Monday, August 8, 2022
Home > ఈవారం రచయిత > ‘నిలువెత్తు నడిచే పాట’ గోరటి వెంకన్న! -ప్రసాద్ జూకంటి

‘నిలువెత్తు నడిచే పాట’ గోరటి వెంకన్న! -ప్రసాద్ జూకంటి

ఓ సిరా చుక్క లక్ష మెదళ్లను కదలిస్తుందనేది పాత మాట. ఓ పాట కొట్లాది జనం పాదాలకు బాటను చూపుతుంది ఇది నేటి మాట. తన పాటలతో సమాజంలోని అన్యాయంపై గొంతెత్తిన కవి, గాయకుడు, ప్రజావాగ్గేయకారుడు, జానపద కళాకారుడు.. తెలంగాణ ప్రజల గొంతుక గోరటి వెంకన్న.

ఎప్పుడూ మొహంపై చిరునవ్వును చెరగనివ్వని వెంకన్న.. తన పాటలో మాత్రం గర్జించి నినదించి నిలదీస్తాడు. చిన్న చిన్న పదాలతో రౌద్రాన్ని, ఆలోచనని, చిలిపిని పుట్టించగల ప్రజాకవి గోరటి వెంకన్న ఈ వారం రచయిత.

ఆధునిక వాగ్గేయ ప్రపంచంలో శిఖరం ఎత్తున నిలిచిన గోరటి వెంకన్న 1963 లో మహబూబ్ నగర్ జిల్లా గౌరారం(బిజినపల్లి)లో నర్సింహ, ఈరమ్మ దంపతులకు జన్మించాడు. కళాకారుల కుటుంబం నుంచి రావడంతో వెంకన్నకు బాల్యం నుంచే పాటల మీద ఆసక్తి కలిగింది. వెంకన్న పుట్టక ముందే ఆ ఇంట్లో పాట పురుడు పోసుకుంది. ఆయన తండ్రి కొన్ని వందల పద్యాలను అనర్గళంగా పాడగల సామర్థ్యం కలవాడు. అలాగే కళాకారుడు కూడా. తల్లి పాడే మంగళ హారతుల పాటలు కూడా ఆయనపై ప్రభావం చూపాయి.

గొరటి వెంకన్న పాట పాడుతుంటే ఆ పాటతో పాటు మనం పయనిస్తుంటాం. ప్రపంచ గమనాగమనాలను సులువైన పదాలతో సుత్తె కంటే బలంగా కొట్టడం వెంకన్న పాటకున్న నైజం. గోరటి వెంకన్న స్వతహాగా ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతి, పల్లె జీవితంలోని స్థితిగతుల్ని, మార్పుల్ని, వైరుధ్యాల్ని పాటల్లో చెప్పడం వెంకన్న స్టైల్. పాటకు పదనిసలు నేర్పించినట్టు.. గజ్జెకు కాళ్ళను కట్టించినట్టు ఆయన చిందేసి పాట పాడితే పల్లెతల్లి పులకిస్తుంది. ప్రకృతి సవ్వడి చేస్తుంది. వెంకన్నలోని సృజనాత్మకతను గుర్తించిన ఆయన ఊర్లో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు కొన్ని పాటల పుస్తకాలను తీసుకువచ్చి ఇచ్చాడు. వాటిలో పాటలను ఆయన అలవోకగా పాడాడు వెంకన్న. మొదటి నుంచి సమాజంపై, రైతుల సమస్యలపైనే పాట కట్టడం ఇష్టం. బడిలో పాట పాడమంటే కూడా ఎక్కువగా భక్తి పాటలనే పాడేవాడాన.

వెంకటరెడ్డి మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు ఆలోచనలు సాగించారు గోరటి వెంకన్న. ఆ ప్రభావంతో అనేక పాటలు రాశాడు. అలా ఆయన రాసిన పాటలు జన నాట్యామండలి వాళ్ళు సభల్లో పాడేవారు. 1984 లో ఆయన రాసిన పాట “ఏమాయెరో నీ మాట ఏమాయరో” అనే పాట చాలా పేరు సాధించిపెట్టింది. సినిమాలకు పాటలు రాయడం మొదటి నుంచి అయిష్టత వ్యక్తం చేసే గొరటి వెంకన్న సినీరంగంలోకి విచిత్రంగా ప్రవేశించారు.

