Tuesday, July 14, 2020
Home > కథలు > హర్టయ్యావా…అమ్మమ్మా…?! -వి.సునంద

హర్టయ్యావా…అమ్మమ్మా…?! -వి.సునంద

అన్నపూర్ణ మనసు పురివిప్పిన నెమలిలాగుంది..కాలు ఒక చోట కుదురుగా నిలవడం లేదు.
అమెరికా పోయొచ్చిన దాని కంటే ఎక్కువగా సంతోషపడుతున్న భార్యను చూసి, నారాయణ రావు కూడా అందులో పాలు పంచుకుని ఆనంద పడుతున్నాడు…

అంతే కదా ..పెళ్ళినాడు మర్యాదలు, పెట్టుబోతలు సరిగా లేవని తమ అంతస్తుకు తగ్గట్టుగా చూడలేదని వియ్యాలవారితో పాటు అలిగిన అల్లుడు..మూడు నిద్రలు ముచ్చట్లేమీ లేకుండానే కూతురిని తీసుకొని పోయాడు…

పురుళ్ళు పుణ్యాల అవసరాలకు అన్నపూర్ణను మాత్రమే పిలిపించుకుని పిల్లలకు సేవలు చేసే ఆయాలా చూసాడే తప్ప ఏనాడూ అత్తగారిని అభిమానంగా చూడలేదు.

కూతురూ అల్లుడి చేతి కీలుబొమ్మలా మారి తనతో అంటీ ముట్టనట్టుగా వుందని భర్తతో చెప్పి గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే వుండేది అన్నపూర్ణమ్మ.

అలాంటి కూతురు మనుమడు మనుమరాలితో కలిసి “వుయ్ మిస్ యూ‌….రా అమ్మా, రా అమ్మమ్మ అన్న మాటలు చెవుల్లో అమృతధారలు కురిపించినట్టయింది ఇద్దరికీ.

భర్తతో ఇద్దరం కలిసి వెళ్దాం రమ్మంది..తనైతే పేగుబంధం కోసం మాట పట్టింపులను ఎప్పటికప్పుడు తుడిచేసుకుంది కానీ, నారాయణ రావు మనసులో అల్లుడు చేసిన గాయమింకా పచ్చిగానే వుంది…” ముందు నువ్వెళ్ళవోయ్ …తర్వాత నేనూ వస్తానంటూ మాట దాట వేశాడు..

భర్త మనసు తెలిసిన అన్నపూర్ణ బలవంతం చేయలేదు.

అన్నపూర్ణ హడావిడి అంతా ఇంతా కాదు. వారం రోజుల పాటు పొయ్యి మీది మూకుడు దించకుండా రకరకాల పిండివంటలు చేసింది…ఇంట్లోని పచ్చళ్ళను ప్యాక్ చేసింది. భర్తతో కలిసి జువెలరీ షాపుకెళ్ళి మనుమరాలికి వంకీలు వడ్డాణం, పాపిటబిళ్ళ స్వాతి హారం ఆర్డరిచ్చింది. బట్టల షాపుకెళ్ళి పద్నాలుగేళ్ళ మనుమరాలు ఎంతుంటుందో ఊహించుకుని పట్టు పరికిణీ వోణీలు కొన్నది. బిడ్డకు పట్టు చీరలు అల్లుడికి మనుమడికి ఖరీదైన డ్రస్సులు కొన్నారిద్దరు. అయినా లోలోపల తెలియని టెన్షన్..

నారాయణ రావు ముంబైకి తత్కాల్ లో టికెట్ బుక్ చేశాడు… వెళ్ళేటపుడు ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకున్నారు…కోటి కాంతుల ఆనందాన్ని నింపుకుని వయసును మరచి పరుగులు తీస్తూ వెళ్తున్న భార్యను చూస్తుంటే కొద్దిగా అసూయగా అనిపించింది నారాయణ రావుకు. పసి మొహాలను చూసి, సేవ చేసి తరించింది.. మరి తనో ఇంతవరకూ వాళ్ళ ముద్దు ముచ్చటకు నోచుకోలేదు..”.పిలవని పేరంటం చెప్పని ఒక్కపొద్దు అన్నట్టు” తనను ఏనాడూ రమ్మని అల్లుడు పిలవలేదు. తనంత తనుగా వెళ్ళడానికి అహం అడ్డొచ్చి వెళ్ళలేక పోయాడు.

