Tuesday, May 17, 2022
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం (సీరియల్ నవల) -5 వ భాగం – శ్రీ విజేత

అతని ప్రేమ కోసం (సీరియల్ నవల) -5 వ భాగం – శ్రీ విజేత

నా పెళ్ళికి స్నేహితులను పిలువాలి కాబట్టి తెలిసన స్నేహితురాల్లకు పెళ్లి కార్డులు అంద చేసాను. నా ఆప్తురాలైన మిత్రురాలు సుజిని, వాళ్ళ చెల్లెలిని ముందుగానే రమ్మన్నాను. అప్పట్లో అన్నయ్య ఇంటివద్ద లేడు, చదువుల కోసమని పట్నం వెళ్ళిండు. ఇక అతనికి కార్డు అందచేద్దామంటే అన్నయ్య అందుబాటులో లేడు, అన్నయ్య లేడు కాబట్టి అతను నాకు కనిపించ లేదు. అతనికి కార్డు అంద చేయలేక పోయినాను. వాళ్ళ ఇల్లు మా యింటికి కొద్దిగా దూరములో ఉంటుంది. ఒంటరిగా వెళ్లి ఇవ్వలేను, ఎవరితోనూ పంపించలేను. వాళ్ళ కుటుంబానికి మాకు పెద్దగా సంబంధాలు కూడా లేవు, పైగా వాళ్ళకు మాకు కులాంతరం ఉంది, బీదవాళ్ళు కూడా. మా వాళ్ళు వాళ్లకు పెళ్లి కార్డ్ ఇస్తారని నేను అనుకోలేదు. ఒకవేళ అతను నాకు కనిపిస్తే నేను నా పెళ్లి కార్డ్ అందచేసే దాన్నేమో, కాని ఆ రోజుల్లో మా యింటి దరిదాపుల్లోకి కూడా రాలేదు. అయినా కొందరి ప్రమేయం జీవితములో యెంత వద్దనుకున్నా ఉంటుందేమో. మన గురించి ఆలోచించేవాళ్ళు మనవాళ్ళే అని మనము అనుకుంటాం కాని మనకు తెలియ కుండానే మన కోసం, మన మంచి కోసం మన క్షేమం కోరి ఆలోచించే వారు కూడా ఉంటారని తర్వాత తరువాత తెలిసింది నాకు కాలక్రమములో.

