Sunday, October 2, 2022
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం (5 వ భాగం ) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం (5 వ భాగం ) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం (5 వ భాగం )

నెమ్మది నెమ్మదిగా వాస్తవాన్ని జీర్ణించు కునే సమయానికి వచ్చాడు హరి.
ఆ తరువాత జరగవలసినవన్నీ చకచకా వె౦ట వె౦టనె జరిగిపోయాయి.
బెడ్ మీద నిస్సహాయంగా ఉన్న చందన మనసు పరిపరివిధాల ఆలోచనల్లో కొట్టుకుపోతో౦ది.
కాలికి ఆపరేషన్ చేసి సిమెంట్ పట్టీ వేసారు. మోచేతికి స్లింగ్.
హిట్ అండ్ రన్ గా కేస్ రిజిస్టర్ అయింది. పోలీస్లకు కావలసిన సమాచారం అందించడం, ఇన్స్యూరెన్స్ కి ఇన్ఫాం చెయ్యటం మొదలైనవన్నీ చేసాడు.
పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది డ్యూటీ డాక్టర్.
చందన కుడి చేతిని చేతుల్లోకి తీసుకున్నాడు హరి.
చందన పెదవి వణికింది, మాట పెగల్లేదు. కళ్ళు నిండు జలాశాయాలయ్యాయి.
“చా…చిన్నపిల్లలా ఏమిటిది చందూ … “ ఎంత ఓదార్చాలని నిగ్రహంగా ఉన్నా హరికీ ఆ బాధ తట్టుకోడం కష్టం గానే ఉంది. అది అతని స్వరంలో ధ్వనిస్తూనే ఉంది.
“ సెమినార్ , హాస్పిటల్ , పిల్లలు …”
చెయ్యి పైకి జరిపి ఆమె కాళ్ళు తుడుస్తూ .
“ఏవీ ఆగిపోవు చందనా, సెమినార్ ఈ విషయం విని పోస్ట్ పోన్ చేసారు, నువ్వు ఇలాటి కండిషన్లో ఉన్నప్పుడు వర్క్ అటెండవమని ఎవరూ అడగరు. నువ్వు నడవగలిగే వరకూ మెడికల్ లీవ్ ఇస్తారులే. వాటి గురించి వర్రీ అవకు.
మురళికి చెప్పాను. వెంటనే వస్తానంటే నేనే వద్దన్నాను. వీలు చూసుకునే రమ్మన్నాను. పిల్లలా నేనుండగా వాళ్ళ బెంగ అనవసరం బంగారూ
ఆఫ్టర్ స్కూల్ కేర్ అరేంజ్ చేసాను. అయిదింటికి వస్తూ ఇంటికి తెస్తాను. మళ్ళీ ఉదయం వరకు చూసుకోలేనా? అయినా టూ త్రీ డేస్ లొ నువ్వు ఇంటికి వచ్చేస్తావు. వీలయితే ఇంటి నుండి వర్క్ చెయ్యవచ్చు,పిల్లలనూ సూపర్ వైజ్ చెయ్యవచ్చు. ఎల్లాగూ ఒక ఫుల్ టైం కుక్ అండ్ బేబీ సిట్టర్ పెట్టుకు౦దా౦”

కంటి కొసన మెరిసిన నీటి చుక్క ఆమె కంట పడకుండా తలతిప్పుకున్నాడు.
“ ఏం పాపం చేసాను హరీ , నన్నిలా వెంటాడి శిక్షించడానికి? నీకు తెలుసు , ఎప్పుడూ స్పీడ్ లిమిట్ దాటను, సిగ్నల్ జంప్ చెయ్యను. పోయి పోయి నాకే జరగాలా ఈ యాక్సిడెంట్? ఒక్కొక్కళ్ళు రేసుగుర్రాల్లా పరిగెట్టిస్తారు కార్లను, తాగి మరీ డాన్స్ చేయిస్తారు…”
ఆమెను మధ్యలోనే ఆపుతూ,
“అందుకే గదా మనలాటి వాళ్ళు ఇబ్బంది పడేది? అయినా చ౦దూ, మనం ఎన్నో అనుకుంటాం , ఏవేవో కలలుగంటాం. ఏవో చేసేయ్యగలం అనుకు౦టా౦ కాని ఏమీ చెయ్యలేమని చూపిస్తూ ఇలా ఎదురు చూడని అడ్డంకులు వస్తాయి.
