Thursday, July 9, 2020
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం! (సీరియల్ నవల) -6వ భాగం – శ్రీ విజేత

అతని ప్రేమ కోసం! (సీరియల్ నవల) -6వ భాగం – శ్రీ విజేత

అలా నాకు ఇష్టమున్నా లేకున్నా నా పెళ్లి జరిగిపోయింది. సాయంత్రం నా అప్పగింతల కార్యక్రమము మొదలయింది. పచ్చటి పెళ్లి పందిరి ముందు అత్తామామలకు, మా అత్తగారి అత్తమ్మకు, నా భర్తకు, వరుసైన నా చిన్న అత్తమ్మలు, మామయ్యలకు నన్నుచేతుల్లో పెట్టి మా వాళ్ళు కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. అమ్మ దుఃఖంకు అంతే లేదు, అందరికన్నా చిన్న బిడ్డను కదా నాన్న కన్నీరు పర్యంతం అయ్యాడు.

అక్కయ్యలు, భావలు కూడా నన్ను సాగనంపారు నన్ను ఒక చిన్న బిడ్డలా భావించి. వదినలు, అన్నయ్యలు కూడా నన్ను ఓదార్చి పంపినారు. పిల్లల్లో పిల్లనైన నన్ను మా అన్నయ్యల పిల్లలు, మా అక్కయ్యల పిల్లలు కరుణతో చూస్తున్నారు. వాళ్ళందరిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నాను. నా కళ్ళల్లో కన్నీటి గంగ ప్రవహించింది. నా ప్రియమైన నేస్తం సుజీ, వాళ్ల చెల్లీ, అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. వచ్చిన దగ్గరి బంధువులు కూడా నన్ను ఓదార్చి సాగనంపినారు. కడసారి నన్ను మా యింటి కడుప కడిగి ముగ్గు వేయమన్నారు. ఆ ఇంటిని, యింటి పరిసరాలను, చెట్లు చేమలను, పశుపక్షులను తలచుకుంటూ కడుప కడిగి ముగ్గు పెట్టి కదిలినాను నా భర్త వెంబడి.

నాతోటి తోడుగా మా చిన్నక్కను పంపించారు. ఆడ పిల్ల జీవితం ఇంతేనేమో అనిపించింది. పుట్టినప్పుడే ఆమెను ఆడ పిల్ల అంటారేమో ఇక్కడి పిల్ల ఎలాగు కాదని ఈ దేశములో అని అనిపించింది. మా బస్సు కదిలింది మాఊరి నుంచి వాళ్ళ ఊరుకు. మా ఊరు మానేరుకు ఈవలి ఒడ్డున ఉంటే వాళ్ళ ఊరు మానేరుకు ఆవల యాబై కిలోమీటర్ల దూరములో ఉంటుందన్నారు. బస్సు కదులుతూ ఉంటే నా కళ్ళల్లో మా ఊరి పరిసరాలు పరుగులు పెట్టినాయి. ఊరు దాటి బస్సు, మా ఊరి పక్కన ఉన్న పట్టణం దాటి మానేరు బ్రిడ్జి పైనుంచి పరుగులు పెట్టింది.

