Wednesday, January 26, 2022
Home > కథలు > వర్ష ధార ! -అక్షర్ సాహి

వర్ష ధార ! -అక్షర్ సాహి

ఫీస్ లో అంతా సందడి గా ఉంది. పండగ రోజు సెలబ్రేషన్ ల ఎంజాయ్ చేస్తున్నారు. సుదీర్గంగా సాగిన ప్రాజెక్ట్ కంప్లీట్ అవడం ఒకటైతే.. ఎండాకాలానికి సెలవిచ్చిన ‘సన్ అంకుల్’ కి సంబరంతో సలాం కొట్టిన వరణుడు తొలకరి జల్లు కురిపించడం రెండోవది. అటు వర్షం పడుతుంటే ఇటు కాంటీన్ నుంచి వచ్చిన వేడి వేడి సమోసాలు, మిర్చి లు షేర్ చేసుకుంటున్నారు.

మేనేజింగ్ డైరెక్టర్ ‘విశ్వం’ తన క్యాబిన్ నుండి బయటికి వచ్చి “హాయ్ గైస్ లెట్ మీ షేర్ యు సంథింగ్.. కంపెనీ పెట్టి 4సం. అయ్యింది. చాలా ప్రాజెక్ట్స్ చేశాము. అయితే ఇప్పుడు మనం కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ కి క్లయింట్ సైడ్ నుండి 200% రెస్పాన్స్ వచ్చింది. ఇన్ ఫాక్ట్ మన క్లయింట్ ఇంకో రెండు సంవత్సరాల బిగ్ ప్రాజెక్ట్ ఇప్పుడే కంఫర్మ్ చేసాడు. టార్గెట్ టైం కంటే వన్ వీక్ ముందుగానే కంప్లీట్ చేసినందుకు ముందుగా మీ అందరికి కంగ్రాట్యులేషన్స్. అండ్ ది క్రెడిట్ మస్ట్ బి గివెన్ టు ‘వర్ష’. వర్షిణి లేకుంటే ఈ ప్రాజెక్ట్ ఇంత తొందరగా కంప్లీట్ అయ్యేది కాదేమో! థాంక్యూ వర్ష అండ్ కీపిట్ అప్”. అందరు చప్పట్లు కొట్టారు.

బాస్ వెళ్ళిపోగానే అందరు వర్షిణి ని ప్రశంశల వర్షం తో ముంచెత్తారు.

వర్షిణి కి ఆఫీస్ లో ఒక సంవత్సరం నుండి ఇలాంటివి చాల కామన్. పొగడ్తలకు పొంగిపోదు, బాధలకు కృంగి పోదు. ఎప్పడు గల గల మాట్లాడుతూ, నవ్వు తూ నవ్విస్తూ ఉంటుంది. అందానికి సరిపడా ‘సమయస్ఫూర్తి’, వయసుకు మించిన ‘తెలివితేటలు’ ఆమె ఆభరణాలు. ఎలాంటి వారైనా ఇట్టే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎవ్వరు మిస్ బిహేవ్ చేసిన సందర్భాలు లేవు. ప్రేమ కోసం అయన వాళ్ళందరిని, ఆస్తిపాస్తులను కాదనుకొని పెళ్లి చేసుకుంది. బాగుందని ఎవరైనా అట్ట్రాక్ట్ అయినా ఆమె మాటతీరు చూసి మనసు మార్చుకొని గౌరవాన్ని పెంచుకుంటారు. తన ప్రపంచం అంతా తన భర్త ‘అవినాష్’.. ఎంబిఏ చదివినా.. ప్రస్తుత తమ ఆర్థిక పరిస్థితి బాగోలేక జాబ్ చేస్తుందే తప్ప… జాబ్ చెయ్యాలని ఇంట్రెస్ట్ లేదు. అయితే అది ఆఫీస్ లో ఎవరికీ కనిపించదు. చేస్తున్న ఏ పనికైనా వంద శాతం న్యాయం చెయ్యడమే తనకు తెలుసు.

వర్ష, అనూష ఇద్దరు కెఫెటేరియా లో కాఫీ తాగుతూ ఉన్నారు. “జాబ్ మానేస్తున్నావట? ఏంటి స్పెషల్? ఈరోజు టాక్ అఫ్ ది ఆఫీస్ నీగురించే ” అడిగింది అనూష.