‌‌‌ …………

రైల్వే స్టేషన్ లో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన కూతురు సుజాతను చూసి ముందు గుర్తు పట్టలేదు అన్నపూర్ణ. మోకాళ్ళు దాటే జడ ఇప్పుడు పోనీ టైల్ గా మారింది. పంజాబీ డ్రస్సులో కొత్తగా కనిపించింది.”.హాయ్ అమ్మా! హౌ ఆర్యూ” అన్న కూతురు మాటలు అర్దమయ్యి తల పంకించింది బాగానే వున్నానని..దారిలో మొత్తం సంభాషణంతా హిందీ ఇంగ్లీషులో జరుగుతుంటే ఉత్సాహం నెమ్మది నెమ్మదిగా నీరుగారి పోసాగింది…

ఆ రోజు ఆదివారం అంతా ఇంట్లోనే వున్నారు.. అన్నపూర్ణను చూసి అపరిచితురాలు అన్నట్టుగా ఎవరూ పలకరించకుండా తమ పనులలో నిమగ్నమై వున్నారు..ఇంట్లోకి అడుగు పెట్టిన వ్యక్తిని పలకరించడం కనీస సంప్రదాయం..మరి వీళ్ళేమిటి….! ఇలా అసలు ఫోన్లో మాట్లాడింది వీళ్ళేనా…తనేమైనా పొరపాటు పడిందా…అంతర్మధనం మొదలయ్యింది అన్నపూర్ణలో…

తనే మనసుకు సర్ది చెప్పుకుని అల్లుడికి నమస్కారం చెప్పి పలకరించింది..ప్రతి నమస్కారం కూడా చేయకుండా అఁ అని గదిలోకి వెళ్ళిపోతున్న అల్లున్ని చూసి నిశ్చేష్టురాలయ్యింది…

మనుమడు చెవులలో తీగలేవో పెట్టుకొని ఇతరులను గమనించే స్థితిలో లేడు…మనుమరాలు ఫోనులో ఎవరితోనో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతోంది..

అసలెందుకొచ్చానా రెక్కలుంటే బాగుండు వెంటనే వెనక్కి
ఎగిరి పారిపోవాలనిపించింది అన్నపూర్ణకు.

కూతురు సుజాత వాళ్ళ దగ్గరకు వెళ్ళి కుదిపి చెబితే. హాయ్! అని వారి లోకాల్లో మునిగి పోయారు.
అప్పటి వరకూ పాతికేళ్ళు వయసు తగ్గినట్టుగా పరుగులు పెట్టిన అన్నపూర్ణకు ఇప్పుడు పాతికేళ్ళు మీదబడ్డట్టయ్యింది..

కూతురే తల్లిని ఫ్రెషప్ అవమనీ ఆమె కోసం కేటాయించిన రూమ్ చూపెట్టింది..తలార స్నానం చేసి వచ్చాక ప్రయాణ బడలిక తీరింది..పనమ్మాయి చేసిన వంటలన్నీ అలాగే వున్నాయి..అదేమిటమ్మా! మీరు తినలేదా. అనుమానంగా అడిగింది..రోజూ ఇంతేనమ్మా” వంటమనిషికి ఇది చెయ్యి అది చేయి అని ఆర్డరిస్తారు..అంతలోనే మరో నౌకరుతో హోటల్ నుండి ఇష్టమైనవి తెప్పించుకుంటారు” అంది కూతురు.

“ఎంత సిరి వుంటే మాత్రం ఇంత దుబారానా” వీళ్ళను మార్చగలదా అనుకుంది…అన్నపూర్ణ.
తను తెచ్చిన వస్తువులు చూపించాలన్న ఉత్సాహమే పోయింది ఆమెలో..

ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చిన మనుమడు మనుమరాలు హాయ్! అమ్మమ్మా అంటూ పలకరించారు అది ఇంగ్లీషులోనే…ఏం రా తెలుగు మాట్లాడరా! మీరు? అనగానే “తెలుగా” పరిహాసంగా నవ్వుతూ..

