Monday, August 8, 2022
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం! (3వ భాగం) – శ్రీ విజేత

అతని ప్రేమ కోసం! (3వ భాగం) – శ్రీ విజేత

మాది మానేరు నది ఒడ్డునున్న పల్లెటూరు, పట్టణానానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాన్న వ్యవసాయం చేసేవాడు. మాకు పది ఎకరాల పొలము ఉంది. ఉన్నంతలో బాగానే బతుకుతున్న మధ్యతరగతి కుటుంబం మాది. ఓ పాలేరును పెట్టుకొని చిన్నగా నాన్న వ్యవసాయం చూసుకొనేవాడు. అమ్మ ఇంటి పనులు చూసుకుంటూ నాన్నకు చేదోడు వాదోడుగా ఉండేది. నాకు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు, వాళ్ళు నా కన్నా పెద్దవాళ్ళు. వాళ్లకు నాకు వయసులో ఎడం కొద్దిగా ఎక్కువనే. అందరి కన్నా చిన్న అమ్మాయిని నేను, అది వరమో శాపమో నాకు అప్పుడు ఎలా తెలుస్తుంది!

అందరు ప్రేమగా చూసుకునేవారు అందరికన్నా చిన్నదాన్ని అని. నాన్న అన్నయ్యలను చక్కగా చదివించాడు.మా ఊరిలో ఉన్నంతలో చదువుకొని, తర్వాత పక్క పట్టణములో చదువుకొని వాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నా చిన్న తనంలోనే వాళ్ళ పెళ్లిళ్లు కూడా అయినాయి. నా చిన్నతనంలోనే మా యిద్దరి అక్కయ్యల పెళ్లిళ్లు కూడా అయినాయి. నాకు వాళ్లకు పదేళ్ల వయసు తేడా ఉంటుంది. అంటే నా చిన్నప్పుడే, నాకు ఐదారేళ్ళ వయసు ఉన్నప్పుడే వాళ్ళ పెళ్లిళ్లు అయిపోయినాయి. ఉన్నంతలో మా అక్కచెల్లెళ్లకు సరి అయిన సంబంధాలు చూసి వాళ్లకు పెళ్లి చేసి తన బరువు బాధ్యతలను తీర్చుకున్నాడు నాన్న.

నాకు ఆరేడు ఏళ్ళు వచ్చే వరకే మా అన్నయ్యలకు, అక్కచెల్లెళ్లకు పిల్లలు కూడా అయినారు. వాళ్ళ పిల్లలకు నాకు వయసులో తేడా ఆరేడేళ్లే. అన్నయ్యలు ఉద్యోగ రీత్యా ఊరు విడిచి వెళ్ళిపోయి పట్టణములో స్థిరపడ్డారు. ఇక ఇంట్లో అమ్మ, నాన్న నేనే. అందరితో పాటు నన్నుకూడా బడిలో వేసినారు నాకు ఐదారేళ్లప్పుడు. మా ఊళ్ళో ఏడో తరగతి వరకు ఉంది. మా అక్కయ్యలు చదువుకొనే కాలములో ఐదో తరగతి వరకే ఉండేది. నిజంగా బతుకు బాల్యమెంత గొప్పగా ఉంటుంది!

నా తోటి పిల్లలతో ఆట పాటలతో కాలము హాయిగా గడిచిపోయేది! మా ఊరి బడి ఒక మధురమైన జ్ఞాపకం. మా ఉపాధ్యాయులు మాకు చదువుతో పాటు ఆటపాటలు కూడా నేర్పించేవారు. బడి చెంతనే మా పొలం ఉండేది. పొలం చెంత చింత చెట్లు, జామ చెట్లు, పూల చెట్లు, సీతాఫలముల చెట్లు ఉండేవి. ఆయా కాలాలలో కాసిన పండ్లు ఫలములు నాకు నా స్నేహితురాళ్లకు కావలసినన్నీ దొరికేవి తినడానికి. వానకాలంలో పెసళ్లు అలుకుతే రెండు మూడు నెలలకే పెసరు కాయలు కాసేవి. మా పొలం చెంత వేసిన కూరగాయలు, ఆకు కూరలు, కాలం తోటి వచ్చే మక్క కంకులు, జొన్న కంకులు, మాకు తినడానికి అందుబాటులో ఉండేవి. మా పొలం చెంత మా బడి నాకు ఒక విహార స్థలములా అనిపించేది. అన్నయ్య, అతను కూడా మా బడిలోనే చదువుకునేవారు, అన్నయ్య అంటే మా కజిన్. నా కన్నా ఒక్క తరగతి ఎక్కువ. వాళ్ళ క్లాస్ మా క్లాస్ వేరు వేరు కాబట్టి పెద్దగా టచ్ లో ఉండేవారు కాదు. నేను పెద్దగా ఆ చిన్నప్పుడు వాళ్ళను పట్టిచ్చుకున్నట్టు జ్ఞాపకం లేదు. వాళ్ళ చదువు ఏడు అయిపోగానే వాళ్ళు పక్క ఊరిలో పది వరకు చదువుకోవడానికి వెళ్ళిపోయినారు.

