Thursday, April 22, 2021
Home > కథలు > సహ జీవనం! – స్వాతీ శ్రీపాద

సహ జీవనం! – స్వాతీ శ్రీపాద

అబ్బో అప్పుడే వేసవి వచ్చేసినట్టు౦ది. ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. లంచ్ తరువాత క్లాస్ కి వెళ్లి వచ్చేసరికి గోటు ఆరిపోయింది. బాటిల్ తీసుకుని నీళ్ళు తాగి కొంచం విశ్రాంతిగా కుర్చీలో వాలి కళ్ళు మూసుకునే లోగా ఫోన్ బజ్. ఎప్పుడూ పక్క వారికి ఇబ్బందని వైబ్రేషన్ లో పెట్టుకుంటాను.

ఈ సమయంలో కాల్ చేసేది వైదేహి ఒక్కతే,

“హలో చెప్పు వైదూ” అన్నాను.

“అమ్మా రేపు సెలవు తీసుకో, సాయంత్రం ఇంటికి వస్తున్నాను” మరో మాటకు అవకాశం ఇవ్వకుండా పోన్ పెట్టేసింది.

ఏం కొంప మునిగి౦దో, లేపోతే ఇంత హఠాత్తుగా నేనెందుకు గుర్తుకు వస్తాను.
ప్రపంచం పచ్చగా కనిపించినంత సేపూ తనూ తన సరదాలు తప్ప ఎవ్వరూ గుర్తుకు రారు.
కాస్త ఏ విషయమైనా అటూ ఇటూ అయితే చాలు ప్రపంచం తల్లకి౦దులయిపోయినట్టు గాబరా పడిపోతూ పరుగెత్తుకు వస్తుంది.

ఇవ్వాళ ఈ విషయం కొత్తకాదు. ముప్పై ఏళ్ళు వచ్చినా చిన్నపిల్ల వ్యవహారమే.
ఒక్కోసారి నామీద నాకే అనుమానం వస్తుంది, నా అభ్యుదయ భావాలతో పిల్లను సక్రమంగా పె౦చలేదా అని.
ఊహ తెలిసి ఆలోచి౦చగలదు అనుకున్నాక ఇద్దరం చక్కటి స్నేహితులుగానే ఉండే వారం. అవును. ఏ రోజూ ఇదేమిటి అదేమిటి అని అడగలేదు తనను. ఇది చెయ్యి అది చెయ్యి అని నిర్భంధించనూ లేదు.

దేనికి ఏ సమస్యలు రావచ్చో కూలంకషంగా వివరి౦చే దాన్ని.

“ ఆ తరువాత నీఇష్టం వైదూ, ఏది నీకు బాగనిపిస్తు౦దో అది చెయ్యి.”

“రిస్క్ తీసుకోకూడదా అమ్మా?” ఒకసారి అడిగింది.

“మళ్ళీ రిగ్రేట్ అవకపోతే, కష్టమైనా నష్టమైనా స్వీకరి౦చగలిగితే ఎంచక్కా తీసుకోవచ్చు”

జవాబైతే ఇచ్చాను కాని దానికి నా లక్షణాలే వచ్చాయా అనిపించింది.
అల్లాగే కదా కష్టమైనా నష్టమైనా అనుకుని అవినాష్ వెంట నడిచి వచ్చేసినది.
అలా అనుకునే కదా అతని కుటుంబంలో సర్దుకు పోవాలని చూసినది.
ఒక జీవితాన్ని వెచ్చించి ప్రేమ కొనుక్కోవాలనుకోడం ఎంత వెర్రితనం.
తప్పులు ఎన్నదలుచుకోవాలే గాని ఆ సృష్టి కర్తలోనూ కనిపిస్తాయి.
పొడే గిట్టని వాళ్లకి ప్రేమ విలువ ఏం తెలుస్తుంది?
అందుకే కదా ఇలా పిల్లతో ఒంటరి జీవితం ఎంచుకున్నది.
ఎంటెక్ చదివాక పెళ్లి మాట ఎత్తితే

“వద్దమ్మా నాకీ వ్యవస్థ మీద నమ్మకం లేదు. పెళ్లి పేరిట జీవితాలు వ్యాపారం అవడం నాకు నచ్చట్లేదు. ఈగోలు, అధికారాలు, త్యాగాలు ఇవన్నీ అవసరమా? నన్నిలాగే ఉండనివ్వు” అనేసింది.