“ఏం లేదు.. ఊరికే!” కాఫీ సిప్ చేస్తూ చెప్పింది వర్ష.

“ఓహో బేబీ ప్లానింగా!” కన్నుకొట్టింది అనుష. “నో అదేం లేదు” సిగ్గుపడుతూ చెప్పింది. “మ్యారేజ్ అయి వన్ ఇయర్ అయ్యింది ఇంకో సంవత్సరంలో సెటిల్ అయ్యి.. ఆతర్వాతే పిల్లలు!”.

“మరి ఇద్దరు జాబ్ చేస్తేనే కదా తొందరగా సెటిల్ అయ్యేది… చెప్పకుండా ఇంకో పెద్ద జాబ్ ఏదైనా వెతుక్కున్నావా ఏంటి? ఎదో సీక్రెట్ కనిపెట్టినట్టు స్టయిల్ గా అడిగింది.

ఇంతలో వాట్సాప్ లో మెసేజ్.. “కం ఇన్ టు మై కేబిన్”… “బాస్ రమ్మంటున్నాడే మళ్ళి మాట్లాడుదాం” అంటూ ఫోన్ లో “జస్ట్ టూ మినిట్స్ సర్!” రిప్లై చేసింది.

“సరే.. ఇంటికెళ్తూ మాట్లాడుకుందాం” అని చెప్పి తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది అనూష.

విశ్వం ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ గుమ్మం దగ్గర వస్తూ ఆగబోయిన వర్ష ని లోనికి రమ్మని సైగ చేశాడు.

“సరే మిగితా విషయాలు నేను డైరెక్ట్ గా కలిసినప్పుడు డిస్కస్ చేద్దాం… బై అంటూ ఫోన్ కట్ చేశాడు.

“వెల్ వర్ష.. పొద్దున్నే నీ రిజైన్ లెటర్ చూసాను. మళ్ళి ఒకసారి ఆలోచించరాదూ!”

“లేదు సర్” ప్రాజెక్ట్ అయిపోయింది! మల్లి ఇంకొకటి స్టార్ట్ చేస్తే మధ్యలో విడిచిపెట్టలేను”.

“ఓహ్ అగైన్.. కాల్ మీ విసు.. పెళ్ళికి ముందు అలాగే పిలిచేదానివి కదా!” నవ్వి ఊరుకుంది.

“వాడు.. అవినాష్ ఏమైనా వద్దన్నాడా? మొన్న కలిసినప్పుడు ‘నాకేం అభ్యంతరం’ లేదన్నాడే!”

“తన ఫోర్స్ ఏమి లేదు నాకే… ‘’

“ఐ నో ఐ నో… నాకు అన్నీ తెలుసు పెళ్ళికి ముందూ తర్వాత ఇద్దరిలో ఎలాంటి మార్పు లేదు. ఛాయస్ ఈజ్ యువర్స్” నెలాఖరు కాబట్టి ఇంకో త్రీ డేస్ వరకు ఎలాగూ వస్తావు.. తర్వాత కూడా నీకు ఎప్పుడు కావాలన్నా జాయిన్ అవ్వొచ్చు.

“విసూ వన్ రిక్వెస్ట్.. రేపటినుంచే రావద్దనుకుంటున్న.. మా ఆయన ఫస్ట్ డే ఇన్ న్యూ ఆఫీస్ కదా!”

“అబ్బో పెద్ద ఫస్ట్ డే!” వన్ ఇయర్ నుంచి చాలీ చాలని జీతానికి పని చేశాడు… చిన్న కంపెనీ కి.. మారడు, నా కంపెనీ లో ఇస్తా అంటే వద్దంటాడు. అటు వాడు అంతే ఇటు నువ్వు అంతే!

“విసూ..”

“సరే సరే” ఆపేస్తాను! నవ్వాడు. షేక్ హ్యాండ్ ఇస్తూ.. “అల్ డి బెస్ట్! మీ ఇద్దరికీ ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా నేనున్నాని మర్చిపోవద్దు”.

“తప్పకుండా విసు.. మాకు పెద్ద దిక్కు మీరే కదా.. ఇద్దరు నవ్వుకున్నారు.

