Monday, February 17, 2020
Home > కవితలు > స్మార్ట్ ఫోన్! -హుమాయున్ సంఘీర్

స్మార్ట్ ఫోన్! -హుమాయున్ సంఘీర్

మనిషిలోని తడిని
ఆరబెడతానని
ఆర్ధ్రతని ఆవిరి చేస్తానని
అనుబంధాల తీపిని
చప్పగా చేస్తానని
నన్ను సృష్ఠించిన వాడితోనే
ఫుట్ బాల్ ఆడుకుంటానని
రోగిష్ఠిని చేసి కుదిస్తానని
డిజిటల్ లైఫ్ ని వండి వార్చి
వడ్డించి మనిషి తత్వాన్ని
మర్డర్ చేస్తానని

నేను ఆజ్ఞాపించగానే
తలూపే కట్టు బానిసల్ని
చేస్కొని యాప్ ల
ఆటలు ఆడిస్తానని..,
ఇలా చాలానే శపథాలు
పూనినట్టుంది మనిషి
చేతిలో పురుడు పోస్కున్న
స్మార్ట్ ఫోను…
గుడిలో, బడిలో, మదిలో
తన సొదే
శవాలతో సెల్ఫీలు
ఎంత అప్ డేట్ చేస్తోంది
మనుషులను ?

దాని మాటే వేదాంతమైంది
అందరికీ
అదే గీతలు గీస్తుంది
హద్దుల్ని కూడా చెరిపేస్తుంది
అయినా అది అందరికీ
ఆప్త మితృవే
ఈ డిజిటర్ కుగ్రామంలో
పరుగులు పెట్టండని
రేస్ పెట్టింది

అందరూ పరుగెత్తుతున్నారు
ఎదురొచ్చినవాళ్ళను గుద్దుకుంటూ
ఈ మారణ హోమంలో
మానవత్వం అక్కడ
రోడ్డుమీద గాయాల పాలై
రోధిస్తోంది
మంచితనం అక్కడ
రక్తమోడుతూ ఆర్తనాదాలు
చేస్తోంది

సహాయం, నీతి, నిజాయితీ,
ప్రేమా, జాలీ, కరుణలు..,
ఆ రోడ్డు మీద నుజ్జు నుజ్జయి
ఆనవాలు కూడా గుర్తించరాని
విధంగా వాటి దేహ శకలాలు
రోడ్డుకు ఆమ్లెట్లలా అంటుకుపోయాయి
అయినా మనిషెక్కడ
పట్టించుకుంటూ ఆగిపోతాడు
చెప్పండి ?

ఆగిపోతే ఔటైపోతానని
అతని భయం అతనిది
అందుకే ఆగడు
అలాంటివెన్ని శవాల గుట్టలు
తన ముందు పేరుకున్నా
వాటిని తొక్కేసి, ఎక్కేసి
ఎగబాకి పోతుంటాడు
అనంత విశ్వ రహస్యమేదో
చేధించాలన్నట్టు ?

ఎందుకంటే అతని చేతిలో
వున్న ఫోన్ తనను
పరుగెత్తించే రిమోటైంది గనక
టీవీ, సినిమా, ఆటా – పాటా ఏంటి
ప్రపంచాన్నే తనలో ఇముడ్చుకొని
విశ్వాంతరపు ముఖంతో
వున్న దానికి దాసోహం
కాని దెవ్వరు చెప్పండి
ఏ ఒక్కర్నీ వదలకుండా
అందర్నీ పరుగెత్తిస్తోంది
ఉదయాన్నే అమ్మనీ,

అరచేతుల్ని చూస్కునే
సంస్కారాన్ని ఈడ్చి తన్ని
తనని మాత్రమే చూసేలా
తయారు చేస్కుంది మనుషుల్ని
జేబులో తను లేకపోతే
ప్రపంచమే చీకటై పోయిందన్నట్టుగా
ఆ చీకట్లోకి విసిరేసింది
మనిషిని

అతనిలోని మమతను
మసి చేసి తను
మనిషి – మనిషితో అక్రమ
సంబంధం నడిపిస్తోంది
ఈ స్మార్ట్ గేమ్ లో
అందరూ అంతమయ్యేవారే
తను మాత్రం అనంతంలో!???

-హుమాయున్ సంఘీర్

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!