ఆరేడేళ్ళ కాలం ఎంత ఈజీగా గడిచిపోయింది! మా ఊరిలో ఉన్నంతవరకు ఏడు తరగతుల వరకు చదువుకున్నాను. నా తోటి స్నేహితురాళ్ళు కొందరు పక్క ఉరికి చదువుకోవడానికి వెళ్ళినారు. అమ్మ మాత్రం నన్ను చదివించడానికి ఇష్టపడలేదు. నా వయసప్పటికీ పదమూడేళ్లవరకు ఉంటుంది. ఆడపిల్ల చదువుకొని నౌకర్లు చేస్తదా? రాజ్యాలేలుతదా? చదివిన కాడికి చాలు అనుకున్నది అమ్మ.

ఆడ పిల్లను పక్కూరికి తొలి చదివించడానికి ఇష్టపడలేదు అమ్మ, పైగా అప్పటికి నేను మచ్యూర్ అయి ఉన్నాను. అమ్మ కు నా చదువు కన్నా నా భద్రతనే ఎక్కువ అనుకున్నదేమో! ఆడ పిల్ల పెళ్లి చేసేస్తే పనైపోతుందని అనుకున్నదేమో నా చదువును ఆపివేసింది ఏడవ తరగతికే.

చదువుకున్న అన్నయ్యలు కూడా నన్ను చదివించుమని చెప్పలేదు. నేను చిన్న పిల్లను నా కేమి తెలియదు అప్పుడు చదువు యొక్క విలువ. తర్వాత తెలిసింది ఏమిటంటే నా తోటి చదువుకున్నవాళ్ళు కొందరు కాలక్రమములో టీచర్లు అయ్యారు, వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నా చదువు ఆపివేయడం నా జీవితాన్నే మార్చివేసినట్లయ్యింది. నా బాల్యం చూస్తుండగానే గడిచిపోయింది, చిన్నప్పుడు ముచ్చటగా గౌనులు వేసుకొనే నేను లంగా ఓనీల్లోకి మారిపోయాను. ఆ తరువాత అయిదేళ్ళు చూస్తుండగానే గడిచిపోయినాయి.

