Sunday, October 2, 2022
Home > కథలు > మన కోసం బతుకుదాం ఇకనైనా! -వి.సునంద

మన కోసం బతుకుదాం ఇకనైనా! -వి.సునంద

ఏవండీ! వింటున్నారా! మిమ్మల్నే! భోజనం చేసి కుర్చీలో కునుకిపాట్లు పడుతున్న మాధవరావును పిలిచింది సులోచనమ్మ.

అబ్బా! ఏమిటోయ్? విషయమేమిటో చెప్పు వింటూనే వున్నా! మాగన్నుగా పట్టిన నిద్రను పాడు చేసినందుకు కొద్దిగా విసుగ్గా అన్నాడు.

చిన్నోడు మనల్ని రమ్మంటున్నాడు కదా! ఆ విషయం ఏమాలోచించారాని అడుగుతున్నా! పక్కనే వున్న బల్లెపీట కూర్చుంటూ అంది.

ఏమిటోయ్ ఆలోచించేది! వాడికి నేనెన్నిసార్లు చెప్పినా నీతో చెప్పి ఒప్పించాలని చూస్తున్నాడు. ఆ ఉరుకులు పరుగుల వాళ్ళ జీవితంలో స్పీడ్ బ్రేకర్లలాగా మనమెందుకు చెప్పు. ‘ఇంత కాలం వాళ్ళ కోసం బతికాం. ఇకనైనా మన కోసం బతుకుదాం’ అంటున్న భర్తను వారిస్తూ..

‘మనువడు మనుమరాలితో ఆడుకోవాలని లేదా’ మీలో ఈ స్వార్దం ఎప్పటినుండి మొదలయ్యింది’ కొంచెం నిష్టూరంగా అంది.

పిచ్చిదానా! ఈ కాలం పిల్లలను కాలంతో పరుగెత్తే యంత్రాలను చేస్తున్నారు తల్లిదండ్రులు.. నీ చిన్నకొడుకు దానికేం అతీతుడు కాడు. రానని చెబుదాం.. కానీ నీవు ఓ కునుకు తీయవోయ్! ఇప్పటి దాకా వంటింటిని వదలకుండా గబ్బిలంలా వేలాడబడ్డావ్ గా! అలసిన భార్య ముంగురులు సర్దుతూ అన్నాడు.

ఆ ప్రేమకే తను కట్టుబడి ఇప్పటివరకు తను చెప్పినట్టే చేసింది.. కానీ ఈ విషయంలో భర్తతో రాజీ పడలేకపోతోంది….

ఈ వీకెండ్ వస్తున్నామని ఫోన్ చేశాడు కొడుకు ఫణీంద్ర. అంత హఠాత్తుగా వస్తున్నాడంటే ‘పెద్ద ప్లాన్ తోనే వస్తుండొచ్చు నీ కొడుకు'”జాగ్రత్త బుట్టలో పడకు” హెచ్చరించాడు మాధవ రావు.

కన్న కొడుకు ప్రేమగా మనల్ని చూడాలనిపించి వస్తుంటే… మీరేంటండీ… ఎవరో పరాయి వ్యక్తిలా ఆలోచిస్తున్నారు.. బాధగా అంది..

భార్య అమాయకత్వానికి జాలి పడుతూ.. ఊరికే అన్నా లేవోయ్! నాకు మాత్రం వాళ్ళు వస్తున్నారంటే సంతోషం కాదా.. ఊ..ఏమేం కావాలో చెప్పు..పెన్ను పేపర్ తీసుకుని చెప్పినన్నీ రాసుకుని తేవడానికి బయలు దేరాడు..

‘ఏం మనిషో! ఓ పట్టాన చిక్కడు కదా! మనసునిండా ప్రేమున్నా నిండుకుండలా తొణకడు… బియ్యం పిండి శనగ పిండి ఉన్నయో లేదో వెతికింది. ఆయనొచ్చేలోపే చేయాలి..హడావిడి పడుతూ పిండివంటలు మొదలు పెట్టింది..
ఆరోగ్యానికి నడక మంచిదని బండి వున్నా వాడకుండా ఈమధ్య నడుస్తున్నాడు…నడుస్తూ ఆలోచిస్తున్నాడు…ఎలాగైనా తమని తీసుకెళ్ళాలనే ఎత్తగడతోనే వస్తున్నాడు..వాడి మనసేంటో చిన్నప్పటినుండీ తెలుసు….పాపం సులోచన.. పిల్లలకు ప్రేమ పంచడం తప్ప ఏమీ తెలియదు..

