అతను బడికి వెళ్లని విద్యార్థి. పాల బుగ్గల జీతగాడు. పశువుల కాపరి. తాపీ మేస్త్రి. బతుకు ప్రస్తానం ఎలా సాగినా క్షరాన్ని స్వరంగా మలిచి…స్వయం కృషితో కవిగా ఎదిగిన తెలంగాణ వాగ్గెయ కారుడు. ప్రకృతి మెచ్చిన సుప్రసిద్ధ కవి. జనం మెచ్చిన ప్రజా కవి. మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ దశాబ్ద కాలం కిందటే హెచ్చరించిన ప్రజల మనిషి. ఆయనే.. అందెశ్రీ!
ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ వరంగల్ జిల్లా, జనగాం వద్ద గల రేబర్తి అనే గ్రామంలో 18 జూలై 1961 జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఎంగిలి పాటలు పాటడం కాదురా.. అక్షరం నీ శరీరంలో ఆపాదమస్తకం ధ్వనిస్తున్నది… నీకై నువ్వే కై గట్టాలే… ఈ అందెను అమ్మ పాదాల సందడి చేయించాలే.. అంటూ ప్రోత్సహించి శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ అందె ఎల్లయ్య పేరును అందెశ్రీగా మార్చారు. ఆయన ఆశీస్సులతో తనలోని మాటలకు పాటల రూపం ఇచ్చారు అందెశ్రీ.
తనలోని ప్రతిభకు కారణం ప్రకృతే కారణం అంటాడు అందేశ్రీ. తలంపు ఉంటే చాలు జీవితమే అన్ని నేర్పుతుందని నమ్మే ఆయన.. తన కష్టాలను చూసి వెనుకడుగు వేయలేదు. తన కష్టాలకు స్వరూపంలో పురుడు పోశాడు. అది పాటగా మారి ప్రజలను అత్తుకుంది. ప్రజల మనిషిగా మార్చింది. అందెశ్రీ ఏ విధమయిన చదువూ చదవలేదు. అక్షరాలతో పని ఉన్న కవిత్వంలో ఓ నిరక్ష్యరాసుడు రాణించడం ఏమిటని ఎవరైనా అనుకోవచ్చు. కానీ కవిత్వానికి చదువుతో లంకె పెట్టరాయన. పైరగాలిలో, పక్షుల గుంపులో, వాన చినుకులో, కొండవాగులో, మట్టి వాసనలో పుట్టిన సహజమైన కవిత్వం ఆయనది. ఆచార్య బిరుదరాజు రామరాజు ప్రోద్బలంతో జానపద గీతాలపై ఆసక్తి పెంచుకున్నారు. చదువు రాకపోయినా నోటికొచ్చిన రీతిలో లొల్లాయి పాటలు పాడటం చేసేవాణ్ని అని చెబుతారాయన.
ప్రజలు మాట్లాడే భాషలోనే కై కట్టి పాడతాడు. ప్రజల సాధారణ జీవితాన్ని పాటలో ఆవిష్కరిస్తాడు. నేలను విడిచి సాము చేయడం ఆయనకు నచ్చని పని. సాహిత్యం తనను అగాదం నుంచి ఆకాశం పైకి ఎత్తినా నేలను విడవలేదు. మట్టిని మరవలేదు. జరుగుతున్న వాస్తవాన్ని కవితలోనైనా అందెశ్రీ వదిలి పోడు. అందుకే “కనరా.. కనరా.. కాలాన్ని కనులారా..” అంటాడు.
తనకు జన్మనిచ్చిన తెలంగాణ నేల తల్లిపై పాటపాడితే అది ఉప్పెనలా మారింది. మలి దశ ఉద్యమానికి 14 ఏళ్లు నిండిన సందర్భంగా 2012లో తెలంగాణ అంతటా ధూంధాం పేరుతో కళా జాతరలు సాగాయి. వేదికలన్ని ఉద్యమ పాటలతో వేడెక్కుతున్న తరుణంలో సరిగ్గా 2012 సెప్టెంబర్ 30 ఆయన మేధస్సులో పుట్టి స్వరరూపం దాల్చిన గేయమే “జయజయహే తెలంగాణ జననీ జయ కేతనం”. అది జనాల గుండెలను చేరింది. ఉద్యమానికి ఊపిరైంది. అమరుల త్యాగానికి సలాం అయింది. పది జిల్లాల తెలంగాణకు విముక్తిని ప్రసాధించిన గీతమైంది. ప్రత్యేక రాష్ట్రం సిద్దించిన అనంతరం ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించింది.
లోకకవిగా పేరోందిన ఆయన పాటలు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధం. నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన కాకతీయ విశ్వవిద్యాలయం 2008లో గౌరవ డాక్టరేట్ అందించింది.
ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు. అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు “లోకకవి” అన్న బిరుదునిచ్చి 2014 ఫిబ్రవరి 1లో సన్మానించారు. 2015 దాశరథి సాహితీ పురస్కారం అందించింది వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం 2015లో అందుకున్నారు.
ఆయన రచించిన పాటల్లో అన్ని ప్రజాదరణ పొందాయి. “జయజయహే తెలంగాణ జననీ జయకేతనం”, “పల్లె నీకు వందనములమ్మో”, “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు”, “గలగల గజ్జెలబండి”, “కొమ్మ చెక్కితే బొమ్మరా..”, “జన జాతరలో మన గీతం”, “యెల్లిపోతున్నావా తల్లి”, “చూడ చక్కని” లాంటి పాటలు సుప్రసిద్ధం.
ప్రజలెంత దూరంలో ఉంటారో అంతే దూరంలో ఉంటానంటారు అందెశ్రీ. బాల్యం నుంచి కష్టాలతో సహవాసం చేసిన ఆయన ఆత్మగౌరవాన్ని మాత్రం ఏనాడు వదులుకోలేదు. ఆత్మగౌరవంతో కూడిన ధిక్కారం ఎంత ఉన్నా పర్వాలేదు కాని అజ్ఞానంతో కూడిన ధిక్కారం రవ్వంత ఉన్నా పతనం తప్పదని హెచ్చరించిన ప్రజాకవి ఆయన.
తన సాహిత్యానికి ప్రజెలే తీర్పరులనే ఆయన.. గుర్తింపు కోసం ఏనాడు ఆరట పడని నిడారంబర కవి. ఆయన గొంతుకలో నుంచి మరెన్నో పాటు రావాలని.. పల్లె జీవనానికి సొబుగులు అద్దాలని ఆశిద్దాం.
-ప్రసాద్ జూకంటి