అన్నయ్య, అతను పక్కూరి బడిలో పది పాసయి, పట్టణములో రెండు సంవత్సరములలో పన్నెండు కూడా పాసయినారు. వాలిద్దరు చిన్నప్పటి నుండి మంచి దోస్తులు. చదువుల్లో ఫస్ట్ కూడా. ఆ వేసవి సెలవుల్లో అన్నయ్య కోసం క్రమం తప్పకుండా అన్నయ్య ఇంటికి వస్తుండేవాడు అతను . వచ్చినప్పుడు తరచుగా నాకు కనిపిస్తుండేవాడు. అన్నయ్య చందమామలు, బాలమిత్రలు, వారపత్రికలు, నవలలు, కథల పుస్తకాలు చదువుతుండేవాడు. మాఊరిలొని గ్రంధాలయం నుండి, పక్క పట్టణం గ్రంధాలయం నుండి కూడా పుస్తకాలు తెచ్చుకొని చదువుతుండేవాళ్ళు వారు. ఆ పుస్తకాలు చదువడం అనే అలవాటు నాకు కూడా అబ్బింది వాళ్ళనుండి. అప్పుడప్పుడు అతన్నుండి పుస్తకాలు తీసుకోవడం, చదువడం, మళ్ళీ అతనికి పుస్తకాలు తిరిగి ఇవ్వడం జరిగేది. అలా కథల పుస్తకాలు చదువడం, నవలలు చదువడం ఒక అభిరుచిలా ఏర్పడింది. అతను చాలా ఆసక్తిగా మాట్లాడేవాడు, చాలా వినయంగా ఉండేవాడు. అతనికి మంచివాడు పిల్లవాడు అని పేరుండేది. పైగా అన్నయ్య దగ్గరి దోస్త్. కొద్దిగా చనువు పెంచుకున్నానేమో నాకు తెలియదు. కొద్దిగా అతనితో ఫ్రీగా మాట్లాడేదాన్నేమో అన్నయ్య ఉన్నప్పుడే. ఆతను నన్ను ఎలా అర్థం చేసుకున్నాడో తరువాత తరువాత తెలిసింది. పదహారు పదిహేడు ఏళ్ళ వయసు నాకు అప్పుడు. అతనికి పద్దెనిమిది, పందొమ్మిది ఏళ్ళ వయసు ఉంటుందేమో. యవ్వనం మనిషి జీవితంలో ఊహా లోకం కావచ్చు. అతను నా యెడల ఎన్ని ఊహల్లో తెలిపోయాడో నా కెలా తెలుస్తుంది! తరువాత తరువాత తెలిసింది కాని! నేను ఆడపిల్లను కాబట్టి జాగ్రత్తగా ఉండేదాన్ని నా పరిధిలో.

చిన్నప్పటి నుండి అందరు అనేవారు నేను అందంగా ఉంటానని, కావచ్చు నిజమే వాళ్ళు అన్నది! పదహారు పదిహేడేళ్ళ అమ్మాయి అందంగా ఉండదని ఎవరంటారు! అందముకు తోడు నేను వాగుడు కాయను, కొద్దిగా చిలిపిగా మాట్లాడుతాను. అదే నా అదనపు ఆకర్షణ ఏమో! నా అందం నాకు తెలియడం కంటె నేను యెంత అందంగా ఉంటానన్నది అతని ఊహల్లోంచి వచ్చిన భావాల్లోంచి ఇంకా బాగా తెలిసింది తరువాత. నేను అందగత్తెను అయినందుకా అతడు నాపై ఆకర్షణను పెంచుకున్నాడు? నేను అతని ఊహల్లో చిలిపి అమ్మాయిని అయినందుకా నాపై ఇష్టాన్ని పెంచుకున్నాడు?

ఆ రోజుల గురించి జ్ఞాపకముంచుకున్నాయి కొన్నే విషయాలు. అతనికి తరచుగా కనిపించడం నేను, అతనితో అప్పుడప్పుడు మాట్లాడడం, పుస్తకాలు అడుక్కొని చదువడం, మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఇవన్ని అన్నయ్య తో అతను ఉన్నప్పుడే. నేనేమి పెద్దగా దీన్ని ప్రేమ అని అనుకోలేదు. అతను నా యెడల అనుకున్న విషయం నేకేమీ తెలియలేదు తరువాతి దాకా గాని. ఈ మాత్రం పరిచయాలే ప్రేమలవుతాయని నేను ఉహించలేదు. నిజంగా బాల్యం, యవ్వనం మధురమైనవి. జీవితములో యేమాత్రమైనా తృప్తి, ఆనందం మిగిల్చుకోన్నానంటే అది బాల్య యవ్వనాల్లోనే.