ఎంత సామర్ధ్యం ఉన్నా ప్రతిదీ మన చేతిలో మాత్రం లేదు. ప్రతి మనిషి జీవితంలో ప్రతి క్షణం ముందే రాయబడటం ఒక అద్భుతమే కదూ, ఏ సూపర్ కంప్యూటర్ ఉందో ఆ పై వాడి చేతుల్లో , ఎంత మంది జీవితాలు ప్రోగ్రాం చేసి పెట్టుకున్నాడో…
నువ్వు సెమినార్ అనుకున్నావు ఆ పై వాడు ఇలా బెడ్ రెస్ట్ ప్లాన్ చేసాడు.
పెద్దగా ఆలోచించకు చందూ , అన్నీ మన మంచికే అనుకుందాం”
అనునయంగా అన్నాడు.
“ నాకు ఊహ తెలిసాక ఎవరికైనా వీలయితే మంచే చేసాను గాని, ఎవరికీ ఎప్పుడూ చెడు జరగాలని కలలో కూడా అనుకోలేదు. తెలిసీ తెలియక కూడా ఎవరినీ ఎప్పుడూ నొప్ప౦చలేదు”
“ నిజమే చందూ, మనం మానవ మాత్రులం, భగవంతుడు అని చెప్పుకునే రాముడికి కష్టాలు తప్పాయా?ఏం పాపం చేశాడని పద్నాలుగేళ్ళు అడవుల పాలయ్యాడు. ఏం పాపం చేశాడని జీవితమంతా ఇల్లాలికి దూరమయ్యాడు. మనకష్టాలు గట్టేక్కి౦చమని ఆ దేవుణ్ణి ప్రార్దిస్తాం . మరి ఆయన పడిన కష్టాలో … జీవితం అన్నాక కష్టమూ సుఖమూ అన్నీ కలగలుపే. రెంటినీ సమానంగా చూడగలగాలి.
మనకన్నా ఎక్కువ బాధల్లో ఉన్నవారినీ వారి ఒరిమినీ తలుచుకుంటే ఎంత ఊరడింపు? ఎంత మంది కన్నానో మనం అదృష్టవంతులం అనిపించక మానదు.”
ఆలోచనలో పడింది చందన.
“ ఇదెంత, వారంలో లేచి తిరుగుతావు, మూడు వారాల్లో మామూలు మనిషివైపోతావు, బీ బ్రేవ్ “ ధైర్యం చెప్పాడు.
“ పిల్లలను తీసుకు రానా?”
“ఉహు వద్దు బెంగపడతారు. వాళ్లకి అలవాటేగా ఒకటి రెండు రోజులు మీతింగ్స్ కి వెళ్ళడం”
ఇంకా అతను అక్కడ ఉండగానే ఎంత వద్దన్నా వినకుండా మురళి , ప్రియ సాయంత్రానికల్లా వచ్చేశారు.
వాళ్ళను హాస్పిటల్ లో ఉంచి ఇంటికి చేరాడు హరి.
పిల్లలను స్కూల్ నుండి తీసుకు వచ్చి అప్పటికే వారికి స్నానాలు చేయించి పాలు తాగించింది బేబీ సిట్టర్.
వాళ్ళతో బాక్ యార్డ్ లొ ఒక గంట గడిపాడు. స్వింగ్ సెట్ మీదా, స్లైడర్ మీదా , బైక్స్ నడిపిస్తూ వాళ్ళను సూపర్ వైజ్ చేస్తూనే లాప్టాప్, ఫోన్ పెట్టుకుని హాస్పిటల్ వర్క్ అటెండ్ అవుతూ మధ్య మధ్య చందనతో మాట్లాడుతూ…
ఎనిమిదిన్నరకల్లా పిల్లలను నిద్రపుచ్చి బేబీ సిట్టర్ ను ఆ రోజుకు ఉండమని చెప్పి మళ్ళీ హాస్పిటల్ కు బయల్దేరాడు.
మురళిని ప్రియను ఇంటికి పంపి తను అక్కడ ఉండిపోయాడు.
“ చూసావా, ఇద్దరికిద్దరం ఒక్క క్షణం తీరికలేకుండా బిజీగా ఉన్నామనే కదా మనకిలాటి అవకాశం, ఏకాంతం కల్పించాడు భగవంతుడు.” అంటూ ఆమెను నవ్వించాడు.
అప్పటి చందన కూడా కొంచం తేరుకుంది.
ఆమెకు నచ్చిన పాటలు హం చేసి వినిపించాడు.
చివరిగా ఆమెను నిద్రపొమ్మని చెప్తూ,
“ ఏ కలతలూ లేకుండా పడుకోరా చిన్నారీ, భగవంతుడు సుఖమిచ్చినా బాధ ఇచ్చినానో కంప్లైంట్. కాని బాధలు భరించే శక్తిని ఇమ్మని కోరదా౦” అన్నాడు.
