Saturday, April 4, 2020
Home > కవితలు > అమ్మమ్మ -రామవ్వ! -తగిరంచ నర్సింహారెడ్డి

అమ్మమ్మ -రామవ్వ! -తగిరంచ నర్సింహారెడ్డి

ఎండాకాలం తాతీళ్లంటె చాలు
ఉండుడుమొత్తం అమ్మమ్మతాడనే ..
పాణమోలే ప్రేమంత ఒలకవోశి
గావురంగ సూత్తది!!

పొద్దుగాళ్లనే లేచి
శుద్ధిగ ఇల్లలుకుజేసి
ఎన్నీలముగ్గులవెట్టేది!
ఆముగ్గులన్నీ నవ్వులనీ..
ఆనవ్వులకు పోటీగా
మనవల నవ్వుచూస్కుంట….
కల్తీలేని తన నవ్వసొంటి
తెల్లని అరటుకులను
అనురాగపుశక్కరిేసిన
ఛాయ్ ల వోశి
కమ్మగ కడుపునిండ తినవెట్టేది!!

పగిలిన కాళ్లతోటి
పట్టరాని ఎగిర్తాన
గుట్టలసుట్టూత తిరిగి
శెట్టశెట్టుకు దేవులాడి
తునికాకునేరి ముళ్లె గట్టి
అవస్థకనవడకుండా
భుజం మీదేసుకునితెస్తూ
*పైసలమూటతెచ్చినంత సంతోషం*
*ముడుతలవడ్డ కండ్లల్ల*
*కోటిమెరుపులై కనవడ్తుండె !*
ఆ గుట్టలమీదసుత
మనుమలకోసం ఆరాటంతో
ఆ కండ్లసూపు దేవులాటంత
మొర్రి, తునికి తీరోక్క పండ్ల మీదనే!!

ఎప్పుడో పొద్దుపొడువకముందుపోయి
పది పదకొండుదాటినంక
*ముడుతలవడ్డబక్కచెట్టు*
ఆకును ముళ్లెకట్టి నెత్తికెత్తుకుని
*శేతుకొమ్మకు నీళ్లసీసతగిలేసుకుని*
శెమటచుక్కలధారతోటి
శ్రమవడుకుంట యింటికిచేరేది!
తెచ్చిన పండ్లన్నింటిని
యింట్లకడుగువెడ్తునే
అమృతమోలే శేతికందిచ్చేది!!
*కమ్మటి పండ్లరుచికన్న*
*అమ్మమ్మ పంచే ప్రేమరుచే*
*మస్తు కమ్మగుండేది!!*

తెచ్చిన ఆకునంత మూలకుకుప్పవోశి
గింతన్న ఎటమటం కాకుండ
పైసలకట్టకంటే మంచిగ
మడతవెట్టి పుడలు కడుదుుంటిమి!
పోరగాండ్లందరికి
నువ్వులు ఏంచి
నూకలు కలిపి
లేకుంటే ..
నువ్వులుశక్కరికలిపి
గిన్నెలల్లవోశిస్తే
నోట్లే వోసుకుంట…
ఆకుమడతవెడుతుంటిమి
అష్టాచెమ్మా ఆడుదుంటిమి !!
ఆకుపుడలమ్మిన పైసల్తోని
మనుమలు తేజుండాలని
ఇంద్రధనుస్సు కంటే మంచిగుండే
రంగురంగుల బట్టలుకొనిచ్చేది!
శేతుకు బ్రాసిలెట్టులో
మంచి గడారం కొనిచ్చినుండే!
మండెఎండల్ల శెమటగక్కుకుంట
చేసిన శ్రమల గింతన్న
తనకోసముంచుకోలే!
*ఆకుపచ్చనిశెట్టుకున్న*
*రామసక్కని గుణాలన్ని*
*” రామవ్వ” నెత్తుర్లనే ఉన్నయి!!*