బాధ్యతలు లేని బతుకు, ఉల్లాసమైన బతుకు, ఆనందమైన బతుకు, ఆహ్లాదమైన బతుకు. ఆ ఏడాది ఎంత ఈజీగా గడిచిపోయింది! అప్పట్లో మా కజిన్ సుజీ, నేను, అన్నయ్య, అతను ఆటల్లో మాటల్లో తెలిపోతుంటీ కాలం ఈజీగా గడిచిపోయేది. సుజి, అన్నయ్య, అతను క్లాసుమేట్స్. నేను ఏడు వరకు చదివి చదువు ఆపివేస్తే సుజీ పది వరకు చదివి చదువు ఆపివేసింది. ఉన్న స్నేహితురాళ్ళలో సుజీ నాకు చాలా దగ్గర. అన్నయ్య అతడు బాగా చెస్ ఆట ఆడేవారు, ఒకోసారి మేము నలుగురం కలిసి క్యారం బోర్డు ఆడేవాళ్ళము, చెరి ఒక జంటగా చేరి. ఒకోసారి అందరం బడి దగ్గరి మా పొలం చెంతకు వెళ్ళేవాళ్ళం, సరదాగా చెట్లల్లో, చేమల్లో పచ్చటి ప్రకృతిలో ప్రకృతి పురుగులమై. మా ఊరు పరిసరాలు ఆహ్లాదంగా ఉండేవి. చిన్నపాటి కొండలు, గుట్టలు, పక్కనే మానేరు, యేటి ఒడ్డుపై మామిడి తోట, చుట్టూ పచ్చటి పంటపొలాలు ఒక దృశ్య కావ్యంలా ఉండేది. చూస్తుండగానే ఆ సంవత్సరం వేసవి ఏప్రిల్, మే మాసాలు ఈజీగానే గడిచిపోయినాయి. వానాకాలం వచ్చింది. అన్నయ్య, అతను ఇంటర్ పాసయి డిగ్రీ చదువుకోసం పట్టణములో కాలేజీలో చేరిపోయినారు. జులై ఆగస్టు మాసములు వస్తూ, పదిహేనవ ఆగస్టు జెండావందనం పండుగ గడిచి, వినాయక చవితి పండుగ గడిచి సెప్టెంబర్ అక్టోబర్ మాసాలు కూడా వచ్చినాయి. ప్రతి పండుగా ఒక వినోదం, ఒక వేడుక. సెప్టెంబర్- అక్టోబర్ మాసాల్లో వచ్చే బతుకమ్మ పండుగ మా ప్రాంతపు పెద్ద పండుగ, ముఖ్యంగా స్త్రీలకు. బతుకమ్మ పండుగ అంటే అందరు ఆడపిల్లలలాగే నాకు కూడా చాలా ఇష్టమైన పండుగ. బతుకమ్మ పండుగను పితృ అమావాస్యకు మొదలు పెడుతారు. అందులో పిల్లలు ఏడు రోజులు ఆడేది చిన్న బతుకమ్మ పండుగ , పెద్దలు తొమ్మిదవ రోజునాడు ఆడేది పెద్ద బతుకమ్మ పండుగ. ఈ పండుగను సద్దుల బతుకమ్మ పండుగ అని కూడా అంటారు, ఎందుకంటే చక్కర, బెల్లం, నెయ్యి మరియు అన్ని రకాల పిండిలతో, నువ్వులతో, వేరు శనిగ గింజలతో తీపి పదార్థాలు తయారు చేస్తారు.

చిన్న బతుకమ్మను ఆడడానికి వెళ్ళినపుడు అందరు ఆ సద్దులను పరస్పరం సిబ్బిలలో పంచుకొని ఇచ్చుకోవాయినం, పుచ్చుకోవాయినం అంటూ పంచుకుంటారు. ఇక పితృ అమావాస్య వారం రోజులు ఉందనగా బొడ్డెమ్మను వేస్తారు, పుట్టమన్నుతో చెక్కపీటపై మట్టి వరుసల పీఠం పేరుస్తారు. అది బొడ్డెమ్మ. దానిని పసుపు కుంకుమలతో అలంకరించి, పూలతో పేర్చి సాయంత్రం పూటల్లో ఎవరి ఇంటి ముందటనైనా ఉంచి ఆడ పిల్లలు చుట్టూ తిరుగుతూ, బతుకమ్మ పాటలు పాడుతారు. బతుకమ్మ పాటను ఒకరు చెప్తుంటే మిగితావారు అంటుంటారు లయబద్దంగా.

“రామ రామ రామ ఉయ్యాలో / రామనే శ్రీ రామ ఉయ్యాలో / హరి హరి ఓ రామ ఉయాలో / హరియ బ్రహ్మ దేవ ఉయ్యాలో ….” ఇలా సాగుతుంది బతుకమ్మ పాట.

