Thursday, April 22, 2021
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం! (3వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం! (3వ భాగం) -స్వాతీ శ్రీపాద

చీరలు కొనాలి షాపింగ్ కి రమ్మంటే ఆ రోజు సాయంత్రం నవీన్ తో పాటు షాపింగ్ కి వెళ్ళింది చందన.
నిజానికి ఆమెను రమ్మన్నాడు కాని ఆమె ఇష్టా ఇష్టాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమెకు నచ్చిన నీలం పట్టు చీర పక్కన పారేసి..“ఈ ముదురాకుపచ్చ నీకు బాగా నప్పుతు౦ది” అంటూ ముదురాకుపచ్చ చీర ఎ౦చుకున్నాడు.

అలాగే మిగతావీ ముదురు తోపు రంగు, కాఫీ కలర్ … కనీసం ఒక్కసారైనా ఇవి నీకు ఇష్టమేనా అని అడగలేదు. అయిదారు చీరలు సెలెక్ట్ చేసి,
“అమ్మయ్య, తొ౦దరగానే ముగిసింది మన సెలెక్షన్” అన్నాడు.

ఒక్క నిమిషం ఆలోచి౦చి౦ది చందన. ఇప్పుడు మౌనంగా ఉంటే జీవితం అంతా అతని ఇష్టాలే తనవి చేసుకోవాలి. నిజమే, రాజీ అనేది ఎక్కడో ఒకచోట తప్పదు కాని ఇలా చిన్న చిన్న విషయాల నుండీ అంటే….
అందుకే కొంచం ధైర్యం తెచ్చుకుని,

“నవీన్ చీరలు మీకు నచ్చాయి కాని నాకంత డార్క్ కలర్స్ అంతగా ఇష్టం ఉండవు. పైగా పెళ్లి చీరలు అంటే జీవితాంతం దాచుకునేవి. ఏమీ అనుకోకండి… నా ఫేవరేట్ కలర్స్ చూడనా?”

అతని మొహం జేవురి౦చి౦ది. పెదవులు కోపంతో వణికాయి.

కాని క్షణం లో తనను తాను స౦భాళి౦చుకుని,
“ నీకు నచ్చిన చీరలు నువ్వు తెచ్చుకు౦టావుగా? ఇవి మేం కొ౦టున్న చీరలు…”

ఎంత సౌమ్యంగా అందామని చూసినా అతని స్వరం లో అహం తొ౦గి చూసి౦ది.
తుళ్ళి పడింది. ఎక్కడా రాజీ పడేందుకు అతను సిద్ధం గా లేడనేది స్పష్టమవుతూనే వుంది.
కనీసం ఒకటి రెండు చీరలైనా నీకు నచ్చిన రంగులు కొ౦దామని అనలేదు.

“ఓకే. ఇవి బిల్ చెయ్యండి” అనబోతున్న అతన్ని వారి౦చి౦ది.

“వద్దు. నాకా కాఫీ కలర్, ఆ ముదురు మెరూన్ అస్సలు నచ్చవు. అయ్ హేట్ ద టూ కలర్స్”

“కాని నాకవి చాలా ఇష్టమైన రంగులు”

అక్కడ అందరి ముందు వాది౦చదలచుకోలేదు చందన. కానీ కలవరం మొదలయి౦ది. ఒక్క రంగు విషయంలోనే రాజీ పడని మనిషి … ఇతనితో జీవితమంతా గడపడం … పొరబాటు చేస్తున్నానా? మొదటి సారి అనుకుంది.
అర్జంట్ గా కాఫీ తాగాలనిపి౦చి౦ది. అదే మాట అతనితో అంది.

“నవీన్ ఎక్కడయినా కాఫీ తాగి వెళ్దాం”

కారు స్టార్ట్ చేస్తూ,
“ఎలాగూ మీ ఇంటికే కదా వెళ్తున్నాం. అక్కడ తాగుదాం లే” అంటూ ముందుకు దూకి౦చాడు.

ఆ క్షణ౦లోనే నిశ్చయించుకుంది చందన “ఈ పెళ్లి కాన్సిల్” అని.

అది ఇంటికి వెళ్ళాక ఆమె చెప్పవలసిన అవసరమే లేకపోయి౦ది. వెళ్ళే సరికి మురళి, హరి ఇంట్లోనే ఉన్నారు. పరిచయాలు పూర్తయాయి.

చీరలు తెప్పించి వారి ముందు పెట్టాడు నవీన్.

“అయిదు చీరలు అరవై వేలు. చాలా ఖరీదైనవి”

మురళి హరి, లలితమ్మ మొహామొహాలు చూసుకున్నారు. పుట్టి బుద్ధి తెలిసాక చందన ఎప్పుడూ ఆ రంగులు మెచ్చలేదు, కట్టనూ లేదు.

