Monday, March 1, 2021
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం! (2 వ వారం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం! (2 వ వారం) -స్వాతీ శ్రీపాద

పట్నం మారాక , అడపాదడపా ఇంటికి వచ్చినా, చదువులో సాయపడినా ఎవరి హద్దుల్లో వారు ఉండే వారు.

ఈ లోగా మురళికి ఇద్దరు పిల్లలు -అమ్మాయిలు పెద్దపాప అన్విత కి అయిదేళ్ళు, చిన్నది మాన్విత మూడేళ్ళది.
చిన్న దాన్ని ఒళ్లో కూచో బెట్టుకుని. దాని చిలక పలుకులు వింటూ సంబరపడుతున్న హరిని చూసి కాఫీ తెచ్చి ఇస్తూ,
“ఇలా మా పిల్లలను చూసి సంబరపడటమే గాని నీకు ఆ ధ్యాసే లేదు” నిష్టూరంగా అన్నాడు మురళి.
“ఏ ధ్యాస ? పిల్లల ధ్యాసా? బాగానే ఉంది కాని …”
“పెళ్లి మాటే ఎత్తవు. ఇహ పిల్లల ధ్యాసా? చెప్పరా ఎవరినైనా ప్రేమించావా? భగ్న ప్రేమా? నీ సమస్య ఏమిటో చెప్తే సాయం చేస్తాగా ?” అనునయంగా అడిగాడు.
“ఎవరయినా సాయం చెయ్యగలరంటే అది నువ్వొక్కడివే… తప్పకుండా చెప్తాను. అంటూ పిల్లను దింపి కాఫీ కప్పు అందుకున్నాడు.
రెండు నిమిషాల నిశ్శబ్దం తరువాత కాఫీ తాగడం ఆపి,
“నేను ఒకమ్మాయిని గాఢ౦గా ఇష్టపడుతున్నాను. ఒట్టి ఇష్టం అని చెప్పలేను. ఆ అమ్మాయిని చూసి చలించిన నా హృదయం మరొకరిని ఒప్పుకోదు. అలాటి అనుభవం ఇది అని చెప్పలేనిది. ఇన్నాళ్ళూ తను చదువుకుటో౦దని ఆగాను.
నా అభిప్రాయం ఇది అని తనకూ తెలియదు.
ఇది సమ౦జసమొ కాదో గాని మురళీ, ఇద మన స్నేహానికి అడ్డు రాదనే అనుకు౦టున్నాను.” ఆగాడు హరి.
అప్పటికే మురళిలో అనుమాన౦. “కొ౦పదేసి …”
“అవును మురళీ, నీ అనుమానం నిజమే. నేను చందనను ఇష్టపడుతున్నాను…”
“కాని … కాని …”
“అవును మురళీ నాకు తెలుసు, నీకన్నా పదేళ్ళు చిన్న అయినప్పుడు నాకన్నా కూడా పదేళ్ళు చిన్నదే, అదొక్కటే కాదు. ఆర్ధికంగానూ మాకుటు౦బ౦ మీతో సరి తూగలేదు. మా వాళ్ళూ పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. అమ్మలేదు. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. కాని ఎంత నచ్చజెప్పుకు౦దామన్నా నా మనసు రాజీ పడటం లేదు. జవాబు ఎలాటిదైనా సంతోషంగా స్వీకరిస్తాను.”
మురళికి ఏం అనాలో తోచలేదు. అతనిపై కోపం కూడా రాడం లేదు.
ఈ మాట చందనకు తెలియదంటున్నాడు. తెలిస్తే దాని స్పందన ఎలా ఉ౦టు౦దో!
“కొంచం సమయం కావాలి హరీ, ఆలోచించాలి” అని మాత్రం అన్నాడు.
ఆ తరువాత ఎప్పటిలాగే అందరితో మాట్లాడి వెళ్ళిపోయాడు హరి.
ఈ విషయం ముందుగా ఎవరితో చర్చ౦చాలో అర్ధ౦ కాలేదు మురళికి.
సూటిగా చందనను అడిగేస్తే … ఎలాటి అభిప్రాయం లేనిదానికి ఒక అభిప్రాయం కలిగించిన వాడనవుతానా?
అమ్మకూ నాన్నకూ చెప్తే , అమ్మో ఇంకేమయినా ఉందా? వాళ్లకు కోపం వస్తే, హరిణి ఏమైనా అంటే..
చివరికి భార్య ప్రియతో చర్చించాడు.
“ముందు చందన అభిప్రాయం అడుగుదాం మురళీ తను ఏ మాత్రం సుముఖంగా ఉన్నా పెద్దవాళ్ళ దగ్గర ఈ మాట తేవచ్చు. నిజమే మురళీ ఇష్టానికి కులాలో అంతస్తులో, వయసులో క్రైటీరియా కాదు గదా, సాయంత్రం చందనను తీసుకుని బయటకు వెళ్దాం అప్పుడు ఫ్రీ గా మాట్లాడవచ్చు” అంది ప్రియ.
