Sunday, October 2, 2022
Home > కథలు > కోకిల! -వి.సునంద

కోకిల! -వి.సునంద

“కరుణించు ఓ దేవా! నడి సంద్రములోనా.. పయనించే నా నావ”…..“నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాటతో ఇప్పించుకో”…ఒకదాని తర్వాత మరొక పాట రాగయుక్తంగా పాడుతుంటే ఆ పాటల తరంగాలు రైలు పెట్టెలోని అందరి వీనులకు విందు చేస్తున్నాయి….
మనిషి కంటే ముందే పాట తనను పరిచయం చేసుకుంటూ పాడే అమ్మాయి ఎలా వుందో ఊహించుకోమని మనసుకు చెబుతోంది…ఆం ఎలా వుంటుంది చింపిరి జుట్టు మాసిన బట్టలు చూడగానే జాలి గొలిపేలా నాలుగు డబ్బులు జోలెలో రాల్చుకునేలా వుంటుంది…అనుకున్న శ్రీధర్ ఆ అమ్మాయిని చూడగానే ఒక్కసారిగా షాకయ్యాడు..
ఉతికిన బట్టలలో కడిగిన ముత్యంలా, మెరుస్తున్న కళ్ళతో, గుడ్డి తమ్ముడి చేయి పట్టుకొని సీట్ల దగ్గర ఆగి ఆగి వెళ్తోంది…పట్టుమని పదేళ్ళు కూడా లేవు…
పిల్ల చూస్తే ముద్దుగా వుంది..పెద్దయితే బలే అందగత్తె అవ్వుద్ది…విషపు మాటలు కొన్ని….ఏం పిల్లా ! సూస్తుంటే బాగున్నవు గనీ ఇదేం అడుక్కునే బుద్ధి అమ్మ నాయుిన లేరా..మరి కొందరి వెక్కిరింతలు…..ఎవరేమని అంటున్నా పట్టించు కోకుండా స్థిత ప్రజ్ఞలా ఓ వైపు పాట పాడుతూ మరో చెయ్యి చాపి అడుక్కుంటూ వెళ్తున్న ఆ అమ్మాయిని చూస్తుంటే, అదే వయసున్న తన కూతురు గుర్తొచ్చి గుండె కలుక్కుమంది శ్రీధర్ కు…
బాల్యం బందీగా మారి ఈ చిన్నారి తూనీగ రెక్కలు విరిచేసింది కదా అనిపించింది.. చట్టాలెన్నొచ్చినా ఇంకా ఇలాంటి పిల్లలకు అందని ద్రాక్షలే అనుకుంటూ ఆలోచనలలో మునిగిన శ్రీధర్ తన ముందు నుండి కదలి పోతున్న రాగం దూరమవ్వడంతో, వెంటనే ఆలోచనలాపి “ఏయ్! పాపా! ఇలా రామ్మా!” గట్టిగా కేకవేశాడు.. పాటలో లీనమై వెళ్తున్న అమ్మాయికి తమ్ముడు చెప్పడంతో పాట ఆపి వెనక్కి తిరిగి శ్రీధర్ దగ్గరికి వచ్చింది…
నీ గొంతు బాగుంది ఎక్కడ నేర్చుకున్నావ్! ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇక్కడే వుంటే వచ్చే నాలుగు డబ్బులు కూడా రావన్నట్టు కొంచెం అసహనంగా ముఖం పెట్టి “ఎక్కడ నేర్చుకోలేదు సారు” అంది…
ఆ అమ్మాయి ఫీలింగ్స్ గుర్తించి.. పది రూపాయల నోటు చేతిలో పెడుతుంటే ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి తీసుకోనా వద్దా అని సందేహంగా చూస్తూ తమ్ముడి జేబులోంచి చిల్లర తొమ్మిది తీసి ఇవ్వబోయింది…వద్దమ్మా! అని, పిల్లల కోసం కొన్న బిస్కెట్ పాకెట్ చాక్లెట్లు ఇస్తుంటే ఆ చిన్నారి కృతజ్ఞతా చూపు మనసునలాగే కట్టి పడేసింది… ఆ పసిదాన్ని ఒక్కసారి అక్కున చేర్చుకోవాలనిపించింది…
ఖమ్మం లో దిగి బండి తీసుకుని ఇంటికి వెళ్తున్న శ్రీధర్ కు ఆ అమ్మాయి అమాయకమైన రూపం పాట అలా మనసులో మెదులుతూనే వున్నాయి….

