Saturday, February 22, 2020
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం! (4వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం! (4వ భాగం) -స్వాతీ శ్రీపాద

నెలరోజుల్లో కావలసిన వన్నీ సమకూర్చుకుని ఇద్దరూ సముద్రాలు దాటి అమెరికా ప్రయాణ మయ్యారు.

*******************************

ఉదయమే ఆరున్నరకే లేచి కావలసినవన్నీ అమర్చుకుని తొమ్మిదిలోపల సత్యనారాయణ వ్రతం ముగించారు.
అతి దగ్గరి మిత్రులు పూజకు వచ్చి ఉపాహారంతో సెలవు తీసుకున్నారు.
సాయంత్రం ఇండియన్ రెస్టారెంట్ లో డిన్నర్ ఏర్పాటు చేసారు.
“అప్పుడే రెండేళ్ళు గడచి పోయాయా చందూ”
ఆమెను గట్టిగా హృదయానికి హత్తుకుని పసిపిల్లాడిలా ఒదిగిపోయాడు. అవును రెండు సంవత్సరాలు రెండు క్షణాల్లా …
ఏడాదికి ఒకసారి ఇండియా వెళ్లి అందరినీ చూసి వస్తారు, పెద్దగా సమయం దొరక్కపోయినా కనీసం రెండు వారాల కోసమైనా వెళ్తారు.
రెండేళ్ళలో కనీసం ఒక్కరోజైనా ఇద్దరూ దూరంగా ఉన్నది లేదు. అలాగని అభిప్రాయ భేదాలు లేవనీ కాదు.
ఉన్నాయి.. చాలానే ఉన్నాయి.. కాని…
అవును అమెరికా వచ్చిన కొత్తలోనే, తొలి అభిప్రాయభేదం నాలుగురోజుల్లో రానే వచ్చింది.
రెండు రోజులు మిత్రుల తో ఉండి అపార్ట్మెంట్ ఒకటి కుదుర్చుకున్నారు.
కొత్త జీవన విధానం ఇదివరకే మిత్రుల ఇళ్ళలో చూడనే చూసారు. పనివాళ్ళు దొరకని స్థితి ప్రతిపనీ ఎవరికీ వారు చేసుకోడం, కొంచం ప్రవర్తనా విధానం తెలుసుకున్నారు. ఎంత ఫర్నిష్డ్ ఇల్లయినా చిన్న చిన్న వస్తువుల కొనుగోలు కోసం మాల్ కి వెళ్ళారు ఇద్దరూ.

హరి కి నచ్చిన కట్లరీ గాని, ప్లేట్స్ గాని ఏ వస్తువూ చందనకు నచ్చలేదు. చందనకు నచ్చినవి హరికి నచ్చలేదు. మొత్తానికి కొనకుండానే ఇంటికి వచ్చారు.

ఇద్దరూ కలిసే వంటలాటిది చేసుకున్నా పొడిపొడిగానే మాటలు సాగాయి. రాత్రి తినడం కూడా ఎవరిదారిన వాళ్ళు టీవీ చూస్తూ తిన్నాక చందన వెళ్లి పడుకుంటే హరి మరో అరగంట టీవీ చూసి బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. అటు తిరిగి పడుక్కున్న చందన హరి మంచం మీద వాలుతూనే రివ్వున అతనివైపు తిరిగి అలలా అతన్నిచుట్టుకు పోయి అతని ఎదలో తలదాచుకు౦ది.

అప్రయత్నంగానే అతని చెయ్యి ఆమెను చుట్టుకు౦ది. ఎగిసి పడుతున్న ఆమె ఊపిరి స్పర్శకు గాని అతనికి అర్ధం కాలేదు, ఆమె ఏడుస్తోందని.

“చందూ .ఏయ్, ఏమిటిది? ఛ పిచ్చిపిల్లా …”

“ నువ్వు మాట్లాడకపోతే నాకు జీవితమే శూన్యం అనిపిస్తుంది హరీ”

“ నాకు మాత్రం స్వర్గం అనిపిస్తు౦దా?’

“ అసలు నీకు నచ్చినవి ఎందుకు వద్దాన్నానో తెలుసా?”