వర్ష, అనూష ఆఫీస్ లో అందరికి గుడ్ బై చెప్పి హ్యాండ్ బాగ్స్ తీస్కుని బయటికి వచ్చేశారు. లైట్ గా వర్షం పడుతూనే ఉంది. పార్కింగ్ ప్లేస్ కి వెళ్లి ఇద్దరు అనూష కారు లో బయలుదేరారు. రోజూ దారిలో వర్ష ని పిక్ చేస్కోవడం, రిటర్న్ లో డ్రాప్ చెయ్యడం ఆఫీస్ లో అందరికన్నా ఎక్కువ చనువు, స్నేహం ఏర్పడింది అనూష కి. చల్లని సాయంత్రం పైగా వర్షం… “ఈ వర్షం సాక్షిగా” అంటూ ఎఫెమ్ రేడియో లో పాటలు ప్లే అవుతూ ఉంది.

వర్ష పాట హమ్ చేస్తుంటే అడిగింది అనూష వర్ష కపుల్ కి బాస్ ఎట్లా పరిచయం అని.

“విసు, అవినాష్ ఇద్దరు కాలేజీ నుంచీ ప్రాణ స్నేహితులయ్యారు. అప్పట్లో ఇద్దరూ ఒకే దగ్గర ఉండేవారు. విసు సిటీ లోనే అమ్మా-నాన్న లతో నే ఉంటున్నా ఎక్కువగా అవినాష్ దగ్గరే ఉండేవాడు. ఇద్దరికీ డబ్బులకు కొదువ లేదు. విసు వాళ్ళ నాన్న ది బిజినెస్ అయితే అవినాష్ వాళ్ళ ది వరంగల్ లో వ్యవసాయ కుటుంబం. విసు ఎలాగూ బిజినెస్ లోనే సెటిల్ అవుతా అని డిసైడ్ చేస్తే అవినాష్ కొంతకాలం జాబ్ చేసి తర్వాత బిజినెస్ పెట్టాలనే ఆలోచనలో ఉండే వాడు.
అవినాష్ కి నాకు పరిచయం అయ్యేముందు నుంచే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. మా పెళ్లి అయింతర్వాత కూడా అందరం చాలా క్లోజ్ గా ఒకటే ఫామిలీ అన్నట్టుంటాము”. చెప్పింది వర్ష.

“ఇప్పుడు చెప్పు అసలు విషయం ఏంటి..ఎంబీఏ చదివిన నీవు కాళీ గా ఉంటావా ? నేను నమ్మను. ఎదో ఉంది.” అడిగింది అనూష.

“ఏంలేదు అను జస్ట్ ఊరికే.. నాకు హౌస్ వైఫ్ లాగా ఉండటం అంటే ఇష్టం… మా వారికి వేరే కంపెనీ లో పెద్ద జాబ్ వచ్చింది.. ఇంక బేబీ ప్లాన్ చేద్దామనుకుటున్నాం.. ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీ మైండ్ తో ఉందాం అనుకుంటున్నా” సిగ్గు పడుతూ చెప్పింది.

“ఓకే మై డియర్ అల్ ది బెస్ట్. కానీ రేపటినుండి ఆఫీస్ బోసి పోతుందేమో! ముఖ్యంగా నేను నిన్ను మిస్ అవుతానేమో! ఏదైనా అద్భుతం జరిగి నీ మనసు మారి నువ్వు ఆఫీస్ కి వస్తే బాగుంటుంది. అవసరం అయితే డెలివరీ టైం లో లీవ్ పెట్టొచ్చు”.

“ఇంకా మొదలే లేదు నువ్వు డెలివరీ దాకా వెళ్ళావా.. చూద్దాం లే.. ! ముందు త్వరగా పోనివ్వూ వర్షం ఎక్కువతుంది”.

ఇంటికి వేళ్లెసరి ఇంకా అవినాష్ రాలేదు. ఇల్లంతా సద్ది, స్నానం చేసి వంట చేసి టీవీలో “నిన్నే పెళ్లాడుతా” మూవీ చూస్తూ ఎదురు చేస్తుంది వర్ష. రాత్రి అవుతోంది. అవినాష్ ఇంకా రాలేదు. బహుశా వర్షం అని ఎక్కడో ఆగివుంటాడు. రెండు గంటలనుండి వెయిట్ చేస్తూ ఉంది. కొత్త ఉద్యోగం కన్ ఫర్మ్ చేసుకొని వారం కిందటే పాత ఆఫీస్ మానేశాడు. ఈరోజే ఫ్రెండ్ ని కలిసొస్తా అని వెళ్ళాడు.

