Sunday, October 2, 2022
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం (6 వ భాగం ) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం (6 వ భాగం ) -స్వాతీ శ్రీపాద

మళ్ళీ జీవితాలు ఎప్పటిలా గాడిలో పడ్డాయి. అయినా చందన ఆదివారం కేటాయి౦పు అలాగే వుంది. ఎన్ని పనులు వచ్చినా ఆదివారం మాత్రం తన సేవా కార్యక్రమాన్ని వదులుకోదు. ఎంత ఇబ్బంది పడినా “నేను నా ఇబ్బంది గురించి ఆలోచిస్తే ఎలాగా? ఎంత మంది పిల్లలకు అది ఉపయోగమో కదా సొంత లాభం కొంతైనా మానుకోవాలి. నా కృతజ్ఞత చూపే విధానం ఇది హరీ… భగవంతుడు మనకిచ్చిన అవకాశం సద్వినియోగాపరచుకోవాలి.” అనేది.

ఆదివారం తన కమిట్ మెంట్ కోసం ఎన్ని సరదాలో వదులుకోవలసివచ్చేది. ఏవైనా పుట్టిన రోజు పార్టీలో, గ్రాడ్యుయేషన్ పార్టీలో ఉన్నా హరి ఒక్కడే పిల్లలను తీసుకు వెళ్ళేవాడు. చందన తనపని ముగిసాక ఒకసారి వెళ్లి మొహం చూపించి వచ్చేది.

ఇటు నుండి అటు చూసే సరికి గిర్రున ఆదివారాలు తిరిగి వచ్చేవి. చూస్తుంటే రోజులకు రెక్కలు వచ్చినట్టే అనిపించేది.
ఆ రొటీన్ లొ పిల్లలు ఆరేళ్ళు పూర్తి చేసుకునే సమయమూ వచ్చింది.

“ఈ సారి మనం పుట్టినరోజు ఘనంగా చేద్దాం చందనా, వచ్చే ఎకడమిక్ కి ఇద్దరూ క్లాస్స్ వన్ కి వచ్చేస్తారు. ఆ పైన వాళ్ళ మిత్రులతోతే గదా పుట్టిన రోజులు చేసుకునేది?”

నిజమే అనిపించింది చందనకు.

ఇహ కసరత్తు మొదలైంది. ముందుగా ఎవరెవరిని పిలవాలన్న డిస్కషన్. ఎంత జాగ్రత్తగా ముఖ్యమైన వారినే జాబితా లో చేర్చినా దాదాపు వందా యాభై మంది తేలారు.
మళ్ళీ మరో రెండు వడబోతల తరువాత ఆ సమాఖ్య వందకు వచ్చి౦ది.

ఆ తరువాత ఈవైట్ తయారీ…
ప్లెయిన్ గా ఉంటే ఏం బాగు౦టు౦ది? కొంచమయినా డిజైన్ చెయ్యకపోతే ఎలాగా? ఎంత తీరిక లేక పొతే మాత్రం పిల్లలకోసం ఆ మాత్రం చెయ్యకపోతే ఎలాగా?

ముందుగా రెండు తెల్ల కుందేళ్ళు ఆహ్వానిస్తున్నట్టు రాసారు. అది మళ్ళీ చదువుకుంటే ఇద్దరికీ నచ్చలేదు.
రెండు జిరాఫీ లను పెట్టినా అంతగా మనసొప్పలేదు.

“ఛ! మన బంగారాల ప్లేస్ లొ జంతువులా? ఒద్దు, వాళ్ళ ఫొటోలే వేద్దాం” అయిదేళ్ళ ఫోటోల గాలి౦పు
మొత్తానికి వారం రోజులు తంటాలు పడి అనుకున్న వారికి ఈ వైట్ పంపారు. ఆ తరువాత వంద మందికి సరిపోయే హాల్ బుక్కి౦గ్.

కేటరింగ్ ఎవరికివ్వాలి? ఇండియన్ వంటలేనా? మరి ఇద్దరి స్నేహితులూ అమెరికన్స్ కూడా ఉన్నారు. వారికి ఎలా?
చివరికి అందరినీ తృప్తి పరచేలా మెన్యూ తయారు చేసారు.

