సమాజంలో అణచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు తీవ్రం అవుతుంది. ఈ సిద్దాంతాన్ని జీవితాంతం నమ్మిన వ్యక్తిగా కాళోజి సుప్రసిద్దుడు. ధాస్య సంకెళ్లు తాను పుట్టిన గడ్డను బంధించిన వేళ సహించని కవి ఆయన. సమాజంలో నిస్తేజం ఆవరించిన క్షణాన ఉవ్వెత్తున ఎగిసిన ఉత్తేజం ఆయన. ఆయనే కాళోజి నారాయణరావు. “పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది” అన్న కవితోక్తికి సాకారంగా తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమంలో ఆయన కలం గొడవ చేస్తు.. గర్జిస్తుంది. నిజాం దమన నీతికి, రజాకారుల నిరంకుశత్వానికి, వ్యతిరేకంగా చరమగీతాన్ని కట్టిన కవి కాలోజి.
వ్యక్తిగా తానేది కోరుకుంటాడో కవిగా అదే కోరుకునే కాలోజి నారాయణరావు 1914, సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో రమాభాయి, రంగరావు దంపతులకు జన్మించారు. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. ఆయన అసలు పేరు రఘువీర్ నారయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా కాళోజీ. అనంతరం ఆయన కాళన్నగా, కాళోజీగా ప్రసిద్దికెక్కాడు. పాతికేళ్ల వయసులో 1940 లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది.
హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల్లో మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. 1939 లో హైదరాబాదులో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. నాగొడవ, కాళోజీ కథలు, జీవన గీత, అణా కథలు, నా భారతదేశయాత్ర, పార్థివ వ్యయము, తుదివిజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు, బాపూ!బాపూ!!బాపూ!!! వంటి రచనలతో ప్రసిద్దికెక్కాడు. విద్యార్థి దశ నుంచే నిజాం ప్రభుత్వంపై దిక్కార స్వరాన్ని వినిపించిన ధైర్యశాలి. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో పనిచేసిన ఆయన పుల సందర్భాల్లో నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించారు.
ప్రతి గ్రామంలో ఓ గ్రంథాలయం ఉండాలని కోరున్న వ్యక్తి కాళోజి. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. అనంతరం సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది.
కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో పట్టు సాధించినా తెలుగుపై మక్కువ ఎక్కువ. ఆ మక్కువే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుడిగా, పని చేయడానికి ప్రోత్సహించబడ్డాడు. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓడిపోయారు కాళోజీ.
తన రచనల ద్వారా సమాజాన్ని మేల్కొల్పిన కాళోజికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. మొదట ఆ పురస్కారాన్ని తిరస్కరించినా.. విద్యార్థి దశనుంచీ మిత్రుడైన పి.వి.నరసింహారావు మాటను కాదనలేక 1992లో ఆ పురస్కారాన్ని స్వీకరించాడు. అస్తిత్వంపై జరిగే దాడిని ఏ మాత్రం సహించని కాళోజి తెలంగాణ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పోయారు. ముఖ్యంగా తెలంగాణ భాషపై జరుగుతున్న అహంకార పూరిత వ్యాఖ్యలపై ఎవని వాడుక భాష వాడు రాయాలె అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. “ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక” అని చెప్పి..తన రచనల ద్వారా తెలంగాణ సమాజాన్ని ఉత్తేజ పరిచిన ఆయన 2002 నవంబరు 13న తుది శ్వాస విడిచారు. తన రచనల ద్వారా చేసిన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ఆయన జన్మదినం అయిన సెప్టెంబర్ 9 రాష్ట్ర భాష దినోత్సవంగా గిర్తించింది. నిప్పు కణికల్లాంటి అక్షరాలు చెక్కిన కాళోజీకి మరణం లేదు. ప్రజల తిరుగుబాటులో తన కవితల రూపంలో ఆయనేప్పుడు సజీవంగా ఉంటాడు.
-ప్రసాద్ జూకంటి