ఈ మధ్యనే వరంగల్ ట్రాన్సఫర్ అవడం వల్ల ట్రైన్ కు వెళ్తున్నాడు…..
ప్రతిరోజూ ఆమ్మాయి కోసం వెతుక్కోవడం చూడగానే తెలియని ఆనందానికి లోనవ్వడం అలవాటయ్యింది…ఎన్ని సార్లు బుజ్జగించి అడిగినా కావలసిన సమాచారం రాబట్టలేక పోతున్నాడు…
ఆఫీస్ పనుల వత్తిడి వల్ల నెలరోజులపాటు వరంగల్ లోనే వుండవలసి వచ్చింది… తన పిల్లలు గుర్తొచ్చినప్పుడల్లా ఆ అమ్మాయి గుర్తొచ్చేది…
వారం రోజులు సెలవు పెట్టి భార్యా పిల్లలతో సినిమాలు షికార్లకు వెళ్ళి వచ్చాడు..
యధావిధి నిర్వహణలో పడిపోయాడు..ఓరోజు ఆ పాటలమ్మాయిని చూడగానే మనసు పురివిప్పిన నెమలి అయ్యింది…చూడగానే బాధ వేసింది..మొహమంతా కంది పోయి వుంది..బాగా ఏడ్చినట్టుంది.. కళ్ళు వుబ్బి విచ్చుకున్న మంకెన పూవుల్లా వున్నాయి…ఇక ఆలస్యం చేయొద్దు ఎలాగైనా. అమ్మాయి వివరాలు తెలుసు కోవాలనే పట్టుదలతో తెలియకుండా వెంబడించాడు…

అక్కా తమ్ముడు ఇద్దరు ఖమ్మం దాటి మధిరలో దిగడం చూసి తనూ దిగాడు…
రోజూ బోలెడన్ని కబుర్లు చెప్పే అక్క అలా వుండటం నచ్చలేదు తమ్ముడికి…అక్కా! ఎందుకక్కా! రోజూ అమ్మతో తిట్లు దెబ్బలు తింటావు.. అమ్మ చెప్పినట్టు వినొచ్చుగా… నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తదక్కా! అంటున్న తమ్మున్ని దగ్గరకు తీసుకొని…నాకేమో రోజూ చూస్తున్న పిల్లల్లా శుభ్రంగా వుండాలని..తలదువ్వుకోవాలని వుంటుంది…అందుకే నా కున్నవాటిలో మంచివి సంచీలో వేసుకొని రైలు డబ్బాలో పాసుకు పోసుకునే దాంట్లోకెళ్ళి మార్స్కున్నది.. అమ్మకెవలో చెప్పిండ్రురా..అనగానే అక్కా! నేచెప్పలేదక్కా! అందరు నిన్ను బంగారు బొమ్మోలె వున్నవంటే సూడాలనిపిస్తున్నది.. మాయదారి దేవుడు కళ్ళు లేకుండ సేసిండు.. అనంగనే ఏడుస్తూ తమ్మన్ని దగ్గరికి తీసుకుంది..నీకు తెలియదు తమ్ముడు దేవుడు కాదు అనబోయి నాలుక కరుసుకుంది ఆ అమ్మాయి….