“త్వరగా రా బాబూ.. ఆకలేస్తోంది.. ఎంత సేపయ్యా మొగుడా!” టీవీ లో టాబూ మాటలు విని గట్టిగా తనూ అంది. ఒక్కసారి చుట్టూ చూసి సిగ్గు పడి నవ్వుకుంది.

సినిమా చూస్తూ వాళ్ళ లవ్ స్టోరీ గుర్తు చేసుకుంటూ ఉంటే అవినాష్ ఇంకా తొందరగా వస్తే బాగుండు అనుకుంది. పెళ్ళైన దగ్గరినుంచి ఆఫీస్ లో తప్పించి ఎక్కువ సమయం ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఫోన్ చేసినా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయకపోవడంతో ఎటూ తోచని స్థితిలో ఉంది. నిజానికి ఇద్దరికీ వర్షం అంటే చాలా ఇష్టం. వర్షం పడిందంటే ఇద్దరు తడవాల్సిందే.. ఆడుతారు .. పాడుతారు .. చిన్న పిల్లలైపోతారు..పక్కన పిడుగు పడ్డా తెలియనంత మైమర్చిపోతారు. అలాంటిది తొలిసారి వర్షం మీద కోపం వస్తుంది.

“ఓ వాన దేవా! కొంత రెస్ట్ తీస్కో తండ్రి” అనుకుంటూ ఆకాశంలో కి చూస్తూ ఉంది. కానీ వరణుడు విలయతాండవం చేస్తున్నాడు. రద్దీ రహదారులన్నీ రాజీ పడి దాసోహం అన్నాయి.

ఈ సమయంలో ప్రకృతి ఎందుకో కన్నెర్ర చేస్తోంది! ఎవరికీ ఎం అపాయం పన్నిందో .. ! వాన దేవుడు ఈసారి ఉగ్రరూపమే దాల్చాడు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎదురు నిలవలేక చెట్లూ ఒరుగుతున్నాయి. టీవీ లో అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతున్నట్టు చూపిస్తున్నారు. జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. దాదాపు ట్రాఫిక్ అంతా ఆగినట్టుంది. రోడ్లన్నీ సెలయేళ్ళను తలపిస్తున్నాయి. మాన్ హోల్స్ దాగుడు మూతలు ఆడుతున్నాయి.
హైదరాబాద్ లో చిన్న పాటి వర్షానికే కరెంట్ కష్టాలు మొదలవుతాయి… ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరికీ అంతుచిక్కదు. ఎందుకైనా మంచిదని తన ఫోన్ ఫుల్ ఛార్జింగ్ చేస్తూ ఉంది వర్ష. ఎప్పటికప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని అరా తీస్తూ ఉంది ఏమైనా తెలిసిందా ఎక్కడ ఆగాడో అని. అందరూ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు అని చెప్తున్నారు.

ఎక్కడో పిడుగు పడిన శబ్దం విని ఉలిక్కి పడింది. ఇంతలో కరెంట్ కూడా పోయింది. తెలీని భయం ఆవహిస్తుంది. ఫోన్ రింగ్ అయ్యేసరికి హమ్మయ్య అనుకుని ఫోన్ తీసుకుంది కానీ అది విసు ఫోన్ నెంబర్.
“హలో”
“వర్ష ఏమైనా తెలిసిందా? వచ్చాడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది” విసు అడిగేసరికి ఈసారి గుండెల్లో బాంబు పేలినట్టైయింది.

“లేదు.. ఈ ఏరియాలో పవర్ కూడా లేదు ఎక్కడున్నారో! ఎలా ఉన్నారో! టెన్షన్ గా ఉంది విసు” గబా గబా చెప్పింది.

“సరే భయపడొద్దు.. ఎక్కడో ఆగి ఉంటాడు లే ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది ఫోన్. ఇంటికి రాగానే నాకు ఫోన్ చెయ్యి. లేదంటే రమ్మంటావా నన్ను శాలిని అక్కడికి ఇప్పుడే వస్తాం!” ధైర్యం చెప్పాడు విసు.

“లేదు లే ఐ యామ్ ఆల్రైట్. రాగానే మెసేజ్ చేస్తాను” అంటూ ఫోన్ లో ధైర్యం గానే చెప్పింది కానీ మనసులో “దేవుడా నా అవినాష్ ని సురక్షితంగా ఇంటికి చేర్చు తండ్రి” అని వేడుకుంటూనే ఉంది.