బతుకమ్మ పాటల్లో, జాతి, సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పేపాటలు, ఉమ్మడి కుటుంబ ప్రయోజనాలు, ఆరోగ్య సూత్రాలు- వీటికి సంభందించిన అంశాల పాటలు, కరవు కాటకాల మీద వచ్చిన పాటలు, ప్రకృతి బిభిత్సాల మీద వచ్చిన పాటలు, స్త్రీల జీవితములోని కష్టాలు తెలిపే పాటలు ఉన్నాయంటారు. బతుకమ్మ పాటలు అంటే కష్టాలు, వెతలు వెల్లబోసుకొనే పాటలే. వాడవాడల్లో పిల్లలందరూ ఏడు రోజులు బొడ్డెమ్మను ఆడిన తరువాత, పితృ అమావాస్యనుండి చిన్నబతుకమ్మను ఏడు రోజులు ఆడుతారు. చిన్న బతుకమ్మ చిన్నారి ఆడపిల్లలకు ఏంతో ఇష్టమైన ఆట. బతుకమ్మ పండుగ వస్తుందంటే మేదరి వాళ్ళ దగ్గర అమ్మ కొత్త సిబ్బి కొనేది. తెల్లవారినంక మా పొలం చెంతకెళ్ళి బతుకమ్మ పేర్వడానికి కట్ల పువ్వులు, గునుగు పువ్వులు, పట్టుకుచ్చుల పువ్వులు, గోరంట పువ్వులు, బంతిపువ్వులు తంగేడు పువ్వులు, గుమ్మడి పువ్వులు, గుమ్మడి ఆకులు సేకరించి తీసుకవచ్చేదాన్ని. బడికి సెలవులే కాబట్టి తీరిక సమయం ఎక్కువే. మద్యాహ్నం వరకు బతుకమ్మను పేర్చి, మధ్యలో గుమ్మడి పువ్వు గౌరమ్మను పెట్టి అలంకరించేదాన్ని. సాయంత్రం తయారై వాడకట్టు మా పది ఇండ్ల పిల్లలతో కలిసి కాసేపు ఇంటి ముందట బతుకమ్మలను పెట్టి ఆడి తరువాత మానేరు ఒడ్డుకు వెళ్ళే వాళ్ళం. అక్కడ బతుకమ్మ ఆడి బతుకమ్మలను మానేరు నీళ్ళల్లో వేసి వచ్చేవాళ్ళం.

బతుకు ఒక వినోదం, ఒక వేడుక ఆ రోజుల్లో.. లీలగా జ్ఞాపకం వస్తుంది ఒకోసారి అన్నయ్య, అతను మానేరు ఒడ్డుకు వస్తుండేవారు. మానేటి ఒడ్డున మామిడి తోటలో తిరుగుతూ మా ఆటపాటలను చూస్తూ ఉండేవారు. మేము పెట్టె
సత్తుముద్దలను కూడా తినేవారు సంబురంగా. నిజంగా బతుకు బాల్యమెంత మధురమైనది!

కాలం ఎవరి కోసం ఆగుతుంది? బతుకమ్మ పండుగ, దసరా పండుగ అయిపొయింది, దీపావళి పండుగ కూడా అయిపొయింది, సంక్రాంతులు, ఉగాదులు రాబోతున్నాయి. నా జీవిత గమనం మారిపోబోతుందని నాకెలా తెలుస్తుంది? నాకు పెళ్లీడు వచ్చిందని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అమ్మా నాన్న. అంతా విచిత్రం! పెళ్లి ఏమిటో ఇంత తొందరగా అనిపించేది! జీవితములో కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో, కొందరు వ్యక్తులు ఎందుకు కలుస్తారో తెలియదు. మనుషుల జీవితాలు ఎవరి చేతుల్లో ఉంటాయో తెలియదు, ముఖ్యంగా ఈ దేశములో ఆడపిల్లల జీవితాలు అమ్మానాన్నల చేతుల్లోనే ఉంటాయేమో పెళ్లీడు వచ్చే వరకు. ప్రతి అమ్మ నాన్న తమ బిడ్డ మంచిగా బతుకాలని, తమ బిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలనే కోరుకుంటారేమో. నాన్నవయసు కూడా డెబ్బయి ఏళ్ళ వరకు వచ్చి ఉంది. ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. నాకు పెళ్లి చేస్తే నాన్న బాధ్యత తీరిపోతుంది. అమ్మ తాపత్రయం కూడా నాకు తొందరగా మంచి సంబంధం చూసి చెయ్యాలనే. ( మిగితా వచ్చేవారం…)

-శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!