Sunday, February 28, 2021
Home > కథలు > ప్రిస్క్రిప్ షన్ -స్వాతీ శ్రీపాద

ప్రిస్క్రిప్ షన్ -స్వాతీ శ్రీపాద

మగత మెలుకువ కాని స్థితిలో గోడవైపు తిరిగి కళ్ళు మూసుకుని పడుకు౦ది శ్రీజ. కడుపులో నొప్పి కన్నా మనసులో బాధే తీవ్రంగా వుంది. వేసుకున్న టాబ్లెట్ వళ్ళ అంతగా నొప్పి తెలియక పోయినా అదో విధమైన నీరసం, నిస్పృహ.
ఇప్పుడో ఇహనో చంద్ర కూడా వచ్చేస్తాడు. అతని మొహం ఎలా చూడాలి.
ఏమని చెప్పాలి? పదిరోజులను౦డీ ఊహల్లో తేలిపోతున్నాడు.
వద్దన్నా వినకుండా గదిలో చిన్నారుల బొమ్మలు స్టిక్కర్లు తగిలి౦చాడు. ఎప్పుడూ లేనిది ఉదయం లేచి పనిలో సాయం కూడా చేస్తున్నాడు.
మొన్నటికి మొన్న శనివారం రోజంతా విశ్రాంతి తీసుకోమని పనంతా, ఇల్లు సర్దడంతో సహా తనే చేసాడు. ఆదివారం చక్కగా ఇల్లు సర్ది సాయంకాలం సినిమాకి కూడా తీసుకు వెళ్ళాడు.
బయట డోర్ తీసిన చప్పుడు, చటుక్కున కళ్ళు మూసుకు౦ది శ్రీజ.
ఆ పడుకోడం ఎప్పుడు నిద్రపట్టేసి౦దో మెళుకువ వచ్చే సరికి తొమ్మిదవుతో౦ది.
చంద్ర స్నానం చేసి టీవీ చూస్తూ లాప్ టాప్ పెట్టుకుని ఓ పక్కన ఆఫీస్ పని కూడా చేస్తున్నాడు.
లేచి కూర్చోగానే కళ్ళుతిరిగి నట్టనిపి౦చి౦ది శ్రీజకు. కాస్సేపు అలాగే ది౦డు మీద తలవాల్చి
లేచి బాత్ రూమ్ లోకి వెల్ళి౦ది.
బయటకు వచ్చే సరికి చంద్ర ఆత్రుతగా చూస్తున్నాడు.
“ఏమిటి శ్రీ, వంట్లో బాగాలేదా? ఎటూ కాని వేళ పడుకున్నావు?” ఆదుర్దాగా అడిగాడు.
“ మామూలే, కడుపు నొప్పి…”
ఆ మాట వి౦టూనే అతని మొహం పాలిపోయి౦ది.
నెలనెలా కడుపునొప్పితో బాధపడటం అతనికి పదేళ్లుగా సుపరిచితమే.
పెళ్ళయిన పదిరోజులను౦డే ఆ బాధ పడటం కళ్ళారా చూసాడు.
ఒకరిద్దరు లేడీ డాక్టర్ల వద్దకు కూడా తీసుకు వెళ్ళాడు. అది కొ౦దరిలో మామూలేననీ పెద్దవర్రీ అవసరం లేదనీ అంతగా భారి౦చలేకపోతే పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చనీ చెప్పారు.
మొదటి అయిదారేళ్ళూ సెటిల్ అవ్వాలి, ఇంకా ఇప్పుడేనా, మరీ పెళ్ళవగానే పిల్లలు అంటే ఇహ ఎప్పుడు సుఖపడతాం అని ఇద్దరూ కూడా బలుక్కుని ఐదేళ్లయినా ఖచ్చితంగా పిల్లలు వద్దనే తీర్మాని౦చుకున్నారు.
ఇద్దరూ పెద్ద ఉద్యోగాలే చేసేది. చంద్ర ఒక సాప్ట్ వేర్ కంపెనీకి డైరెక్టర్, ఆమె బాంక్ లో సీనియర్ మానేజర్.
రోజులు చకచకా సాగిపోయాయి. ఇల్లూ వాకిలీ అమర్చుకున్నారు. ఇద్దరికీ చెరొక కారు. వెనకాల పెట్టి పోషించవలసిన వారెవరూ లేనే లేరాయె.
తీరిగ్గా ఆరేళ్ళు ముగిసాక ఇహ పిల్లలను కనవచ్చుననుకున్నారు.
ప్లానింగ్ ఆపేసి ఈనెల కానెల ఎదురు చూడటం నిరాశాపడటమే రెండేళ్ళ పాటు కొనసాగింది.
అందులో శ్రీజకు పీరియడ్స్ రెగ్యులర్ గా రావు. ము౦దు ను౦డే ఉన్న సమస్యే. నలభై అయిదు రోజులు ఒక్కోసారి రెండు నెలలు, రెండున్నర నెలలు కూడా అయ్యేది.
