Saturday, May 30, 2020
Home > కవితలు > నెమ్మది…ఓరవాకిలిగా తీసి ఉంచు మనసును! – స్వాతీ శ్రీపాద

నెమ్మది…ఓరవాకిలిగా తీసి ఉంచు మనసును! – స్వాతీ శ్రీపాద

నెమ్మది
ఓరవాకిలిగా తీసి ఉంచు మనసును
గాలిలో తేలుతూ లేచిగురాకునై
లోయలూ సముద్రాలూ
పర్వతాలూ పసిడి కిరణాలూ దాటుకు
ఏ అర్ధరాత్రో నీకను రెప్పలపై వాలతాను
కలత నిద్రలో
జారిన నీకలల పరదాలను ను సవరించి
రెప్పల చివర అంటిన నిరీక్షణకు మంచుముత్యాలు
మల్లెల సరాలుగా మార్చి
తలలో తురుముకు౦టాను
సగం నిద్రలో కళ్ళు తెరిచి
చూపులతో వెతుక్కునే నీ ఆర్తికి
జవాబునై చల్లని పిల్లగాలి నవుతాను
నిశ్చింతగా విశ్రమించు
అలసిపోయిన నిట్టూర్పులపై
పెదవులాని౦చి
అమృతం పంచి ఇస్తాను
నువ్వూ నేనూ నిరాకర భావనలమయాక
కాలంతో పనేమిటి
ముందూ వెనకా ఏదీ లేని ఒక సంతులనత ఇది
ఊరూపేరూలేని ఒక నిరామయ జగత్తు కదా
నెమ్మదిగానే మనసులు మాట్లాడుకోనీ
తనివి తీరా నేల గాలితో మాటాడినట్టు
సముద్రాలు చీకటిని పెనవేసుకున్నట్టు
ఆకులు చుక్కలతో చేతులు కలిపినట్టు
ఎంత సుందరం ఈ శూన్యం
ఎంత వసంత హేల ఈ మౌనానికి
ఎవరూ తొంగి చూస్తారన్న భయం లేదు
ఆవిరైపోతున్న వెన్నెల జలపాతంలో
లీనమవడం ఎంత మనోహరం
గడ్డకట్టిన సమయం నది మీద నడక
ఎంత అలవోక పయనం
అందుకే
నెమ్మది
ఓరవాకిలిగా తీసి ఉంచు మనసును

– స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!