Saturday, May 30, 2020
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం ( 2 వ వారం) – శ్రీ విజేత

అతని ప్రేమ కోసం ( 2 వ వారం) – శ్రీ విజేత

ఆసక్తిగా ఒక్కొక్క పుస్తకం విప్పి చూస్తున్న. అతని పుస్తకాలు చూస్తుంటే అతడు ఒక మౌనసముద్రుడు అనిపించింది, ఇన్ని భావాలు గుండెల్లో ఎలా దాచుకున్నాడు అనిపించింది! కాలం కన్నీరైతే కావ్యం పన్నీరు అని తలచిన మహానుభావుడు అని అనిపించింది, నా గురించి ఏమి రాసిండో అని చూస్తూ పోయిన. తన పుస్తకాల్లో నన్ను లీలగా జ్ఞాపకం ఉంచుకున్నాట్టున్నాడు, అందరితోపాటు నాకు కూడా కృతజ్ఞ్యతలు చెప్పుకున్నాడు ‘మరచిపోయానకున్నా మరచిపోలేనని చెప్పే స్నేహమయికి’ అని. నవ్వచ్చింది నాకు, నన్ను స్నేహమయి అన్నందుకు, బహుశా, నేను అతన్ని అలానే భావించాను అని చెప్పినందుకేమో! ఎక్కువగా అతడు రాసింది కవితలు, కొన్ని కథల పుస్తకాలు కూడా, పాటల పుస్తకాలు కూడా. భాషా కోవిదుడై కొన్ని మంచి పుస్తకాలు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోంచి అనువాదం కూడా చేసిండు. అతని పుస్తకాల్లో దేశభక్తుల కథలున్నాయి, భక్తిపరుల రచనలున్నాయ్యి, మేధావులు, విజ్ఞులు రాసిన వాటి అనువాదాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకంను తిరిగేస్తూపోయిన. తన మొదటి పుస్తకములో ఒక దగ్గర, ఇలా రాసుకున్నాడు, నువ్వు నేనూ అంటూ!

“నువ్వు నేల, నేను ఆకాశం, ఎప్పుడైనా కలుస్తామా! రెండు దిగంతాల పర్యంతం నిశితంగా సూటిగా చూసినపుడు, కాలం కడపటి ఆవల ఉట్టి ఊహారేకల్లా మాత్రం కలుస్తాం. అప్పుడప్పుడు, ఏడు రంగుల ఇంద్ర ధనుస్సు మనిద్దరి మధ్యన లంకెలా వంతెన వేస్తుంది. బహుశా క్షణికమే! సూర్యుడు వాన చినుకులు పరస్పరం జరిగిపోయినపుడు, మంచులా భ్రమలా కరిగిపోతుంది, అప్పుడు నువ్వు నువ్వే, నేను నేనే”.

చదువుకొని నాలో నేనే నవ్వుకున్నాను, కవులు ఊహల్లొనే బతుకుతారేమో అనిపించింది. అతనికి ఊహాల్లో కలుసుకోవడం ఉంటుందేమో కాని నా ఊహల్లో ఆ ప్రస్తావన లేనే లేదు నిజంగా, ఊహించేంతటి తీరిక ఎక్కడిది బతుకులో? అతడు నన్ను జ్ఞాపకం ఉంచుకున్నట్టున్నాడు, కాని నేను అతన్ని మరిచి పోయానన్నది నిజం. ఒక కవితలో ఎంత ముగ్ధమనోహరంగా చెప్పాడు, బహుశా నా గురించేమో!

“మంచు కురిసిన హేమంతం గడ్డి పరకల్లోని తుషార మౌక్తికం, రాత్రిని పోగొట్టుకున్న జ్ఞాపకాల సిందూరపు దేవకాంత. అడుగులన్నీ తడబడిన ధవళ నేత్ర జ్వలిత మునికాంత. ఒత్తిల్లిన మేని సౌకుమార్యాలన్ని కుంకుమ పువ్వుల్లా గుబాళించుకొని మయూరిలా నాట్యమాడే వనజాత. జ్ఞాపకాల మాటున దాగుకొని మైమరిచి పరుగులిడే లేడిపిల్ల. వెన్నెల నవ్వులన్నీ ఈ లోకంమీద పారేసుకున్న నవరసాల నవ్వుల రాణి.” అని, ఏమని చెప్పాలి, పొగడాలి అతని భావనను, నేను తుషార మౌక్తికాన్నీ కాను, దేవ కాంతను, ముని కాంతను కాను, వనజాతనూ కాను. ఉట్టి గడ్డి పువ్వును. బతుకు పరిమళాలను అన్నీ కావాలని మరచిపోయిన, పోగొట్టుకున్న మామూలు స్త్రీని. చివ్వరగా ఒక మాట అన్నాడు చూడూ!

