సమాజంలో మార్పు కోరేవారిలో ఒక్కొక్కరిది ఒక్కో పంథా. కొందరు నాయకత్వ స్థానంలో సమాాజాన్ని నడిపిస్తే, మరి కొందరు అక్షరాలనే ఆయుధాలుగా చేసుకుంటారు. అలా అక్షరాలనే ఆయుధాలుగా మలిచి సమాజంలో విప్లవ దివిటీలు పట్టిన కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. నాటి నిజాం పాలనకు వ్యతిరేంకగా అక్షర యుద్దం చేపట్టిన ధీశాలి ఆయన. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నినదించిన ధైర్యశాలి.
దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో వెంకటమ్మ, వేంకటాచార్యులు దంపతులకు 1925 జూలై 22 న జన్మించారు. ఉర్దులో మెట్రిక్యులెషన్ను ఖమ్మంలో పూర్తి చేసిన ఆయన భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బిఏ పట్టా పుచ్చుకున్నారు. ఆరంభంలో కమ్యునిస్టు భావాలు కలిగిన దాశరథి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా కూడా కొంత కాలం కొనసాగారు. అయితే రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్నారు.
నిజాం పాలనలో రకరకాల హింసలనుభవిస్తున్న తెలంగాణా సమాజాన్ని దాశరథి చూడలేక పోయారు. ఉబికివస్తున్న తిరుగుబాటును అక్షరరూపంలోకి మలిచి నినదించాడు.
“రైతుదే తెలంగాణము రైతుదే.ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు.
దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్” అంటూ నిజాంను సూటిగా ప్రశ్నించారాయన.
తన తిరుగుబాటుకు నిజాం ప్రభుత్వం చేత దాశరథి జైలు శిక్షను కూడా అనుభవించారు. ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించినందుకు నిజామాబాదు లోని ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసి ఉంచింది, నిజాము సర్కార్. అయితే ప్రభుత్వం ఆయన శరీరాన్నైతే బంధించగలిగింది కాని తనలోని ఆలోచనలను కట్టడిచేయలేకపోయింది. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు.
ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. సాహిత్యంలో దాశరథి అనేక ప్రక్రియల్లో తన ప్రతిభను చాటాడు. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసాడు. గుండేలో బాధ అధికమైనప్పుడు పదాల్లో పౌరుషత్వం కనిపిస్తుంది. దాశరథి రచనల్లో ఈ ధోరణి స్పష్టంగా కానవస్తుంది. తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిగలిగాడు. సాహిత్యంపై మక్కువ కలిగిన దాశరథి.. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడుగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించాడు. తల్లి మీద, తల్లి తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ, మార్పు నా తీర్పు, ఆలోచనాలోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ
కవితా పుష్పకం, తిమిరంతో సమరం, పునర్నవం, అమృతాభిషేకం, నవమి నాటికలు, ఆలోచనాలోచనలు కవితా సంపుటాలు, యాత్రాస్మృతి(స్వియచరిత్ర) గాలిబ్ గీతాలు వంటి రచనలు దాశరథి కలం నుంచి వెలువడిన రచనలు. కవితా పుష్పకం రచనలకు ఏపి సాహిత్య అకాడమి అవార్డు, తిమిరంతో సమరానికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు, ఉత్తమ అనువాద రచనగా గాలిబ్ గీతాలకు అవార్డు లభించింది.
నిజాంను పిశాచిలా అభివర్ణిస్తు తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచిన దాశరథి.. ప్రపూర్ణ మహాకవి, సింహకవి, అభ్యుదయ కవి, యువ చక్రవర్తి వంటి అనేక బిరుదాకింతుడిగా ప్రసిద్ది చెందారు. 1972 లో అప్పటి ప్రధాని ఇందిరాగాందీ దాశరథిని జాతీయోద్యమ రథసారధిగా గుర్తించి తామ్రపత్రంతో సన్మానించించగా 1976లో ఆగ్రా యూనివర్సిటీ డాక్టర్ ఆఫ్ లేబర్ పట్టాతో సత్కరించింది. ఇక 1987 లో అమెరికా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ దాశరథిని అంధ్ర కవితా సారధి బిరుదుతో ఘనంగా సన్మానించింది.
తన కవితలతోనే కాదు.. సినిమా పాటలతో కూడా దాశరథి సమాజంలో చెరగని ముద్ర వేశారు. 1961లో ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు రాయడంతో ఆయన సినీరంగ ప్రవేశం చేసాడు. ఇంచుమించుగా కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్యానికి సేవచేశారు. ఆ చల్లని సముద్ర గర్భం… పాట ఇప్పటికి ఫేమసే. తెలంగాణ సమాజంలో తనదైన ముద్ర వేసిన దాశరథి కృష్ణమాచార్య జయంత్యుత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఆయన పేరుతో సాహితీ వేత్తలకు అవార్డులు కూడా ఇస్తోంది. 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా పని చేసిన ఆయన 1987 నవంబర్ 5 న కన్నుమూశారు దాశరథి.