గట్టిగా ఏమన్నా అంటే “ నీ బాధలు చూసాక కుటుంబ వ్యవస్థమీద నమ్మకమే పోయింది నాకు. ఎక్కడమ్మా ప్రేమ? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. అంతే కదా … మనం ఎంత ఇచ్చినా ఏం తిరిగి వస్తుందో నమ్మకం లేదు. ప్రేమకు ద్రోహ౦ కానుకగా ఇచ్చేవాళ్ళను చూశాం కదా? నాకు పెళ్లి అనే మాటంటేనే కంపరంగా ఉంటుంది. పుట్టి౦టిని, జీవితాన్ని, ఇంటి పేరునూ వ్యక్తిత్వాన్నీ వదులుకుని, తిరిగి కట్నాలూ కానుకలూ ఇచ్చి ఏం బావుకు౦దామని ఈ పెళ్ళిళ్ళు … చిటికెడు నీడ … అదీ అత్తింటి వారు ఇస్తారన్న భరోసా లేదు.” అ౦టు౦ది

‘నీ ఇష్టం ఆలోచించుకో’ ఎప్పటిలానే నా జవాబు.

రెండేళ్ళు అమెరికా వెళ్లి వచ్చింది. అక్కడ ఆర్కిటెక్ట్ గా ప్రతిభా నైపుణ్యాలు సాధించి ప్రస్తుత౦ హైటెక్ సిటీ లో పెద్ద కంపెనీకి వీపీ గా వుంది.

అక్కడే అపార్ట్మెంట్ తీసుకు౦ది.
అమెరికాలో ఉన్నప్పుడు ఒకరిద్దరు దగ్గరైనా అది ప్రేమ వరకూ రాకము౦దే కులమతాలు, ఆర్ధిక స్థోమత చర్చకు రాడంతో దూరం జరిగింది వైదేహి. అమెరికా వెళ్ళినా వేషభాషల్లో మార్పు తెచ్చుకున్నా మనసులు మాత్రం ఇరుకు సందులే.
వైదేహి ఏం జరిగినా నాతో చెప్పకుండా ఉండలేదు. ఇద్దరి మాటల్లో ఎన్ని చర్చలో.
చివరికి పర్సనల్ ఫీలింగ్స్ తో సహా.

మర్నాడు ఏదో అబద్ధం చెప్పి సెలవు అప్ప్లై చేసి ఇంటికి వచ్చాను. ఇంకో రెండు మూడు గంటల్లో వైదేహి వస్తుంది. ఈ మధ్యన ఇటు వైపు వచ్చి రెండు నెలలు దాటింది.
అవును.
ఇదివరకు వారం వారం వచ్చేది. విక్కీ తొ పరిచయమయాక అది మొదట్లో పదిహేను రోజులకోసారి ఆ తరువాత ఆదివారాలు అతనితో కలిసి వచ్చి చూసి వెళ్ళడం, ఆ తరువాత నెలకో సారిగా మారి గత ఏడాదిగా ఫోన్ మాటలు ఎక్కువ రాకపోకలు తక్కువ అయ్యాయి.

సమ్మర్ వెకేషన్ లొ పిల్లలతో స్కూల్ ట్రిప్స్ ఆ తరువాత నా స్లిమ్మింగ్ ప్రోగ్రాం ఇంటి రిపేర్లు సమయమే తెలిసేది కాదు. తీరిగ్గా టీవీ చూడటం, నచ్చిన సినిమాలకు వెళ్ళడం తోచినది చెయ్యడం. ఇంతకన్నా ఏ౦ కావాలి జీవితం లో.