పుట్టి పెరిగిన ఊరు. టీచరుద్యోగం చుట్టు పక్కలే చేశాడు కాబట్టి.. ఇంటిని వదిలి వెళ్లవలసి రాలేదు.. ఇంటికి పెద్ద కొడుకుగా చెల్లెండ్ల పెండ్లిళ్ళు పురుళ్ళు. పుణ్యాలతోనే.. పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో చదువుల్లో రాణించారు. పెద్దోడు అమెరికాలో, చిన్నోడు హైదరాబాద్ లో ఉద్యోగాలతో సెటిలయ్యారు… ఇంతకాలం వాళ్ళ అవసరాలు తీర్చడంతోనే గడచిపోయింది..

దారిలో అందరినీ పలకరిస్తూ ఇల్లు చేరేసరికి సులోచన గప్ చుప్ గా డబ్బాల్లో సర్దేసింది.. ద్వారం దగ్గరి నుండే వాసన పసిగట్టి … కాళ్ళు కడుక్కుంటూ..అబ్బా! బాగా ఆకలిగా వుందోయ్! చపాతీ మాత్రం చెయ్యకబ్బా! రోజూ తిని బోరు కొడుతోంది…అంటున్న భర్తను …

మీరసలు పోలీస్ ఉద్యోగం చేయాల్సుండే…దొంగలను ఇట్టే పట్టి ఎన్ని బహుమతులు పొందేవారో…’
లడ్డూ కారప్పూస ప్లేట్ లో తెచ్చి పెట్టింది…

ఆ శ్రమే నేను పడొద్దన్నది.. చూడు ఎంత అలసి పోయావో.. కారప్పూస వత్తి లడ్డూలు చేసి ఎలా కందిపోయాయో చూడు చేతులు.. కందిపోయిన చేతుల్ని పట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు. ఆ అనురాగానికి కళ్ళలో నీటి తెర..

మీరు మాత్రం యువకుడిలా నడుచుకుంటూ వెళ్ళి సరుకులు అంత బరువు మోసుకొచ్చారుగా.. ఏవి మీ చేతులు.. అనగానే నన్ను తిననియ్యవా ఏమిటీ! ఓ చెయ్యి వెనక్కి దాచుకున్నాడు..

భార్యాపిల్లలతో శుక్రవారం రాత్రి రానే వచ్చాడు ఫణీంద్ర… పిల్లలకు చదువు గొడవ తప్పినందుకు ఆనందంగా వుంది. ఇల్లంతా సందడి. కన్నుల పండుగలా వుంది ఇద్దరికీ.. “పందిరి మీది గుండులా ఎప్పుడు ఏం చెబుతాడో” నని భయపడుతున్నాడు మాధవ రావు..

నెమ్మదిగా తల్లిని ప్రసన్నం చేసుకోవడం మొదలు పెట్టాడు.. విషయం చెప్పి ఇలా “మనమంతా ఒకేచోట ఆనందంగా వుండాలని మా కోరికమ్మా!!” పెద్దవాళ్ళు.. అన్నయ్య ఎలాగూ రాడు.. మీరూ వెళ్ళి వుండలేరు.. అందుకే ఈ వయసులో మీరు మా దగ్గరుంటేనే బాగుంటుంది’ అనగానే అవునత్తయ్యా! మామయ్యను ఒప్పించండి. మీరు చెబితేనే వింటారు.. అనగానే పొంగిపోయింది వారి బాధ్యతకు ప్రేమకు…

తప్పకుండా వస్తామని మాట తీసుకొని వెళ్ళి పోయారు.. కొడుకు పిల్లలు పద పదే గుర్తుకొస్తుంటే ఇక ఆగలేకపోయింది సులోచన. భర్తను బలవంతంగా ఒప్పించింది..

ఇంటిని పని మనిషి చంద్రమ్మకు అప్పజెప్పి వచ్చారు……

ఊహించుకున్న జీవితమంతా తారుమారయ్యేసరికి తట్టుకోలేక పోతోంది సులోచన. కొడుకూ కోడలు ఆఫీసుకెళ్తారని పొద్దున్నే లేచి ముందు కోడలికి సాయంగా పనులు చేసేదల్లా, నెమ్మదిగా బాధ్యతంతా నెత్తిమీద వేసుకోవలసి వచ్చింది “అమ్మా! నీ చేతి వంట రుచిగా వుంటుంది అనడంతో”

నానమ్మతోనే స్నానం చేయించుకుంటాం. టిఫిన్ తినిపించుకుంటాం అంటే మురిసిపోయింది.. అటు వంట ఇటు పిల్లలను తయారు చేయడం తన పిల్లల చిన్నతనపు రోజులు గుర్తొచ్చాయి.. అప్పుడు అత్తాడబిడ్డలకు చేస్తే ఇప్పుడు కొడుకు కోడలుకు చేస్తోంది…కానీ ఆనాటి సత్తువేది ఒంట్లో..