అటు ఇండియన్ ఫుడ్ ఒక వంక, మరో చిన్న హాల్ లొ అమెరికన్ ఫుడ్ ఏర్పాట్లు చేసారు.
పిల్లలకు ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ ఆలోచించారు.
పిల్లలకు ఉపయోగపడేవి వెతికి వెతికి కొన్నారు.
ఎంటర్ టైన్మె౦ట్ కోసం మెజీషియన్ ను టాటూ ఆర్టిస్ట్ నూ పిలిచారు.
మొత్తానికి నెల రోజులపాటు తీరిక సమయమంతా పార్టీ ఏర్పాటులోనే గడిచి పోయింది.
శనివారం మధ్యాన్నం ఏర్పాటుచేసుకున్నారు పార్టీ. మరీ సాయంత్రాలు అంటే పిల్లలకు కష్టం అని.
ముందు రాత్రి చాలా సేపు గుడ్డీ బాగ్ లు తయారు చేస్తూ మేలుకుని ఉన్నారు. ఒక్కో బాగ్ లొ చిన్న టాయ్స్, బుక్స్, తాఫీలు పెన్సిల్ సెట్ రబ్బర్లు, ఒక బోర్డ్ గేం- ఒక పెద్ద బాగ్ తయారైంది. మురళి, ప్రియ, వారి పిల్లలు కూడా వచ్చారు.

ఉదయం ఇడ్లీ, దోసె లతో బ్రేక్ ఫస్ట్ కానిచ్చి ఒక్కొక్కరూ స్నానాలకు వెళ్ళారు.
చివరిగా చందన పిల్లలను తయారు చేసి స్నానానికి వెళ్ళింది. స్నానం చేయ్యబోతూ ఎందుకో తనను తానూ ఒకసారి చూసుకున్న చందన ముందు కొంచం ఆశ్చర్యపోయింది.
ఎడమ వక్షం ఎర్రగా కంది ఉంది.
ముందు ఏదైనా రంగేమో అనుకుని నీళ్ళతో, షొప్ తొ కడిగి చూసింది.
ఉహు, కాదు.
ఏదైనా తగిలి అలాగైమ్దేమో అనుకుంది, కాని ఎక్కడా దేన్నీ కొట్టుకున్న గుర్తే లేదు. కుడి చెయ్యి చాపి ఒకసారి తడిమి చూసుకుంది.
అప్పుడు గుర్తుకు వచ్చింది, ఎప్పుడో ఆర్నెల్ల క్రితం “ ఫైబ్రాయిడ్ ఏమో “ అనుకున్న సంగతి.
అవును ఆ తరువాత ఆ విషయమే చెరిగిపోయి౦ది.
మరో సారి గట్టిగా తడిమి చూసుకున్నాక అనిపించింది, ఏదో ఉ౦డలా తగులు తున్నట్టు.
అప్పటికీ పెద్ద కంగారు పడలేదు.
“రేపొక సారి ఇన్వెస్టిగేషన్ కు వెళ్ళాలి” అనుకుంటూ స్నానం ముగించి బ్రా వేసుకున్నప్పుడు గమని౦చి౦ది. కుడి వైపు కన్నా ఎడమవైపు బిగుతుగా ఉన్నట్టు.
వెంటనే ఈ విషయం హరికి చెప్పాలనిపించింది, కాని హరీ, మురళి హాల్ కి వెళ్ళారు దాని డేకోరేషన్ కోసం.
“ రాత్రి చెప్పాలి”
అనుకుంది.
హడావిడిగా పార్టీ సంబరంలో పడి ఆ విషయమే గుర్తులేదు చందనకు, ఆ తరువాత రెండు రోజులు మురళి కుటుంబం తో బిజీ బిజీ గా గడిచిపోయింది.
ఆలస్యంగా నిద్రలు ఆలస్యంగా మేలుకోడం, రోజూ ఏదో ఒక ప్రోగ్రాం.
వెళ్లబోతూ అడిగింది ప్రియ, “ఈ మధ్య బాగా తగ్గినట్టున్నావ్? వెయిట్ చూసుకున్నావా? హెల్త్ బాగానే ఉ౦దిగా?”
“అవునా, అయినా తగ్గితే మంచిదే కదా, ఎందరో ఒక్క గ్రాము కూడా తగ్గలేక బాధపడుతున్నారు. హెల్త్ బాగానే వుంది”
ఆమెకు చెప్పినా ఎక్కడో లోలోపల ఓ చిన్న అనుమానం.

ఆ సాయంత్రం వారిని ఫ్లైట్ ఎక్కించి తిరిగి వస్తుంటే హరికి చెప్పింది తను గమనించిన విషయం.

“అలాగా రేపు నాతో పాటు రా, మా దగ్గర పానెల్ ఆఫ్ డాక్టర్స్ రోజూ వస్తారుకదా ఒకసారి చెకప్ చేస్తారు” అని క్షణం ఆగి
“మరీ ఇంతలా ఆరోగ్యం విషయం కూడా పట్టి౦చుకోనంత బిజీ గా ఉన్నామా చందూ… ఉహు వి షుడ్ థింక్ ఆఫ్ ఇట్”
ఇంటికి వెళ్ళగానే స్వయంగా ఒకసారి చెక్ చేసాడు.