ఇవన్నీ వింటుంటే శ్రీధర్ ఒళ్ళంతా ఓ లాంటి గగుర్పాటుకు గురైంది…అంటే..అంటే…కన్న బిడ్డలని చూడకుండా ఇంత దారుణమా…ఆకలినా..అవసరమా…దీనికి పురికొల్పింది్టి…! ఆవేదన ఆలోచన మిళితమై వాళ్ళ వెనకాలే నడిచాడు.. ఊరి బయట దూరంగా విసిరేసినట్టున్న గుడిసెలు అందులో ఓ గుడిసెలోకి వెళ్లడం దూరం నుంచే గమనించసాగాడు..కొద్ది సేపయ్యిందో లేదో నడివయసు ఆడమనిషి ఆ అమ్మాయిని గొడ్డును బాధినట్టు బాదుతూ బూతులు తిడుతూ జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకొచ్చింది…

సక్కదనంగ వున్నవని కాలుసేతులు ఇరగ్గొట్టకుండ జోలిచ్చి పంపితే సోకులెక్కువైనయి…నీ సోకులు ఇప్పుడు గాదే ఇంకా ఆరేడేళ్ళకు గావాలి…నిన్ను జూసి యిప్పుడెవ్వరే జాలి పడి డబ్బులేసేది…ఆ గుడ్డోన్ని చూసి ఏత్తున్నరు…గొంతు బాగుందని కోకిలని పేరెడితే పెంచిన మమ్మల్ని కాకుల్లా సేసి ఏడిపిత్తున్నవు గదనే…అంటుంటే….
అంటే ఈ అమ్మాయి సొంతబిడ్డ గాదా! అందుకే రాక్షసిలా ప్రవర్తిస్తోంది…ఆ పాపాయి పేరు కోకిలా..?అనుకుంటూ ఇంకొక్క క్షణం ఆలస్యం చేస్తే ఆ కుంటి మనిషి చేతిలో ప్రాణం పోయేట్టుందని గబగబా దగ్గరికి వెళ్ళి ఆమె చేతుల్లోంచి కోకిలను విడదీసి దగ్గరకు తీసుకున్నాడు…హఠాత్తుగా జరిగిన దానికి ఏం చేయాలో అర్ధం కాలేదు ఆమెకు..తేరుకొని ఏయ్! ఎవరయ్యా నువ్వు నా బిడ్డ నా ఇష్టం మద్దెలో వచ్చి నవ్..అని దబాయించ బోతుంటే. అదే విషయం స్టేషన్ల చెబుదువురా! గట్టిగా గద్దించే సరికి అవిటి దాన్ని వదిలేయండి “బాబూ! మీకు దండం బెడతా! నా బిడ్డను పువ్వోలె జూస్కుంట” అని కాళ్ళ మీద పడింది..

“నిజం చెప్పు లేదంటే! అని బెదిరించేసరికి” ఖమ్మం రైలు పట్టాల దగ్గర పసిగుడ్డుగా దొరికింది బాబూ!” ఏడవడం మొదలు పెట్టింది…మరి ఆ గుడ్డి పిల్లవాడు ..” ఆడు నా కొడుకే బాబు. పాపిట్టి దాన్ని నీనే ఆడి కళ్ళల్లో జిల్లేడుపాలు పోసి గుడ్డోన్ని చేసిన” అంటుంటే నివ్వెరబోయాడు…అయ్యా! గీ కాలు గూడా నేనె రోకలిబండతో యిరగ్గొట్టుకున్న…పాడు పనులు చేయలేక..ఆకలిని సంపుకోలేక గియన్నీ సేసిన బాబూ! చమించండయ్య! అంటుంటే అవాక్కయ్యాడు…నేరాలు ఘోరాలు టీవీలో చూశాడే గానీ ఇలా…తట్టుకోలేక పోయాడు.

నీ పిల్లలకు మంచి దారి చూపిస్తానని చెప్పి..పర్స్ లోని నోట్ల కట్టతీసి. ఆమె చేతిలో పెడుతూ…ఇంకెవ్వరి ఉసురుపోసుకోకు.. వీటితో ఏ టీ కొట్టో బజ్జీల బండో నడుపుకోమంటూ. నీ కొడుకును ప్రత్యేకమైన స్కూల్లో చేర్పిస్తాను….ఈ కాకుల లోకంలో కోకిల బతకలేదు.. ఈ పాప సుమధుర రాగాలతో రేపటి భవిష్యత్తులో గాన కోకిలై పేరు తెచ్చుకోవాలి… అంటూ కోకిల కన్నీళ్ళు తుడిచి చేయి పట్టుకొని తన లక్ష్యం వైపు నడిపించాడు.

-వి.సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!