మూడుగంటలు ఏకధాటిగా పడిన వర్షం మెల్లగా తగ్గుముఖం పట్టింది. కరెంట్ కూడా వచ్చింది.. ‘హమ్మయ్య’ ఇహ వస్తాడనుకొని వెయిట్ చేస్తూ మరో రెండు గంటలు పాటలు వింటూ గడిపింది. వర్షం పూర్తిగా తగ్గినా ఇంకా రాక పోయే సరికి ధైర్యం కాస్తా దిగులుగా మారింది. విసు కి ఫోన్ చేస్తే కారు తీసుకుని వైఫ్ తో ఇంటికి వచ్చి శాలిని ని తన దగ్గర ఉంచి. అవినాష్ వెళ్లిన రోడ్స్ అన్ని వెతకడం ప్రారంభించాడు.

రోజు మాట్లాడుకునే ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేశాడు కానీ తెలియదన్నారు. ఎన్ని సార్లు తిరిగిన రోడ్లే తిరిగాడో తెలియదు. తెల్లవారి మధ్యాహ్నం వరకు వెతుకుతూనే ఉన్నాడు. ఫోన్ రింగ్ అవుతే చాలు అవినాష్ కావచ్చు అనే చిన్న ఆశ.. అటు వర్ష ఏడుస్తూనే ఉంది. శాలిని వర్ష ని ఓదారుస్తూ టీవీ లో న్యూస్ చూస్తూ ఉంది.

పోలీస్ యంత్రాంగం ఎవరికీ ఇబ్బంది కాకూడదనే నిర్విరామంగా పని చేస్తూఉన్నారు. రోడ్స్ అన్ని క్లీన్ చేపించడం, విరిగి పడ్డ చెట్లను తొలగించడం చక చకా చేస్తున్నారు. కనిపించిన వాళ్లందరికీ విసు, అవినాష్ ఫోటో చూపిస్తూ అడిగాడు. నిరాశ తో ఇంటికి వెళ్లి… వర్ష తో సహా అందరు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని నిర్ణయించే లోగా విసు ఫోన్ మోగింది. అవినాష్ ఫోన్ నుంచి రావడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.

“ఇదిగో మాట్లాడు” అంటూ ఫోన్ వర్ష కి ఇచ్చాడు.

తన్నుకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని హలొ అనేంత లోనే అవతలి వాయిస్ విని షాక్ అయ్యింది. ఆతను చెప్పిన మాటలు విని గొంతు పెగలడం లేదు. దుఃఖం ఆగడం లేదు…వెంటనే విసు ఫోన్ తీసుకుని మాట్లాడాడు. హుటాహుటిన అందరు నిమ్స్ హాస్పిటల్ బయలు దేరారు. వర్ష ని ఓదార్చడం షాలిని వల్ల కావట్లేదు. కారు నడుపుతూ విసు కూడా లోలోన ఏడుస్తూ ఇన్ స్పెక్టర్ చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటూ అవి నిజం కావద్దని దేవుడా కాపాడమని కుమిలిపోతున్నాడు.
కారు పార్కు చేసి హాస్పిటల్ లో వెళ్లి అక్కడ ఇన్ స్పెక్టర్ వెళ్లి పరిచయం చేసుకొని అడగ్గా..
“మాన్ హొల్స్ లో మూడు బాడీస్ దొరికాయ్ కొన ఊపిరితో ఇద్దరు పోరాడుతున్నారు. ఘటనా స్థలంలో కవర్ లో ఫోను, వాచ్ దొరికింది. ఫోన్ ఛార్జింగ్ చేసి చూస్తే లాస్ట్ త్రీ మిస్సిడ్ కాల్స్ మీ నంబర్ ఉండటంతో ఫోన్ చేశాం అని చెప్పాడు. ముగ్గురిలో ఎవరో ఒకరు ఉండొచ్చు వెళ్లి చూడండి” అని చెప్పాడు.