మానేరు గలగలలు జ్ఞాపకం వచ్చినాయి. మానేరు ఒడ్డునుంచి చూస్తుంటే దిగువన మొదటగా కనిపించేది మా ఊరే. ఆ యేటి గట్టు వెంబడి వెళ్ళిపోతే మా పొలం ఇంకా ఆ పక్కనే మా చిన్ననాటి బడి, అక్కడినుండి లోపలి వెళ్ళిపోతే ఊరు, మా ఇల్లు కూడా వస్తుంది. గలగలా పారే ఆ మానేటి ఒడ్డున ఉన్న మామిడి తోటలో మేము ప్రతి ఏడు ఆడుకొనే బతుకమ్మ పండుగ నాటి రోజులు కళ్ళముందు మెదిలినాయి. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి ఇక్కడి పరిసరాలను, మనుషులను బంధాలను, అనుబంధాలను అన్నీ వదిలేసి ఇంకో కొత్త జీవితంలోకి, కొత్త ప్రదేశంలోకి వెళ్ళిపోవడం అంటే భాధగానే అనిపించింది. చిన్న పిల్లను, స్వేచ్చగా బతికిన పిల్లను, కష్ట సుఖాలు తెలియని పిల్లను, ఎంతలో ఎంత మార్పు నేను ఊహించకుండానే కాలచక్రం గిర్రున తిరుగుతూ అని అనిపించింది! పరుగులు పెడుతున్న ఈ బస్సు అయినా ఈ కాలం అయినా ఎవరికోసం ఆగుతుంది అనిపించింది. ఈ బస్సు ఇక్కడే ఆగిపోతే ఎంత బాగుండును ఎప్పటికీ అని అనిపించింది లేకుంటే ఈ బస్సు ప్రయాణం ఇలాగే నిరంతరం కొనసాగితే ఎంత బాగుండు అనిపించింది నా చిన్ని మనసుకు, ఇంకా జీవితంలో కొత్తగా జీవితాన్ని ఊహించుకునే శక్తి లేక కావచ్చు. ఒక కొత్త జీవితం, కొత్త మనషులు, కొత్త పరిసరాలు ఎందుకో రుచించ లేదు జీవితంలో. ఇంత బస్సు నిండా మందిలో మా అక్కయ్య తప్ప ఎవరున్నారు నాకు బాగా తెలిసినవారు? అంతా కొత్తనే, మనసంతా దిగులుతో నిండి పోయింది.

అంతా ఒక కొత్త ప్రపంచం అనిపించింది. ఏమిటీ బంధాలు, బంధుత్వాలు అనిపించింది. ఎంతలో ఎంత త్రుటిలో మొదలవుతాయి, ఏర్పడుతాయి ఈ బంధాలు అనిపించింది. బతుకుల్నీ ముడివడేసుకుంటుంది కాసుల కోసమేనా అనిపించింది. బస్సులో నా పక్కన అతను అతని పక్కన నేను ఉట్టి చలనం లేని మనుషుల్లా. పెళ్లి పసుపు బట్టల్లో పసిడి బొమ్మలా ఉన్నానేమో నేను, అతను నా పక్కన పసుపు బట్టల్లో నల్లటి విగ్రహములా, నిజంగా అతడు నా మనసుకు నచ్చలేదు, మనిషి మొరటులా ఉన్నాడు. కొత్త పెళ్లి జంట ముద్దు ముచ్చటలో గడుపుతారేమో! నాకు అతనిలో ముద్దు ముచ్చట కనిపించ లేదు. మరబొమ్మనా ఈ మనిషి అనిపించింది. అతని ముఖములో చిరునవ్వును చూద్దామన్నా కనిపించలేదు నాకు. ఎంత ముద్దు చేస్తారు భార్యను, ఎంత చనువుగా, ఇష్టంగా ఉంటారు భార్యతో ఆ కొద్ది సేపట్లోనైనా. ఒక్క మాటైనా మాట్లాడచ్చు కదా, మాట లేదు, ముచ్చట లేదు. ఆడపిల్లను నేనేమి చనువు తీసుకుంటాను? పెళ్లి పందిరిలో తలంబ్రాలు ఎంత హుషారుగా పోస్తారు ఎవరైనా, ఆయనలో నాకు ఆ ఉరుకు హుషారు కనిపించలేదు, నేనంటే పెండ్లి జరుగుతున్నంత సేపు ఉట్టి యంత్రములా మారిపోయిన మనిషిని. అతనన్నా ఉత్సాహంగా కనిపించాలిగా, అలా కనిపించలేదు. నా కెందుకో విచిత్రంగా అనిపించింది! కోరికోరి నన్ను ఇలాంటి పిల్లవాడికి అంటగట్టా రేమిటీ నా తలిదండ్రులు? ఏమి చూశారు వాళ్ళు అనిపించింది. పొలం, పుట్రా, ఇల్లు, జాగా, పాడి పశువును చూసేనా నన్ను ఇలా అంటగట్టింది అనిపించింది. మణులు, మాణిక్యాలు, బంగారం కోసమేనా మనుషులు బతుకుతుంది అనిపించింది. ఏమి లేకున్నా పరువా లేదు ఈడు జోడైనా చూడాలి కదా! ఎందుకిలా చేశారు అనిపించింది. తలిదండ్రుల ఇష్టాలకు, ఆశలకు నాలా కొందరు బలి అయిపోతారా అనిపించింది. ఎంత గొప్ప తలిదండ్రులు వీళ్లు? కేవలం ముఖం చూసి పిల్లనిస్తారా? ఇల్లును చూసి ఆస్తిని చూసి పిల్లనిస్తారా, తలిదండ్రులను చూసి పిల్లనిస్తారా అనిపించింది? పిల్లవాడి గుణగణాలు, పనితనం కూడా చూసి తెలుసుకొని ఇవ్వాలి కదా అనిపించింది. చిన్నపిల్లను, స్వార్థం లేనిదాన్ని తలిదండ్రులను నమ్మి ఈ పెండ్లి చేసుకున్నాను. అతన్ని చేసుకునే ముందు పోనీలే ఉద్యోగాలు చెయ్యకున్నా రైతు బిడ్డైనా చాలనుకున్నాను, పనిమంతుడైనా చాలనుకున్నాను నేను. కాని అతన్ని చూస్తుంటే నాకు తల్లితండ్రి చాటు బిడ్డలా అనిపించింది. ఇంత అమాయకుడా, ఇంత చలాకితనం లేనివాడా అనిపించింది. ఈయనతోనేనా నేను బతుకంతా భరిస్తూ బతుకాల్సింది? నాతోని అవుతుందా నిజంగా అనిపించింది. హాయిగా ఈ బంధాలన్నీ విడిచిపెట్టి చనిపోతే ఎంత బాగుండును, అంతకు మించి ఈజీ పని ఏముందీ అని అనిపించింది. ఎన్నడైనా చనిపోవలసిందే కదా అనిపించింది. బాల్యం, చదువు, స్నేహితులు, అమ్మా, నాన్న బందువులు, పిల్లలు, పెద్దలూ అందరు జ్ఞాపకం వచ్చినారు.

