Saturday, February 22, 2020
Home > పుస్తక పరిచయం > అనుభవమే కవిత్వంగా వచ్చిన ఎస్.ఆర్ . పృథ్వీ దీర్ఘ కవిత ” నడక సడలిన వేళ ” – సబ్బని లక్ష్మీనారాయణ

అనుభవమే కవిత్వంగా వచ్చిన ఎస్.ఆర్ . పృథ్వీ దీర్ఘ కవిత ” నడక సడలిన వేళ ” – సబ్బని లక్ష్మీనారాయణ

ఎస్.ఆర్ . పృథ్వీ సాహిత్య ప్రేమికుడు, ఇంకా జీవిత నేపథ్యములో నడక ప్రేమికుడు. ఐదున్నర దశాబ్దాలు కాలినడకనే తన జీవితములో భాగము చేసుకున్నవాడు. అలాంటి వారు సడన్ గా ఒక తాగుబోతు సైకిల్ మోటారిస్టు వలన ఆక్సిడెంట్ కు గురై దాదాపు రెండు నెలలు బెడ్ రెస్ట్ అయినపుడు తన అనుభవాన్ని కవిత్వంగా మలిచారు పృథ్వీ గారు . కవిత్వం ఆర్ధ్రతతో కూడుకొని ఉంటుంది, అనుభవం లోంచి, అనుభూతిలోంచి పుడుతుంది . అందుకు ప్రత్యేక్ష సాక్ష్యం 435 లైన్లలో 14 పేజీల్లో ఉన్న ఈ దీర్ఘ కవిత.

నడక గురించి చెప్తూ, ” చిన్నతనాన్నుండి నా వెన్ను తడుతూ / నన్ను వెంటాడే జ్ఞాపకం / నా నడక ” అంటాడు కవి.

తన ” తొలకరి రోజుల్లో / సైకిళ్ళ పై వెళ్లే / స్నేహితులకు భిన్నంగా / నడకతో అనుబంధాన్ని / పెంచుకున్న పాదాలు నావి” అంటాడు.

తన శ్రమ జీవితంలో ” రోజుకు ఇరువై మైళ్ళను/ సునాయాసంగా కొలిచిన పాదాలు నావి” అంటారు వారు.

“నడకంటే నా కెందుకింత ప్రేమ ” అని చెపుతూ ..

” బహుశా నాన్న వారసునిగా నన్ను చూడాలనేమో ” అంటారు వారు .

తన శ్రీమతి గురించి చెపుతూ , ” నా వెనుక స్కూటరెక్కి / నడుం చుట్టూ చెయ్యివేసి / సినిమాకో, షికారుకో / వెళ్ళాలన్న కోరిక / ఉందో లేదో తెలియదు గాని/ …. నా నడక అలవాటును నాతోనే నిలిపింది / ….. నా అడుగులతో జత కలిపింది ” అంటారు వారు.

తన వృత్తి ధర్మంలో నడక ” రోజుకు రెండు పర్యాయాలు/ కోర్టు వీధుల్లో విలీనం కావడం/ నిత్య కృత్యం ” అంటారు

ఫ్యాక్టరీ పని మీద హైద్రాబాద్ మిత్రుడు చలం ఇంటికి వెళ్ళినపుడు ,

” సికింద్రాబాద్ నుంచి మలక్ పేట నడుమ దూరాన్ని / అడుగులతో కొలిచే జ్ఞాపకాలు ” అంటాడు .

ఇంకా, ” నడకకు, నాకు ఉన్న అనుబంధం / నా మనసుకు, హృదయానికి ఉన్న సంబంధం / అది నాన్న జీవితం వంటిది ……/అదేపల్లి వారి పరిచయం వంటిది ” అని నడకను జీవితాన్ని నెమరేసుకుంటాడు.

” నడకలో నాకు నేనే సాటని / గర్వపడేవాడిని ” అని చెప్పుకొనే పృథ్వీ సడన్ గా ఒక తాగుబోతు సైకిల్ మోటారిస్టు వలన ఆక్సిడెంట్ కు గురై దాదాపు రెండు నెలలు బెడ్ రెస్ట్ అయినపుడు, తనకు జరిగిన ఆక్సిడెంట్ గురించి వేదాంత ధోరణిలో చెపుతూ, ” కాలం/ ఎప్పుడు ఎవర్ని/ ఏ ఆపదకు గురి చేస్తుందో ఎవరికెరుక / విధి ఆడించే నాటకములో / కీలుబొమ్మలమనిపిస్తుంది” అంటాడు తన నడక సడలిన వేళ.

“అసౌకర్యాల ముళ్ళదారిలో / చుట్టూ ఉన్న వాళ్ళ అడుగుల వాడిని చూచినప్పుడల్లా …./ నా కాళ్ళు కదలలేని స్థితికి / నా కళ్ళు రెండు చెమ్మగిల్లేవి ” అంటాడు

అలాంటి సందర్భంలో , ” కాలం విలువ తెలిసిన వాడిని! కవిని గనుక / నా కలం కొత్త కవితలకి ప్రాణం పోసింది” ప్రయోజనాన్ని ఆశించి అంటాడు .

జరిగింది ఎలాగూ జరిగింది కనుక ” సరికొత్త జీవితం వైపుకు / ఆనందంగా అడుగులు వేయాలని /దృఢ సంకల్పంతో నిరాశకు నీళ్లొదులుతూ / ఆశల పాన్పు మీద / ఆనందంగా కలలు కంటున్నాను ” అని ఆత్మ విశ్వాసంతో ఆశాజనకంగా ఈ దీర్ఘ కవితకు ముగింపు పలుకుతాడు పృథ్వీ గారు . కాదేది కవితకనర్హం అన్నట్లు అనుభవాన్ని నడక నేపథ్యంగా కవిత్వంగా మలచిన ఎస్.ఆర్ . పృథ్వీ గారు అభినందనీయులు .

సబ్బని లక్ష్మీనారాయణ

6-6-302, సాయి నగర్ ,

కరీంనగర్-505001

మొబైల్ 8985251271

ప్రతులకు:

ఎస్.ఆర్ . పృథ్వీ.

” నడక సడలిన వేళ ” (దీర్ఘ కవిత), , వెల : 20/-,

ఇంటి నంబర్. 3-866, మహాత్మ గాంధీ వీధి , రామకృష్ణ నగర్,

రాజమహేంద్రవరం-533101.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!