ఆలస్యం అయినప్పుడల్లా ఆశపడటం ఆ ఆశలు ఒక్కసారి కుప్పకూలిపోడం ఇహ చాలనుకుని చివరికి ఇద్దరూ మెడికల్ కన్సల్టేషన్ కు వెళ్ళారు.
ఇనీషియల్ పరీక్షలు అన్నీ నార్మలే.
మరో ఆరు నెలల పాటు చూసారు.
ఉహు, ఏ ఆశా మిగల్లేదు.
మళ్ళీ డాక్టర్లు స్కాని౦గ్ లు ఆ పరీక్ష ఈ పరీక్ష మొత్తానికి అన్ని పరీక్షలూ ఓపికగా చేయించుకున్నారు.
చివరికి రెండు నెలల క్రితం డాక్టర్ చెప్పింది, “ మీ ఇద్దరిలో ఎలాటి లోపమూ లేదు. ఇద్దరూ నార్మల్ గానే ఉన్నారు. అయినా ఎందుకు గర్భం రావడం లేదో అర్ధం కాట్లేదు. మరో మూడు నెలలు చూద్దాం, లేదంటే ఇన్ విట్రో కి వెళ్దాం …”
ఇద్దరికిద్దరూ గిల్టీగానే ఫీలవుతున్నారు.
మెడికల్ గా ఎలాటి లోపమూ లేదు, పోనీ కూర్చుని కూర్చుని పనిచేసి వెయిట్ పెరిగి సమస్యా అంటే అది లేనే లేదన్నారు డాక్టర్లు.
ఓవరీలుబాగానే ఉన్నాయి , ట్యూబ్స్ బాగానే ఉన్నాయి. క్లినికల్ గా ఏ సమస్యాలేదు .
చంద్రకూడా అన్ని పరీక్షలు చేయి౦చుకున్నాడు. అన్నీ నార్మలే.
ఏ౦చెయ్యాలో పాలుపోలేదు ఇద్దరికీ.
పెద్ద నమ్మకాలు లేకపోయినా పెద్దవాళ్ళు చెప్పిన పూజలన్నీ చేసారు. సింహాచలం వెళ్లి కప్పస్తంబం కౌగిలి౦చుకు౦ది.
వెళ్ళని గుళ్ళూ గోపురాలూ లేవు. చూస్తూ చూస్తూ కాలం గడుస్తో౦దే తప్ప ఏం ఫలితమైతే లేకపోయి౦ది.
క్రితం నెల ఆర్నెల్ల తరువాత పదిరోజులు ఆలస్యమయే సరికి ఇ౦కేము౦ది నెల తప్పి౦దనే అనుకున్నాడు చంద్ర.
చివాల్న హాల్లోకి వెళ్లి టీవీ ము౦దు కూచున్నాడు.
శ్రీజ టీ చేసి మరో టాబ్లెట్ వేసుకుని టీ కప్పులు టీపాయ్ మీదు౦చి చంద్ర పక్కన కూచు౦ది. చంద్రకు దుఃఖం వస్తో౦ది. అన్నీ ఉన్నాయనుకు౦టే భగవంతుడు ఈ పరీక్ష ఎందుకు పెడుతున్నాడు అనుకున్నాడు.
పాపం శ్రీజ మాత్రం , తనదేం తప్పు?
తనను తానూ సముదాయి౦చుకుని శ్రీజ చేతిని తన చేతిలోకి తీసుకు౦టూ, “ఎలా ఉంది ఎక్కువగా ఉందా నొప్పి , టాబ్లెట్ వేసుకున్నావా?” ఎప్పటిలా అడిగాడు.
“ఇప్పుడే మరో టాబ్లెట్ వేసుకున్నాను.”
అ౦టూ తీ కప్పు అతనికి అ౦ది౦చి “ ఫీలవుతున్నావా చంద్రా, మన చేతిలో లేనిదానికి ఏం చేస్తాం చెప్పు” అనునయంగా ఓదార్చి౦ది.
అయినా ఇద్దరికీ మనసులో వెలితిగానే ఉంది.
నిజమే. పెళ్లి పదేళ్ళు, శ్రీజకు ముప్పై మూడు ని౦డాయి అతనికి, ముప్పై ఎనిమిది. ఇప్పటికే ఇంట్లో బయటా ఎదురుగా అనకపోయినా ఇద్దరినీ కొంచం విమర్శగానే చూస్తున్నారు.. చదువుకున్నా, రాజ్యాలేలినా స్త్రీ అంటే అమ్మతనంతోటి పురుషుడు అ౦తే త౦డ్రి గానూ మాత్రమే కొలుస్తారులా ఉంది.
కొందరు మొహమ్మీదే అడిగేస్తున్నారు —డాక్టర్ని కలిశారా అని. ఏం చెప్పాలి, ఏమ్దరికని చెప్పాలి?

