Saturday, February 22, 2020
Home > పుస్తక పరిచయం > సబ్బని లక్ష్మీనారాయణ గారి “ తెలంగాణ రెక్కలు“ -నాగేంద్ర శర్మ

సబ్బని లక్ష్మీనారాయణ గారి “ తెలంగాణ రెక్కలు“ -నాగేంద్ర శర్మ

‘ఈ
మట్టిపై
మమకారం ఉన్న
ప్రతి ఒక్కరికి
ఆదరించే అమ్మ
తెలంగాణ !’
అంటూ తెలంగాణ మట్టిపై మమకారం ఉన్న ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తూ సబ్బని వెలువరించిన పుస్తకం ఇది.
“ ‘ తెలంగాణ రెక్కలు ’ కృతిలో ఆరు పంక్తుల్లో తెలంగాణ స్వరూపాన్ని ఉత్తేజకరంగా ఉల్లేఖించారు” అని సబ్బనిని ప్రశంసించారు ప్రసిద్ధ కవి డా.సి. నారాయణ రెడ్డి గారు తన ముందు మాటలో.

‘రెక్కల రూపశిల్పి’ M.K. సుగంబాబు గారు సబ్బని “ తెలంగాణ రెక్కలు” నిలువెత్తు సత్యదర్పణం అని ప్రకటిస్తూ.. ‘సత్య శోధనే రెక్కలు ప్రక్రియ లక్ష్యం. ఆ సత్య శోధనలోంచే, ఆ లోతుల్లోంచి తాత్విక చింతనకు మార్గం ఏర్పడుతుంది. కవిమిత్రుడు సబ్బని లక్ష్మీనారాయణ సత్య ప్రేమికుడు. ఈయన తన రెక్కలకు ఆధారం చేసుకున్న విషయం (subject) తెలంగాణ. ఇవాళ తెలంగాణా లక్ష్యం ప్రత్యేక కాగా, సబ్బని తన రెక్కల్లో తెలంగాణ ఆర్తిని, ఆకాంక్షను, ప్రస్పుటం చేసిన తీరు, ప్రత్యేక తెలంగాణ అవసరాన్ని వ్యక్తం చేసిన విధానం అపూర్వం.’ అన్నారు.

ఇంకా “ ఒక చారిత్రాత్మకమైన మలుపులో తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి, గళం విప్పి, వారి ఆకాంక్షలను ‘రెక్కలు’గా గానం చేసిన సబ్బని బహుదా ప్రశంసనీయుడు, ఇది ఉత్తమ కావ్యం, నిలువెత్తు సత్య దర్పణం. అత్యంత పటిష్ష్టమైన, అత్యంత శక్తివంతమైన, అత్యంత సూటిదనాల పదాలతో, ఉపమానాలతో, ప్రతీకలతో సబ్బని రెక్కలు హృదయ రంజకంగా సాగడం కవి కవితా చింతనను తేటతెల్లం చేస్తున్నాయి.” అని శుభాకాంక్షలు తెలిపారు సుగంబాబు గారు.

మచ్చుకు కొన్ని తెలంగాణ రెక్కలు:

“కపటచిత్తం
వాళ్లది
రోజుకో
మాట
సత్యం
ఒక్కటే.” అంటారు సబ్బని చిత్త శుద్ధి లోపించిన నాయకుల నుద్దేసించి .

“నిప్పు
రాజుకుంది
ఎవరాపుతారు
చేతులడ్డంపెట్టి?
తెలంగాణ
అగ్నికణం. “ అని చెపుతారు తెలంగాణ ఉద్యమ వాడిని, వేడిని తెలియచేస్తూ.
‘అందరికీ
అన్నీ తెలుసు
తెలిసి కూడా
మౌనం
బలి పశువు
తెలంగాణ ‘ అని మోసపోతున్న తెలంగాణ గురించి కపటతత్వ నాయకుల గురించి చెపుతారు.

‘చట్టబద్ధమైన
నిర్ణయం
తెలంగాణ
సాకారం
పార్లమెంటే
పునాది.’. అంటూ తెలంగాణ ఏర్పాటు చట్టబద్ధమైన ప్రక్రియ అని గుర్తు చేస్తారు.

‘నాటి భారతం
నేటి తెలంగాణ
కురుపాండవ
సమరంలా !
అంతిమ పోరాటం
సత్యమేవజయతే !’

తెలంగాణ ఉద్యమములో వచ్చే ఎత్తుపల్లాలను స్పర్శిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని కురుపాండవ సమరంతో పోలుస్తూ కవి నిక్కిచ్చిగా అంతిమ విజయం తెలంగాణ సాకారం అని అంటారు. ఇలాంటి ఆరారు లైన్లలో తెలంగాణ గురించి అర్థవంతమైన నూరు రెక్కలున్నపుస్తకం ఇది.

– సంకేపల్లి నాగేంద్రశర్మ
9441797650

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!