ఇంతలో సుజాత కల్పించుకుని వాళ్ళకు అమెరికా పోవాలని కోరిక.. అందుకే తెలుగు మాట్లాడటం లేదు అంతా ఇంగ్లీషే… తెలుగు దాదాపు మరచి పోయారని చెప్పింది. అక్కడికి వెళితే మాత్రం అలా మరచి పోవాలా అంతు పట్టలేదు అన్నపూర్ణకు. అవసరం లేని విశాలమైన గదులున్నాయి కానీ విశాల మైన మనసులే లేవనుకుంది..

తను తెచ్చిన పిండివంటలు పచ్చళ్ళను ఫ్రిజ్లో పెట్టింది..బట్టలు,నగలు తనకిచ్చిన రూమ్ లోని బీరువాలో దాచేసింది… ఆ రాత్రి తన బాధనంతా కన్నీళ్ళతో తలగడకు పంచి వెక్కి వెక్కి ఏడ్చి గుండెలోని భారాన్ని దింపుకుంది అన్నపూర్ణ…

పొద్దున్నే లేచి తయారయి వంటగదిలోకి వచ్చింది…స్నానాదికాలు కాగానే భర్తతో కలిసి టీ తాగే అలవాటు తనకు. వంట మనిషి ఇంకా రాలేదు..ఎక్కడ ఏమున్నాయో తెలియదు..తల్లి అలికిడికి సుజాత లేచింది..” హాయ్!అమ్మా! గుడ్ మానింగ్” పలకరించి, టీ పెట్టి తల్లికి తనకూ కాఫీ తెచ్చుకుని తాగుతున్న కూతురు వంక చిత్రంగా చూసింది… పిల్లలంటే వేరు దీనికేమయింది..” సుఖమొస్తే ముఖ కడుగ దీరదన్నట్టు”… తల్లి మనసులో భావాన్ని కనిపెట్టి బెడ్ కాఫీ అంటారమ్మా అంది..

అల్లుడూ పిల్లలది అదే తంతు…వంట మనిషి వచ్చింది..మెనూ అడిగి టకాటకా శాండ్విచ్ లు,బర్గర్ లు ఇంకేమిటో తనకు తెలియనివి చేసి పెట్టింది పనిమనిషి.

ఏవీ గొంతు దిగలేదు…అన్నపూర్ణ అవస్థ చూసి పిల్లలూ అల్లుడూ” విలేజ్ కదా ఏం తెలుస్తాయ్” వ్యంగ్యంగా అనుకొని నవ్వుకుంటుంటే, ఈ వయసులో నన్ను పిలిపించుకుని ఏడిపించడానికా ‘అనుకుంది బాధగా..పిల్లల వేషధారణ చూసి నివ్వెరబోయింది..పొట్టి డ్రస్సులో ఒళ్ళంతా కనబడేలా మనుమరాలు, ప్యాంట్ షర్టు లో కూతురు, ఆఫ్ నిక్కర్ లో మనుమడు… తనున్నది అమెరికా లోనా అని భ్రమ కలిగింది అన్నపూర్ణకు..

ఖాళీగా వుండటం ఇష్టం లేక జాబ్ చేస్తున్నానని తల్లితో చెప్పింది… తయారై వచ్చిన సుజాత
తల్లికి జాగ్రత్తలు చెప్పి, తను ఫైవ్ ఓ క్లాక్ వరకు వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది..

“యధారాజా తదా ప్రజా అంటే ఇదే” అనుకుంటూ ఓపికున్నంత వరకు ఇళ్ళంతా సర్దింది..బాసుమతి బియ్యం కనబడితే వాటినే వుడకేసుకుని అందులో తను తెచ్చిన పచ్చళ్ళను కలుపుకుని తిన్నది.. మధ్యలో ఎవరో ఆడామగా పిల్లల్ని అరడజను మందితో వచ్చాడు బీ టెక్ చదువుతున్న మనుమడు..వాడి గదిలోకి వెళ్తూ అక్కడ కనబడిన అమ్మమ్మను చూపుతూ..షి ఈజ్ మా గ్రాండ్ మా.. తెలుగు తప్ప మరేం రాదు అంటూ..పరిచయమైనా చేయకుండా తీసికెళ్ళాడు…లోపల ఇకఇకలు పకపకలు పెద్ద సౌండ్ తో మ్యూజిక్ పెట్టుకుని డాన్స్ చేస్తున్న వాళ్ళను కిటికీలోంచి చూసి ఏం చేయాలో అర్ధం కాక తలపట్టుకుంది…

తల్లి వచ్చే టైమ్ కు బయటకు వెళ్ళి ఎప్పుడో ఏడింటికి చదివి చదివీ అలసి పోయిన వాడిలా ఇంటికి రావడం… మనుమరాలు కూడా అదే తంతు ఇంటికి వచ్చాక కూడా ఆపకుండా సెల్ లో ముచ్చట్లు..” ఎవరికి వారే యమునా తీరేలా” వుంది ఇల్లు.