“ హరీ ఉదయం మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాలి కదా నువ్వు… “
“ నా విషయం వర్రీ అవకు. రెండు రోజులు నా డ్యూటీ చార్లీకి అప్పగించా ఫోన్ లొ కన్సల్ట్ చేస్తాడులే..నేనూ మధ్యమధ్య నాప్ తీస్కుకు౦టాలే…”
అన్నట్టుగానే రెండు రోజుల్లో ఇంటికి వచ్చినా బెడ్ దిగటానికి వీల్లేదు. పేరుకి ఇంట్లో ఉన్నట్టే.
ఇంటికి వచ్చాక గాని పిల్లలకు తెలియదు. అంతవరకూ ఇదివరలో లాగానే అమ్మ బయటకు వెళ్ళింది అనుకున్నారు.
అయిదేళ్ళు వచ్చేసరికే చూసే టీవీ కిడ్స్ షోలు పుస్తకాల వల్ల అన్ని విషయాలు అవగాహనకు వస్తాయి పిల్లలకు.
ఆమె కాలు ప్రాక్చార్ అయిందనీ , యాక్సిడెంట్ వల్ల జరిగిందనీ అర్ధమయింది.
“ అమ్మ కాలుకు బుబ్బూ అయింది, డోంట్ ఫాల్ ఆన్ హర. కాలు నొప్పెడుతు౦ది”
ప్రియ చెప్పగానే ఇద్దరూ తలలూపారు.
ప్రియ పిల్లలిద్దరూ కాలేజికి వచ్చారు. అందుకే ఆమెను ఒక వారం ఉండమని వెళ్ళాడు మురళి.
అన్విత మాన్విత కాల్ చేసి మేనత్తను పరామర్శించారు. ‘గెట్ వెల్ సూన్ “ అని విష్ చేసారు.
వారం పది రోజులకు కాలు కొంచం సెట్ అయి సపోర్ట్ తో నడవగలుగుతొ౦ది.
పిల్లలు కొత్త షెడ్యూల్ కు అలవాటు పడ్డారు.
ప్రియను ఫ్లైట్ ఎక్కించి వచ్చాడు హరి.
పిల్లలను చూసుకోడం వారితో కాస్సేపు కూచుని ఎదో ఒక పుస్తకం చదివించటం ఇంటి నుండే వర్క్ చెయ్యటం ఆరంభించింది చందన. మామూలు స్థితికి వస్తుంటే అనిపించింది ఇలాటివి మామూలే కదా అని. ఏదైనా జరగ్గానే బెదిరిపోయి గాభారాపడటం ని౦ది౦చుకోడం నవ్వొచ్చింది.
ఇంకా ఇంకా ఇంతకన్నా తీవ్రమైన సమస్యలు ఉన్నవారు ఎందరో వారికి ఉపశమనం ఏమిటి?
ఆలోచించుకోగా ఎవరో ఎందుకు నేనే వారానికో రోజు వారికేదైనా చెయ్య గలిగితే అనిపించింది. అదే ఆలోచన హరితో పంచుకున్నాక మనసు శా౦తి౦చి౦ది.
వారినికో రోజు నాలుగైదు గంటలు చైల్డ్ వెల్ఫేర్ పేరిట పిల్లలకు ఫ్రీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంది.
ఆదివారం ఉదయం ఎనిమిది నుండి మధ్యాన్నం రెండు వరకు. అపురూపంగా దొరికే వీకెండ్ అలా త్యాగం చెయ్యడం మామూలు విషయం కాదు.
అంతకు ముందు లేని సౌఖ్యమేదో మనసుకు కొత్తగా చేకూరినట్టనిపి౦చి౦ది.
ఇంకా వాకింగ్ స్టిక్ సాయంతోనే నడక సాగుతోంది. చెయ్యి స్లిమ్గ్ తీసేసినా బరువులు ఎత్తడం కష్టం గానే వుంది.
పిల్లల ఆలనాపాలనా పెద్ద ఇబ్బందైన విషయం కాకున్నా ఇది వరకులా కాస్సేపైనా ఎత్తుకోలేక పోడం ఇబ్బందిగానే వుంది.
ముఖ్యంగా మానస నిద్రలేచి ఒక పట్టాన కిందకు దిగిరాదు. బెడ్ రూమ్స్ పైన ఉన్నాయి. కళ్ళు తెరవక ముందే ఎత్తుకుని తీసుకు రావాలి.
“హోల్డ్ మీ “ అంటుంది.