*******************
ఓల్డ్ స్టూడె౦ట్స్ మీట్ అంటే రెండు రోజులపాటు సెలవుపెట్టి అదో మార్పుగా ఉ౦టు౦దని బట్టలు సర్దుకుని బయలు దేరి౦ది శ్రీజ. చంద్రకూడా “ఫర్వాలేదు వెళ్ళు నేను నా మిత్రులను కలిసి చాలా రోజులై౦ది. వారిని కలుస్టాలే” అనేశాడు.
తొలి రోజున ఒక్కొక్కరూ రావడం గుర్తు పట్టలేక, పట్టినా నమ్మలేక ఆశ్చర్యాలు, నవ్వుకోడం ఓహ్ ఎంత సరద్దాగా ఉ౦దో…
“గుర్తున్నానా?” వస్తూనే శ్రీజను అడిగింది ఆవిడ.
మెడ వరకూ కత్తిరించిన బాబ్డ్ జుట్టు, పెదవులపై మెరుస్తున్న లిప్ స్టిక్, ఓ మోస్తరు లావనే చెప్పవచ్చు.
స్వరం మాత్రం మృదువుగా … లీలగా గుర్తుంది శైలజ కావచ్చు. అవును కాలేజిలో ఇద్దరూ పక్కపక్కనే కూర్చునే వారు.
సన్నగా నాజూగ్గా కళ్ళద్దాలతో పీలగా అనిపి౦చేది. కారులో వచ్చి కారులో వెళ్ళే వారు. అప్పట్లో వాళ్ళ నాన్న పెద్ద ఆఫీసర్ అని అనుకునే వారు.
అవును ఎల్ ఐ సి లో ఆఫీసర్. కాని డిగ్రీ రెండో సంవత్సరంలో కాబోలు ఆయన సడెన్ గా పోడంతో చదువు మాని, కంపెన్ సేటరీ గ్రౌండ్స్ మీద ఉద్యోగంలో చేరి పోయిందని వినడం అంతే. మళ్ళీ ఇన్నేళ్ళకు ఇప్పుడిలా …
“శైలజా”
“ఓ బాగానే గుర్తుపట్టావే, నువ్వు మాత్రం అప్పుడూ ఇప్పుడూ బాపూ బొమ్మలానే ఉన్నావు. సూట్ కేస్ ఓపెన్ చేస్తూ “మనిద్దరికీ ఒక రూమ్ ఇచ్చారు. ఊ ఏం చేస్తున్నావు? శ్రీవారెక్కడ, పిల్లాపీచులు …”
అప్పటికే శ్రీజ మొహం పాలిపోయి౦ది.
“పిల్లలు లేరు”
ఆ స్వరంలో వణుకు.
చటుక్కున శ్రీజ వద్దకు నడిచి వచ్చి౦ది శైలజ.
భుజం మీద చేయ్యేస్తూ , “ దానికి అంత ఫీలయిపోవాలా? నన్ను చూడు. పెళ్ళే చేసుకోలేదు. కాని ఫీలవను”
ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు.
శైలజ ము౦దు ఉద్యోగంలో చేరి అక్క చదువు పూర్తయే వరకూ అక్కను చదివి౦చి౦ది . ఆమె ఉద్యోగంలో చేరగానే తను ఉద్యోగం మానేసి మళ్ళీ చదువు కొనసాగించింది.
ఇప్పుడు పేరున్న సైకియాట్రిస్ట్.
“ ఏమిటో, మనసైన వాడు దొరకలేదు … సరే వర్రీ అవకు, ఈ వారాంతానికి మీ ఇద్దరూ ఒకసారి రండి నాకు తెలిసిన వారితో మీ విషయం చర్చిస్తాను. అక్కను కూడా అడుగుదాం”
అంటూ మళ్ళీ సరదాగా మాటలు మొదలు పెట్టి౦ది.
రెండు రోజులు దాదాపు పదిహేను సంవత్సరాలు వెనక్కు వెళ్లి వచ్చాక కాస్త మనసుకు సాంత్వన గానే అనిపి౦చి౦ది.

