Wednesday, January 26, 2022
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం (సీరియల్ నవల) 4వ భాగం – శ్రీ విజేత

అతని ప్రేమ కోసం (సీరియల్ నవల) 4వ భాగం – శ్రీ విజేత

ఆడపిల్ల జీవితాన్ని వాన చినుకుతో పోల్చి చెప్పింది ఒక మహా రచయిత్రి. వానచినుకు ఒక పుష్పదళం పై పడితే మౌక్తిక బ్రాంతిని కలిగిస్తుందట, ముత్యపు చిప్పలో పడితే రత్నమౌతుందట, బురదలో పడితే వ్యర్ధమవుతుందట.

ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. పెళ్లి గురించి నేనేమి బంగారు కలలు కనలేదు, నా వయసు అప్పటికి పదహారు పదిహేడేళ్ళే. ఆడపిల్లకు పెళ్లి చెయ్యాల్నంటే ఇది కట్న కానుకల దేశం కదా! కాలం రోజు రోజుకూ మారుతూ పోయినట్టుంది.

అక్కయ్యల పెళ్లి చేసినప్పుడు నాన్న పెద్దగా ఇబ్బంది పడలేనట్టున్నాడు. నా వరకు వచ్చే వరకు నాన్నకు ఇబ్బందే అయ్యింది. ధరలు పెరిగినట్టు కట్న కానుకల రేట్లు కూడా పెరిగి పోయినాయి. నా కోసం ఒకటి రెండు సంబంధాలు చూసినారు అమ్మానాన్నలు అప్పటికే.

ఎంత చూసినా డబ్బులతో పని! అందదగత్తె అయితేమీ, తెలివి తేటలు ఉంటె ఏమి ఆడపిల్ల అంటేనే కట్నాలు ఇచ్చుకొని పెళ్ళిళ్ళు చేసే దేశం కదా! ఆ కాలములో ఎంత లేదన్నా లక్ష రూపాయల కట్నం ఇవ్వచ్చు మంచి సంబంధం దొరుకాల్నంటే, యాబయి వేలైయినా ఇస్తే ఓ మోస్తారు చూసుకోవచ్చు ఆర్థిక విషయాల్లో. ఉద్యోగం చేసే సంబంధాలు కావాల్నంటే ఇంకా డిమాండ్. ఆడుతూ పాడుతూ గడుపుతున్న నాకు ఇవన్ని ఏమి తెలుస్తాయి?

అన్నయ్యలను, వదినలను పిలిచి అడిగాడు నాన్న నా పెళ్లి గురించి డబ్బులు సర్దుబాటు చెయ్యాలె అని.
వాళ్ళు చేతులు ఎత్తేసారూ, “మాకు ఆడపిల్లలు ఉన్నారు, మా పిల్లల పెళ్ళిళ్ళ కోసం కూడా మేము జమచేసుకోవాలె, మాకెవరిస్తారు? మేమూ ఇండ్లు కట్టుకున్నాము, మాకు అప్పులైనాయి, మా దగ్గర డబ్బులు లెవ్వు.” అని.

వాళ్ళకు పిల్లలు ఉన్న మాట నిజమే, కాని సాటి ఆడబిడ్డను కూడా పట్టించోకోవలసిన అవసరం లేదా అనిపించింది. అన్నయ్యలు అలా అనకూడదు, వదినలైనా సర్ది చెప్పాలి కదా తోటి ఆడ పడుచు గురించి అయినా, కాని వాళ్ళ మాటలు వింటే కూడా బాధ కలిగింది.

“మా కోసమే కన్నారా, మా దగ్గర ఏమి లెవ్వు ఏమన్నా ఉంటే అమ్ముకొని చేసుకొండ్రి” అని.

డబ్బులను ప్రేమించే ప్రపంచం ఏమో ఇది ! మనుష్యులను ప్రేమించే వాళ్ళు బహుశా ఇలా మాట్లడరేమో! నాకే మనస్సు చివుక్కు మంది, అమ్మానాన్నలు ఎంత బాధపడిపోయి ఉంటారో అప్పుడు. ఆ ఇంట్లో నేను చిన్న అమ్మాయిని, అదే నాకు శాపం అయ్యిందేమో! నా గురించి ఆలోచించమంటే వాళ్లకు వాళ్ళ పిల్లలు కనిపిస్తున్నారు, వాళ్ళ భవిష్యత్ కనిపిస్తుంది.