మనసంతా పరిపరి విధాలా ఆలోచిస్తూ పోయింది. ఎవరికి ఎవరు ఏమవుతారు నిజంగా, ఈ బంధాలు, బంధుత్వాలు ఎంతసేపు! కృత్రిమంగా ఎర్పరచుకున్నవి కదా అనిపించింది! నిన్నటికీ ఇవ్వాల్టికి ఎంత మార్పు! నిన్నటివరకు నేను ఎవరికో బిడ్డను, అప్పుడు పరాధీననే నా కంటూ స్వేఛ్చా, వ్యక్తిత్వం లేకుండా, ఇప్పుడు ఒకరికి భార్యను, ఒక ఇంటికి కోడలును, ఇప్పుడూ పరాధీననే. జీవితం ఇంతేనా ఆడపిల్లది ఈ దేశములో! నిజంగా చదువుకున్నా ఎంత బాగుండేదో, నా తోటివాళ్లు ఇప్పటికి కొందరు చదువుకుంటున్నారు. ఆ చదువు పేరున కూడా నా పెళ్లి ఇలా తొందరగా జరిగేది కాదేమో అనిపించింది. బస్సు కదులుతూ పోతూనే ఉంది నా ఆలోచనలకు కుదుపు వేస్తూ. చీకట్లు ముసురుకున్నాయి, బస్సులో గుడ్డి లైట్ వెలుగుల్లో ఉట్టి ఉత్సవ విగ్రహాలమా చూసేవాళ్ళకు మేము అనిపించింది. ఈ బస్సులో ఉన్నవాళ్ళంత మా ఇద్దరికీ రక్షకులుగా ఉండి మమ్ములను పంజరములో పెట్టినట్లుగా పెట్టి పెండ్లి అనే బంధంతో కలిపి సంసారం అనే ఇంకో పెద్ద పంజరములో ఉంచడానికి తీసుకపోతున్నారా అని అనిపించింది! నేను వద్దు అనుకుంటే కాలం ఆగుతుందా , నాకు ఇష్టం లేకుంటే కూడా కాలం ఆగుతుందా? బస్సు రెండు గంటల వ్యవధిలో, చెట్లు చేమలను దాటుకుంటూ, కొండలు గుట్టలను దాటుకుంటూ వాళ్ళ ఊరికి చేరుకుంది. వెళ్ళేవరకు రాత్రి ఎనిమిది దాటి తొమ్మిది గంటలు అయ్యింది. పల్లెటూరు మసకమసగ్గా వీధి దీపాలు వెలుగుతున్నాయి. మా బస్సు ఊరిలోని రామాలయం దగ్గరకు వచ్చి ఆగింది. బంధువులందరు దిగి వెళ్ళిపోయారు. మమ్ములను అక్కడ సీతారాములకు నమస్కారం చేయించి చాప పరిచి కూర్చో పెట్టినారు దేవాలయం ముందు. దేవుల్లైన వారికైనా కష్టాలు తప్పినాయా, ఇక నా బోటివారు ఎంత అనిపించింది. దేవుళ్ళను మొక్కుతూ ప్రార్థించినాను ఇక అంతా మీదే భారం అని.