మనుమడి విషయం కూతురుకు చెప్పాలా వద్దా తెలియడం లేదు. రోజులు గడుస్తున్నాయి…

యధా ప్రకారం స్నేహితులను వెంటేసుకొచ్చిన మనుమడు గదిలో ఆరోజు మ్యూజిక్ కాకుండా మరేదో పెట్టుకుని చేతుల్లో కూల్డ్రింక్స్ తాగుతూ ఒకరిపై ఒకరు పడి వంటి మీద స్పృహ లేకుండా అసభ్యంగా ప్రవర్తిస్తుంటే చూడలేక పోయింది..బ్లూ ఫిల్మ్ అది…తలుపులు వేసుకోవడం లేదు ఈమధ్య.

ముసల్ది ఏం చేస్తుందిలే అన్న ధీమా…వెళ్ళి ప్లగ్ పీకేసి ఒంట్లో బలాన్నంతా ఉపయోగించి మనుమడి చెంపల్ని పటాపటా వాయించింది…అలాగే అక్కడున్న ఆడామగా అందరి చెంపలు వాయించింది..హఠాత్తుగా జరిగిన సంఘటన నుంచి వాళ్ళింకా తేరుకోలేక పోతున్నారు..కూల్ డ్రింక్ పేరుతో వారు తాగేది మందని అర్ధమయ్యింది…ఫ్రిజ్ లోని నీళ్ళు తెచ్చి మనుమడి మీద వాళ్ళ మీద గుమ్మరించింది..మనుమడికి బలవంతంగా మజ్జిగ తాగించడంతో మత్తు దిగి చాలా సేపటికి మామూలు మనిషయ్యాడు..ఎదురుగా అమ్మమ్మ పులిలా ఉగ్రరూపంతో కనిపించేసరికి బిత్తరబోయాడు..జరిగిందంతా కొద్ది కొద్దిగా గుర్తుకు వచ్చి తన చుట్టూ చూశాడు..వాళ్ళింకా మత్తులో జోగుతున్నారు.. తన తప్పు తెలిసింది..ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్న మనుమడితో వాళ్ళను లేపించింది..మత్తునుండి ఒళ్ళు విరుచుకుంటూ లేచిన వాళ్ళను పంపించేసింది…

మొత్తం గదంతా నీట్ గా సర్ధి మనుమడిని దగ్గరకు తీసుకుని తన చేతివేళ్ళ అచ్చులతో కంది పోయిన బుగ్గలను తడిమి ఏడ్చింది ..” ఏం రా కన్నా! నేను ఎన్నో ఊహించుకుంటూ మిమ్మల్ని గొప్పగా చూసి తరించి పోదామని, మీ మాటలకు మురిసిపోయి వచ్చాను.. నన్ను మీరు పట్టించుకోకపోయినా ఫరవాలేదు కానీ మీ భాష, వేష ధారణ, అలవాట్లు ఇంత దారుణంగా వుంటాయని ముందే తెలిస్తే ఈ గడప తొక్కేదాన్ని కాదురా!.. డబ్బు మనిషిని దిగజార్చకూడదు..చదువు సంస్కారాన్ని నేర్పాలి…మన పద్ధతులు అలవాట్లను వాళ్ళు ఆదర్శంగా తీసుకుని పాటిస్తుంటే. మీరేమో యిలా. అసహ్యంగా…ఆపేసి మనుమడి వైపు చూసింది…

అమ్మమ్మ కొంగులో చిన్నపిల్లవాడిలా ముఖం దాచుకుని.. కన్నీళ్ళతో తప్పయిపోయింది అమ్మమ్మా! మంచీ చెడు చెప్పేవారు లేరు..కావలసినంత డబ్బు ఇచ్చారే కానీ ఇలా మాకు మంచి మాటలెప్పుడూ చెప్పలేదు. ఎవరి ఫ్రెండ్స్ తో వాళ్ళం ఎంజాయ్ చేయడమే జీవితమని తెలుసు అమ్మమ్మా!..అన్నాడు.

