Sunday, October 2, 2022
Home > ఈవారం రచయిత > బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి -ప్రసాద్ జూకంటి

బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి -ప్రసాద్ జూకంటి

తెలంగాణ సాహిత్య రంగంలో ఆయనో శిఖరం, తెలంగాణ వైతాళికులలో అత్యంత ప్రతిభాశీలి, నిజాం పాలనను వ్యతిరేకించిన నిలువెత్తు ఉధ్యమం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం నినదించిన తొలి గొంతు ఆయనది. అయనేవరో కాదు.. రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు, గ్రంథాలయోద్యమకారుడు, విద్యాసంస్థల స్థాపకుడు సురవరం ప్రతాపరెడ్ఢి. క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. చీకటిలో అవమానాల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణకు ఆత్మగౌరవంతో కూడిన వెలుగులు పంచిన మహనీయుడు సురవరం పతాపరెడ్డి. నాలుగు దశాబ్దాల పాటు తెలుగు సాహితీ రంగానికి సేవ చేసిన సురవరం ప్రతాపరెడ్డి విశేషాలు ఈ వారం తెలుసుకుందాం.

సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో జన్మించాడు. ప్రతాపరెడ్డి తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో ఆయన చిన్నాన్న రామకృష్ణారెడ్డి వద్ద పెరిగాడు. ఎబియం మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను, హైదరాబాద్‌ నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్‌, మద్రాస్‌ ప్రెసిడెన్సీలో బిఏ, తిరువాన్కుర్ లో బిఎల్ చదివాడు ప్రతాపరెడ్డి. అనంతరం 1916లో పద్మావతిని వివాహమాడాడు. కొన్నాళ్లు ప్లీడర్ గా ప్రాక్టీస్ కొనసాగించిన ప్రతాపరెడ్డి.. హైదరబాద్ కొత్వాల్ రాజబహదుర్‌ వేంకట్రామిరెడ్డి విజ్ఞప్తితో రెడ్డి హాస్టల్ నిర్వాహణ బాధ్యతలను చెపట్టారు.

ఏ పని చేసిన పక్కాగా ఉండాలని నమ్మే ప్రతాపరెడ్డి.. రెడ్డి హస్టల్ ను ఓ విద్యాలయంగా మార్చారు. సాహిత్యంపై మక్కువ కలిగిన ఆయన విద్యార్థుల్లో భాషాభివృద్దికి తీవ్రంగా కృషి చేశారు. ఇందులో భాగంగా అప్పటి వరకు వెయ్యి గంథాలు కలిగిన హస్టల్ లైబ్రరీని 11వేల గ్రంథాలకు పెంచారు. నిజాం పాలనలో తెలుగు భాషకు ప్రాధాన్యత దక్కడంలేదని తపించి పోయాడు.

జాతీయోద్యమ భావాలు కలిగిన సురవరం ప్రతాపరెడ్డి 1926లో గోలకొండ అనే పత్రికను స్థాపించి నిజాం ప్రభుత్వాన్ని ముక్కుసూటిగా ప్రశ్నించారు. గోలకొండ పత్రిక నిర్వహణలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికి జాతీయ భావాలను ధైర్యంగా ప్రచారం చేశారు. ఒకానొక దశలో గోలకొండ పత్రికలోని వ్యాసాలను చూసి చూడనట్లుగా వదిలేస్తే మొదటికే ముప్పు వాటిల్లుతుందని నిజాం సర్కార్ ఆగ్రహించింది. ఇకపై వెలువడే సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని షరతు విధించింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న లోకోక్తి ఎరిగిన సురవరం.. నిజాం ఎత్తుకు పై ఎత్తు వేశాడు. ప్రభుత్వ ఆంక్షలను తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు. అది మరింత సమస్యగా ఆనాటి ప్రభుత్వం భావించింది. 1947 ప్రాంతంలో అది దిన పత్రికగా మారింది.