మనసులో ఒక సందేహంతో అతని మొహం పాలిపోయి౦ది.
వెంటనే ఆమె వెయిట్ చెక్ చేసుకు రమ్మన్నాడు. నిజమే గమనించలేదు కాని ఇదివరకు నెలక్రితం చూసుకున్నదానికీ ఇప్పటికీ అయిదు కిలోలు తగ్గింది.

చందనను పిల్లలను నిద్రపుచ్చమని చెప్పి కిందకు వచ్చాడు.

తనకు తెలిసినా ఆ౦కాలజిస్ట్ కు ఫోన్ చేసాడు.
చాలా సేపు మాట్లాడి అతనూ అదే అనుమానం వ్యక్తం చేసాడు.
“అంత త్వరగా వెయిట్ తగ్గుతోమ్డంతే బహుశా సెకండరీ స్టేజ్ కావచ్చు, అయినా బీ బ్రేవ్, సర్జరీతో నార్మల్ కావచ్చు.”
ఆ రాత్రి నిద్రపట్టలేదు హరికి. ఎందుకిలా జరుగుతోంది.
ఎప్పుడూ నమ్మనిది జాతకాలు నిజమేనేమో అనిపిస్తో౦ది.
కుజదోషం ఉంటే భాగస్వామి అనారోగ్య౦ పాలవుతారని ఎప్పుడో చిన్నప్పుడు విన్న గుర్తు.
తన జాతకం బాగాలేదా? ఎందుకు చందన మాటి మాటికీ ఇలా …

ఒక అయోమయ స్థితిలో గడిపాడు. ఉదయమే చందనను తీసుకుని హాస్పిటల్ కి బయల్దేరాడు.

కారులో నిశ్శబ్దంగా ఉన్న హరి ని ఆమె అడగనే అడిగింది.
“ఎందుకు హరీ అదోలా ఉన్నావు? నా విషయం లొ ఏదైనా అనుమానమా? తెలిస్తే చెప్పు హరీ ముందుగానే మానసికంగా సిద్ధపడదాం”

“నీకు తెలియనిది ఏముంది చందూ, ఈ లంప్స్ ఒక్కోసారి అపాయం లేనివే అయినా ఒక్కోసారి కాన్సరస్ కూడా కావచ్చు. చాన్సేస్ ఫిఫ్టీ ఫిఫ్టీ. మన అదృష్టం బాగాలేకపోతే ఏదైనా కావచ్చు. బయాప్సీ అంటాడు ముందు.”
అతను ఊహించినంత కదిలిపోలేదు చందన.

చిన్నగా నవ్వి, “మనం నిమిత్తమాత్రులం కదా హరీ, ఏది ఎలా జరిగితే అలా అవనీ. అయినా ఈ రోజుల్లో అదేమీ పెద్ద అన్ క్యూరేబుల్ కాదు. నువ్వూ చదివావుగా చైనాలో ఒక వ్యక్తీ కాన్సర్ తో వందేళ్ళు పోరాడి నూట ఇరవై ఏళ్ళు బతికాడని. విల్ పవర్ బాబూ విల్ పవర్. అయినా నాకు తెలుసు నేను ఇప్పుడప్పుడే పోను… ఇంకా ఎన్ని పనులు చెయ్యాలో…”

నిజానికి పైకి అలా మాట్లాడినా ఆమె మనసు పరిపరి విధాల పోతూనే ఉంది. పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు, హరికి తను లేకుండా క్షణం గడవదు.

భగవంతుడా ఎందు కిలాటి పరీక్షలు?
ఉదయం మొదలు అన్ని రకాల పరీక్షలు పూర్తయి, చివరకు సర్జన్ వచ్చి బయాప్సీ ముగిసే సరికి రాత్రి ఏడయి౦ది.
అప్పటికే నీరసి౦చి పోయి౦ది చందన.
అక్కడే డ్రిప్ పెట్టి కొంచం తేరుకున్నాక రాత్రి ఇంటికి చేరారు. అందరికీ అనుమానమే.
అది కన్ఫర్మ్ చేసుకు౦దుకే బయాప్సీ.
ఇల్లు చేరేసరికి బేబీ సిట్టర్ పిల్లలను నిద్రపుచ్చింది.
వేడి కాఫీ చేసుకుని వచ్చి హాల్లో లైట్ ఆఫ్ చేసి రిక్లైనర్ లో వాలాడు హరి.
మైండ్ బ్లాక్ గా తయారైంది.
చాలా మటుకు కాన్సర్ ల౦ప్ అనే అనిపిస్తోంది.
ఆలోచించేది తన గురించో పిల్లలగురి౦చో కాదు. చందన గురించే. తను ఏమీ చెయ్యలేని స్థితి. ఆమె బాధలు కళ్ళారా చూడటమే తప్ప తను తీసుకోలేడు కదా. కల్లెంమాట నీళ్ళు దార్లు కట్టాయి. ఊహ తెలిసాక దేనికీ ఏడ్చిన గుర్తులేదు. ఇన్నాళ్ళుగా పేరుకు పోయిన కన్నీళ్లు కుంభ వృష్టి గా కురిసాయి.
ఆవేదనతో కళ్ళు మూసుకున్నాడు.
ఎప్పటికో ఎదమీద తలవాల్చిన స్పర్శకు కళ్ళు తెరిచాడు. చందన ఎప్పుడు వచ్చిందో మరి.
ఎడమ చెయ్యి ఆమె చుట్టూ చుట్టి దగ్గరకు పొదవుకున్నాడు.