అవునూ ఎవరి పిల్లలను వారు ప్రేమించు కుంటారేమో, ఇష్టపడుతారేమో, అంతకు మించి ఏముందీ ప్రపంచములో అనిపించింది. బాధ్యత తీసుకుంటే బరువులు మీద పడుతాయని అనుకుంటారేమో కొందరు. భరించుకునే శక్తి ఉండి కూడా తప్పించుకుంటారేమో కొందరు. నిజంగా ప్రేమలు, అభిమానాలు, ఇష్టాలు లేని వారి నుండి ఏదయినా ఆశించడం దండుగ అనిపించింది!

ఆ కోడళ్ళ మాటలు విని విస్తుపోవడం వంతయ్యింది నాన్నకు. ఆ మాటలు విని అమ్మ కూడా బాధ పడింది. వాళ్ళ మాటలకూ మనసు నా నొచ్చుకొంది. వీళ్ళేనా నా అన్నదమ్ములు అనిపించింది. ఇంత స్వార్ధపరులా అనిపించింది. పిల్లలని కని, పెంచి, పెద్దవాళ్ళను చేసి ప్రయోజకులను చేస్తే తలిదండ్రులకు ఇచ్చే జవాబు ఇదేనా అనిపించింది. నన్ను కన్నందుకు ఆ బాధ్యత నాన్నదే అని గుర్తుకు చేసారేమో అనిపించింది.

పాపం వయసు పండిన నాన్న ఏమి చేస్తాడు, తనకు ఉన్నంతలో తను బతికి ఉన్నపుడు ఓ సంభందం చూసి నా పెళ్లి చెయ్యాలి అని అతని తపన, ఇక ఇంట్లో ఉండి పనులు చూసుకొనే అమ్మ ఏమి చేస్తుంది, ఎవరిని అంటుంది? నా అన్న వాళ్ళే కాదన్నపుడు ఇక తన మార్గం తనే చూసుకోవాలేమో నాన్న! నాన్నపెద్దగా ఏమి చేస్తాడు, పెద్ద కట్నాలు ఇచ్చి ఉద్యోగస్తులను చూసే శక్తి అతనికి లేదు, మా బోటి వ్యవసాయ దారుల కుటుంబానికి ఇచ్చి నా పెళ్లి జరిపించే స్తోమత మాత్రం ఉంది.

నాకు అర్థమయ్యింది ఒక్కటే నా గురించి ఆలోచించే వారు అమ్మ నాన్న తప్ప ఎవరు లేరు అని. నా పెళ్లి అనేది జరుగడమే ముఖ్యం. నాన్నకు బాధ్యత తీరుతుంది, అమ్మ తృప్తి పడుతుంది కూడా అనిపించింది నాకు.

కాలం ఎవరి చేతిలో ఉంటుంది? ఎప్పిడేమిమి జరుగునో ఎవరికి తెలుసు? నా జీవితం నా చేతిలో ఉంటుందా? నేనేమైనా పెద్దగా చదువులు చదువుకున్నానా , ఉద్యోగం చేస్తున్నానా? పెద్ద సంపన్నుల కుటుంభంలో పుట్టినానా? మధ్య తరగతి అమ్మ నాన్నల చేతుల్లోని ఆడపిల్లను, బతుకంటే ఒక వెసలుబాటు, అర్థం చేసుకొని గడుపడం, బతుకడం కావచ్చు నా లాంటివారికి.

జాతకాలు, కులాలు, మతాలు, కట్నాలు, కానుకలు, సంప్రదాయాల నిలయమైన సంఘంలో ఆడపిల్ల జీవితం ఏ దరికి కొట్టుక పోతుందో ఎవరికి తెలుసు?

నాకు ఒక పెళ్లి సంభందం చూశారు మా వాళ్ళు దూరపు బంధువుల ఊరి నుంచి. ఆస్తి పాస్తులుంటే చాలు అని, అబ్బాయి వాళ్లకు అమ్మాయిని ఇస్తారు కదా మన వాళ్ళు. మా వాళ్ళు అదే పని చేశారు. పిల్లవాని వాళ్లకు పాతిక ఎకరాల భూమి ఉందట. దొడ్డి నిండా పశువులు, ఇంటి నిండా పాలేర్లు. లంకంత ఇల్లు. ఇద్దరే కొడుకులు, ఇంటికి పెద్ద కొడుకు, పదవ తరగతి వరకు చదువు కున్నాడు, కట్నమా, పరువా లేదు ఎంత ఇచ్చినా సరిపోతుందట ఉన్నంతలో.