‘వెన్నెల నవ్వులనన్నీ ఈ లోకం మీద పారేసుకున్న నవరసాల నవ్వుల రాణి’ అని. ఈ బతుకంటే అంతే కదా! బతుకులోని మాధుర్యాలనన్నీపోగొట్టుకొని బతుకుతున్న దాన్ని. నా గురించి యెంత పొగడినా, నా జీవితములో నవ్వులన్నీ కోల్పోయిన ఉట్టి సారం లేని మనిషినే కదా! బతుకు కొందరికి అమృతమయం కావచ్చు, నాకు మాత్రం కష్టాల కడలిలానే, కన్నీటి కావ్యం లానే కనిపించింది అడుగడుగునా. బతుకు గురించి పెద్దగా ఆశపడవద్దేమో నిజంగా, తెలియనప్పుడూ ఆశ పడలేదు, తెలిసినప్పుడూ ఆశపడ లేదు. నాపై అతని భావనలకు నాలో నేనే నవ్వుకున్నాను.

ఇంకొక దగ్గర, ఇలా రాసుకున్నాడు, “ఇసుక తిన్నెల్లోంచి చూసాను, నా కళ్ళు దూరము నుంచి నిదానంగా నిన్ను ఎక్స్ రే తీసాయి, రెప్పపాటున నీ చిత్రపటం కంటి రెటీనాపై స్టిల్ ఫోటోగ్రాఫ్ లా నిక్షిప్తమయ్యింది. నీ కన్నుల లోగిల్లో కాంతులున్నాయి, కలువలున్నాయి నన్ను వెలిగించేందుకు. నీ కంటిపాపలోని నీలి సముద్రం నన్ను మునగ దీసుకోంది నన్ను రారమ్మని చెప్పి, కాలం ఫోటో తీసాను ప్రతి ఫ్రేమ్ లోనూ నువ్వే, దృశ్య కావ్యం రాయాలి ఇక. నవ వసంతం మళ్ళీ వచ్చినది.