వీలైనంత వరకూ హరి ఆ ఇబ్బంది తెలియకుండా పిల్లను ఎత్తుకుని కిందకు తీసుకు వస్తాడు కాని ఎప్పుడైనా ఆటను ఉదయమే వెళ్ళవలసి వచ్చినా, బయటకు వెళ్ళినా దాన్ని బతిమాలుకోవలసివచ్చేది.
“ నా కాలు కి బుబ్బూ కదా మనూ, నేను నిన్ను ఎత్తుకుని నడవలేను, కిందకు వచ్చెయ్యి, ఇక్కడ నీ చెయ్యిపట్టుకు నడిపిస్తాను” బ్రతి మాలుకునేది.
పొరబాటున పిల్లలు మరచిపోయి మీదకు దూకినా కాలో చెయ్యో నొప్పి చేసేవి. అయినా హారి మాటలు గుర్తు చేసుకునేది.
పిల్లలను చిన్నబుచ్చటం ఇష్టం లేక ఓర్చుకునేది.
ఆదివారం.
ఉదయమే లేచి ఎప్పటిలా తన ఫ్రీ చైల్డ్ కేర్ ట్రీట్మెంట్ కోసం రెడీ అయి బయలుదేరింది.
హారి చందనను దింపి వచ్చి మళ్ళీ ఒక గంట నిద్రపోతాడు.
లేచి కారు తాళాలు తీసుకున్న అతను ఆశ్చర్యంగా మొహం పెట్టడం చూసి, ఎందు కన్నట్టు కళ్ళతోనే ప్రశ్నించింది.
“ చందూ నీ వాకింగ్ స్టిక్ లేకుండానే …”
అవును అసలు ఆ విషయమే గుర్తులేదు. మామూలుగానే నడిచేస్తో౦ది. ఎక్కడా ఇబ్బందీ నొప్పీ కూడా అనిపించలేదు.
“ నువ్వు గుర్తు చేసే వరకూ గుర్తే లేదు హరీ …”
“ఒకే అలాగే కంటిన్యూ చెయ్యి, ఇవే మెడికల్ మిరకిల్స్ , అనుకున్న దానికన్నా ముందే క్యూరవుతాయి. లెట్ అజ్ సిలిబ్రేట్ ఇట్ ఇంద ఈవినింగ్”
ఇద్దరికీ అపరిమితమైన సంతోషం కలిగింది.
నిజమే, అనుకున్న సమయం కన్నా ముందే హీలవడం ….
బహుశా తను చేసే ఈ మంచి పనికి భగవంతుడు ఇచ్చిన వరం కావచ్చు.
ఎంత నిస్వార్ధంగా పని చేసినా ఆ పై వాడు ఉదారంగా స్వీకరించాడు లా వు౦ది.
ప్రతిఫలంగా ఎదో ఒకటి ఇలా ప్రసాదిస్తాడులా ఉంది.
దారిలో సేవేఎస్ ముందు ఆపి చాక్లెట్స్ కొన్నారు పిల్లలకు పంచడానికి. ఏదో చెప్పాలని ఉద్వేగంగా ఉన్నా ఏమీ చెప్పలేక పోయింది. అతని చేయ్యండుకుని కారుదిగి క్లినిక్ లోకి నడిచింది.
ఆదివారం మధ్యాన్నం ఒక గంట నాప్ తీసుకోడం ఇద్దరికీ అలవాటు. పిల్లలు కూడా ఒక్కోసారి వారితో పాటు నిద్రపోతారు.లేదూ బేబీ సిట్టర్ వాళ్ళను ఎంగేజ్ చేస్తుంది.
ఆరోజూ ఇంటికి వచ్చి లంచ్ చేసే సరికి రెండున్నర దాటింది. ఎప్పటిలానే మధ్యాన్నం నిద్రకు సిద్ధమయారు.
కర్తెన్స్ లాగి రూమ్ లొ చీకటి చేసుకు పడుకున్నారు. ఎంతో సంతృప్తి తో ఆనందం తొ నిద్రకు ఉపక్రమి౦చి౦ది చందన. అలవాటు ప్రకారం అమ్మ ఏడ మీద తలపెట్టి పడుకుంది మానస.
నిద్రలోకి జారబోతూ విపరీతమైన నొప్పి అనిపించి మానస తలను పక్కకు జరిపింది. కాని ఓ చిన్న అనుమానం. ఎందుకలా…?
మే బీ ఫిబ్రాయిడ్స్ …..
అన్నీ అనుమానాలే నవ్వుకుని నిద్రలోకి జారుకుంది చందన.

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!