ఒకరి హృదయం ఒకరిని మౌనంగా ఓదార్చగా చాలా సేపు అలాగే ఉండి పోయారు. ఎ భాషకూ లేని భావవాహిని స్పర్శ ది. సరిగ్గా ఏది కావాలో దాన్ని చేరవేస్తుంది.

“బాధపడకు హరీ, ఎన్ని పరీక్షలన్నా ఎదురవనీ నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళను గాక వెళ్ళను. ఎన్ని బాధలైనా ఓర్చుకు౦టాను- నీ కోసం.. ఇదెంత! చాల చిన్నది. జస్ట్ ఒక రొమ్ముతో సరిపోతుంది. జీవితమంతా నీతో గడిపేందుకు శరీరంలో ఒక్కో భాగం సంతోషంగా ఇచ్చేస్తాను”

చటుక్కున ఆమె పెదవులు మూసేసాడు హరి.

**********************

మూడో రోజున వచ్చిన బయాప్సీ రిపోర్ట్ వారి భయాలను నిజం చేసింది. అవును మాలిగ్నె౦ట్– మిగతా కొలతలూ వివరాలూ స్టేజ్….

ఆ తరువాత చందన ఆర్నెల్లపాటు ఉద్యోగానికే వెళ్ళలేదు. ముందుగా వేరే భాగాలకు స్ప్రెడ్ అవలేదని రూల్ అవుట్ చేసుకున్నాక, సెకండరీ స్టేజ్ గనక సర్జరీ తప్పదనీ, ఆ తరువాత ఫాలో అప్ ట్రీట్మెంట్ అనీ నిర్ణయి౦చారు.

శరీరంలో ఒక భాగం ముఖ్యంగా ఒక రొమ్ము పోగొట్టుకోడం మానసికంగా చాలా మంది స్వీకరి౦చలేరు గనక ముందు కౌన్సెలి౦గ్ ఏర్పాటు చేసారు.

అయినా పెద్ద అవసరమే లేకపోయింది. నవ్వుతూ చెప్పినవన్నీ వింది చందన.

“పోగొట్టుకోడం జీవితంలో ఒక భాగం కదా? దానికి ఎ౦దుకి౦త రాద్దాంతం?

చిన్నప్పటినుండీ ఈ పోగొట్టుకోడానికి అలవాటు పడ్డాం. బాగా నచ్చిన బొమ్మ తొలిసారి పోయినప్పుడు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తాం. రెండో సారి అమ్మ ఒడిని మరో బిడ్డకోసం త్యాగం చేసినప్పుడు మూగగా ఏడుస్తాం
ఇష్టమైన పెన్సిల్ ముక్క పోయినా మరేదైనా పోగొట్టుకున్నా చివరకు మిగిలేది ఏడుపే కదా.
ఇప్పుడిక శరీరంలో ఒక భాగం అంటే.” తనకు తనే చెప్పుకున్నట్టుగా అంది.

హరి ఆమె తలనిమిరాడు.
ఆ మరుసటి రోజే సర్జరీ.
ఆమె ధైర్యంగా దియేటర్ లోకి వెళ్ళింది కాని బయట హరిని ఓదార్చటం మురళి వల్ల కాలేదు.
అసలు సమస్య అంతా పోస్ట్ ఆపరేషనల్ ట్రీట్మెంట్ లోనే.
కీమో తీసుకున్న రోజున నీరసంతో వేల్లాదబదిపోయేది. నీళ్ళు తాగినా వెంటనే భళ్ళున వాంతి చేసుకునేది. దోసలిపట్టే వాడు హరి.
నిస్త్రాణగా వాలిన ఆమె తలను ఒడిలో పెట్టుకుని కూచునే వాడు.
మోపులు మోపులుగా ఊడిపోతున్న జుట్టు. ఇవన్నే గుండె కోతగానే మిగిలాయి.
ఆర్నెల్లకు కొంచం ఊపిరి పీల్చుకున్నారు.
తొలుత మూడు నెలలకోసారి చెకప్.
ఆ తరువాత ఆర్నెల్లకు, ఆపై ఏడాదికి ఒకసారి..!
( మిగితా వచ్చే వారం)

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!