నువ్వు వస్తావని చూసా కాని రాలేదు, ఇక వసంతం ఎక్కడిది? నింగి చూసి చిన్నబోయినది, పుడమి నన్ను తల్లిలా ఒదార్చినది నువ్వు నా దరి లేనపుడు! తుమ్మెదలా వచ్చాను..పువ్వే కనిపించకుండా పోయింది.. ఇక అడవి అడవి అంతా గాలించాలి.” నిజంగా ఇవన్ని చూస్తుంటే అతనిపై జాలివేసింది నాకు. ఇంతటి ప్రేమ ఎందుకు నిజంగా, తన వారు కాని వారిని కూడా అంతగా ప్రేమిస్తారా మనుషులు అని. నిజంగా అతని ప్రేమ ముందు నేనెంత! అతను నన్ను కోరుకుంటే నేను అందినానా, చెందినానా అతనికి? అంత విధి చేతిలో నాటకములా కదా ఈ బతుకు ఈ దేశములో! ఎంతటి అనుభూతులు, జ్ఞాపకాలు అవి! ఎక్కడి ఇసుకతిన్నెలు అవి, ఎప్పటి బాల్య యవ్వన స్మృతులు అవి! అతని కన్నుల్లో కనిపించి, మెరిసి కరిగిపోయినానా నేను. అతనికి దొరుకకుండా, కనిపించకుండా కనుమరుగై పోయినానా నేను! ఆ సంక్రాంతులు, ఉగాదులు, వసంతాలు, వేసవులు, బతుకమ్మ పండుగలు, దసరాలు, దీపావళులు, శరత్ కాలపు పండువెన్నెలలు, ఆ పల్లెటూరు, ఆ పచ్చిక మైదానాలు, ఆ ఊరి గోధూళి, ఉదయాలు, పగల్లు, రాత్రులు ఎలా మరచిపోతాను నేను. బతుకులోని నవ వసంత లోకాన్ని చూసి ఆ బతుకును అందుకోవాలని ఆశపడ్డ పురుష పుంగవుడు అతడు. బహుశా నేనేమో బతుకేమిటో తెలియక, కులాల, మతాల , కుతంత్రాల, అడ్డ్డు గోడల లోకములో బందీనయి బతికి వచ్చిన దాన్ని ఇక్కడి దాకా! బహుశ నా కోసం ఆశపడి, ఎదురు చూసి నేను అందక నిరాశ పడిన మనిషి అతడు. అతని భావనల్లో నేను పువ్వునైతే, అతను బ్రమరమేమో! అతనికి దొరకకుండా, కనిపించకుండా నేనే దూరంగా వెళ్ళిపోతే అతడు ఎలా బతికాడో, గడిపాడో. జీవితములో మూడు ధశాబ్ధాలు ఎంత బరువుగా, దీర్ఘంగా గడిచిపోయినాయి! కాల మహిమ ఏమిటీ ? ఎందుకిలా జరిగింది, జరుగుతుంది అనిపిస్తుంది. ఉదాత్తమైన అతని బతుకు భావనలను నేను ఎలా జీర్ణించుకోవాలి! అతన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అతనికి బహుశా ఇవ్వడమే తెలుసు, నాకు ఇవ్వడం తెలియదు, తీసుకోవడం కూడా తెలియదు. ఉట్టి బలహీనురాలిని, బయస్తురాలిని, అతని ఔన్నత్యమైన ప్రేమ ముందు ఉట్టి అల్పురాల్ని. అతనే త్యాగి ఇంకొకరి కోసం. నేను నా కోసం, నా వారి కోసం బతికిన స్వార్థపరురాలిని. మగవాడిది జాలి గుండెనేమో, మైనములా కరిగిపోతుంది ఆడపిల్ల ముందు. ఆడపిల్ల హృదయం కఠినమైందేమో వజ్రములా, ఊర్కే కరుగదేమో అంత సులభంగా మగవాడి ముందు. నేను రాతి గుండె దాన్నే నిజంగా. కావాలని కొన్నిటిని కాలదన్నుకున్నాను. కావాలని బతుకులో బందీనయి కొన్నింటిని ఇష్టం ఉన్నా లేకున్నా స్వీకరించి ఇక్కడి దాకా వచాను. అమృతతుల్యమైన అతని భావనలు నన్ను తన్మయురాలిని చేస్తున్నాయి. నేను పొందిన బాధ, కష్టం అంతా మరచిపోయేట్లు చేస్తున్నాయి. ఎంతటి ప్రేమ అతనికి నాపై, ప్రేమ తాత్కాలికం అంటారు, ప్రేమ గుడ్డిది అంటారు కాని కాదే, అతన్ని, అతని భావాలను చూస్తుంటే అతని ప్రేమలో ఏ తేడా లేదు, అతని ప్రేమ నా యెడల తరుగలేదు నాటికీ, నేటికీ. నిజంగా నేను అతని ప్రేమను పొందడానికి అర్హురాలినా? ప్రేమను ఇవ్వలేని వాళ్ళు, పిరికివాళ్ళు, భయస్తులు బహుశా ప్రేమించద్దేమో! నేనే ఉదాహరణ. కాలము మనిషికి కొన్ని అవకాశాలు ఇస్తుంది, బతుకును బాగు చేసుకోవడానికి, వాటిని గుర్తించి స్వీకరించకుండా మొండిగా వెళ్లి వస్తే నాలానే ఉంటారేమో . అనుభవించాలేమో ఇక, బతుకు కష్టమైనా నష్టమైనా నాలా. అయినా ఇంతటి ప్రేమ భావనలు ఉన్న మనిషి, గుండెల్లో ఇంతప్రేమ ఉన్న మనిషి నన్ను ఇంతకాలం ఎందుకు కలువలేకపోయాడు? ఈ లోకానికి బయపడా, నా క్షేమం కోసమేనా? అతను అంటున్నాడు “ఆమె గాలిపటం, బతుకు ఆదారముతో నేను, నా చేతి ఆకాశములో సుందర విహంగంలా ఆమె, బహుశా ఆ గాలిపటం అందదు, మనసు ఉరుకుతూ ఉవ్విళ్ళూరుతూ గాలిపటాన్ని దారంతో చేరి అందుకోవాలనే ఆరాటం, కాని రాక్షస లోకములో గాలిపటం చిన్నాభిన్నం అవుతుదేమోనని అందుకే గాలిపటం -నేను”. అతడిలో ఎంతటి విజ్ఞత ఉంది. ప్రేమను గుండెల్లోనే దాచిపెట్టుకొని కాలాన్ని ఈదుతూ వస్తున్నాడు. ఆడపిల్ల జీవితం గాలిపటం లాంటిదే కదా ఈ దేశములో. ఎవరి చేతిలోని విహంగాన్ని నేను నిజంగా, కాలం చేతిలోని మనిషిని కదా! పుట్టడం, పెరుగడం, పెళ్ళిచేసుకోవడం నా చేతిలోని పని కాదు, కాలం చేతిలోని పని. అతడు, అతని ప్రేమ కూడా నా జీవితములో కాల ప్రవాహములో ఒక భాగం. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఎమి లాభం అంటారు. జీవితములో చాల సందర్భాలు ఉన్నాయి అలా. అజ్ఞానం, అమాయకత్వం, భయం, సంఘ నియమాలు, కట్టుబాట్లు, మనుషులను బహుశా ఇలా తయారు చేస్తాయేమో! అతడయినా, నేనయినా సరి అయిన సందర్బాలలో సరిగా జీవిత్తాన్ని మలచుకోలేకపోయినామేమో. కాలం ఇచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకుందామంటే కూడా నేను స్పందించ లేకపోయినానేమో అతడు కోరినట్లు. కొందరి జీవితాలు విషాద కావ్యాలు ఆలోచిస్తేనే. మనసుంచి లీనమై అక్కడక్కడా కొన్ని పేజీలు తిరిగేస్తూ పోతున్నాను. బతుకు గురించి ఇంతటి అవగాహన ఉందా ఇతనికి అనిపించింది ఒక్కొక్కటి చదువుతుంటే. బతుకును తలచుకుంటే, ప్రేమా! ప్రేమా! ఎంతటి దానివే నువ్వు అనిపిస్తుంది!

