Wednesday, June 3, 2020
Home > సీరియల్ > అతని ప్రేమ కోసం (సీరియల్ నవల) -7వ భాగం – శ్రీ విజేత

అతని ప్రేమ కోసం (సీరియల్ నవల) -7వ భాగం – శ్రీ విజేత

కలత నిద్ర లోనే తెల్లవారింది. అంతా కొత్త మనుషులు, కొత్త ప్రదేశం. కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం ముగించి కొత్తబట్టలు కట్టుకున్నాను. ఆనాడు మా మారు పెండ్లి రోజు. అప్పట్లో ఇప్పటిలా పెళ్లి తెల్లవారి రోజు రిసెప్సన్ లాంటివి ఏమి చేసే వారు కాదు ఆడంబరంగా. తెలిసిన బంధువులను మిత్రులను పిలిచి పెండ్లి భోజనం ఏర్పాటు చేసేవారు. ఆనాడు ఉదయం పదకొండు గంటల వరకు మా తరపు బంధువులందరు వచ్చినారు. ఒంటరిగా ఉన్నాను అనిపించే నా మనసుకు కొద్దిగా ఊరట అనిపించింది. వచ్చిన బంధువుల్లో కొందరు ఇక్కడి తరపువారు నన్ను మా వారిని పకపక్కన కూర్చోబెట్టి కట్న కానుకలు సమర్పించినారు. కొన్ని జంటలను చూసి ఈడు జోడుగున్నారు అని అంటారు. మా జంటని చూసి సహజంగానే అలా అనుకునే అవకాశం లేదు. అయినా జీవితంలో భార్య అంటే భరించుకునేది, భర్త అంటే భరించుకునేవాడు అనే అర్థం కావచ్చు. వచ్చిన వారు మా ఇద్దరి జంటను ప్రత్యేక దృష్టితో చూసినారు అనిపించింది. భర్త అనే మగ మనిషి నా పక్కన కూర్చున్నాడు అనే స్పృహ నన్ను ఇబ్బందికి గురి చేసింది అందరిలో. అది నా అపరిపక్వమైన వయసు కావచ్చు, మనసు కావచ్చు, అనుభవం లేని తనము కావచ్చు. లోకంలో దేని గురించి అయినా మంచి అయితే మంచి అంటారు, చెడు అయితే చెడు అని చెప్పుకు తిరుగుతారు అందరిలో కొందరు. అది వారి మానసిక స్థితి కావచ్చు. వచ్చిన ప్రతి వాళ్ళకు మా కోడలు ఎలాఉంది అని ప్రత్యేకంగా చెప్పుకుంది మా అత్తమ్మ తను తన కొడుక్కి మంచి కోడలును తెచ్చుకున్నాననే ఒకానొక గొప్పతనంగా భావించి. ఆమెను చూస్తుంటే, మా వాళ్ళను చూస్తుంటే కొందరి తృప్తికి కొందరు బలి అయిపోతారేమో అని అనిపించింది.

మధ్యాహ్నం భోజనాల కార్యక్రమం అయ్యింది. ఆ సాయంత్రం లోగా అందరం మా వారితో సహా మా తల్లిగారి ఇంటికి బస్సులో వచ్చినాం. తెల్లవారి మా అత్తగారి బంధువులు వచ్చినారు మా యింటికి, ఆ రోజు పెళ్లి పందిరి కింద కూర్చొని నల్లపూసలు కుచ్చినారు, చిన్నగా విందు భోజనం ఏర్పాటు చేసినారు మా వాళ్ళు. అంతకు మించి కార్యక్రమాలు నేను ఊహించినదో, మా వాళ్ళు చేయాలనుకున్నదో ఏమి జరుగలేదు. పెళ్ళంటే రెండు కుటుంభాల బంధమేమో, అది రోజు రోజు పెనవేసుకపోయి ధృఢపడుతుందేమో కాని పెళ్లి రెండు హృదాయల బంధం కదా! అది ఎలా ఉండబోతుందో నేను ఊహించలేక పోయినాను. నిజంగా పెళ్లి అంటే రెండు మనసులు కలిసిన బంధం! మనసు, మమత, బతుకు ఇవన్నీ పుస్తకాల్లో చదువుకోవడానికి, రాసుకోవడానికి పనికివస్తాయేమో! నిజంగా మనసుండీ మనుషులతో కలిసి బతుకుతుంది ఎందరు? నిజంగా జీవితమంటే ఒక వెసలుబాటు చేసుకొని బతుకడం అనిపించింది. నేను కూడా అలానే బతకాలి అనుకున్నాను. అంతకన్నా గత్యంతరం ఏమి కనిపించలేదు.