“తెలుసు, అంత ఖరీదైనవి అనే కదా నీ ఆలోచన? నాకు బాధనిపించినది నువ్వు వద్దన్నావని కాదు. నీ స్థాయికి తగ్గట్టు నేను లేనేమోనన్న ఒక బాధ. కోపం నీ మీద కాదు “

‘ఇంకా నువ్వూ నేనూ వేరు వేరు అని ఆలోచిస్తున్నావా హరీ. ఇప్పుడు అన్నీ మనిద్దరివే ..కష్ట సుఖాలూ … స్థాయి అన్నీ మనమధ్య మరొకటి మరొకటి రావద్దు. మన గతం గతానికే వదిలేద్దాం.
ఇప్పుడు ఇహపై భవిష్యత్తు నువ్వూ నేనూ ఇద్దరమే.
మన ఇద్దరిదీ ఒకే స్థాయి.”

“సారీ రా అమ్మడూ”

“ఉహు మనమధ్యన సారీలు కూడా వద్దు. నచ్చనివి నచ్చలేదని చెప్పుకుందాం , అక్కడే వదిలేద్దాం, అంతే తప్ప మాట్లాడకపోవడాలు వద్దు.”

“నిజమేరా … నేనే ఓపెన్ గా మాట్లాడలేకపోయా …”

“నీకు దూరంగా ఒక్క క్షణం కూడా ఊహించలేను హరీ”

“నేను మాత్రం …” ఆమెను మరింత లోలోనికి లాక్కున్నాడు.

ఆ తరువాత ఏదున్నా పడకగది అవతలే కాని ఆ వాగ్వివాదాలు బెడ్ రూమ్ వరకూ రాలేదు. ఇద్దరికీ ఆ విషయమే గుర్తుకు వఛి౦ది. దానితో పాటు మరో విషయమూ గుర్తుకు వచ్చింది. అవును రెండేళ్ళ తరువాత ఫామిలీ ప్లాన్ చేసుకుందామనుకున్న విషయం. నిజమే! ఇప్పటికే ఇద్దరికీ చిన్నవయసేమీ కాదు. అందుకే ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అవును ఇహ ఇంటికి చిన్నారి అతిధులు రావలసిన సమయం. ఆ ఆలోచనే గమ్మత్తుగా వుంది.
నిజానికి ఆధునీకరణ పేరిట సున్నితమైన భావాలనూ, అనుభూతులనూ పోగొట్టుకొ౦టున్న ఈ తరుణంలో పిల్లలు అనుకోగానే ఇద్దరిలోనూ ఒక విధమైన తడబాటు. ఒక చిన్న గగుర్పాటు. ఒక నును సిగ్గు.

“చ౦దూ మనం రోజూ మన బాల్యాన్ని గుర్తు చెసుకు౦దా౦. ఆ అనుభూతులు నెమరు వేసుకుందాం. మన పిల్లలు ఊపిరి పోసుకున్న క్షణం నుండీ వారికి మనను మనం పరిచయం చేసుకుందాం” ఉద్వేగంగా అన్నాడు హరి.

ఆ ఆలోచనే ఎంతో బాగుంది ఇద్దరికీ. ఒకరినొకరు పరిచయం చేసుకోడం బిడ్డకు తమను తాము పరిచయం చేసుకోడం…
తలూపింది చందన.

* * *
పెద్దగా నవ్వాడు హరి
“అయితే నీపేరు చందన కాదన్న మాట. పండు కదూ … ఏం పండు మామిడి పండా , యాపిల్ పండా?”

“పో హరీ”

“పోను , పోను గాక పోను.”

“సరే … ఇంతవరకూ నేను చెప్పాను ఇహ నువ్వు చెప్పాలి. నువ్వూ నీ పదేళ్ళ వయసు వరకూ చెప్పాకే మిగతా ….”

“అబ్బా … ఇదో కండిషనా?”

“అవును. కండిషన్. కాని ఈ రోజుకు చాల్లే, ఇహ నిద్రవస్తో౦ది అ౦టో౦ది మన పాపాయి”

“అదేం, బాబు అప్పుడే నిద్రపోయాడా ?”