ఒకరిద్దరు చిన్ననాటి మిత్రులు కలిసినా వాళ్ళు వాళ్ళవాళ్ళ సంసారాలలలో పీకలదాకా మునిగి, కొడుకుల పిల్లలకో కూతుళ్ళ పిల్లలకో సేవలు చేస్తూ క్షణం తీరికలేకుండా అందరి జీవితాలూ వీళ్ళే బ్రతికేస్తున్నారు.

వసు కూతురు హైటెక్ సిటీ లొ పని చేస్తుంది.
దాని కూతురిని పొద్దునే ఎనిమిదిలోపు వసు దగ్గర దింపి ఆఫీస్ కి వెళ్తే సాయంత్రం ఏడూ దాటాక వసుదాన్ని వాళ్ళింట్లో దింపి రావాలి.
మొగుడూ పెళ్ళాలిద్దరూ ఆ మూడేళ్ళదాన్నిచూసి చూసి నిస్త్రాణకు వచ్చేస్తున్నారు.
ఎక్కడన్నా డే కేర్ లో వెయ్యమంటే కూతురు వినదు.

“పిల్లలు అందరిలో సిక్ అవుతారు అమ్మా… అయినా ఏం పెద్దపని? వేళకు పాలుతాగి౦చి తిండి పెడితే నిద్రపోతుంది కదా -అంటుందట కూతురు.

“ఆ పాలు తాగించడానికి మూడు ఊళ్లు, తిండి తినడానికి ఏడూ ఊళ్లు తిప్పుతుంది. ఒక్క క్షణం పక్కకు చూపు మళ్ళినా ఏదో ఒకటి సర్వ నాశన౦. పట్టుమని మధ్యాన్నం ఒక అరగంట పడుకోదు. దాన్ని దింపి వచ్చే సరికి ఎవరో దుడ్డు కర్రతో చావబాదినట్టు అయిపోతున్నాం. నువ్వు అదృష్ట వంతురాలవే” అంది ఏడవలేక నవ్వుతూ.

మొత్తానికి ఎవరిని చూసినా నా అంత ఆనందంగా ఎవరూ లేరని అనిపించింది.
వేడి వేడిగా రెండు కప్పులు టీ తాగాక ప్రాణం లేచి వచ్చింది.
ఇల్లు కొంచం సర్ది దాని గదిలో బెడ్ షీట్స్ మార్చి బాత్ రూమ్ లొ టవల్ మిగతా షాంపూ, షొప్ లాటివి పెట్టి ఇహ వంట మొదలుపెడదామనుకుని కూడా వచ్చాక చేసుకోవచ్చులే అని ఆగాను.
ఏడున్నరకు కాబోలు ఓరగా వేసి ఉన్న డోర్ ధడాల్న తెరుచుకుని వచ్చింది వైదేహి.
కాస్త చిక్కినట్టుంది. వస్తూనే సూట్ కేస్ ఓ మూలకు తోసి వచ్చి పక్కన కూచుంది.

“ఎందుకే …” అంటూ లేచి వెళ్లి టీ తెచ్చాను.

టీ తాగి దాని గదిలోకి వెళ్తూ “ ఒక్క అరగంట, రెడీ అవు బయటకు వెళ్దాంఅంది.
విక్కీ రాలేదు. అతనితో సహజీవనం చేస్తున్న రెండేళ్ళలో ఇలా అది ఒంటరిగా రాదం మొదటి సారి. ఏం జరిగిందో …
అయినా ఎప్పుడూ అడిగే అలవాటు లేదు.

ముందుగా డిన్నర్ చేద్దామని మాల్గుడికి వెళ్లాం. తీరిగ్గా వాడు సర్వ్ చేసి మేం తినే సరికి తొమ్మిదిన్నర దాటింది.
ఏవో ఆఫీస్ విషయాలు, ప్రెండ్స్ గురించి చెప్తూనే ఉంది. కాని నేను ఎదురు చూసిన ప్రస్తావన లేదు.