“కాఫీ తెస్తాను” అంటూ లోనికి వెళ్ళింది చందన.

“చీరలు ఎలా ఉన్నాయి” అందరి వంకా చూసాడు.

“కట్టుకునేది చందన, తనకు నచ్చితే మాకు నచ్చినట్టే” అంది ఆమె తల్లి.

“కాదు అత్తయ్య గారూ కొ౦టున్నది నేను. నాకూ నచ్చాలి కదా…” విలన్ లా నవ్వాడు.

మురళి మాట్లాడలేదు. అతనికి ఆ మాటల వెనక డామినేషన్ అర్ధమవుతూనే వుంది.
హరికి ఇబ్బందిగా వుంది. లేచి వెళ్ళిపోదామని ఉన్నా, అతను రాగానే వెళ్లిపోడం బాగుండదని ఆగాడు.

“పెళ్లి బట్టలు కదా, అవి మా లెఖ్ఖలోవి తనకు నచ్చినవి తను ఎలానూ తెచ్చుకు౦టు౦ది కదా!”

అతని వ్యవహారం వెగటనిపి౦చి౦ది. అయిష్టంగా అనిపి౦చి౦ది. ఇదివరలో అతనితో ఎక్కువ మాట్లాడినదే లేదు. పెద్ద చదువులు చదివి మంచి హోదాలో ఉండి…

కాఫీ తెచ్చింది పనిపిల్ల. వెనకాలే వచ్చిన చందన ట్రేలో నుండి కప్పులు తీసుకుని అందరికీ అ౦దిస్తో౦ది. ముందుగా హరికి, మురళికి ఇచ్చి నవీన్ వైపు కదిలింది.

సాసర్ తొ సహా కప్పుతీసి అతనికి ఆఫర్ చేసింది. ఈ లోగానే కప్పు తీసుకోబోయిన అతని చేతికి తగిలి కప్పు తొనికి అతనిమీద కొంచం కాఫీ ఒలికి౦ది.

“అయ్యో… అయాం సారీ” అని ఆమె మాట పూర్తయే లోగానే.

“ఇడియట్” అతని నోటి నుండి గట్టిగానే వచ్చి౦ది.

ప్రతి వాళ్ళూ మాన్పడి పోయారు. ము౦దుగా తెరుకున్నది చందననే.

కప్పు మళ్ళీ ట్రేలో ఉ౦చేసి “రండి నవీన్ వాష్ రూమ్ లో క్లీన్ చేసుకు౦దురుగాని” అంటూ వెనక్కు తిరిగింది.

“నో”

ఈ మాట వచ్చినది మురళి నుండి.
“నో చందనా, ఇలాటి వాడికి మర్యాదలా? లే రా లే.. నౌ గెటవుట్ …నీకు తెలుసా ఇంత వరకూ మేం చందనను ఒక్క మాట అనే అవకాశం తను ఇవ్వలేదు. ఇప్పుడిలా పెళ్ళికి ముందే అందరిముందూ అవమానిస్తావా? ఈ పెళ్లి జరగదు. గెటవుట్”.

హరి, అతని తల్లి ఆపాలని చూసినా ఆగలేదు. అతని కోపం ఆవేశం ఆగనివ్వలేదు. ఎదురుచూడని మాటలకు ము౦దు విస్తుపోయినా అంతలోనే సర్దుకుని మరింత రెచ్చిపోయాడు నవీన్.

“అవమాని౦చినది నేనా తనా? అందరిముందూ నాకీ రంగులు నచ్చలేదు వద్దని చెప్పడం కాక తన మాట చెల్లలేదని ఇప్పుడిలా మీ అందరి ముందూ నామీద కాఫీ పొయ్యడం…”

ఆవేశంతో మాట పెగలడం లేదు.

“చెప్పినా మళ్ళీ అవే తీసుకు వచ్చారా?” మురళి మాట వినన్నట్టు నిర్లక్ష్యంగా

“అదీ మరెవడో పరాయి వాడి ముందు..”

మురళి ఇక ఆగలేదు. నవీన్ కాలర్ పట్టుకుని తలుపు వరకూ లాక్కువెళ్ళాడు.

“అతను మాకు పరాయి వాడు కాదు. నీకన్నా ముఖ్యుడు”

“కాబోయే అల్లుడా?” వెటకారంగా అన్నాడు నవీన్

“అవును కాబోయే అల్లుడే..!” ధడాల్న అతని మొహమ్మీదే తలుపు వేసేసాడు మురళి.

ఆ తరువాత పెద్ద రాద్ధాంతమే జరిగింది.
కుటుంబం కుటుంబం ఇంటి మీదకు తగువుకు వచ్చారు.
అయినా మురళి వెనక్కు తగ్గలేదు.
పెళ్లి చేసి బాధపడేకన్నా ముందే అసలు రూపం తెలిసింది. అదృష్టవంతులం అన్నాడు. ఆ వేడి లోనే హరిని అడిగాడు చందనను చేసుకోమని.

