Friday, August 7, 2020
Home > కవితలు > ఎలా చెబితే అర్థం అవుతుంది! -వి. సునంద

ఎలా చెబితే అర్థం అవుతుంది! -వి. సునంద

ఆ మూడు రోజుల బాధ గురించి
కనిపించని కత్తిపోట్లు
పొత్తి కడుపులో స్వైర విహారం చేస్తాయని
ముక్కలు ముక్కలైన లోపలి పొరలు
రుధిర ధారలై పొంగుకొస్తుంటే
ఎవరికీ చెప్పుకోలేని బాధ
ఎద తన్నుకొస్తుంటే…
మునుపు స్నానాల గదుల్ల చూరులో
ఎవరికీ కనబడకుండా దాచిన
అమ్మ పాత చీర ముక్కల
జమ్మిచెట్టు ఆయుధాలను..
నెల నెలా కిందికి దించి అడ్డుకట్టలేసి
బాధల యుద్ధాన్ని గెలిచిన సంగతి..
అదే అభి ”మానానికి” మానని పుండై
రోగాల నెలవవుతుందని తెలిసింది ఇప్పుడిప్పుడే కదా…
పదే పదే వాడే పాతబట్టలతో బతుకే పాత బట్టై చిరిగిపోతుందనే కదా
చూరుల్లోంచి బయట పడి
రక్తపుటేరులకు న్యాప్కిన్లతో అడ్డుకట్టవేసి
మనసింకా విచ్చుకోని రోజులనుండి
వయసులో వచ్చిన మార్పులను
ఉడిగేదాకా ఆ సృష్టి రహస్యాన్ని పేగులు మెలిపెట్టే బాధను ఇన్నాళ్ళు
పెదవంచున బిగబట్టి దాచుకుంది
జన్మస్థానాలను కాపాడుకుంటున్నది….
ఇప్పటి దాకా ఆడపుట్టుకనే
అమ్మ కడుపులోనే ఆఖరి చరణంగా మార్చింది చాలక
మూడు రోజుల ఉపశమనానికి
లోలోపలి రక్షణకు జియెస్టీ పేరుతో పన్ను…
మళ్ళీ తిరోగమనంలోకి ఆడబతుకుల
ఆరోగ్యం
అనారోగ్య పాతబట్టల్లోకి…

-వి.సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!