ఒక మాట అంటారు చూడు, పిల్లల పెళ్లి పెద్దలకు పండుగ అని, నా పెండ్లి అలాంటిదే అనిపించింది మా వాళ్ళను చూస్తే. ఇల్లంతా ముస్తాబు చేశారు, ఇంటిలో రంగు రంగుల కాగితాలు అంటించారు అలంకరణ కోసమై. ఇంటి వెనుక, ఇంటి ముందట పందిర్లు వేయించారు. అప్పట్లో ఇప్పటిలాగా ఫంక్షన్ హాల్లంటూ ఏమి ఉండేవి కావు ఎవరి ఇంటి ముందట వారు పెళ్లి పందిరి వేసి ఎవరి స్తోమతుకు తగ్గట్టు వారు బంధు మిత్రులను పిలిచి పెళ్లి చేయడం పద్ధతి. బాజా బజంత్రీలు వచ్చినాయి పెళ్లి రోజు రేపు అనంగ సాయంత్రమే. నన్ను పెండ్లి కూతురును చేసేవారు. పెండ్లి రేపు అనే వరకు చేస్తూనే ఉన్నారు. పెండ్లి రేపు అనంగ సాయంత్రం కూరాల్లు పట్టినారు అమ్మలక్కలు అందరు వచ్చి. పెండ్లి పిల్లవాన్ని తీసుకరావడానికి పిల్లవాని ఊరికి వెళ్ళినారు మా బంధువుల్లో నలుగురు. పెళ్ళినాడు రాత్రే కుమ్మరి ఇంట్లోంచి ఐరేని కుండలు, కంసాలి ఇంట్లోంచి మట్టెలు మంగళ సూత్రాలు బాజాబజంత్రీలతో తెచ్చినారు. పెండ్లి వంటల కోసం అన్నీ ఏర్పాట్లు చూసినారు ఇంటి వెనుక స్థలములో. ఇవన్ని ఉట్టి బొమ్మలా చూస్తూ ఉండిపోయినాను. పెండ్లినాడు నన్ను పెండ్లి కూతురును తయారు చేసినారు, బహుశా నేను పుత్తడి బొమ్మలా మెరిసిపోయి ఉంటాను. నా అర చేతులలో పండిన గోరంటను చూస్తుంటే, “మందారములా పూస్తే మంచి మొగుడస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టీ చెయ్యంత, అందాల చందమామ అతడే దిగి వస్తాడు” అనే పాట జ్ఞాపకమం వచ్చింది. ఆ పాటలో ఎంత నిజముందో లేదో కాని నా అరచేతులు మాత్రం బంగారములానే పండినాయి. నాకు ఎలాంటి మొగుడు వస్తాడో చూసుకోవాలనిపించింది. జీవితం పాట కాదని, కల్పిత కథ కానే కాదని తెలుసుకోవడానికి ఒక జీవిత కాలం సరిపోతుందేమో! నేను ఆ జీవితం ముంగిట్లో ఉన్నాననిపించింది. ఒక్క అడుగు తీసి అడుగు వేసే లోపల ఒక జీవితం తారుమారు అవుతుందేమో! పెళ్లి అలాంటిది భారతీయ సమాజములో. పెళ్లి ఒక అందమైన జీవితం అంటారు, అనుబంధాల వారధి అంటారు, కాని అది ఎందరికో తెలియదు! బహుశా అది స్వర్గమైనా కావచ్చ్చు, నరకమైనా కావచ్చు. పెళ్లి జీవితములో తప్పనిసరిగా జరుగబోయే సంఘటన, జరుగవలసిన సంఘటన చాలా మంది జీవితాల్లో. దాని పూర్వపరాలు కూడా ఆడపిల్లకు ఆడపిల్ల చేతిలో ఈ దేశములో ఉంటాయో లేదో కూడా తెలియదు. కాలం తోసుకపోయింది నన్ను, పరిస్థితుల ప్రభావంగా నేను ఆ కాలం ఇరుసులో ఇరుక్కొని నలిగి కొట్టుకపోయానేమో అని అనిపిస్తుంది. పెళ్లి చేయడం ఒక బాధ్యత తలిదండ్రులకు ఆర్థికంగా అన్నీ సమకూర్చుకొని, పెళ్ళికి వచ్చి మాట సాయంగా సహకరించడం బంధుమిత్రుల బాధ్యత. పెళ్లి ఒక స్వర్గపు పూదోట అయితే ఆ పూదోటలో పెళ్ళయిన దంపతులు విహరిస్తుంటే చూసి తరించేవాళ్ళు ఈ లోకంలోని మనుషులే కావచ్చు, పెళ్లి ఒక ఊబి లాంటిడైతే ఆ ఊబిలో పడి గిలగిలా కొట్టుకుంటున్న దంపతులను చూసి రకరకాల వ్యాఖ్యానాలు చేసేది కూడా ఈ లోకం లోని మనుషులే కావచ్చు. ఏది ఏమైనా ఆ స్వర్గపు పూదోటలోకో లేక ఊబి లాంటి దాని లోకో పెళ్లి చేసి దంపతులను పడవేయడానికి ఉబాలాట పడుతుందేమో ఈ లోకం అని అనిపించింది.