తెలుగు భాషను ఎంతగానో ప్రేమించిన సురవరం.. తెంగాణప్రాంతాన్ని కూడా అంతే ప్రేమించాడు. తెలంగాణలో కవులే లేరని ఆంధ్ర పండితుడు ముబండ వేంకట రాఘవాచార్యులు ఎగతాళి చేస్తే సహించలేకపోయారు సురవరం. ఆయన అవహేళనను ఒక సవాలుగా స్వీకరించి కేవలం నాలుగు నెలల్లో 354 తెలంగాణ కవుల శ్లోకాలను, పద్యాలను సేకరించి జాబితా, వివరాలతో ‘గోల్కొండ కవులు’ అను గొప్ప సంచికను ప్రచురించారు. అదీ వారి పట్టుదల. “బ్రిటిష్ ఆంధ్రులు బ్రౌణ్యాంధ్రం (ఇంగ్లీష్ తెలుగు) మాట్లాడితే మేము తారక్యాంధ్రం (ఉర్దూ తెలుగు) మాట్లాడుతాము. వారిది ఇంగ్లీష్ దడదడ, మాది ఉర్దు గడబిడ” అనేవారు.

శుద్ధాంతకాంత(నవల), భఖ్తతుకారం, హైందవధర్మ వీరులు, ప్రతాపరెడ్డి కథలు, మొగలాయికథలు, ఆంధ్రుల సాంఘీక చరిత్ర హిందువుల పండగలు, హరిశర్మోపాఖ్యనంస చంపకీభ్రమర విషాధం, రామాయణ రహస్యాలు, ఉచ్చల విషాధం( నాటిక) ఆయన రచనలు. ఆయన రచించిన ఆంధ్రుల సాంఘీక చరిత్రకు 1955లో కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. తెలుగు భాషకు చేసిన సేవకు గుర్తింపుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని నెలకొల్పింది.

భాషను శ్వాసలా భావించే సురవరం.. భాషాభిమానులతో కలిసి 1921లో ఆంధ్రజన సంఘాన్ని స్థాపించారు. 1930లో మెదక్(ఉమ్మడి)జిల్లాలోని జోగిపేటలో జరిగిన మొట్టమొదటి ఆంధ్రమహాసభకు సురవరం అధ్యక్ష్యత వహించాడు. అలాగే తెలంగాణాలో గ్రంథాలయోద్యమంలో ఆయన ప్రముఖపాత్ర వహించాడు. 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు. 1943లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు, 1944లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షత వహించాడు. ఇక 1952లో హైదరాబాదు రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరపున వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు.

కాశీనాథుని నాగేశ్వరరావుగారు, తెలుగు దేశంలొ మొట్టమొదటి రాజకీయ ఖైదీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు సురవరం వారికి స్నేహితులు. ప్రతాపరెడ్డిగారు. 1951 లో ప్రతాపరెడ్డిగారు, పులిజాల హనుమంతరావుగారితో కలిసి ‘ప్రజావాణి’ దినపత్రికను స్థాపించి రెండేళ్ళు నడిపారు. తెలంగాణా ప్రజల భాషనుకాని, వారి సంస్కృతినిగాని తక్కువ చేసి మాట్లాడితే సహించని సురవరం ప్రతాపరెడ్డి 1953లోఆగష్టు 25న తన సాహిత్యాన్ని గుర్తుగా వదిలేసి భౌతికంగా ఈ లోకానికి దూరమయ్యారు.

ఉమ్మడి రాష్ట్రంలో అందరు తెలంగాణవాదులకు మాదిరిగానే సురవరం ప్రతాపరెడ్డికి సరైన గుర్తింపు రాలేదు. ఆయన చరిత్రను, తెలుగు భాషకు చేసిన సేవను ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేకపోయింది ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్. అయినా.. ఆయన తెలంగాణకు తెలుగు భాషకు చేసిన సేవ పరిమళం సాహితీ వనంలో ఇంకా గుభాళిస్తునే ఉంది.

-ప్రసాద్ జూకంటి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!