మాధవరావు గారికి కొడుకు మీద చాలా కోపం వస్తూంది. తల్లి వయసుసుకు మించి కష్టపడుతున్నా పట్టించుకోకపోవడం… ఇక సాయంత్రం పిల్లలకు దేశభక్తి పాటలు కథలు చెప్పొచ్చని ఆశ పడ్డాడు.. కానీ ఏది సాయంత్రం రాగానే బండెడు హోం వర్క్ చేసుకునే పిల్లలు.. పిలిచి దగ్గరకు తీసుకోబోతే, ‘క్రమశిక్షణ గురించి మీకు చెప్పేదేముంది మామయ్యా’ అంటూ కోడలి చురకలు..

మొదట్లో కొద్దిరోజులు సాయంత్రమన్నా అలా నడిచొద్దామని భార్యను బలవంతం చేసి దగ్గర్లో పార్కుకు తీసికెళ్ళాడు. పాపం పొద్దుట నుండి చేసీ చేసీ అలసి పోయి ఒళ్ళునొప్పులతో రాలేక మానేసింది..

ఇలా ఆలోచించి ఆలోచించి వంటికి తెచ్చుకున్నాడు మాధవరావు. మంచంలోంచి లేవలేకపోతున్నాడు.. కొడుకూ కోడలుకు చూపించడానికి తీరిక లేదు.. ఏదో మామాలు జ్వరమని మందులు కొనుక్కొచ్చి వేశారు.. ఐనా తగ్గలేదు.. సులోచనకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. అటు వంటి పిల్లల పని సరిగా చేయలేక పోతోంది.. వంటలు ఆయన ఆలోచనలతో చేయడంతో రుచులు మారిపోయాయి. పిల్లలకు తినిపించే ముందే భర్త పిలవడం. కోడలు విసుక్కుంటూ.. ఏం జబ్బో ఏమో మా ప్రాణానికొచ్చింది’ విసురుగా చేసుకుంటూ కసురుతూ వెళ్ళమని చెప్పడం… సులోచనను మనస్తాపానికి గురి చేస్తున్నాయి..

కొడుకూ కోడలు ఓ నిర్ణయానికి వచ్చి… మీరు కొన్నాళ్ళు మనూరికి వెళ్ళండి.. స్థల మార్పు.. తగ్గక పోతే పెద్ద హాస్పటల్ లో చూపెడదాం… అంటుంటే.. ఇప్పుడు చూపెట్టొచ్చు కదరా.. ఆయనకు బాగా లేదుగా అంది ఏడుస్తూ…

మాధవరావు నీరసంగా….
మనూరి శాస్త్రిగారి మందులే నాకు సరి పడతాయిరా.. మీ యమ్మకేం తెలియదు మమ్మల్ని పంపించేసేయ్.. అన్నాడు.

శాస్త్రిగారా.. అలాంటి పేరు వినని సులోచన నివ్వెరబోయింది. భర్త పరాకు మాటలు మాట్లాడుతున్నాడని వణికి పోయింది. అదేమాట కొడుకుతో అంటే నీకు తెలియకుండా వున్నారేమో అమ్మా! నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకు అంటూ టాక్సీ మాట్లాడుకొని ఊర్లో దించి.. జాగ్రత్తలు చెప్పి అదే టాక్సీలో వెళ్ళి పోయాడు ఫణీంద్ర…

వచ్చేసరికి ఇంటిని అద్దంలా వుంచింది చంద్రమ్మ.. పాలు పెరుగు కూరగాయలు తెచ్చి పెట్టింది..
ప్రయాణంలో అలసి పోయి రావడం.. దారంతా పదే పదే భర్తను చూసుకోవడంతో.. స్నానంచేసి పడుకున్న సులోచనకు మర్నాడు 7 ఏడు గంటలకు గానీ మెలకువ రాలేదు.. లేవగానే భర్త కోసం వెతుక్కుంది.. కనిపించక పోయే సరికి గాబరా పడుతూ ముందు గదిలోకి వచ్చింది.. తెల్లని మల్లెపూవులా లాల్చీ పైజామాలో మెరిసిపోతూ కనిపించేసరికి కలా నిజమాయని ఆశ్చర్యంతో… చూస్తుంటే.. సు లోచన అంటే తెలుసానోయ్ మంచి చూపులు అని అర్ధం మరలా చూడకు.. నాకు దిష్టి తగులుతుంది.. సీతమ్మ చెరను రామయ్య విడిపించాడు…..” సులోచన చెరను ఈ మాధవరావు విడిపించాడు” చిలిపిగా కన్ను కొడుతున్న అరవై అయిదేళ్ళ భర్త వంక ఆరాధనగా చూస్తూ…అంటే శాస్త్రిగారి పేరుతో మాటలు తడబడుతూ…..అంటున్న భార్యను చప్పున నోరు మూస్తూ అవునోయ్…..అంటూ..!

-వి.సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!