ఆ తెల్లవారి నేను నా భర్తతో, మా అత్తమ్మవాల్లతో వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఇకనుండి రోజురోజుకు మా తల్లిగారి ఇంటి బంధాలను తగ్గించుకుంటూ అత్తగారి ఇంటి బంధాలను పెంచుకోవాల్నేమో అనిపించింది. మనషుల్ని ప్రేమించాలి, మనుషుల్నిఇష్టపడాలి, ఎవ్వరినీ ద్వేశించవద్దు, కాలం ఇచ్చినదాన్ని స్వీకరిస్తూపోవాలి అని తెలుసుకొని బతుకాలనుకున్నాను. కాలం నన్ను ఎలా బతుకాలని నిర్దేశిస్తుందో కాలానికే వదిలేశాను. ముందుగా మా అత్తవారి ఇల్లును ఆ యింటి పరిసరాలను అవగతం చేసుకోవాలనుకున్నాను. మా అత్తవారి వాళ్ళ ఇల్లు లంకంత ఇల్లు, అలా నేను అంటుంటే నాకు లంకలో ఉన్న సీతమ్మనే జ్ఞాపకం వచ్చింది నన్ను నేను పోల్చుకుంటే, ఇష్టమున్నా, ఇష్టం లేకున్నానేను జీవనం గడుపవలసిందే అని. ఇంటి ముందటికి వెళ్ళితే తప్ప మనషులు కనబడని ఇల్లు అది. ఇంటి వెనుకకు వెళ్ళితే దూరంగా కనిపించేవి కొండలూ, గుట్టలు, గట్లు, చెట్లు కనిపించాయి. అది వేసవి కాలం కాబట్టి దూరంగా ఎడారిలానే కనిపించింది. అంత పెద్ద ఇంట్లో ఉండేది పనిమనిషితో కలిపి ఏడుగురం. నేను నా భర్త, మా అత్తమ్మ మామయ్యా, మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ, మా మరిది, మాతో పాటు పని మనిషి. ఎవరి మనస్తత్వం ఎలాంటిదో చూస్తే, అనుభవానికి వస్తే కాని తెలుస్తుందేమో అనిపించింది.

మనుషులు, ముఖ్యంగా ఆడ మగ కలిసుండాల్సింది మనుగడ కోసమేమో విశాల దృక్పథంతో చూస్తే. తమ సంతతిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం ఏమో. ఆటవికులు అనాదిగా ఎలా కలిసి ఉన్నారో కాని, ఈ నవ నాగరికులు పెళ్లి బంధముతో కుటుంభ జీవనంతో కలిసి బతుకాలి. సంతానోత్పత్తి వాళ్ళ జీవితములో ఒక భాగామైపోవాలి, అప్పుడే పెళ్లి జంటకు జీవితములో ఒక చేయవలసిన పని పరిపూర్ణమైనట్లు భావిస్తుందేమో లోకం. ఆ పనిలో భాగంగా పెళ్లి చేసుకున్న జంట కలిసి బతుకాలి, కలిసి పనులు చేసుకోవాలి, సంగమించాలి, పిల్లల్ని కనాలి, పెంచాలి, పోషించాలి. మళ్ళీ వాళ్ళను అందరిలా తయారు చెయ్యాలి, ఇది లోక రివాజు. ఆ పనిలో భాగంగా ఒక మంచి రోజునాడు మాకు శోభనం ఏర్పాటు చేసినారు. పెళ్ళయిన జంటకు ఇష్టములా భావించబడే ఈ ప్రత్యేకమైన పని నా కెందుకో అసహజం అనిపించింది. దీనికి మంచిరోజులే కావాలా, మనుషులు సహజంగా కలుసుకున్నపుడే మంచి రోజులు, మనసులు కలిసినపుడే మంచిరోజులు. స్వేఛ్చా ప్రకృతిలో స్వేఛ్చగా బతికే మనుషులు ఇలానే చేసుకుంటారా అనిపించింది.
ముస్తాబు చేసారు ముద్దుగా నన్ను నా తోటి వయసువాళ్ళు. సిగ్గుల మొగ్గను కాలేదు, ముగ్ధ మనోహరమైన రోజు అని మురిసిపోలేదు. యాంత్రికమైన జీవితంలో ఇది ఒక భాగం ఇష్టమున్నా, ఇష్టం లేకున్నా అనిపించింది. సహజంగా జరిగిపోయే, జరుగవలసిన పనికి ఇంత ప్రత్యేకమైన తంతు ఎందుకు అనిపించింది నా చిన్నారి మనసుకు. పందిరి మంచం, తెల్లచీర, మల్లెపూలు, మధురిమలు, గుమగుమలు కొన్నిఊహల్లో, కథల్లో కొన్ని నిజంగానే కావచ్చు. ఎంత వద్దనుకున్నా జీవితాన్ని ఆహ్వానించాలే, స్వీకరించాలే అది ధర్మం, బాధ్యత అని గుర్తుకు చేసుకున్నాను. కాని మా ఇద్దరి మధ్య అంత సహజమైన దగ్గరితనం అసలు ఎర్పడనే లేదు, అతను ఉట్టి మట్టి బొమ్మలానే కనిపించాడు. ఆ మట్టి బొమ్మను కవ్విస్తే నేనే కవ్వించాలి, నవ్విస్తే నేనే నవ్వించాలి. కాని నవ్వించడానికి, కవ్వించడానికి నా దగ్గర మనసే లేకుండాపోయింది అతన్ని చూసిన మొదటి నుండి. అయినా ఆ మట్టి ముద్దను నేను మలచుకోవాలి కావచ్చు అనిపించింది.