సాయంత్రం బయటకు వెళ్దామన్నప్పుడు పిల్లలను తీసుకువెళ్దామనీ, అందరం కలిసి వెళ్దామనీ ఎన్నో రకాల అడ్డం పడింది.
“పిల్లలను అమ్మ చూస్తారులే, ఎప్పుడూ అందరం కలిసే వెళ్తా౦కదా, ఈ రోజు ముగ్గురమే వెళ్దామని” నచ్చ జెప్పి౦ది ప్రియ.
కారులో బయలు దేరారు.
“అవును, మీ హరిని రమ్మన లేదా?”
“ఉహు, వాడికేదో పని ఉంది.” ఎదురు చూడని ప్రశ్నకు తడబడ్డాడు.
ఆ అవకాశం అ౦దిపుచ్చుకుంటూ, “అవును చందనా హరి మీద నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగేసింది.
“ఏంటీ, ఏదైనా ఇంటర్వ్యూ కార్యక్రమమా?’
“కాదు, అతని ప్రసక్తి వచ్చింది గనక….”
“మంచి సిన్సియర్ డాక్టర్, మంచి గాయకుడు. కాస్తో కూస్తో …. “ అందగాడు అనబోయి ఆగిపొయి౦ది మళ్ళీ ఏం అర్ధాలు వస్తాయోనని.
రూఫ్ గార్డెన్ రెస్టారెంట్ లో ఒక మూల చూసుకు కూచున్నారు.
“వాడూ నేనూ క్లాస్ మేట్స్ మి”
“కొత్తగా చెప్తున్నావేమిటి? ఎప్పటినుండో తెలిసిన విషయమేగా?”
“ మా ఇద్దరిదీ ఆర్నెల్లు అటూ ఇటూ గా ఒకటే వయసు. అంటే తెలుసుగా ముదిరిపోయిన బ్రహ్మ చారి. ముప్పై మూడు దాటాయి. వాడింకా పెళ్లి మాటే ఎత్తడం లేదు.”
“ఎవరినైనా ప్రేమి౦చాడేమో” అనుమానం వెలిబుచ్చి౦ది ప్రియ.
“నీతో ఎప్పుడైనా ఆ విషయం ఏమైనా చెప్పాడా చందూ”
“అబ్బే లేదన్నయ్యా, ఎప్పుడూ ప్రేమ విషయమే ఎత్తలేదు. ఎవరి గురించీ మాట్లాడలేదు. అసలు హరిని కూడా పిలవాల్సి౦ది అడిగేసేవారం కదా”
ఇద్దరూ మొహాలు చూసుకున్నారు.
మళ్ళీ కాస్సేపు ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ఆర్దరిచ్చిన సూప్ తాగారు.
“ హరి ఎవరినైనా ప్రేమించానంటే ఏ౦చెయ్యనురా?”
డిన్నర్ కోసం ఎదురు చూస్తూ అడిగాడు మురళి.
“ఏముంది ఆ అమ్మాయిని పిలిచి ఆ మాటర్ చెప్పేసెయ్. నీ డ్యూటీ అయిపోతుంది.” సులువుగా చెప్పేసింది
“అందుకే గదా నిన్ను రమ్మని తీసుకు వచ్చా” నెమ్మదిగా అన్నాడు.
అది ఆమె బుర్రలోకి ఇంకే సరికి రెండు నిమిషాలు పట్టింది.
హరి చెప్పిన మాటలు తూచా తప్పకు౦డా ఆమెకు వినిపించాడు.
“నాకైతే అంత ఇష్టంగా లేదురా, ఎవరూ దొరకనట్టు పదేళ్ళ పెద్దవాడికి ఇవ్వడం, ఏమో మనసు ఒప్పదం లేదు”
“నీ ఉద్దేశ్యం చెప్పు చందనా” అడిగి౦ది ప్రియ.
“నిజం చెప్పాలంటే నాకు హరి మంచి మిత్రుడు, తెలిసిన వాడు అంతకు మించి నేనెప్పుడూ ఆలోచించలేదు. విముఖతా లేదు. కాని అన్నయ్యా ఒకటి మాత్రం గట్టిగా నిర్ణయించుకున్నాను. అమ్మా నాన్న నువ్వు ఇష్టపడిన వారినే పెళ్లి చేసుకు౦టాను. అది హరి అనా మరొకరనా ఆలోచించను. కాని నాకు జీవితాంతం అందరూ కావాలి. నాకు ఎవరో నచ్చారని కన్నవారిని తోడ బుట్టిన వారిని వదులుకోలేను.” చాలా స్పష్టంగా చెప్పింది చందన.
“హరిని నీతో మాట్లాడమననా?”
“నీ ఇష్టం. ఎవరు మాట్లాడినా నా జవాబు ఇదే?”
ఆ విషయం అప్పటికి అక్కడ వదిలేసారు.

