Sunday, October 2, 2022
Home > పుస్తక పరిచయం > ‘సినీవాలి’.. రంగుల ప్రపంచం లోని అన్ని రంగాల్ని చర్చించిన కమర్షియల్ నవల.

‘సినీవాలి’.. రంగుల ప్రపంచం లోని అన్ని రంగాల్ని చర్చించిన కమర్షియల్ నవల.

నిజాన్ని పచ్చిగా, నిక్కచ్చిగా చెప్పాలంటే ఎంతో గట్స్ కావాలి. అలాంటి రచనే ‘సినీవాలి’.

డబ్బు, సెక్స్, ప్రేమ ప్రతి మనిషి కి అవసరమే.. కానీ ద్వేషం, పగ, ప్రతీకారం మనిషిని ఆవహిస్తే అది ఎదుటివాళ్లనే కాదు తనని కూడా దహించి వేస్తుంది. అంతరంగాల్లోకి తొంగి చూస్తే ప్రతి స్త్రీ గొప్పగా కనిపిస్తుంది.

‘తెల్లని వన్నీ పాలు కావు’ అన్నట్లు సినిమా జీవితం కూడా అంతే. కష్టాలు సామాన్య మానవుడికే కాదు అన్ని వర్గాల వారికీ, అన్ని రంగాల వారికీ ఉంటాయి. ‘సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి’. మనకి తెరమీద కనిపించేవి కథలు మాత్రమే.. కానీ తెరవెనుక తారల జీవితాలలో నిత్యం తొంగి చూసే వ్యధలు ఎన్నో ఉంటాయని చెప్తుంది ‘సినీవాలి’. వాళ్ళ ఆటోగ్రాఫ్ ల వెనుక, స్మైలీ సెల్ఫీల వెనుక ఎన్నో త్యాగాలు, ఎత్తులు పై ఎత్తులు, జిత్తులమారి చేష్టలు, చీకటి కోణాలు ఎన్నో దాగివుంటాయన్నది చెప్తుంది.

ప్రతినిత్యం వెంటాడే ఆకలి కష్టాలు కొందరివైతే, అధికార దురహంకారం కొందరిది. స్త్రీ అందానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కానీ ఆడది అంటే అనుభవించడానికి మాత్రమే అన్నట్లు చూసే నీచుల ఆకృత్యాలు ఇందులో కనిపిస్తాయి. తనకు సన్నిహితంగా ఉన్నంత వరకు శృంగార తారామిత్రులే.. విడిపోతే, వ్యతిరేకిస్తే వ్యభిచారిని దానికేంటి అంత ప్రాముఖ్యత ఇవ్వడం అంటారు. ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామా అనిపిస్తుంది. సినీ రాజకీయాలు ఇలా ఉంటాయా అనిపిస్తుంది. అయితే ఇవన్నీ నాణేనికి ఒకవైపైతే ఇంకోవైపు ఎలాగైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన లక్ష్యాన్ని సాధించాలనే తపన వదిలిపెట్టొద్దని చెప్తుంది. సెక్స్ కి ప్రేమకి తేడా చెప్తుంది. సినిమా కోసం ఎంతమంది ఎన్ని రంగాల్లో పనిచేయాలో అవగాహన కలిపిస్తుంది. సమకాలీన సినివ్యవస్థను ఎండగడుతుంది. కొత్తగా ఈరంగానికి వచ్చేవారికి ఈ వ్యవస్థ ఇలా పని చేస్తుందని వివరిస్తుంది.

రచయిత, పాఠకులకు ఓ వైపు నవ రసానుభూతుల్ని కలిగిస్తూనే మరోవైపు వాస్తవికతను చర్చిస్తాడు. సమకాలీన సంఘటనలకు కొంత మార్పులు చేర్పులు చేసి అక్షర రూపమిచ్చి కథలో ఇమిడ్చి నేటి వ్యవస్థకు చాలా దగ్గరగా పోలుస్తాడు. నిర్భయంగా పలువురి పేర్లు ప్రస్తావించి పాఠకుడికి ఇది కథ కాదు రియల్ స్టోరీ అనే భ్రమను కలిగిస్తాడు.

ప్రతి సినిమా ప్రేమికుడు, సినీ కార్మికుడు, సినీ కళాకారుడు చదువుకోవాల్సిన నవల.

కథ విషయానికి వస్తే…

సినిమా నేపధ్యంలో సాగిన ఒక దర్శకుడి ఊహాత్మక కథ. ఆకలి కష్టాలతో వ్యభిచారినై, అటుపై సినీ తార అయి తన బిడ్డ భవిశ్యత్తు బాగుండాలని, తన శరీరాన్ని,తన జీవితాన్ని తాకట్టు పెట్టి ఓడిన ఓ తల్లి కథ. ఏది తప్పో ఏది రైటో తెలియని వయసులో నా అనుకునే వాళ్ళ చేతుల్లో నలిగిపోయిన ఓ పసి హృదయగాద. దిక్కెవరు లేని స్థితిలో కొంగు పరిచి కష్టాలు తీర్చుకుంటూ కడుపు నింపుకుని పెరిగిన ఓ కన్నె కథ.. ‘కళామతల్లి’ కి సేవ చేయాలంటే కొందరికి కమిట్ కాక తప్పదని చెప్పిన ఓ కళాకారిణి కథ. పవిత్రత అంటే శరీరానికి కాదు మనసుకు సంబంధించినదని ప్రేమలో పడి పునీతమైన ఓ స్త్రీ కథ. హీరోయిన్ ని చాలా ఉన్నతనంగా చూపించాలి అని తపన పడి ఆరాధించిన దర్శకుడి కథ. సెక్సువల్ అట్రాక్షన్ వేరు ప్రేమ వేరు అని తెలుసుకున్న ఓ సామాన్య మానవుడి కథ.

మొత్తంగా రచయిత దర్శకుడిగా తన స్వీయ అనుభవాలకు, వాస్తవాలను జోడించి తన ఊహలచే థ్రిల్లర్ గా మలిచిన ప్రణయకథ.

-అక్షర్ సాహి
aksharsahi@gmail.com

Cinevali
by Prabhakar Jaini

For Copies
All Leading Book Shops(AP & Telangana)

Price: Rs 400/-

Or

Purchase by sending Rs 250/- through PAYTM to 7989825420.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!