జీవితం ఎంత మదురాతి మధురమైనది నిజంగా. ప్రకృతి లోని అందమంతా స్త్రీ లోనే ఇమిడి ఉందేమో! ముట్టుకుంటే మురిసిపోతూ మైనంలా కరిగిపోయే ముదితలుంటారు, పట్టుకుంటే పరువాల వయసుతో పురుషుడి ఒడిలో ఒదిగిపోయే సప్తవర్ణాల ఇంద్ర ధనుస్సుల్లాంటి మగువలుంటారు, ఎదలోయల ఎత్తు పల్లాలపై సున్నితంగా మీటితే మూర్చనలు పోయే వీణలుంటారు, పద సవ్వడులను అనుసరించి పదములు పాడే పురుష పుంగవుడుంటే నడకల్లో నాట్యాలు కురిపించే మయూరిలుంటారు, నడకలో నవరసాల హవాభావాలు ఒలుకబోసే చిలుకల కొలికిలుంటారు. నుదుట సింధూరంపై ప్రియ పురుషుడు చుంభిస్తే నవనాడులన్నీ వీణా తంత్రుల్లా మ్రోగిపోయి తన్మయత్నములో తూలిపోయే సుకుమార సుందర రమణులుంటారు, లిప్తపాటులో తెరుస్తూ మూస్తూ ఈ జగతిని వీక్షిస్తున్న చక్షువులను అలనల్లన సుకుమారంగా పెదవులతో వీవనలా అద్దుకునే గండు తుమ్మెదలాంటి పురుష పుంగవుడుంటే తనువునంతా పులకింపచేసే లలితాంగిలుంటారు ! మధువులూరే పెదవులపై తుమ్మెదలా వాలి సుందరంగా, సుకుమారంగా మధువును గ్రోలే మన్మదుడుంటే పరువాల ఉయ్యాలలో ఊగిపోయే పడతులుంటారు. బతుకులోకి నవవసంతాన్ని మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తూ తనువూ మనసు ఒకటి అయి ఆలంబనగా ప్రేమతో పక్కన నిలుచుండే మగ తోడుంటే లతలా పెనవేసుకపోయే ప్రియ బాంధవిలుంటారు. నుదుట సిందూరపు దారలోంచి, సంపెంగ లాంటి నాసిక శీర్షం మీంచి, మూసిఉన్న దానిమ్మ గింజల్లాంటి పలువరుసల పైన లేలేత అధారాల మధురసాల మీంచి జారి, చెక్కిలి వంపుల్లోంచి దిగజారి ఎదలోయలగుండా క్షితిజ రేఖలా గీత గీస్తూ వచ్చిన ప్రియబాంధవుని ఖర స్పర్షకు పరవశించి జలపాత కన్యలా పరుగులెత్తి ప్రవహించే స్త్రీలుంటారు! జీవితం ఎంత మధురమైనదీ, ప్రియమైనదీ! నాలో ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయేమో, నేను ఎంత వద్దనుకున్నా! అయినా అనుకున్నవన్నీ అందుతాయా అందరికీ ! కోరుకున్నవన్ని దక్కుతాయా కొందరికి. బంగారం విలువ, రత్నాలు, వజ్రవైడుర్యాల విలువ అందరికీ తెలుస్తాయా ! దాని విలువ తెలిసిన వాళ్ళు కావాలి ! వాటిని అందుకొని స్వీకరించే వాళ్ళు కావాలి. జీవితంలోని మధురిమలను ఆస్వాదించేవాళ్ళు కావాలి. మరకతములు, మణులు అక్కడ పడి ఉంటే వాటి విలువను గుర్తించి స్వీకరించేవాళ్ళు కావాలి, వాటిని అనువుగా ధరించేవాళ్లు కావాలి. అలా కానప్పుడు రాయికి రత్నానికి తేడా ఏముంటుంది? బతుకు ఒక మధుర రస కావ్యం స్త్రీ జీవితంలో అనువుగా అల్లనగా అందుకొని, లాలనగా స్త్రీ జీవిత పుట్లలలో సుమధుర జీవన పదపల్లవులను లిఖించే మనోహరమూర్తి ఇష్టసఖుడు దొరికినపుడు! మాటే ముత్యమై, మనసే బంగారమై అమృత సుధలు తన యెడల కురిపించే మగ మహారాజుకు తను అణువణువునా పులకిస్తూ దాసోహం అయిపోదా స్త్రీ మూర్తి. మురళీ గాన సుస్వర వేణూ గానానికి ముగ్ధురాలై మనసు పడేసుకున్న మగువలా స్త్రీ ఉండిపోదా తన జీవితములో అలాంటి తోడు తనకు దొరికితే. చెట్టు నుండి వచ్చే మధుర రస ఫలాలు ఎవరి చేతికి చేరుతాయో ఎవరికి తెలుసు…!