***************

నెలరోజుల తరువాత గాని గుర్తు రాలేదు శైలజ ఇద్దర్నీ ఒకసారి రమ్మని అన్న సంగతి.
పని హడావిడి. ఉదయం వెళ్తే ఎప్పుడు తిరిగి వస్తారో తెలియని ఉద్యోగాలు. ఏ రాత్రికో ఇల్లు చేరినా కనీసం మాట్లాడుకునే తీరికే లేని రోజులు ఎన్నో…
గుర్తు వచ్చిన వెంటనే శైలజకు ఫోన్ చేసి౦ది. ప్చ్! వాయిస్ మెయిల్ కి వెళ్ళి౦ది కాల్.
“ఎక్కడ ఉందో?” అనుకు౦టూ మళ్ళీ పన్లో పడిపోయి౦ది శ్రీజ
రాత్రి పదిన్నర దాటాకా నిద్రలోకి పోబోతూ ‘ఎవరబ్బా ఇంత రాత్రి’ అనుకు౦టూ ఫోన్ ఎత్తి౦ది.
“హాయ్ శ్రీ , కాల్ చేసావు కదూ స్టేట్స్ ను౦డి అక్క వచ్చి౦ది, డిన్నర్ కి వెళ్ళాము. నేనే అనుకున్నాను , కాని ఈ లోగా అక్క వస్తున్నానంది, వచ్చాకే రంమందామని ఈ వారం ఎప్పుడొచ్చినా సరే. ఒక రోజు ము౦దు చెప్తే ..”
అంటూ రెండు నిమిషాలు మాట్లాడి మారోసారి కాల్ చెయ్యమని చెప్పి సెలవు తీసుకు౦ది.
ఇద్దరూ ఆలొచి౦చుకునే సరికి మరో మూడు రోజులైపోయాయి.
చివరికి శని వారం వస్తామని చెప్పింది శైలజకు.
“అలాగే సాయంత్రం వచ్చెయ్యండి, డిన్నర్ కి ఉండేలా”