“కాస్సేపు టాంక్ బండ్ మీద తిరుగుదాం అమ్మా”

అది మా ఇద్దరికీ ఉన్న అలవాటు. ఒక అరగంట ఆ చివరినుండి ఈ చివరిదాకా నడిచి ఆ గాలినీ నీటి తరగల గుసగుసల్నీ, వెన్నెల మేసి కనురెప్పలు వాలుతున్న చల్లదనాన్నీ ఇంటికి మోసుకెళ్ళి ప్రశాంతంగా నిద్రపోడం.
తీరిగ్గా నడుస్తుంటే ఉన్నట్టుంది చటుక్కున ఆగి..

“అమ్మా, ఎంత లేదనుకున్నా ఎంత కాదనుకున్నా మనిషి లోలోపల నా అనే ఫీలింగ్ పోదు కదూ…. ఎంత వ్యామోహం పెంచుకోకూడదని ఆధునికత, సహజీవనం, ఆర్ధిక స్వేచ్చ, హక్కులు అధికారాలు ఎన్ని మాట్లాడినా …”

“ఏం జరిగింది వైదూ, విక్కీతో ఏదైనా గొడవా?” చాలా మామూలుగా అడిగాను.

“ అబ్బే గొడవ ఏమీ లేదు. ముందే ఇద్దరం అనుకున్నాం కదా ఎవరి ఇష్టాలు వారివి, ఎవరి స్వేచ్చ వారిది. ఎవరి ఖర్చులు వారివి ఇద్దరం మిత్రులుగానే కలసి ఉందామని, అలాగే ఉన్నాం కూడా. కాని ఈ మధ్యన సాంప్రదాయికంగా పెళ్లి చేసుకున్న భార్యలాగా, అతని మీద సర్వ హక్కులూ నావే అన్న ఫీలింగ్ వచ్చేసింది. అతను ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడినా కోపంగా వుంది.

చివరికి అమ్మా నాన్నను చూసివస్తానన్నా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడేమో అని ఓ మూల అనుమానం.”

పెద్దగానవ్వాను. నవ్వి నవ్వి అలసిపోయే వరకూ నవ్వాను. కళ్ళవెంట నీళ్ళు వచ్చే వరకూ నవ్వాను.
తెల్లబోయి౦ది వైదేహి.

పొరబోయి దగ్గు వచ్చి తగ్గాక వైదూ చేతిని నా చేతుల్లోకి తీసుకున్నాను. “ఒక్క మనుషులకే కాదు వైదూ … సమస్త ప్రాణులకూ ఈ నా అనే భావం లేకపోతే బ్రతకాలన్న జిజ్ఞాస ఉండదు.

పుట్టిన మరుక్షణమే తల్లితో స్పర్శానుబంధం, తండ్రితో ఆత్మానుబంధం పెంచుకున్నా తండ్రి, కన్నా తల్లి తననే బాగా చూడాలనీ తండ్రి తల్లికన్న మిన్నగా ప్రేమి౦చాలనే అనిపిస్తుంది. ఇహ తోడబుట్టిన వారిమధ్య ఆ సిబ్లింగ్ రైవలరీ అందరికీ తెలిసిందేగా… సినిమాల్లో చూపించినట్టు పాటలు పాడుకోకున్న ఈ ఈర్ష్య అసూయలతో మాట కూడా మాట్లాడుకొని వాళ్ళు ఎందరో…

కలిసి పెరిగిన తమకన్నా పరాయి౦టి నుండి వచ్చిన సహచరులను ఎక్కువ ప్రేమిస్తారన్న అసూయ …
ఇహ సహజీవనమైనా, సంప్రదాయమైనా జీవితం పంచి ఇచ్చాక తమతోనే లోకం కావాలన్న తపన. అతి సహజం రా..
రాజీ అనేది ఎక్కడయినా తప్పదు. అయితే ఎంత? కుచ్ ఖోకర్ పానా, కుచ్ పాకర్ ఖోనా ఎంత నిష్పత్తి అనేది ఎవరికీ వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇది కొత్త కాదురా చిన్నా …”

చాలా సేపు వెన్నెట్లో కూచుని లేచి కారేక్కబోతు౦టే అంది
“ విక్కీ నేను పెళ్లి చేసుకుంటాం అమ్మా”

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

One thought on “సహ జీవనం! – స్వాతీ శ్రీపాద

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!