రాత్రి ఎనిమిది దాటిపోయి తొమ్మిది కావచ్చింది. పాతకాలం ఇంటిలో ఓ గదిలో ఇద్దరం. గుడ్డి లైటు వెలుగులో మాకు మేమే సాక్షి. ఇద్దరు మౌన ప్రేక్షకుల్లా ఒకరి ముందు ఒకరం. కొత్త పట్టె మంచం పరుపు మమ్ములను ఆహ్వానించింది. తెల్లని మల్లెమొగ్గలు మనసు పెట్టి చూసినాయి. పాల గ్లాస్ పట్టుకొమ్మని చూసింది. మాటల ముత్యాలు రాలాలి నిశ్శబ్దం లోంచి శబ్దంలా ఎవరి నుండైనా కాని ఇద్దరి మధ్య మౌనమే రాజ్యం చేసింది. వేసవి కాలం కాబట్టి ఫ్యాన్ మెల్లగా అటూ ఇటూ గాలిని కదిలిస్తుంది ఇద్దరి మధ్య మౌనాన్ని ఛేదిస్తూ. బతుకంటీ చీకటి వెలుగు కాని చీకటిలో కూడా వెలుగులుంటాయి, అందరికి కనిపించే వెలుగు లో కూడా చీకటులుంటాయి అనిపించింది..

నెమలిలా నాట్యం చేయాలని ఉన్నా చేయలేకపోయాను. హంసలా నడువాలని ఉన్నా నడువలేక పోయాను. కోయిలలా పాట పాడాలనుకున్నా పాడలేకపోయాను. మనసు ఎంత జటిలమైనది, కఠినమైనదీ మనిషిని బంధిస్తుంది. లతలా అల్లుకపోవాలని ఉన్నా స్తబ్దురాలిలానే ఉండి పోయాను. మల్లెలు, మధుఫలాలు మత్తెక్కించాలి కాని అలా జరుగలేదు. ఉట్టి మరబోమ్మలం, జడురాల్లం అనిపించింది అప్పుడు.

సృష్టి ఎంత విచిత్రమైనదీ ! పశువుకైనా, పక్షికైనా, ఏ జీవికైనా సృష్టి ధర్మం తప్పదు కదా! తుమ్మెదైనా, సీతాకోక చిలుకైనా పువ్వుపై మధువు కోసం వాలిందంటే ప్రకృతి ధర్మంగా అది ఒక ఋతురాగాన్ని పువ్వుకు అందించడం కోసమే అలా. రాగం అనురాగం ప్రతి మనిషిలో ఉంటాయేమో, వాటిని రంగరించి తీయడమే జీవితం కావచ్చు. అందుకు బతుకును మధించాలేమో అనిపించింది.

లైటు ఆరిపోయింది. చీకటిలో చీకటిలా కలిసిపోవాలని, కలిసిపోయామనుకొని కలిసిపోయాం.
బతుకింతే కొందరికీ! జ్ఞానముతోనో, అజ్ఞానంతోనో ఒకసారి తలవంచి కళ్ళు మూసుకుంటే పెండ్లి జరిగిపోయింది, ఇంకో సారి కళ్ళు మూసుకుంటే ఆ కార్యం జరిగిపోయినట్టు అయిపొయింది. జీవితంలో తృప్తి, అసంతృప్తి అని చెప్పడానికి ఏమీ ఉండవు కొన్ని సందర్బాలలో. జీవితం మనసులో ఒక మౌన ఘోష అయి వినిపించింది.
( సశేషం…….)

– శ్రీ విజేత

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!