అప్పటికే ప్రజల్లో మంచి ఆదరణ పొందిన “రాజ్యహింస పెరుగుతున్నాదో పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నదో” అనే పాట సినీ దర్శకుడు ఎన్.శంకర్ చెవిలో పడింది. దింతో ఈ పాటను రాసింది ఎవరా అని తెలుసుకోవడానికి రెండు నెలల సమయం పట్టింది దర్శకుడు శంకర్ కు. ఎలాగోలా వెంకన్నను వెతికి పట్టుకుని సినిమా కోసం పాట రాయమని అడిగితే నిర్లక్ష్యంగా చూశాడు వెంకన్న. సినిమా పాటలన్నీ పడికట్టు పదాలతో రాయబడి ఉంటాయనీ సినిమాల వల్ల సమాజంలో మార్పు రాదనే అభిప్రాయంతో సినిమాలకు రాయడానికి మొదట్లో ఒప్పుకోలేదు.

ఎలాగోల ఒప్పుకున్న ఆయన.. “జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో” అనే పాటను రాశాడు. ఈ పాట సమాజంలో అనేకులను ఆలోచింప జేసింది. అలాగే కుబుసం సినిమా కోసం మరో పాట రాశారు. “పల్లె కన్నీరు పెడుతోందో కనిపించని కూట్రల” అంటూ సాగే ఈ పాటలో చిద్రమైపోతున్న గ్రామీణ చేతి వృత్తులపై ప్రజల గోసను తన కలంతో వెలిబుచ్చాడు. బహుళ జాతి కంపనీల విస్తరణను, సామ్రాజ్యవాదాన్ని వెంకన్న ఇక్కడ కనిపించని కుట్రలు గా వర్ణిస్తు.. జీవన విధానాన్ని, వృత్తుల్ని ఛిద్రం చేస్తున్న తీరును ఆయన ఎంతో ఆర్ధ్రంగా వివరించారు.

విప్లవ భావాలతో కూడిన పాటలను రాయడంతో పాటు పల్లెల్లోని స్వచ్ఛమైన ప్రేమను తన పాటల్లో ఒదిగించడంలో వెంకన్న సిద్దహస్తుడు. తల్లి ఈరమ్మ, కంచెరేగి తీపివోలె లచ్చువమ్మో-నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ.. పారె ఏటి అలలమీద పండు వెన్నెల రాలినట్లు- ఊరె ఊట చెలిమెలోనా తేనీరు తొలికినట్లు అంటూ ప్రకృతితో ముడివేస్తూ పాటగా మలిచిన తీరు మనల్ని బాల్యంలోకి తీసుకపోతుంది.

ఏకనాదం, రేల పూతలు, అల చంద్రవంక వంటివి వెంకన్న కలం నుంచి జాలువారిన రచనలు. పాటను సామాన్యులు విని, వీక్షించి ఆనందిస్తారు. పాలకులు తెలుసుకొని ఆలోచిస్తారు. ఉద్యమకారులు కెరటాలై కదంతొక్కుతూ ఉప్పొంగే తరంగాలవుతారు. అటువంటి ప్రక్రియ ఆయన రచనలో నిత్యం నాట్యం చేస్తూనే ఉంటుంది.

తన పాటతో సామాజాన్ని ఆలోచింపజేసి వెంకన్నకు తెలంగాణ ప్రభుత్వం గుర్తించి గౌరవించింది. 2016లో కాళోజీ నారాయణరావు పురస్కారంతో ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. దాంతో పాటు గొరటి పాటకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. రాజా ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన ది రాజా బైఎనేల్ ఆఫ్ ఇండియన్ పోయట్రీ కార్యక్రమంలో వెంకన్న రాసిన సోయగమే వెన్నెల పాటకు దేశంలోని 15 ప్రాంతీయ భాషల్లో వచ్చిన గేయాల నుంచి ఒక్కొక్కటి చొప్పున ఆంగ్ల అనువాదానికి ఎంపిక చేయగా తెలుగు నుంచి వెంకన్న పాట ఎంపికైంది. గొంతెత్తి పాడితే చైతన్య స్పూర్తి రగిలించే గొరటి వెంకన్న కలం నుంచి, గళంలోంచి మరెన్నో నిప్పు కణికళ్లాంటి పాటలు రావాలని.. సాహిత్య హలంలో వెంకన్న కలం పాటల పంట సేద్యం చేయాలని ఆశిద్దాం.

-ప్రసాద్ జూకంటి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!