Sunday, October 2, 2022
Home > కథలు > మా మంచి పిల్లలు! -వి. సునంద

మా మంచి పిల్లలు! -వి. సునంద

“గుడ్ మార్నింగ్ టీచర్!” అంటున్న పిల్లలకు “శుభోదయం రా పిల్లలూ! అందరూ వచ్చారా?” తరగతి గదిలోకి అడుగు పెడుతూ ప్రేమగా పలకరించింది వసుధ టీచర్.

టీచర్ తో పాటు మరో కొత్త అమ్మాయి రావడంతో అందరూ ఆసక్తిగా చూడసాగారు. అమ్మాయి నలుపు రంగులో వుంది. చేపల్లాంటి కళ్ళను అటూ ఇటూ తిప్పుతూ భయం భయంగా టీచర్ పక్కన నిలబడి చూస్తోంది…

“గీ పిల్లెవరురా..? కారడవిలోంచి తప్పిపోయిన కాకిలా వుంది…” అల్లరిలో ముందుండే చందూ పక్కనే వున్న గిరి చెవిలో గుసగుసగా అన్నాడు.

ఆడపిల్లలు అమ్మాయి వంక చూస్తూ గీ పిల్ల పేరు ఏమై వుందని రకరకాల పేర్లు వూహించుకుంటూ పందాలు వేసుకో సాగారు.

వసుధ టీచర్ ఆ అమ్మాయి పేరు రిజిస్టర్ లో రాసి అందరి ముఖాలలో ఆసక్తిని గమనిస్తూ..

“పిల్లలూ! ఈ అమ్మాయి పేరు రాధ. అంతే కదమ్మా!” ప్రేమగా భుజంపై చెయ్యేస్తూ అడగ్గానే ఉలిక్కిపడి

”క.. క. కాదు టీచర్ నా పేరు రాదమ్మ” అంది.

ఆ నత్తి మాట వినగానే పిల్లలంతా ఘొల్లున నవ్వసాగారు.

“కొత్త కదా పిల్లలూ! అలా నవ్వొచ్చా తప్పుకదూ..” అని మందలించి, సిగ్గుతో తలొంచుకున్న రాధను దగ్గరకు తీసుకుంటూ “ఇంట్లో రాధమ్మవే లేరా బంగారూ! ఇక్కడ నీ పేరు రాధ తెలిసిందా. ఏదీ రాధ అను”.

” రాధ”.. మరో సారి. ఆ అమ్మయితో అనిపించి, “పిల్లలూ! కొత్త నేస్తం కదా! ఆమెను మీతో కలుపు కోండి. మీరంతా మంచిగా కలిసుండాలి సరేనా… .రాధ బంగారూ! అమ్మాయిల దగ్గర కూర్చో”మని చెప్పగానే భయం భయంగా వాళ్ళకు ఓ ప్రక్క ఒదిగి కూర్చుంది.

వసుధ ఆ రోజూ పాఠం కొంత చెప్పి వెళ్ళింది.
ఆ తర్వాత వేరు వేరు సబ్జెక్టుల టీచర్లు, సార్లు ఆ అమ్మాయి కి ఏమేం తెచ్చుకోవాలో చెబుతుంటే బుద్దిగా నోట్సులో రాసుకుంది రాధ.

మధ్యాహ్నం భోజన సమయంలో పిల్లలతో బయటికి వచ్చింది గానీ తినడానికి ప్లేటు లేక అలాగే నిలబడి పోయింది.. ఐదవ తరగతి పిల్లలంతా రాధను వింత పక్షి లా చూస్తున్నారు కానీ అన్నం తినలేదమని ఎవ్వరూ అడగడం లేదు..

ఇంతలో వసుధ టీచర్ వచ్చి “పిల్లలూ! మీ కొత్త నేస్తం అన్నం తిన్నదా..? మీతో పాటు కూచోబెట్టుకున్నారా..?” పాపం ఉదయం తిని వచ్చిందో లేదో’ ‘అనగానే తాము చేసిన పొరపాటుకు తలవంచుకున్నారు పిల్లలందరూ…

”నాకూ.. నాకూ ఆకలిగా లేదు టీచర్ ” తలొంచుకుని చెబుతున్న రాధను.. “నీకు లేనిది ఆకలి కాదు కంచం లేదు.. ‘ఇదిగో నా ప్లేటు తీసుకో’! రేపు నీకు కొత్తది తెస్తా”నంటూ దగ్గరుండి భోజనం పెట్టించి వెళ్ళింది…