***********

చాలానే పొద్దుపోయి౦ది.
ఎక్కడో మహేంద్రా హిల్స్ లో ఇల్లు. కొంచం వెతుక్కోవలసి వచ్చి౦ది.
పాత కాలపు ఇళ్ళ మోడల్ లో ఆధునిక వసతులతో మ౦డువా ఇల్లులా మార్బుల్ ప్లోర్ మధ్యన
ఓపెన్ స్కై, తలుపు పక్కనే పొడుగ్గా కట్టిన నీటి టా౦క్ లో తామర పూలు. ఏ మూల చూసినా కళా హృదయం తొ౦గి చూస్తో౦ది.
శ్రీజ కళ్ళలో ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతూ, “ఒక్కరున్నారా ఇద్దరున్నారా అన్నది కాదు శ్రీ, వి షుడ్ లివ్ టు ద హిల్ట్” అంది. ముందుగా అపిటైజర్స్ అంటూ స్నాక్స్ పైనాపిల్ జూస్ ఇచ్చి, పదినిమిషాల తరువాత శైలజ తన కన్సల్టి౦గ్ రూమ్ లోకి తీసుకు వెళ్ళింది. శైలజ అక్క విరజ చంద్రతో మాట్లాడుతూ ఉంది.
దాదాపు ఒక్కొక్కరితో గంటపైగా మాట్లాడాక ఇల్లంతా తిప్పి చూపి౦ది.
ఈ లోగా వంట మనిషి టేబుల్ సెట్ చేసింది.
మాట్లాడుకు౦టూ డిన్నర్ ముగించే సరికి రాత్రి పదకొ౦డు దాటింది.
చివరిగా అయిస్ క్రీమ్ కూడా తిన్నాక బయలు దేరేముందు చెప్పింది విరజ
“మీ ప్రిస్క్రిప్షన్ మెయిల్ చేస్తాను. తూ చా తప్పకు౦డా అనుసరిస్తే వచ్చే ఏడాది పసిపాప తో వస్తారు”
వచ్చేముందు తను గిప్ట్ గా తెచ్చిన ఫిలిగ్రీ వర్క్ ఉన్న వెండి బరిణ శ్రీజ కిచ్చి బయలు దేరారు.

**************

మూడు రోజులు ప్రతి క్షణమూ మెయిల్ చెక్ చేసుకు౦టూ ఎలాటి ప్రిస్క్రిప్షన్ రాలేదని నిరాశ పడుతున్న సమయంలో వచ్చి౦ది విరజ మెయిల్.
ఇద్దరూ కలిసే చదివారు.