నా పెళ్లి ముహూర్తం కూడా వచ్చింది. పెళ్లి పందిరిలో మొదటిసారి తల ఎత్తి చూశాను పెళ్లి కొడుకును, చూసి విస్తుపోయాను. ఇంద్రుడిని, చంద్రుడిని కొరుకుంటారు అమ్మాయిలు, నవ మన్మధున్ని, ఆరడుగుల అందగాన్ని, ఆజానుబాహున్ని, చిరునవ్వుల చిద్విలాస హాసున్ని, సంపాధనా పరున్ని కూడా కోరుకుంటారు కాని నాకు ఆ భాగ్యం లేదా అనిపించింది, నాకే కాదు కాబోయే మా జంటను చూసి విస్తుపోయిన వాళ్ళే ఎక్కువ ఉండి ఉంటారు. నేను సువాసనలు వెదజల్లే పుష్పవనములో విహరిస్తున్న వన దేవతలా ఉండి ఉంటాను, పసుపు వస్త్రాలలో తళతళ మెరిసిపోతూ బంగారు బొమ్మలా ఉండి ఉంటాను, చిదిమి దీపం పెట్టుకోవచ్చు అంటారు చూడు అలా ఉంటుంది నా అందం. అతను నా మనసుకెందుకో నచ్చలేదు మొదటి చూపులోనే. మొగవాడికి అందమేమిటీ నలుపు రంగులో ఉన్నా చేసుకోవచ్చు కాని అతను అంద వికారంగా కూడా ఉన్నాడు. మనసంతా చివుక్కుమంది. అతని నడక కూడా బాగ లేదు, అతని నడకలో కొద్దిగా వంకరతనం ఉంది. పచ్చటి పందిరి ముందట ఇప్పుడేమి చేయగలను. తల్లిదండ్రులు కుదిర్చిన బొమ్మల పెళ్లి సంబంధం కదా ! నేను అతను పక్కపక్క నిలబడితే కాకిముక్కుకు దొండపండులా ఉన్నారంటారేమో! అనడం ఏమిటీ అన్నారు కూడా ! కళ్ళు మూసుకున్నాను పెండ్లి పందిరిలో, కండల్లో నీళ్లు తిరుగాడినాయి అని ఎవరికి చెప్పుకుంటే తీరుతుంది! ఎవరు అర్థం చేసుకుంటారు నా ఆర్తిని అప్పుడు. దేవుడంటూ ఉంటే కోరుకోవాలనిపించింది, అక్కడే కష్టాల సీతలా భూమి బ్రద్దలై భూమిలోకి కూరుకపోతే ఎంత బాగుండునో కదా అనిపించిది. నా స్థానములో ఇంకెవరైనా ఉంటే పెళ్లి పందిరి లోనే నాకీ పెండ్లి వద్దు, ఈ పిలగాడు వద్దూ అని చెప్పేవారేమో తెగేసి. నాకు అంత శక్తి, సాహసం లేకపోయింది అప్పుడు. కళ్ళ ముందట జీవితం కనబడుతుంది, దాన్ని నేను దాటి వెళ్ళలేను కదా అనిపించింది.