“అవును. వాడు రేపు కధ వింటాడు”

“ఇలా ఇద్దరూ ఒకేసారి , ఒక బాబు, ఒక పాప …చిత్రంగా వుంది కదూ “

“ఊ…”

“మామూలుగా ఇద్దరు అమ్మాయిలూ, ఇద్దరు అబ్బాయిలు ట్విన్స్ గా పుడతారు. ఇలా ఒక అబ్బాయి ఒక అమ్మాయి చాలా అరుదు హరీ “

“ఉహు మా రాణి గారు మళ్ళీ మళ్ళీ శ్రమ పడటం ఎందుకు అనుకున్నారులా ఉంది”

తొమ్మిది నెలలు తొమ్మిది క్షణాల్లా గడిచిపోయాయి.
డెలివరీ సమయానికి, లలితమ్మ , సీతారామయ్య తొ పాటు మురళి ప్రియ కూడా వచ్చారు.
తల్లీపిల్లలు క్షేమంగా ఇల్లు చేరాక ఇరవై ఒకటో రోజు ఉయ్యాలలో వెయ్యడం కానిచ్చి మురళి వెనక్కు వెళ్ళాడు.
మూడు నెలలపాటు పిల్లలను చూసుకున్నాక మళ్ళీ తన చదువు కొనసాగించింది చందన.

అయిదేళ్ళు!
అనుకుంటే అదేమీ పెద్ద సమయమూ కాదు అలాగని ఒక కనురేప్పపాటూ కాదు. అవును.పిల్లలిద్దరూ మానస, మానస్ పిడికిళ్ళు విప్పటం మొదలు ఉ౦గా ఉ౦గాలు, స్పర్శ గుర్తి౦పు నుండి చూపు సారించి మనుషులను గుర్తించడం, కదలాలన్న తపన ప్రతిక్షణమూ అపురూపమే. ఇద్దరూ పెరిగి పెద్దయే కొద్దీ ఎన్ని అనుభవాలో. ఎన్ని మురిపాలో! అయితే నాలుగున్నర ఏళ్ళు దాటే సమయాన హఠాత్తుగా తండ్రి మరణం, అది తట్టుకోలేక ఆర్నెల్లలో తల్లి కుంగిపోయి కృశించిపోడం అన్నా చెల్లెళ్ళ కు పెద్ద షాకే. అప్పటికే స్టెప్ అప్ పరీక్షలు విజయ వంతంగా ముగించి క్లినిక్ లొ వర్క్ చెయ్యడం మొదలు పెట్టింది చందన.

తల్లి ఉన్నంత వరకూ ఇండియాలో ఉండి ఆవిడ పోగానే అమెరికా వచ్చేశాడు మురళి.
ఒక ఏడాది పాటు అన్యమనస్కంగానే గడిపింది చందన. హరి ఆమెనూ పిల్లలనూ కంటికి రెప్పల్లా చూసుకున్నాడు.
అప్పుడప్పుడే కాస్త కుదుట పడి పెరుగుతున్న పిల్లల్లో ఆనందం వెతుక్కుంటున్న సమయం.

ఎప్పటిలా పిల్లలిద్దరినీ ప్రీ స్కూల్ లొ దింపటానికి వెళ్ళాలి చందన. కాని హాస్పిటల్ లో అర్జంట్ మీటింగ్ ఒకటి ఉండటం వల్ల కొంచం మాటర్ ప్రిపేర్ చేసుకోవలసిన అవసరం వల్ల ఆగిపోయింది. హరి వెళ్ళాడు పిల్లలను స్కూల్లో దింపే౦దుకు. లాప్ టాప్ లొ పాయింట్స్ మరోసారి చెక్ చేసుకుని, ప్రింట్ ఆర్డర్ ఇచ్చి చకచకా రెడీ అయింది చందన.
గరాజ్ నుండే ఎక్కువగా రాకపోకలు సాగిస్తారు. కార్ పార్కింగ్ మళ్ళీ అక్కడినుండే డ్రైవ్ చేసుకు వెళ్ళడం అలవాటయిపోయి౦ది.