నిజమే వీళ్ళ తప్పేం వుంది…డబ్బులివ్వడమే తెలుసు గానీ. ఈ వయసులో పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలాంటి వారితో తిరుగుతున్నారు..అసలు పిల్లలకు ఏం కావాలో తెలుసుకోక పోవడం తల్లిదండ్రులదే అసలు తప్పు…ఆలోచిస్తూ వాడికి జీవితమంటే ఏమిటో తన అనుభవాలను రంగరించి చెప్పింది. అప్పటి నుండి మనుమడిలో వస్తున్న మార్పును గమనించసాగింది.

ఆరోజు మనుమరాలి పుట్టిన రోజు. అల్లుడు బిడ్డల ఆర్భాటం, హడావిడి చూస్తూనే వుంది..మనుమరాలిని దగ్గరకు తీసుకోబోతుంటే ఛీ! ఛీ! ముసలి వాసన అంటూ దూరం జరిగిన కూతురిని చూసి నవ్వుతూ” అలా అయితే అమ్మమ్మకు సెంటు కొడదామా” అంటున్న తల్లిని అమ్మమ్మను మార్చి మార్చి చూశాడు మనుమడు…

అన్నపూర్ణ ముఖం మీద చిరునవ్వు చెరగనీయకుండా “అవునురా అమ్మడూ! నాది ముసలి వాసనే!
ఈ ఒక్కసారికి నా వాసన భరించి నేను చెప్పిన మాట వినురా” బతిలాడింది..

‘పాపం పోనీలే ఈ ఒక్కసారికి విను’ అంటున్న కూతురు మాటలకు ఒప్పుకున్న మనుమరాలిని తనున్న గదిలోకి తీసికెళ్లింది…మనుమరాలికి తను తెచ్చిన పట్టుపరికిణీ వోణీ వేసి, పోనీ టైల్ ను తీసేసి తన సవరంతో పొడవాటి జడ వేసింది.. మనుమడితో పూలు తెప్పించి జడకు కట్టింది…తెచ్చిన నగలను అలంకరించింది.. ముద్దుగా సంప్రదాయ దుస్తుల్లో అందంగా కనిపిస్తున్న కూతురిని చూసి మురిసిపోతున్న అల్లుడూ బిడ్డల కళ్ళల్లో మెరుపులను గమనించింది… మనుమరాలికి ఇదంతా కొత్తగా ఆనందంగా వుంది.

“వేడి మీదనే లోహాన్నిమనకిష్టమైన ఆకృతిలో మార్చుకోవచ్చన్న సత్యాన్ని” తెలిసిన అన్నపూర్ణ.. ఆ నలుగురూ వినేలా తన మనసులోని బాధను ,పిల్లల పట్ల పెద్దవాళ్ళ బాధ్యతను, వాళ్ళ కందించాల్సిన ప్రేమాభిమానాలతో పాటు మన దేశ మహోన్నత సంస్కృతిని గురించి చెబుతూనే, కళ్ళు తిరిగి పడిపోయింది.

మనుమడు ఒక్క ఉదుటున అమ్మమ్మ దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకుని తీసికెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. చల్లని నీళ్ళతో ముఖం తుడిచాడు.

నెమ్మదిగా కళ్ళు తెరిచిన అన్నపూర్ణమ్మతో “హర్టయ్యావా…అమ్మమ్మా! మమ్మల్మి క్షమించు” అంటున్న పిల్లలతో పాటుగా అల్లుడూ బిడ్డ కళ్ళతోనే వేడుకుంటుంటే తృప్తిగా నవ్వింది.,

“ఒరేయ్ మనవడా! మరిచి పోయావా..? ఈరోజే కదా నా ప్రయాణం అంది”.. ముగ్గురు తెల్లబోయి చూస్తుంటే.. అవును అమ్మమ్మా!తాతయ్య టికెట్ బుక్ చేసి ఫోన్ చేశాడు అన్నాడు.

-వి.సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!