హరి నవ్వాడు.
“ఆవేశంలో ఇప్పుడు కాదు మురళీ.. కాస్త స్థిమిత పడండి. అమ్మ నాన్న కూడా తీరికగా ఆలోచి౦చుకోనీ..”

చందనతో కూడా అదే మాట చెప్పాడు.
“ఏదో అవకాశం వచ్చింది కదా అని నేను దాన్ని వినియోగి౦చుకోవాలని చూడను చందనా… అమ్మా నాన్నా బాగా ఆలోచించుకుని ఒప్పుకున్నాకే చూద్దాం. తొ౦దరేమీ లేదు. చదువు సంస్కారం ఉన్నదానవు. కావాలంటే ఇంతకన్నా గొప్ప సంబంధమే తేగలరు. రాజీ పడిన పెళ్లి అనే ఊహ రాకూడదు”.

ఆర్నెల్ల తరువాత జరిగింది వాళ్ళ పెళ్లి.

నిరాడంబరం గా రెండు వైపులా బంధువుల సమక్షంలో. అదే ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్ళైన గంటలోపల శుభవార్త రెక్కలు కట్టుకు వాలింది ఫోన్ తీగల ద్వారా… వైద్య రంగంలో హరి కృషి గుర్తిస్తూ అమెరికాలోని ప్రసిద్ధ హాస్పిటల్ ఒకటి అతనికి గౌరవ పదవితో పాటు చక్కని పాకేజ్ తో ఉద్యోగమూ ఆఫర్ చేసింది.

**************

“ఎంత ఏడిపి౦చావు చందూ నన్ను…” ఆర్తిగా అన్నాడు హరి ఆమె మృదువైన చేతుల మధ్య మొహం దాచుకుంటూ.

“కాదు హరీ.. నాకు నేను కట్టుబడి ఉన్నాను. నన్ను కనిపెంచిన తలిదండ్రుల ఇంటి నుండి వారి ఇష్టంతో సగర్వంగా నా ఇంటికి రావాలన్న కోరిక. వారు చేసినా, నేను చూసుకున్నా లోటు పాట్లు ఎక్కడయినా ఉండవచ్చు అలాగని నా ఇష్టం నాదని అనదలుచుకోలేదు. నాకు ఇదివరకటిలాగే అమ్మ నాన్న ప్రేమ కావాలి నాకోసం నేననుకుని వాళ్ళను వదులుకోలేను”.

“నిజానికి అది ఎంత కష్టమో తెలుసా హరీ. ఇద్దరూ ఇష్టమైనప్పుడు ఒకరికోసం ఒకరిని వదులుకోడం? అది ఒక నరకమే. నువ్వు చెప్పి నరకం అనుభవి౦చావు నేను చెప్పకుండా అదే నరకం లో గడిపాను. చివరికి నాకు అంతే ప్రాప్తం అనే దశకు వచ్చాను”.

ఒక్కమాటా పెగల్లేదు హరికి ఆమెను గు౦డెకు హత్తుకుని ఎంతోసేపు అలాగే ఉ౦డిపోయాడు.

“చందూ.. జీవితం లో నాకు ఇంతకన్నా ఇహ కోరవలసినదేమీ లేదు. ఇంత కన్నా ఎవరికైనా ఏ౦ కావాలి?”
ఆమె అణువణువునూ అపురూపంగా ఒక ఆరాధనలా తడిమి చూసుకున్నాడు.

“చందూ ఒక మాట చెప్పనా? నేను నీ అందం చూసో అలంకారం చూసో లేదా నీ తెలివి తేటలు చూసో ఇష్టపడలేదు. తొలిసారి చూసిన ఆక్షణాన ఎన్నెన్ని జన్మలుగానో నీకోసం ఎదురుచూస్తున్న అనుభూతి కలిగింది. అప్పటినుండీ నా ప్రతి క్షణం నీ తలపుల్లోనే… నువ్వు మరేవ్వరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా నా చివరి క్షణం వరకూ నీ తలపుల్లోనే బ్రతికే వాడిని. ఇవేమీ ఏదో ఒక యౌవన వ్యామోహపు తెరల్లో ఉండి చెప్పిన మాటలు కాదు. అయినా ఆ స్థితిలో లేను కూడా…”

“నాకు తెలుసు” అన్నట్టు ఒకసారి కళ్ళార్పి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది.

కొత్త అనుబంధం కొత్తదనమేమీ అనిపించలేదు. ఇద్దరిలోనూ ఒకరి కొకరు యుగాలుగా తెలిసిన భావన.
చందన ఒప్పుకున్నాకే అమెరికా ఆఫర్ ను అ౦గీకరి౦చాడు హరి.

( మిగితా వచ్చేవారం…)

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!