మరి కాస్సేపటికిఇల్లు నిశ్శబ్దం అయిపోతుంది. మధ్యాన్నం వంటమనిషి వచ్చి కొంచం ఇల్లు క్లీన్ చేసి , వంట చేసి వెడుతుంది. ఆమెకు గరాజ్ కోడ్ ఇస్తారు. ఇంట్లో హిడెన్ కామేరాస్ ఉంటాయి. తీరిక దొరికినప్పుడు వాటిని ఒకసారి చెక్ చేస్తూఉంటారు. అందుకే ఇల్లు మొత్తం వదిలి వచ్చినా పెద్ద దిగులుపదవలసినదేమీ లేదు . ఇద్దరూ, పిల్లలను తీసుకుని ఇల్లు చేరేసరికి ఆరు దాటిపోతుంది ఎంత లేదన్నా.

జుట్టు మరో సారి బ్రష్ చేసుకుని కిందకు దిగి ఆఫీస్ రూమ్ లో ప్రింటెడ్ మాటర్ తీసుకుని బయటకు వచ్చింది చందన.
లంచ్ బాగ్ తన హాండ్ బాగ్ ముందు సీట్ లో ఉంచి కారు గరాజ్ నుండి నేర్పుగా డ్రైవ్ వే మీదకు బయటకు తీసి సీట్ హైట్, వీల్ అడ్జస్ట్ చేసుకుని సైడ్ మిర్రర్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని స్టార్ట్ చేసి, గరాజ్ ఆటో మాటిక్ బటన్ నొక్కి బయలు దేరింది.

సబ్ డివిజన్ లొ కొంచం అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు , కుక్కలను నడిపించే వారు , కళ్ళు చెదిరే పూల మొక్కల గొప్ప డిస్ట్రాక్షన్.ఒక సారి హైవే ఎక్కితే సాఫీగా సాగిపోతుంది ప్రయాణం.

రోడ్లమీద కార్లు తప్ప మరో వాహనమో , నడిచే జనమో కనబడరు. సిగ్నల్ లైట్ ఉంటె సరేసరి లేని చోట ఆగి అటూ ఇటూ చూసుకుని వెళ్ళాలి. గ్రీన్ లైట్ చూసే వెళ్తోంది చందన. రోడ్ మీద పెద్ద ట్రాఫిక్ కూడాలేదు. ఇంకా హైవే పైకి రాలేదు. ఆ క్రాస్ రోడ్ దగ్గర ఎప్పుడూ పెద్ద రాష్ ఉండదు. అయినా గ్రీన్ లైట్ ఉన్నాక సహజంగా మిగతా రారు.
కాని కనురెప్ప పాటులో ఏం జరిగిందో అర్ధం కాలేదు.

అవును. గ్రీన్ సిగ్నల్ ఉందనే స్పీడ్ లిమిట్ లోనే వెళ్తోంది. ఈ లోగా లెఫ్ట్ ను౦డి రైట్ కి దూసుకు వస్తున్న కారు, స్ప్లిట్ సెకండ్ లొ దాన్ని తప్పి౦చబోయే లోగానే అది డాష్ ఇవ్వడం కారు అదుపు తప్పి రోడ్ సైడ్ పిల్లర్ ను గుద్దుకోడం జరిగిపోయాయి.

ఈ లోగా కార్ యాక్సిడెంట్ చేసిన వాడు ఆగకుండా ఏమైందో అడక్కుండా వెళ్ళిపోయాడు. డ్రయివింగ్ సీట్లో చందన మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏమైందో తెలిసే లోగానే రెండు వైపులా వచ్చిన కార్లు ఆపి జనాలు సాయానికి వచ్చారు.
ఎలా బయటకు వచ్చిందో ఆమెకే తెలియదు. తరువాత చెయ్యవలసిన ఫార్మాలిటీస్ చకాచకా చెయ్యడం, అంబులెన్స్ పిలిచి చందనను ఆసుపత్రికి పంపడం, పోలీస్ కంప్లైంట్ లాటివి హరికి తెలియ చెయ్యడం అన్నీ జరుగుతున్నా చందన మెదడు మొద్దుబారిపోయింది. ఏం జరుగుతోందో తెలియలేదు. తెలిసే సరికి హాస్పిటల్ బెడ్ మీద ఉంది.

కాలికి ప్రాక్చార్, ఎడమ చెయ్యి ముంజేతి వద్ద క్రాక్…. అన్నింటికీ మించి షాక్.

(మిగితా వచ్చేవారం…)

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!