బతుకు ఒక ప్రయాణం అయితే నా జీవిత ప్రయాణములో అదొక మజిలీ. ఊర్లో పేరున్న కుటుంభం కదా, మమ్ములను భాజా బజంత్రీలతో పల్లకిలో కూర్చుండబెట్టుకొని ఇంటికీ తీసుకవెళ్ళే ఏర్పాట్లు చేసినారు ఊరి వీధులగుండా. పెళ్లి ఒక ఆడంభారమేమో ఈ దేశములో. పెళ్లి పేరున ఎన్ని ఖర్చులు చేస్తారు ఈ మనుషులు, అంత అవసరమా అనిపించింది. పెళ్లిని ఒక, వేడుక, అడంబరములా చేసి పదుగురి ముందు గొప్పగా చేసి నట్లుగా, గొప్పగా ఉన్నట్లుగా ఫీల్ అవుతారు ఈ మనుషులు. రాత్రి కాబట్టి పెట్రోమాక్స్ లైట్ వెలుగులు వచ్చినాయి, పల్లకి, పల్లకి మోసే బోయిలు వచ్చినారు. బాసింగాలు మా నుదుటన కట్టేసి మమ్ములను పల్లకిలో కూర్చోమన్నారు. అంతా బొమ్మల పెళ్ళిలా అనిపించింది. మమ్ములను పల్లకిలో బోయిలు ఎత్తుకొని ఊరేగుతుంటే ఊరి జనం ఇండ్లలోంచి బయటికి వచ్చి మమ్ములను వేడుకలా చూశారు. గాలిలో తేలిపోతున్నట్లుగా ఉన్న ఈ పల్లకి పెళ్లి వేడుక వింతలానే అనిపించింది. ఎంత రమ్యమైనదీ బతుకు నిజంగా! జీవితములో కొన్ని ఇచ్చి, కొన్ని ఎందుకు ఇవ్వడు దేవుడు అని అనిపించింది. పెళ్ళిలో పెళ్ళికూతురిని, పెళ్లి కొడుకుని దేవతల్లా అలంకరిస్తారు, వేడుక చేస్తారు, పెళ్లి జరుగుతున్నపుడు దేవతల్లానే భావించి వేదమంత్రాలు చదువుతారు, పెళ్ళికి అందరు వచ్చి అక్షంతలు వేసి దీవిస్తారు కూడా, పల్లకిలో దేవుల్లలా ఊరేగిస్తారు కూడా. సీతారాముల పెళ్ళయినా, శివ పార్వతుల పెళ్ళయినా, మా బోటివాళ్ళ పెళ్లయినా ఇది అపురూప సన్నివేశమే కాదనను కాని అందరికి ఆ తృప్తి ఉంటుందా, అందుతుందా అనిపించింది.