ఇది రెండు కుటుంభాల పరువు, గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం. జీవితములో కొన్ని సంఘటనలు భవిష్యత్ లో ఇలా ఉండబోతాయని చూచాయగా కొద్దిగా ముందుగా తెలుస్తాయేమో. అలా తెలిసినప్పుడే, అనిపించినపుడే కొద్దిగా జాగ్రత్త పడితే కొద్దిగా సర్దుకొని, తెలుసుకొని మంచిగా బతుకచ్చునేమో. ఈ సంబంధం చూస్తున్న మొదట్లోనే కొద్ద్దిగా పిలగాడి గురించి తెలిసినా నేను అశక్తురాలినై, అమాయకురాలినై మిన్నకుండిపోయాను. చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం. చేసుకున్నోల్లకు చేసుకున్నంత అంటారు కదా ఐక అనుభవించవలసిందే ఇష్టం ఉన్నా లేకున్నా అని తెలిసింది. ఇరు కుటుంభాల పెండ్లి పెద్దల సాక్షిగా ఈ పెళ్లి, బంధుమిత్రుల సాక్షిగా ఈ పెళ్లి. పిన్న పెద్దల సాక్షిగా ఈ పెళ్లి, వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మణుని సాక్షిగా ఈ పెళ్లి. జిలుకర బెల్లం పెట్టించారు ఆలుమొగలు జిలుకర బెల్లములా కలిసి ఉండాలనేమో! ఎంత గట్టి బంధం ఈ దేశములో పెళ్ళంటే. మూడు ముళ్ళ బంధం, ఏడడుగుల బంధం ఈ దేశములో పెళ్ళంటే. ఒక్కసారి మూడుముళ్ళు పడితే ఇక విడివడడం కష్టం. కళ్ళు మూసుకున్నాను తాళి కట్టించుకున్నాను. తలబ్రాలు పోయించుకున్నాను, ఎడడుగులు నడిచాను యాంత్రికంగా. ధర్మేచ, అర్దేచ, మొక్షేచ, కామేచ నాతి చరామి అనే అర్ధాలు ఎంత మంది మొగవాళ్ళకు తెలుస్తాయో తెలియవో నాకు తెలియదు కాని నేను ఆ మాటల యుక్తంగా ఒక మొగవాడికి భార్యనైపోయాను ఆ క్షణం నుండి. ఇచ్చుకున్నవాడు ఈగ పుచ్చుకున్నవాడు పులి అనే సామెత ఉన్న సమాజములో నేను పుట్టింటి నుండి మెట్టినింటికి వెళ్ళిపోయే రోజు వచ్చింది. అందరూ ప్రేక్క్షకులే పెండ్లికి వచ్చిన వాళ్ళు, ఒకరి ఆర్తిని ఆరుస్తారా, తీరుస్తారా. గుండెలోని బాధా ఎవరికి చెప్పుకుంటే తీరుతుంది! ఒక్కొక్కరు మా పెళ్లిని చూసి జాలి పడ్డవాళ్ళు ఉన్నారు, బాధపద్దవాళ్ళు ఉన్నారు. పెళ్లి అయ్యిందని బాధ్యత తీరందని సంతోష పడ్డవాళ్ళు మా తల్లి దండ్రులు కావచ్చు, నా మెట్టినింటి వాళ్ళు కావచ్చు. మా పెండ్లికి వచ్చిన వాళ్ళలో కొందరు మా జంటను చూసి అబ్బాయి అమ్మాయికి తాతలా ఉన్నాడు అని అనుకున్నారు. ఒక్క క్షణం మనసు చచ్చిపోయింది! నాకు ఒక్కసారి ఏడవ తరగతి లో చదువుకున్న గురజాడ రాసిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ మననానికి వచ్చింది, కాలం అప్పటికీ ఇప్పటికీ ఏమయినా మారిందా ఆడపిల్ల విషయంలో అని.
“మేలిమి బంగరు మెలతల్లారా !/ కలువల కన్నుల కన్నెల్లారా ! / తల్లులగన్నా పిల్లల్లారా ! /
విన్నారమ్మా ఈ కథను ?”
“ఆటల పాటల పేటికలారా ! / కమ్మని మాటల కొమ్మల్లారా ! / అమ్మలగన్నా అమ్మల్లారా !
విన్నారమ్మా మీరీ కథను ?”
అని పూర్ణమ్మ లా ఎవరికి చెప్పుకోవాలి నా కథ ! అనిపించింది.
“ పూజారింటను పుట్టెను చిన్నది / పుత్తడి బొమ్మా పూర్ణమ్మా….” అని చెప్పినా ఏ కులమైతెమిలే ఈ సమాజములో, రైతు బిడ్డయినా, కూలీ బిడ్డయినా బతుకులో పెండ్లి కోసం కట్నాల కోరల్లో ఇరుక్కొని, ఆర్ధిక సమస్యల్లో సతమతమవుతున్న తలిదండ్రులకు భారమవుతూ బతుకును బలి చేసుకోవలసిందేమో ! ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా పెళ్ళిచేసుకొని బతుకును భారంగా గడుపవలసిందేమో !
ఈడు జోడు కాని మొగునితో కాలమంతా కలిసి బతుకవలసిందేమో !
ఎందుకు రాసాడు ఆ మహాకవి ఈ పాటను నా లాంటివాళ్ళ బతుకులను చూసా,
“ముద్దు నవ్వులూ మురిపెములూ మరి / పెనిమిటి గాంచిన నిమిషమున / బాసెను కన్నియ ముఖ కమలమ్మున / కన్నుల గ్రమ్మెను కన్నీరు”. నిజంగా బతుకు యెడల నా మురిపములన్నియు కల్లలయినాయి ! నేను కోరుకున్ననా కళల రాకుమారుడిని నేను ఇలా కనుగొన్నానా అని అనిపించింది!