ఇది సరిపోయింది అమ్మ నాన్నలకు. పిల్లవాడి వయసు పది పన్నెండేళ్లు ఎక్కువ ఉంటుందట నా కంటే. దానికి కూడా సరేననుకున్నారు మా వాళ్ళు. పిల్లవాడి రూప విశేషాల గురించి నాకేమి చెప్పలేదు ఎవరు. మగవాడి కేమిలే అందమెందుకు అన్నారు.

ఆడ పిల్లకు అందం ఎందుకో తెలియదు పాపం! నాకూ ఒక మనసు ఉంటుందని, నాకు ఒక ఆలోచన ఉంటుందని తెలియదేమో పాపం మా అమ్మానాన్నలకు. ఏ అమ్మాయి కోరుకోదు అందమైన రాకుమారున్ని! బహుశా నేనేమి కోరుకోలేదు, ఆలోచించలేదు కూడా. నా తలిదండ్రులు నా మంచి కోరుతారు, ఆలోచిస్తారు అని నేను నమ్మినాను. వాళ్ళను కాదనే పరిస్థితులు కూడా నాకు లేవు. వాళ్లకు వివరించి చెప్పే శక్తి, కూడా నాకు లేకుండా పోయింది. మౌనంగానే అన్నీ గమనిస్తూపోయాను. నేనుట్టి ప్రేక్షకురాలిని అయినాను నా బతుకు యెడల కూడా. ఆడపిల్లగా ఉండి, గుండెలపై బరువు దిగితే చాలు అనుకొనే అభాగ్యపు తలిదండ్రులకు, బాధ్యతలు మరచిపోయిన అన్నదమ్ములకు నేనేమి చెప్పదలచుకోలేదు. ఎలా ఉంటె అలా అవుతుందిలే అనుకున్నాను.

జీవితములో పెళ్లి ఒక లాటరీ లాంటిదేమో, గిర్రున తిప్పే చక్రం ఆట లాంటిదేమో, చక్రం ఏ లంకె దగ్గర ఆగిపోతుందో అక్కడే ముడిపడిపోతుందేమో బతుకు. పెళ్ళిళ్ళు స్వర్గములో నిర్ణయించబడుతాయట, ఇంకా తిరుగెక్కడిది ఈ మాటకు! అంతా అదృష్తం, రాత అంటారు. అంతా నా రాతనేమో, నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోయినాయి.

ఒకనాడు నన్ను చూడడానికి ఆ ఊరి నుండి మా యింటికి ఇద్దరు పెద్ద మనుషులు వచ్చినారు నాకు కాబోయే అత్తమామలు అనే వారు. నా అందచందాలను చూసుకున్నారు. తిరుగేమిటిలే నాకు, నా అందచందాలకు! నన్నెవరు కాదంటారని. నా మాటల్లో మరకతములు పండుతాయని, మల్లెలు విరబూస్తాయని అంటారేమో అందరు! నవ్వుతే నవ రత్నాలు రాలుతాయంటారేమో నా యెడల, నడుస్తే నెమలి నడకలంటారేమో, పరుగు లిడితే లేడిపిల్ల పరుగులంటారేమో! నా కన్నుల్లో కలువలు పూస్తాయంటారేమో ! పుత్తడి బొమ్మకు మెరుగులెందుకు? నిజంగా నాకు వంకేమిటీ ! బంగారు మేని ఛాయలో తలతలా మెరిసిపోతుంటే నన్నెవరు కాదంటారు. నిజంగా నేనుట్టి బొమ్మనా ! నా చేతి వ్రేళ్ళని చూసుకున్నా, కాలినడకను చూసుకున్నా, కట్టుబొట్టును చూసుకున్నా నాకు తిరుగేమి ఉంటుంది. నేను వాళ్లకు నచ్చినాను. అమ్మనాన్నలు ఇచ్చే అంతో ఇంతో కట్నకానుకలు కూడా నచ్చి ఉంటాయి. అబ్బాయి మాత్రం నన్ను చూడడానికి రాలేదు. వీళ్ళకు నచ్చితే ఆయనకు నచ్చినట్లేనట ! ఎంత విచిత్రం జీవితం ! మనసెందుకో బాధపడిపోయింది.