ఐసియు లో ఉన్న వాళ్ళని చూపించాడు డ్యూటీ డాక్టర్. కోమాలో ఉన్న ఇద్దరిలో ఒకరు కోలుకుంటున్నారు ఇంకొకరి పరిస్థితి విషమం గానే ఉంది. అది అవినాష్ అని పోల్చుకున్న విసు వెంటనే ట్రీట్మెంట్ గురించి డాక్టర్ తో మాట్లాడాడు. సీనియర్ డాక్టర్ బిజీ గా ఉన్నాడని ఇంకొన్ని గంటలు గడిస్తే గాని చెప్పలేం అన్నాడు. విసు తనకు తెలిసిన డాక్టర్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే వెంటనే వచ్చి అపోలో షిఫ్ట్ చేపించి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వగా కోలుకున్నాడు అవినాష్. ప్రమాదం తప్పినందుకు అందరు సంతోష పడ్డారు అయితే లేచి నడిచే సరికి 6నెలలైనా పడుతుందని… పూర్తిగా కోలుకోవడానికి మరో రెణ్నెల్లు పడొచ్చు అని చెప్పాడు.

రెండు రోజుల తర్వాత ఐసీయూ నుండి స్పెషల్ రూమ్ కి షిఫ్ట్ చేసారు. కొత్త ఆఫీస్ కి ఇప్పట్లో రాలేనని, ఇంకొకరిని తీసుకోమని, లేదా ఇంట్లోంచి పని చేయగలనని చెప్పి ఫోన్ కట్ చేశాడు.

పక్కనే మౌనంగా ఉన్న వర్ష వెంటనే “చాలా భయమేసింది” అంటూ తన రెండు చేతులతో అవినాష్ చేయిని పట్టుకొని ముద్దాడింది కన్నీళ్ళు పెట్టుకుంటూ..

“కొంచెం వర్షం తగ్గుతుందనగా రోడ్ దాటుతున్నాను.. ఇంతలో కరెంట్ పోయింది. మెల్లిగా వస్తున్నా, నాపక్కన ఎవరో పడిపోతూ నన్ను లాగినట్టు అనిపించింది నేను పడిపోయాను. ఇదిగో లేచేసరికి ఈ హాస్పిటల్ లో ఉన్నా.. కానీ నాకు లీల గా గుర్తుంది.. అది.. పడ్డచోటో లేక హాస్పిటలో తెలియదు నేను లేవడానికి ప్రయత్నిస్తూ విఫలం అవుతూఉన్నా! ప్రాణాలు పోతున్నాయని తెలుస్తుంది.. కానీ నా మనసులో, నా శ్వాసలో, నా ఆలోచనలో నువ్వే ఉన్నావు.. నిన్ను వొదిలి ఎలా వెళ్ళను? భయపడ్డా.. భాద పడ్డా.. చివరికి ఎలా అయినా బతకాల్సిందే అనిపించింది… ఇదిగో నీకోసం వచ్చేశా..! నా అడుగులో అడుగు వేసిన నీకోసం… నీ పెదవులపై ఉండే చిరునవ్వు కోసం.. నన్నే దాచుకున్న నీ చల్లని చూపు కోసం…సుతిమెత్తని నీ స్పర్శ కోసం… నులివెచ్చని నీ కౌగిళి కోసం… ”.

ఇంతలో విసు, శాలిని వస్తూ “వహ్ వా.. వహ్ వా.. కవిత్వం పొంగి పొర్లుతుంది రా మొన్న వర్షం పడ్డట్టు…” అని విసు అంటే శాలిని “ఆసుపత్రిలో ఆలుమొగలు – అలుపెరుగని ప్రేమ పక్షులు” అని జత కలిపింది. అందరు నవ్వుకున్నారు.

అనూష ఫోన్ చేసి పరామర్శించింది. ఫోన్ మాట్లాడుతూ బయటికి వచ్చిన వర్ష “టు డేస్ తర్వాత డైలీ పిక్ చేస్కోడానికి రా ఆఫీస్ వెళ్ళేటప్పుడు” అని ఫోన్ కట్ చేసింది.

రెండు రోజుల కింద మాట్లాడిన అనూష మాటలు గుర్తుకువచ్చి “నిజమే అనూష.. నువ్వు అన్నట్టు అద్భుతమే జరిగింది. దేవుడి దయ వల్ల అవినాష్ ప్రాణాలతో బయట పడ్డాడు. ఇది చాలు నాకు, పది కాలాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటాను…” మనసులో అనుకుంటూ అవినాష్ వైవు నడిచింది.

-అక్షర్ సాహి
Aksharsahi@gmail.com

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!