ఎలా అన్వయించుకోవాలి నన్ను నేను ఈ బతుకులో. నా కన్నుల కన్నీరును తుడిచేది ఎవరు? నా ఆర్తిని తీర్చేదెవరు? చూస్తూ చూస్తూ ఉండగనే బతుకులో కొత్త తీరం వచ్చేసింది, ఏమిటి ఇది అని అనిపించింది. ఈ కొత్త బతుకు సముద్రం లో పడి నేను ఎంతవరకు ఈదగలను, వెల్లదీయగలను బతుకును అనిపించింది.

ప్రతి అమ్మాయికి బతుకు యెడల, పెండ్లి యెడల కొన్ని అభిప్రాయములు ఉంటాయి, అది సహజం, కాని అవి నెరవేరుతాయా ! ఆమెకు అంత స్వేచ్చ ఉందా నాడూ , నేడూ కూడా అని అనిపించింది.
అప్పుడు కన్యాశుల్కం ఉంది నూరేళ్ళనాడు, ఇప్పుడు వరకట్నం అని ఉంది అమ్మాయిల బతుకులను ఇబ్బందులకు గురి చేస్తూ. ఇప్పుడూ అప్పుడూ కాసులు లేకనో, కాసులకు ఆశపడో అమ్మాయిల బతుకులను బుగ్గి పాలు చేస్తున్నది అభాగ్యలైన తలిదండ్రులేనా అని అనిపించింది. నా జీవితమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ గా కనిపించింది.

“కాసుకు లోనై తల్లీ తండ్రీ / నెనరూ న్యాయం విడనాడి / పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక /
ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.” ఈ మాట, ఈ పాట నిజం కాదా అనిపించింది, దుఃఖం పొంగి పొరలి వచ్చింది. ఒకనాడు బడిలో నాకు తెలియకుండానే చదువుకున్న ఈ పాట నా జీవితంలోనే ప్రత్యక్షంగా ఎదురుగా వచ్చింది. వీళ్ళే కదా, నా వాళ్ళే కదా నన్ను అర్థం చేసుకోకుండా నాకు ఈ పెళ్లిని చేసారు అనిపించింది.

“ఆటల పాటల తోటి కన్నియలు / మొగుడు తాత యని కేలించ, / ఆటల పాటల కలియక పూర్ణిమ
దుర్గను చేరీ దుక్కించె.” ఇంత కన్న ఏమి కావాలి ఆడపిల్లకు దుఃఖ కారణం. నలుగురిలో నా గురించి ఆనాడు కొందరు ఇదే మాట అన్నప్పుడు. నేను ఏ దేవుడితో మొరపెట్టుకోవాలి ! నా బాధను ఎవరితో చెప్పుకోవాలి. ముడితే మాసిపోయే ముద్ద మందారాన్ని ముదుసలికి అనను గాని ఈడు జోడు గాని మొగుడితో ముడి వేస్తే ఇక ఆమె ఎలా బతుకును వెల్లదీస్తుంది అనిపించింది.

కవులు రాసిన పాటలు నిజమే కదా, కవులు కాల్పనిక కథలే కాకుండా వాస్తవ కథలు కూడా రాస్తారు కదా! ఎన్నడైనా ఎవరైనా నా కథ కూడా ఇలానే రాస్తారేమో ముందు ముందు, ముందు తరాలలో ఇలాంటి పెండ్లిళ్ళు జరుగ కూడదని, సమాజానికి కనువిప్పు కావాలని అని అనిపించింది. నిజంగా నేను ఈ పుత్తడి బొమ్మ పూర్ణమ్మలా చనిపోతే యెంత బాగుండు అనిపించింది అప్పుడు.

నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళేనటా కొందరి జీవితాల్లో. ఎవరి జీవితం ఎలాఉంటుందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎవరికి తెలుసు! ఇంతవరకు గడిపిన నా ఆనందమయ జీవితం ఇక ఎలా గడువ వలసి ఉందో కాలం చెపుతుంది అనిపించింది! ( మిగితా వచ్చే వారం …..)

– శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!