ్ళిబాజాలు మోగుతున్నాయి..మల్లిక పెళ్ళి కూతురాయెనే అంటూ పాట మార్చి మరీ పాడుతున్నారు..నలుగు స్నానం అయ్యింది…లగ్గం టైం దగ్గర బడుతుందని హడావిడి చేస్తున్నరు ముత్తయిదులు..పట్టు చీర కట్టించారు. బారెడు జడ నీళ్లోడుస్తుంటే ఓ దోస్తురాలు గౌరి పూజ చేస్తుంటే మరో వైపు తువ్వాలుతో తల తుడవ సాగింది…

“ఏం కాదులే అబ్బా!జడ వేసి పూలజడ కుట్టండి!” ఇంకా టెన్షన్ ను తట్టుకోలేక పోతోంది మల్లిక.

మంగమ్మత్త పూలు వాడిపోకుండా జడ ఎక్కడ పెట్టిందో అడగడానికెళ్ళిన దోస్తురాలుకు అక్కడెవరో కొత్త మనిషి కనబడే సరికి ఆగిపోయింది.

“మంగమ్మా మా అమ్మాయి పెళ్ళి ముహూర్తం..నీ బిడ్డ పెళ్ళి ముహూర్తం ఒక్కటే..టౌన్ లో పూల జడ కొనడం మర్చిపోయారట..నీవే కాపాడాలి..పూలన్నీ నీ దగ్గరే కొన్నం గదా..ఇంకేమైన పూలు.. కాదు కాదు… పూలజడ గావాలి !” అంటున్న ఆవూరి పెద్దమనిషి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
తన బిడ్డ ఎంతో ఇష్టంగా పూలజడ కుట్టుకుంది…దాని జడకు కట్టాలిప్పుడు…ఒక్క ఊరి మనిషి అందులోనూ తను కష్టంలో వున్నప్పుడు మాట సాయం పైస సాయం చేసిన మనిషిని కాదనాలంటే మనసొప్పడం లేదు…తనబిడ్డనే ఒప్పించుకుంటనని మనసు గట్టి పరుసుకొని తడిగుడ్డలో సుట్టుంచిన అందంగా కట్టిన పూలజడను ఆ పెద్దమనిషికి ఇస్తూ.. “ఎవర్నయునా పంపక పోయారా అయ్యా! ఇచ్చేదాన్నిగా !” అంది.

“నీ మంచితనం అలా అనిపించింది మంగమ్మా! ఎవరిస్తారు చెప్పు…పెళ్ళప్పుడే గదా పూలజడ వేసుకునేది…బిడ్డకిప్పుడు అవసరమని తెలిసీ నేను రాబట్టి ఇచ్చావు..నీ మేలు మరువనంటూ” వెళ్ళిపోతున్న పెద్దమనిషిని అలాగే చూస్తుండి పోయారు మంగమ్మ మల్లిక దోస్తురాలు…

ఇప్పుడేం చేయాలో చేతులు కాళ్ళాడక అక్కడే కూలబడి పోయింది మంగమ్మ…చిన్నప్పటినుండీ ఎన్నిసార్లు పూలజడ వేసుకుంటానని తలనిండా పూలు పెట్టుకుంటానని అడిగిందో…ఆ పూలు అమ్మితే నాలుగు డబ్బులొస్తాయని ఏనాడూ బిడ్డ కోరిక తీర్చలేదు..ఎన్నోసార్లు అలిగితే ఇంటి పరిస్థితి చెప్పి నచ్చజెప్పింది…మరిప్పుడు ఏం చెప్పాలె..ఎట్ల జెప్పాలె గుడ్ల నీళ్ళు నింపుకొని బిడ్డ దగ్గర కొచ్చి తప్పు జేసిన దానోలే తలొంచుకొని నిలబడింది..

మల్లిక దోస్తురాలు ముందే వచ్చి చెవిలో చెప్పగానే విలవిలలాడి పోయింది మల్లిక మనసు..తనిప్పటి వరకూ దేనికోసమైతే పట్టరాని సంబురంగా ఎదురుసూస్తుందో అదే తనకు అందకుండా పోయింది…పాపం అమ్మ మాత్రం ఏం జేస్తది..పెద్దమనిషి వచ్చి చేతులు జాపి అడిగినపుడు…మనసులో బాధను తుడిచేసుకుని లేచి అమ్మ కొంగులో తలదూర్చి… “అమ్మా ఆ పూలయితే కొద్దిసేపటికే వాడి పోతాయి…మన పందిరికి కట్టంగ మిగిలిన ఆ కాగితం పూలు తెచ్చి కట్టమని చెప్పమ్మా! అవయితే ఎప్పటికీ వాడవు..!” “ఏంటబ్బా మీకు నాకంటేబాగా కట్టడం వచ్చుగా….త్వరగా కట్టండి పందిట్లో మా బావ ఎదురు చూస్తున్నడు” అంది.

తల్లి కళ్ళ నుండి కన్నీటి బిందువులు తలమీద రాలాయి..అది చూసి “అమ్మా! ఇప్పుడు కాదు అప్పగింతలప్పుడు…” అంటూ ప్రేమతో తల్లి కన్నీళ్ళను తుడిచింది మల్లిక.

మల్లిక ఆనందానికి కారణం పూలజడ అని ఆ తల్లీ బిడ్డలిద్దరికే తెలుసు!

-వి.సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!