పిల్లవాడిని చూడంది నేను చేసుకోను పెళ్లి అనే శక్తి కూడా కరువైపోయింది నాలో. నేనుట్టి అమాయకురాలిని, భయస్తురాలినేమో, ఏమి చేయలేకపోయినాను, ఈ సంబంధం వద్దనలేకపోయినాను. అయినా ఆడపిల్ల మాటను ఎవరు ఖాతరు చేస్తారని. నా వయసు, శక్తి, అనుభవం నాకు సరిపోలేదు. నాకు ఇలా అని, నా క్షేమం కోరి చెప్పేవారు కూడా దగ్గరగా ఎవరు లేకుండా పోయినారు నా తోటివారు కాని, నా కన్న పెద్దవారు కాని. అది నా దురదృష్టం. పిరికివావాళ్ళకు జీవితం వాళ్ళ చేతిలో ఉండదేమో , కాలం ఎలా ఎగరేసుకపోతే వాళ్ళు అలా కొట్టుక పోతారేమో కాల గమనంలో, నా బతుకు అంతేనెమో అనిపించింది.

ఒకనాడు మా తరపున అమ్మానాన్న, అన్నయ్యలు, దగ్గరి బంధువులు ఒకరిద్దరు వాళ్ళ ఊరికి వెళ్లి వచ్చినారు. వాళ్ళు మాకు మునుపటి నుండి తెలిసిన దూరపు బంధువులే. అది ఒక అవకాశం వాళ్ళు మంచివాళ్ళు అని తెలుసుకోవడానికి మా వాళ్లకు. వాళ్ళకు నచ్చింది ఆస్తిపాస్తులు కావచ్చు. ఇల్లు , పాడి పంట , వ్యవసాయం అయితే ఉంది. మంచి పేరు ఉన్నకుటుంభం. బాదరబంది లేదు, ఆడబిడ్డలు లేరు, ఇక అమ్మాయికి ఏమి పరువాలేదులే అనుకున్నారేమో మా వాళ్ళు నా గురించి. ఇక నా పెళ్ళికి సరేనన్నారు నా ఇస్టాయిస్టాలతో పనిలేకుండానే. నా పెళ్లి నిర్ణయం జరిగిపోయింది. కొత్త సంవత్సరం దాటిపోయి, సంక్రాంతి ముగ్గుల గంగిరెద్దుల పండుగ దాటిపోయి, కువకువల నవ వసంత కోకిలమ్మల ప్రకృతి సోయగాల తెలుగు వారి ఉగాది పండుగ గడచి పోయి నడి వేసవి మే మాసం రానే వచ్చింది. నా పెళ్లి మే మాసం నడి ఎండ కాలములో నిర్ణయించబడింది. నా పెళ్లి కోసం డబ్బులు కావాలి కాబట్టి మా కున్న పొలం లోంచి ఓ రెండెకరాలు అమ్మి డబ్బులను సమకూర్చినాడు కట్న కానుకల కోసం నాన్న . ఆడ పిల్ల పెళ్లి చెయ్యల్నంటే ఈ దేశములో ఆస్తులను కూడా అమ్ముకోవాలి. ఎందుకీ ఆచారం, ఎన్నాళ్ళీ ఆచారం అనిపించింది బాధగా.

