Monday, February 17, 2020
Home > కవితలు > నా అక్షరాలు! -స్వాతీ శ్రీపాద

నా అక్షరాలు! -స్వాతీ శ్రీపాద

నా అక్షరాలు
నా అక్షర బాలలు సుకుమారులు
వడ దెబ్బ తెలియని గుబురు పొదలు
సుతిమెత్తని నవనీతపు భావాలు
మునివేళ్ళతో మాలలల్లే ముగ్ధలు
ఎడారుల్లోనూ చిత్తడి చెలమలై
పూలు పూయించడమే తెలుసుకాని
పదునుపెట్టి మాటల ఆయుధాలునూరి
పిసరంతైనా నొప్పించటం ఎరుగవు
గుచ్చుకున్న గాజుముక్కలు సైతం
సుతారంగా తొలగి౦చు కు౦టూ
నొచ్చుకున్న మనసును వెచ్చని
అశ్రు ప్రవాహాన ఒలికి౦చడమే తెలుసు
వలిపెపు మేలి ముసుగు చాటున
నయగారాలే తెలుసుకాని
భాష సిగ్గుతో చితికిపోయే
నగ్న అశ్లీలాలు అసలు తెలియవు
నా అక్షరాలు లేతపచ్చికపై
గునగునా నడిచి వెళ్ళే ఆరుద్రపురుగులే తప్ప
నరమాంసం తిని ఊరిపై పడే
నరమాంస భక్షక పులులు కావు
ఎక్కడినుండో తెచ్చి అలదు కున్న
రంగుల వెనక మొహం దాచుకు
రాచరికం ప్రదర్శించే వైతాళికులు కావు
అద్దంలో మొహం చూసుకునే జీవితం నా అక్షరాలు

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!