రాధ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ కూలీలు. ఊరి బయట కడుతున్న పెద్ద కంపెనీలో పనిచేయడానికి వచ్చారు. రాత్రి పగలు అక్కడే చిన్న షెడ్ లో వుంటున్నారు. రాధ వాళ్ళు ఇంతకుముందు గుండాల ఏజెన్సీ ప్రాంతంలో వుండేవారు. అక్కడ బడికి పోయేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మోళ్లతో పాటు పనులు చేస్తుంటే వసుధ టీచర్ చూసింది. ఓపిగ్గా వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులను బతిలాడి ఐదవ తరగతిలో చేర్పించింది.

చదువుకోవాలనే ఆ అమ్మాయి తపన చూస్తుంటే ముచ్చటగా వుంది వసుధ టీచర్ కు..
టీచర్ రాధను ప్రత్యేకంగా చూడటం పిల్లలకు నచ్చడం లేదు.. అందుకే ఏ మాత్రం ఖాళీ దొరికినా ‘నల్లకాకని, అడవి జంతువని’ రకరకాల మాటలతో ఏడిపించ సాగారు.. అంతలోనే టీచర్ కు చెప్పి కొట్టిస్తుందేమోనని భయ పడుతూ.. చెప్పావంటే నీ సంగతి చూస్తామని బెదిరించ సాగారు.

ఎవరేమన్నా పట్టించుకోకుండా బుద్దిగా రాసుకుంటూ చదువుకుంటూ వుంటుంటే.. పిల్లల్లో ఇంకా కోపం అసూయ పెరిగి… ఓరోజు హోంవర్క్ నోట్ బుక్ తీసి దాచారు.

ఆరోజు లెక్కల సారుకు చూపించుదామని సంచీలో వెతుక్కుంటే నోట్స్ లేదు. అందరి వైపు చూసింది రాధ. ఎవరు తీసారో అర్థమయ్యింది రాధకు. చెబితే తన బదులు వాళ్ళు దెబ్బలు తింటారు. అందుకే. ఏం మాట్లాడకుండా తలొంచుకుని సారు తిట్లను దెబ్బలను భరించింది.. అది చూసిన పిల్లల్లో తెలియని మార్పు రావడం మొదలయ్యింది..
మరో రోజు అందరూ సంతోషంగా ఆటలాడుతూ వున్నారు.. తననెవ్వరూ వాళ్ళ ఆటల్లో చేర్చుకోక పోవడంతో అక్కడే నిలబడి చూస్తున్నది.. ఇంతలో గీత అనే అమ్మాయి ఉరుక్కుంటూ వెళ్ళి బోర్లా పడటంతో తలకు దెబ్బ తగిలింది. పెద్ద గాయమై రక్తం వస్తుంటే మిగిలిన పిల్లలు భయంతో వణికిపోతూ ‘నేను కాదు దెబ్బ తాకించింది, నేను కాదు’ అంటూ పక్కకు తప్పుకున్నారు..

తనను ఆడనివ్వందుకు బాధ పడుతూ, ఏదో ఆలోచిస్తున్న రాధ అది చూడగానే పరుగెత్తుకొని వెళ్ళి, వెంటనే ఏడుస్తున్న గీతను దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ, రక్తం కారుతున్న చోట ఆరచెయ్యితో అదిమి పట్టి ముఖాన్ని తన పరికిణీ తో తుడిచి భయం లేదని ధైర్యం చెబుతూ టీచర్ల దగ్గరకు తీసుకొచ్చింది.

రాధ సమయస్ఫూర్తికి మెచ్చుకుంటూ టీచర్లు వెంటనే ప్రథమ చికిత్స చేసారు.

మిగిలిన పిల్లలంతా రాధను ఆరాధన గా చూస్తూ భుజం చుట్టూ చేతులు వేస్తూ, ఆత్మీయంగా కరచాలనం చేస్తుంటే రాధ కళ్ళ నిండా ఆనంద బాష్పాలు..

అది చూసిన వసుధ టీచర్ ‘మా మంచి పిల్లలు’ అంటుంటే అందరి పిల్లల కరతాళ ధ్వనులు, చిరునవ్వులతో బడంతా మారుమ్రోగాయి….. వాళ్ళ లో వచ్చి న మార్పుకు, కనువిప్పుకు గుండె నిండా సంతోషంతో ఊపిరి పీల్చుకొంది వసుధా టీచర్.

-వి. సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!