మా పెళ్లి పల్లకి ఊరేగింపు ఊరి వీధులను దాటుతూ, చావడిల దగ్గర ఆగుతూ ముందుకు కదిలింది. పిల్లలు పెద్దలు మొగవాళ్ళు డ్యాన్సులు చేసారు. కొందరు కర్ర సాములు చేసారు, నాగినీ నృత్యాలు చేసారు, కొందరు కాగడాలు కిరోసిన్ నూనె పోసి వెలిగించి సాము గరిడీ విన్యాసాలు చేసారు. కొందరు పుక్కిటిలో కిరోసిన్ నూనె పట్టుకొని కాగడా వెలుగుకు ఊస్తూ గాలిలో మంటలు సృష్టించారు. కొందరు తాగి ఊగుతూ డ్యాన్సులు మరీ చేశారు బాజా బజంత్రీలను డ్యాన్సుకు తగ్గట్టు కొట్టమని పురమాయిస్తూ. కొందరు చిల్లర రూపాయలను గాలిలో వెదజల్లారు సంబురంతో. పెళ్లి ఇంత వినోద కార్యక్రమమా అనిపించింది వాలందర్నీ చూస్తుంటే. జీవితంలోని వినోదం ఇక ఆ తర్వాత ఉండదేమో అన్నంతగా వాళ్ళు ఎగిరి దుమికారు. పెళ్లి పెద్దలకు వేడుక, పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులకు వేడుక, పెళ్ళికూతురికి, పెళ్లి కొడుక్కి కూడా వేడుక కావచ్చు. కాని నాకు అలా ఏమి అనిపించలేదు, పల్లకిలో మా వారిని గమనించి చూశాను, వారు ఎంతో వేడుకతో చిన్నపిల్లవాడిలా చూస్తున్నారు పెళ్లి బరాత్ ను పక్కన నేను ఒక అమ్మాయిని ఉన్నాననే స్పృహ ఉన్నట్లు కనిపించకుండా. “నేను నేనే ఆయన ఆయనే” అనిపించింది ఆయనను చూస్తుంటే! వీధులన్నీ తిరుగుతూ, చావడులను దాటుతూ మా వారి ఇంటి ముందటికి వచ్చి ఆగింది మా పెళ్లి బరాత్. సమయం అర్ధ రాత్రి కావచ్చింది. ఇంటి ముందట పందిళ్ళు వేసి ఉండి సీరియల్ బల్బులు వెలుగుతున్నాయి. పల్లకి దిగినాము. ఇంటి ముందట మాహా వృక్షం లాంటి వేప చెట్టు కనిపించింది నన్ను ఆహ్వానిసున్నట్లుగా. ఆ ఇల్లు పెద్ద బవంతిలా ఉంది పాతకాలం పద్ధతిలో, ముందటికి పెద్ద పాటకులున్నాయి ఇనుప ఊచలతో, కొద్దిగా లోపలికి నడిస్తే పెద్ద దర్వాజా ఉంది. అక్కడ మమ్ముల్ని ఆగమన్నారు, మాకు దిష్టి తీశారు, కుడి కాలు ముందట పెట్టి కడప లోపటికి రమ్మన్నారు మా యిద్దరిని. అలా కాలం కలిపిన మావారితో పుట్టినింటి నుండి మెట్టినింటికి మొదటిసారి ఆ కడప లోపల పెద్ద కోడలిగా అడుగు పెట్టినాను.

విధి చాలా విచిత్రమైనది, ఎన్ని విచిత్రాలు చేయిస్తుందో, ఎన్ని విచిత్రాలు చూపిస్తుందో ఎవరికి తెలుసు! నిన్నటి రాత్రి గాని, అంతకు ముందుగాని సరిగా నిద్ర లేదు, పెళ్ళితో అలసిపోయి ఉన్నాను, అంత కొత్త కొత్తగా, ఎక్కడ పడుకోవాలో తెలియలేదు, అర్ధ రాత్రి అయ్యింది కాని అంతా సందడిగానే ఉంది ఇల్లంతా, తర్వాతి దినం నాడు మారుపెండ్లి ఉంది కాబట్టి అందరు అర్ధ రాత్రి నుంచే వంటల ఏర్పాట్లలో ఉన్నట్టున్నారు, మేక పిల్లలు మే..మే.. అని అరుపులు పెడుతున్నాయి ఇంటి వెనుక నుండి. ఆ రాత్రి అందరితో పాటు నేను కూడా వాళ్ళు పెట్టిన పప్పన్నముతో ఓ ముద్ద తిని అక్కయ్యతో కలిసి వాళ్ళు చూపించిన స్థలములో నిద్రకొరిగాను, రేపు మా వాళ్ళు వస్తారు అనే కొద్దిగా బరోసాతో.
(మిగితా వచ్చే వారం)

-శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!