నా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి, నా కోసం బంగారు నగలు వాళ్ళ తరపున కొనడానికి కంసాలిని పిలిచి నగలు చేయించడానికి డబ్బులు ఇచ్చాడు నాన్న. నెక్లెస్, వంక ఉంగరం, పుస్తెల తాడు, నల్ల పూసల గొలుసు, చంద్రహారంలు చేయించారు. బంగారం అంటే ప్రీతీ కదా ఈ మనుషులకు, కాని బంగారం లాంటి మనుషులు దొరుకడం ఎంత అదృష్తం! నా కోసం పట్టు చీరలు కొన్నారు మూడు, పెళ్లి బట్టలు కొన్నారు. పెళ్లి కొడుకుకు, పెళ్ళికొడుకు తల్లిదండులకు. బందువులకు కూడా బట్టలు కొన్నారు. నా పెళ్లి పత్రికలు కూడా అచ్చు వేయించారు. అందరికి పంచినారు కూడా. మా దగ్గరి బంధువులు, అక్కలు, బావలు, వాళ్ళ పిల్లలు, అన్నయ్యలు, వదినలు, వాళ్ళ పిల్లలు అందరు వచ్చినారు పెళ్ళికి నాలుగైదు రోజుల ముందే. నాన్న తరపు చుట్టాలు, అమ్మ తరపు చుట్టాలు కూడా వచ్చినారు. ఇంటి చుట్టు ఉన్న తెలిసిన కుటుంభ స్త్రీలు, పిల్లలు కూడా వచ్చినారు,నన్ను పెండ్లి కూతురును చేసినారు. పసుపు కుంకుమలతో పుత్తడి బొమ్మలా మెరిసిపోయే నన్ను చూసి ముచ్చట పడ్డవారే, అయ్యో అమ్మాయి ! అని అన్నవాళ్లు కూడా ఉన్నారని తెలిసింది. ఎవరి నోట మాట ఆగుతుంది! చక్కని చుక్కనైన నాకు ఈడు జోడు లేని పెండ్లి చేస్తున్నారు అని వచ్చిన వాళ్ళలో కొందరు అనగా విన్నాను. పిల్లకు, పిలగానికి వయసు తేడా బాగా ఉంటుందట అని విన్నాను. పిల్ల అందంగా ఉంటే, పిలగాడు అందంగా ఉండడు, అనాకారి కొంత అని విన్నాను. ఆస్తికి ఆశపడి పెళ్లి చేస్తున్నారు, పిల్ల గొంతు కోస్తున్నారని విన్నాను. పిల్లవాడు పెద్దగా తెలివైన వాడు కూడా కాదట అని విన్నాను. పిల్లగాని తల్లి చాలా తెలివైనదట, ఆమెదే మాట నడుస్తుందట ఇంట్లో, ఈ అమ్మాయి అక్కడ నెగ్గుతుందా అని అనగా విన్నాను. విని నాలో నేనే నిట్టూర్చాను. నాపై నాకే జాలి వేసింది. నిస్సాహురాలిని నేనేమి చేయగలను. ఇన్ని విని ఏమి చేయగలను. పెళ్లి వద్దనుకోలేను! నా పెళ్లి యెడల నా నచ్చడం ఎవరికి కావాలి. నాకు పెళ్లి చేయ్యాలనుకున్నపుడు ఒక సంబంధం వచ్చింది నా తల్లిదండ్రుల ముందుకు, వాళ్లకు నచ్చింది ఈ సంబంధం, నేను వాళ్ళ కన్న బిడ్డను. వాళ్ళు తృప్తి పడే ఈ సంబంధం చేస్తున్నారని అనుకున్నాను. నా రక్త సంబంధీకులు అయిన ఏ ఒక్కరు కూడా ఈ సంబంధం వద్దు అని చెప్పలేక పోయినపుడు, మౌనంగా చూస్తూ ఉండి పోయినపుడు, వాళ్ళ అందరి అంగీకారమే ఈ పెళ్ళికి ఉన్నపుడు ఇక నేను ఎదురు చెప్పి ఏమి చేస్తాను. ఎలా అయ్యేదుంటే అలా అవుతుందిలే, కానియి అనుకున్నాను. విధి చేతిలో మనిషి కీలు బొమ్మ అంటారు, జరుగబోయే దానిని ఎవరు ఆపుతారులే అంటారు. నేనుట్టి ప్రేక్షకురలిలానే ఈ జీవితాన్ని గమనిస్తూ కాలానికి తల వంచుతూ పోయినాను. యాబయి అరువై ఏండ్ల కిందటి అమ్మానాన్నల ఆలోచనలకు , ఈ తరం నా బోటి వాళ్ళ ఆలోచనలకు తేడా ఉంటుందేమో. అయినా నేను అమ్మానాన్నల మాటకే, గౌరవానికే విలువ ఇచ్చాను, మౌనగా ఉండిపోయాను అన్నీ చూస్తూ, జీవితములో వచ్చింది స్వీకరిస్తూ.

(సశేషం … )

– శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!