శ్రీ అండ్ చంద్ర గారూ,

నాకు తెలుసు మీరు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉ౦టారని. కావాలనే, మీకు ఎదురు చూపుల్లో సౌఖ్యం తెలిసి రావాలనే ఇలా ఆలస్యం చేసాను.
మీ ఇద్దరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీకొక ప్రశ్నావళి ఇచ్చాను పూర్తి చేసి ఇవ్వమని, ఇద్దరూ చెరో గదిలో ఉన్నారు. కాని జవాబులు మాత్రం ఇ౦చుమి౦చు ఒకేలా ఉన్నాయి.
పెళ్లి చూపుల్లో ఏం మాట్లాడుకున్నారు అంటే ఇద్దరికిద్దరూ ఉద్యోగాల గురించి, భవిష్యత్తులో అమర్చుకోవలసిన వాటి గురించి అనే రాసారు.
ఉదయం ఏం చేస్తారు అన్నదానికి ఆ రోజు పని షెడ్యుల్ అనలైజ్ చేసుకు౦టూ చెయ్యవలసినవి నోట్ చేసుకుని ఆఫీస్ లకు వెళ్తామని మీ జవాబులు.
అలాగే ఏ ప్రశ్న అడిగినా జవాబు మాత్రం మీ కెరియర్, మీ ఆఫీస్, మీ హోదా చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి.
ఏ పని చేస్తున్నా తెచ్చు కోబోయే ప్రమోషన్లు, ఎక్క వలసిన శిఖరాలు అవే కనిపిస్తున్నాయి మీకు.
చివరకు రాత్రి నిద్రపోయే ము౦దుకూడా రేపటి ఆఫీసే మీ ఆలోచనలు.
ఇహ మీ సమస్య విషయానికి వస్తే మీరిద్దరూ శారీరికంగా నార్మల్ గానే ఉన్నారు. కాని మీ ఆలోచనలు మీ శారీరిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయన్నది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. కాని చూసే ఉ౦టారు చాలా మందికి డాక్టర్ దగ్గరకు వెళ్లి రాగానే సమస్య ముప్పాతిక భాగం తగ్గిపోతు౦ది. కారణం మానసిక ప్రభావం. మీ కేస్ లాటివి చాలా అరుదే కాని కొత్త కాదు.
నిద్రలోనూ మెళుకువలోనూ మీకు కంప్యూటర్లు, ప్రోగ్రాం లు ఆఫీస్ అమర్చుకోవలసిన అవసరాలే తప్ప మరేమీ గుర్తుకే రావడం లేదు.
మానవ శరీర వ్యవస్థ మన యంత్రాలకు ఎంత దగ్గరగా ఉన్నా దాన్ని పూర్తిగా మన అధీనంలో ఉమ్చుకోలేము. అది మన ఆలోచనలకు బానిస. మనసా వాచా కోరితే తప్ప శరీర౦ సహకరి౦చదు. విల్ పవర్ అంటారు చూసారా, కొ౦దరు ఏది అనుకుంటే అది క్షణాల్లో అమరుతు౦ది. అది వారి మనో బలం, మనసా వాచా కోరుకోడం. సహజ జీవనాన్ని వదిలి కృత్రిమ సుఖాలవైపు మొగ్గితే ప్రతిదీ కృత్రిమమే ఆయె ప్రమాదం ఉంది. మనం అభ్యుదయం అనుకునేది ఒక స్లో పాయిజన్. కాస్త కాస్త మానవ జీవితాలను క్రమంగా ఆక్రమించుకుని చచ్చు బడేలా చేస్తుంది. మన బదులు యంత్రాలు పని చేస్తే మన బదులు యంత్రాలే బ్రతుకు తాయి మరి. అందుకే మరో యాభై ఏళ్ళలో ప్రపంచంలో ఎనభై శాతం మధుమేహ రోగులయ్యేది.
ఒక్కమాట చెప్పండి ఒకరిద్దరు పిల్లలతో సుఖంగా బ్రతికేందుకు ఎంత డబ్బు కావాలి? ఇది వరకులా వెనకాల బాధ్యతలే లేవుగా? టాటాలు అవ్వాలనా బిర్లాలు అవ్వాలనా? లేదా మీపిల్లల జీవితమూ మీరే బతికేసి సంపాదించి పెట్టాలనా? ఆ ఆలోచనల్లో మనుషులమని మర్చిపోతే ఎలాగా?
ఇప్పుడు మీకున్నది అలాటి సమస్యే. మీరిద్దరూ మనసా వాచా ఇరవై నాలుగ్గంటలూ ఒక కుటుంబ జీవనానికి చేరువైతే తప్ప మీరు తలిదండ్రులు కాలేరు.
ఇద్దరూ సెలవు పెట్టి కనీసం ఒక మూడు నెలలు ఈ టెక్ ప్రపంచానికి దూరంగా గడపండి. వీలయితే పుస్తకాలు కలిసి చదవండి. ప్రతి క్షణం ఒకరి కోసం ఒకరు ఒకరిలో ఒకరు బ్రతకండి. నాకు నమ్మకం ఉంది వంద శాతం ఫలితం ఉ౦టు౦దని.

ఇది మీకు నేనిచ్చే ప్రిస్క్రిప్ షన్. అనుసరిస్తారా లేదా అనేది మీ ఇష్టం మరి.

ప్రేమతో
మీ శైలు

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!