“ప్రేమ తేనియ తోట, ప్రేమ హృదయపు బాట, ప్రేమ పెన్నిధి బతుకు ఓ ప్రియతమా !” అని అంటుంటే నేను ఎంత పులకించి పోవాలి!

“ ప్రేమతో పెన్నిదీ, ప్రియురాలి సన్నిధి , మనసు తెలిసీ బతుకు ఓ ప్రియతమా “ అని అంటుంటే నేను ఏమి సమాధానం చెప్పాలి?

“స్నేహ సంపద పంచు, అదియే ప్రేమను పెంచు, ఆదర్శమిది బతుకు ఓ ప్రియతమా ! “ అని అంటుంటే, స్నేహం, ప్రేమల నిలయమైన ఈ బతుకు గురించి నేను ఏమని వాఖ్యానించాలి?

“మనసున్న మనవాళ్ళు మనకు ఒక్కరు చాలు, స్వర్గ సీమే బతుకు ఓ ప్రియతమా!” అని అంటుంటే ఒక్కసారి మనసు నిట్టూర్పుగా నవ్వుకుంది. మనసు! అని మూలిగింది మనసు! అసలు నిజంగా మనసు ఉంటే కదా నాకు! ఆ మనసు ఉన్నందుకేగా బతుకు ఇలా గడిచింది, ఆ మనసు చెప్పింది విన్నందుకే కదా ఎంతో అనుభవించింది, కన్నీళ్ళు కార్చింది. నా మనసు నేను చెప్పినట్టు విన్నదా, లేదు మనసు చెప్పినట్టు నేనే విన్నాను, అనుభవించాను. ‘మనసున్న మనవాళ్ళు మనకు ఒక్కరు చాలు, స్వర్గ సీమే బతుకు’ ఎంతటి నిజమైన మాట! అది అతని పరితపన! మనసున్న మనవాళ్ళు ఎవరు? జన్మనిచ్చిన తలిదండ్రులా? తోడబుట్టిన అక్కచెల్లెల్లా,అన్నదమ్ములా, కట్టుకున్నభర్తనా, మెట్టినింటి మనుషులా.. ఎవరు మనసున్నవాళ్ళు? అసలు నాకు మనసు ఉందని తెలుసా వీళ్ళకు? మనసున్న మనవాళ్ళు మనకు ఒక్కరు చాలు! ఎంతటి మాట, ఆ మనసులు లేని మనుషుల మధ్యనే, మనసున్నవాళ్ళు వీళ్ళు అని అనుకొని బతుకాల్నేమో!

