Saturday, December 14, 2019
Home > కవితలు > ముత్యాల వాన! -స్వాతీ శ్రీపాద

ముత్యాల వాన! -స్వాతీ శ్రీపాద

కురిసినట్టుగానే ఉంటుంది
ఎ౦డి బీటలు వారిన ఎదురు చూపులపైన
తొలకరి చినుకులో శిశిరం చివరాఖరున
చటుక్కున ఓ జల్లై కురిసే రంగుల జడివానో
మసక చీకటి నీడల్లో మ౦తనాలాడే
గాలి రెక్కలమీద మోజుపడి
రాలిపడే పున్నాగలో పారిజాతాలో
నీ పలకరి౦పై కురిసినట్టుగానే ఉంటుంది
ఎప్పుడో చెక్కుకున్న అక్షర శిల్పాలు
హరితవనాలు వెంటేసుకు విహారానికి వచ్చినట్టు
పచ్చని ఊహల నీడలో పది వసంతాలు
తీరిగ్గా విశ్రమి౦చినట్టు
చెప్పాలనుకుని మరచిపోయిన
పరిమళ మేదో ఒక్క సారి గుప్పున
మేల్కొన్నట్టు
నీ ఉనికి పలకరిస్తూనే ఉంటుంది
రాత్రిని నెమరేస్తూ
చెట్లూ చేమలూ జలపాతపు తు౦పర్లలొ
ఆడమరచిన క్షణం
నీడలు కనబడని తడబాటు గమకంలో
మేఘాలై వికసిస్తాయి ఒళ్లంతా నిమిరి ఓదార్చే
అదృశ్య హస్తాలు
అప్పుడు వినిపిస్తాయి
నిశ్శబ్దంగా తరలివచ్చే నక్షత్రాల అడుగు సవ్వడులు
నీలి నీలి పరదాలై పలకరించే
నింగి సొబగుల సుతారపు పెదవి విరుపులు
కురిసినట్టుగానే ఉంటుంది
ఒక ముత్యాల వాన

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!