******************

నాలుగురోజుల తరువాత వచ్చాడు హరి.
ఎప్పటిలా పరామర్శలు కాఫీలు అయ్యాయి. ఆమె గది బాల్కనీలో కుర్చీలు వేసుకుని కూచున్నారు హరీ చందన.
సన్నగా పాట హమ్ చేస్తున్నాడు హరి.
“పూవై విరిసిన పున్నమి వేళా”
“పాడు హరీ”
“కాదు నేను మంచి బాలుడిని”
“చాల్లే ఇది పాత జోక్, పాట పూర్తిగా పాడు”
పాటలో లీనమై పోయాడు. పాట ముగిసే సరికి అతని కళ్ళల్లో నీళ్ళు.
“మరీ ఇంత సున్నితమైతే ఎలా హరీ?” అని క్షణం ఆగి,
“అన్నయ్యతో ఎదో చెప్పావట? నాతోనే చెప్పవచ్చుగా …”
“చెప్పాడా? నీతో ప్రత్యేకం చెప్పాలా? నా భావం నీకు ఎప్పుడో అర్ధం అయి౦దని నాకు తెలుసు. అయినా పెళ్ళిమాటలు పెద్దవాళ్ళతోనే గా మాట్లాడవలసినది.”
“ ఆ వరసలోనే నేనూ ఎప్పుడో నిర్ణయించుకున్నాను హరీ, నా ఇష్టాఇష్టాలు ఏవైనా పెద్దలు అంగీకరించిన వాళ్ళనే నేను ఒప్పుకు౦టాను. దానిలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా…”
“ అందుకే నువ్వంటే నాకు గౌరవం చందనా, ఏదేమైనా కానీ నేనూ నిర్ణయించుకున్నాను బ్రతుకో చావో అది నీతోనే. మీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించడానికి ప్రయత్నిస్తాను ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా …
అలాగని ఇది భౌతిక ప్రేమ కాదు. ఏమిటో చెప్పలేను కాని….”
అవును ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలా ఆరేళ్ళపాటు, అక్షరాలా ఆరేళ్ళపాటు ….

ఆరేళ్లలో ఎన్ని ప్రహసనాలు!
చందన ఎక్కడా తొణికిసలాడలేదు. చదువు పూర్తయి నర్సింగ్ హోమ్ ఒక దానిలో చేరింది. అయినా జీవిత భాగస్వామి ఎంపిక తలిదండ్రులకే వదిలేసింది.
ముందుగా హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడే ఒక అమెరికా సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అబ్బాయి ఎక్కడో ఇదివరకే చందనను చూసాడట. ఇష్ట పడ్డాడు. అయినా లాంఛనంగా చూడటానికి వచ్చారు.
మామూలు పరామర్శలు, మాటలు, చూపులు జరిగాయి.
“అమ్మాయి మా అందరికీ నచ్చింది. నవంబర్లో పెళ్లి పెట్టుకుంటే వెంటనే అమెరికా వెళ్ళిపోతారు ఇద్దరూ…” అన్నాడు పిల్లవాడి తండ్రి.
“అదేమిటి ఇంకా హౌస్ సర్జన్ అవనే లేదు” ఆశ్చర్యం అనిపి౦చి౦ది.
హౌస్ సర్జన్ ది ఏముంది అంతా తెలిసిన వాళ్ళే అయినట్టు రాయి౦చుకోవచ్చు ..” చాలా తేలిగ్గా అనేసాడు ఆయన.
చదువుపట్ల వాళ్ళకున్న విలువ ఇంతేనా? అనిపించింది.
మురళి అప్పుడే నిర్ణయించుకున్నాడు ఇలాటి వారికి ఇంత చదివిన తన చెల్లెలిని ఇవ్వడం జరగదని. ఆ సంబంధం అలా వదిలేసారు.
ఆ తరువాత ఎంత చదివినా పెట్టిపోతలు మామూలే అనిమాట్లాడే వాళ్ళు. అత్తను ఆడబడుచును గౌరవించాలనే వాళ్ళు , మేం పెట్టిన నర్సింగ్ హోమ లోనే పని చెయ్యాలనే వాళ్ళు, ఎంత మందో …
“ నీ అభిప్రాయం చెప్పు అమ్మడూ” అని అడిగినప్పుడల్లా
“మీకన్నా నాకెక్కువ తెలుసా? మీ అందరికీ ఎవరు నచ్చితే వాళ్ళే” అనేది.
వీటన్నింటి మధ్యా చెక్కు చెదరని హరి ఆత్మ విశ్వాసం “ నాకు నమ్మకం ఉంది చందనా మనను ఆ భగవంతుడు కూడా విడదియ్యలేదు సమయం రావాలంతే” అనేవాడు.
చివరికి ఒక సంబంధం కుదిరింది అతనూ డాక్టరే, సిటీ లోనే పెద్ద నర్సింగ్ హో౦ వుంది. తల్లీ తండ్రీ ఉద్యోగస్తులే.
ఒక్కడే కొడుకు. మంచి సంబంధం అనుకున్నారు అందరూ. తాంబూలాలు కూడా తీసుకున్నారు. పెళ్ళికి పది రోజుల ముందు నిశ్చితార్ధం జరిగి౦ది.
మంచి వాడిగానే అనిపించాడు. చీరలు కొనాలి షాపింగ్ కి రమ్మంటే ఆ రోజు సాయంత్రం నవీన్ తో పాటు షాపింగ్ కి వెళ్ళింది చందన.

(3వ భాగం వచ్చేవారం)

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!