నా మనసు ఎవరికి కావాలి, వాళ్ళ మనసుల్ని ఎరిగి నేను బతుకుతే చాలు. అదే వాళ్లకు కావలసింది, నేను వాళ్ళకు అదే ఇచ్చాను. ఇక నా మనసు, బతుకు ఎమయిపోతే వాళ్ళకు ఏమిటీ? ఎవరి బతుక్కు వారే సాక్షి, ఎవరి మనసుకు వారే సాక్షి అంటారు. ఒకరిని అని ఏమి లాభం! నా బతుక్కు నేనే కర్తను, కర్మను అనుకోవాలి. మనుషులను శాసించే మనుషులున్నపుడు, హోదాలు, అంతస్తులు, కులామతాల అడ్డుగోడలు ఈ సంఘములో ఉన్నప్పుడు, ఆడపిల్ల జీవితములో కట్న కానుకల సమస్యలు ఉన్నపుడు ఆడ పిల్ల జీవితం బలి అయిపోతుందేమో! అతని భావనలు చదువుతూ ఆలోచనల్లో కొట్టుక పోతుంటే టప్పుటప్పున కన్నీటి బొట్లు కనుకొలుకుల్లోంచి రాలి, జల జలా కారి చెక్కిళ్ళపైబడి ఉప్పుగా తగులుతున్నాయి పెదవులపై.

నిజంగా అతడు ఎందుకు రాసుకున్నాడు ఇదంతా? ఇది ప్రేమనా? ప్రేమంటే ఏమిటి నిజంగా! ప్రేమంటే అందనిది కదా! ప్రేమంటే విషాదం కదా! అతని భావనల్లో ప్రేమంటే అతడు రాసుకున్నట్లు బహుశా ఇలా ఉంటుందేమో!
“ప్రేమంటే తొలి చూపులో నీకూ, నాకూ దొరికిన అమరమైన క్షణం! బహుశా నీ చూపు నా మేధస్సులో పుష్పించి ఫలించి కవితారావమై పలుకడం. చల్లని సాయంత్రాన ఏటి ఒడ్డున కూర్చున్నపుడు, పశ్చిమాద్రిలోని అందని అద్భుత దృశ్యం. కోటి గొంతులన్నీ వద్దని వారించినా నీ కోసం నా హృదయం తపిస్తుంది చూడూ అదే ప్రేమంటే! ప్రేమంటే జీవన సముద్రములో నీవు నావైపు, నేను నీవైపు పయనించే సుధీర్గ ప్రయాణం!”

నిజంగా ప్రేమంటే ఇదేనా! అతడు నావైపు, నేను అతని వైపు ప్రయానించే సుధీర్గ ప్రయాణమా! నేనెప్పుడూ అతని వైపు ప్రయానించాలనుకోలేదు, అతని ప్రయాణమే నా వైపు సాగి వచ్చింది. ఇది ప్రేమ ఫలితమేమో. నిజంగా అతనెవరూ, నేనెవరూ, ఈ బతుకేమేటీ, నేనెందుకు ఇలా ఉన్నాను? ఈ బతుకు పర్యవసానం ఏమిటీ? ఒక్కసారి బతుకులోకి వెనక్కి వెళ్ళితే బతుకు బాల్యం యవ్వనం, పెళ్లి, జీవితం కళ్ళ ముందుగా సినిమా రీలులా గిర్రు గిర్రున తిరిగింది.
( మిగితా వచ్చే వారం….)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!