తన పాణమాగక
తాత పాణం తింటుండే..
సల్లపూటతాళ్లల్లకువొయి
దేవుండ్ల తిండి కన్న సై యున్న
తాటిముంజలు తెంపుకురమ్మని !
” ఊకే పొయ్యిలనేనా”
నీకు శాతగాకపోతే
గౌండ్లోల్ల కన్న చెప్పి తెప్పీయిమంటది !!
ఎన్నడన్న బండి మీదవోంగ
తొవ్వపొన్న ఆగుతే చాలు ..
ఆడున్నోళ్లు మమ్ముల సూసి
బాల్ రెడ్డి మనుమలని గుర్తువట్టి
బగ్గ ఈతపండ్లు తాటిముంజలు కోసిచ్చి
పైలంగ పోండ్రయ్యా అంటుండే…
” ఆళ్ల ప్రేమ సల్లగుండ ”
పైసలియ్యవోతే చాలు
మీతాన తీసుకుంటమా బిడ్డా..!
మీ తాత, అవ్వ పుణ్యమా అని
మా యింట్లిన్ని నూకలున్నయి
మా పోరలు సల్లగున్నరంటుండే !!
*ప్రేమ పంచుడొక్కటే ఎరుక ఊళ్లే !*
*ఆ ప్రేమలను మించిన సంబురమేముంటది !!*

తునికాకుశెత్తల మామిడికాయలు మక్కేశి
మక్కినయో లేదో నిత్తె చూస్కుంట
తియ్యతియ్యటియి యేరిస్తే
కడుపునిండా కమ్మగతినేది!
*అగ్గికురుస్తున్న ఎండల ఆటలేందని*
చింతగింజలచెమ్మలతో అట్టచెమ్మానో
పంజాలమీదపంజాలతో పచ్చీసాటనో
నీడపట్టనకూసుండవెట్టి ఆడిపించేది!!
బొంబాయిమిఠాయి సప్పుడినవడ్తే చాలు…
*గుళ్లెగంటకంటే మంచిగినిపిచ్చు*
*అమ్మేటాయన ఒంటినుండి*
*శెమటతీర్థం కారుతుండే!*
*శ్రమజీవి జీవునం పునీతమైనట్లనిపించేది!!*
*కారం మెతుకులో కలోగంజో తినుకుంటైనా..*
*కావల్సినయన్నీ కాదనకుండా కొనిత్తుండే*
*మా అమ్మమ్మ రామవ్వ !!*

కలుపుల్లకు కైకిల్లకువోతే
గంజి …గట్కనే పరమాన్నమట…
ఇంటికెవలచ్చినా
మాటకు మర్యాదలకు
గింతన్న మాటరానీయలేదట…
పనికిరావన్న పాతసంచులే
నీచేతులవడి పెద్ద పరదాలై
కళ్లంల యిత్తువోకుండ
ఊరంత పర్సుకున్నయి …
శిన్న శిన్న సంచులన్నీ బంతిసాపలై
పండగపబ్బాలకు మర్యాదచేస్తున్నయి…

యిప్పుడు ఎండినకట్టెతీర్గ అమ్మమ్మ ..!
తనువున సగభాగమైన తాత
తమామ్ శెప్పకుండనే పైకివోయె ..
గావురంగ తెచ్చుకున్న కోడలేమో..
కొడుకునీ, పిల్లల్ని యిడిసిపెట్టి
అర్ధాంతర ఆవుసుతోనే ముందే పోయె..
బుడ్డపోరగాండ్లకు మళ్ల అమ్మవైతివి …
శిన్నప్పటసంది సుత
గదే కట్టమెళ్లదీసుడాయే..
గుడ్లల్ల నీళ్లను గండెలకే దిగమింగితివి…
నిలువెత్తుకట్టానికి
నిజమైన రూపమైతివి ..!
యింకా యింకా….
అరిగోసవడతనే ఉన్నవ్..
కండ్లసూపెవడెత్తుకపోయెనో..!
పెయిల నెత్తురెవలు జుర్రుకున్నరో…!
సూపానకున్నా, నెత్తురింకిపోతున్నా,
బొక్కలరెక్కలకు రికాం లేకుండ
యింకా శెమటపంట పండిస్తూ
కాలేకడుపులకు మెత్తటిబువ్వవైతున్నవ్ …

ఆవుసు దగ్గరవడ్డా గనీ
నీ ఆరాటం పిలగాండ్లమీదనే !
అందరూ సల్లగ బతకాలనే !!
*రామవ్వ* ప్రేమకివే వందనాలు…!!

-తగిరంచ నర్సింహారెడ్డి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!