Thursday, July 9, 2020
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం ! (7 వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం ! (7 వ భాగం) -స్వాతీ శ్రీపాద

శనివారం. వీకెండ్ కాబట్టి లేట్ గా లేవడం అలవాటే కాని ఆ రోజు చందన ఉదయమే లేచి౦ది. ఏడి౦టి కల్లా రెడీ అయేసరికి బద్ధకంగా కళ్ళు విప్పాడు హరి.
“ఇంత ఉదయమే ఎక్కడికి చందూ?”
“గుడిలో వాలంటరీ వర్క్ సైనప్ చేసాను హరీ. భగవంతుడు నాకిచ్చిన అవకాశానికి కృతజ్ఞత చూపాలిగా, లేచాక పిల్లలను తీసుకుని గుడికి రా”
అంటూ హడావిడిగా బయలు దేరింది.
ఏడున్నర నుండి పూల మాలలు కట్టడం, పూజకు కావలసిన ఏర్పాట్లు చూసి ఆ తరువాత ప్రసాదాల తయారీ వాటిని పంచే వరకూ అక్కడే వుంది. అప్పటికి రెండు గంటలు దాటింది. పిల్లలని తయారు చేసి తీసుకుని వెళ్ళాడు హరి.
అక్కడే ఎవరికీ కావలసింది వారికి కోనో లంచ్ చేసి ఇంటికి వచ్చారు.
అప్పుడప్పుడే మామూలుకు వస్తున్నా ఆరోగ్యం, పోనీ టెయిల్ వరకూ పెరిగిన జుట్టు సన్నగా చందనపు బొమ్మలాగే వుంది చందన.
“నీకు నువ్వు అగ్ని పరీక్ష పెట్టుకు౦టున్నావా చందూ?”
“లేదు హరీ జీవితంలో ఎప్పుడూ మనకోసం మనమేనా? ఎవరికైనా ఎం చేసామని మానను మనం ప్రశించుకుంటే చెప్పుకు౦దుకు ఏమైనా మిగలాలిగా ?”
“నువ్వెప్పుడు చెప్పుకు౦టావు ?”
నవ్వింది చందన.
“ చేసిన పని చెప్పుకోవాలా? చెయ్యకపోతే చెప్పుకోవాలి గాని…”
నిజమే చేసే పని కనబడుతుంటే చెప్పుకోడం ఎందుకు?
రెండు సంవత్సరాలు ఎలాటి ఇబ్బందులు లేకుండానే గడిచాయి.
పిల్లలు ఒక రొటీన్ లోకి వచ్చేశారు. ఉదయమే స్కూల్ కి వెళ్తే సాయంత్రం చందన ఇంటికి వస్తూ ఆప్టర్ కేర్ తరువాత ఆరింటికి ఇంటికి తెస్తుంది.
కాస్సేపు టీవీ చూసి కాసేపు ఆడుకుని రాత్రి ఏడున్నరకల్లా డిన్నర్ తినేసాకా వారి గదుల్లో నిద్రపుచ్చ్సుతు౦ది చందన.
ఇద్దరూ ఒకే వయసు వారైనా అమ్మాయికి ఉన్నంత చురుకుదానం పిల్లవాడిలో కనబడదు. బెడ్ మీద పడుకునే ఒక చిన్న పుస్తకం తనే చదువుతుంది. కాని పిల్లవాడికి మాత్రం చదివి వినిపించడమో చదివి౦చడమో చెయ్యాలి.
ఆ సమయానికి ఇంటికి వస్తాడు హరి. అతనికీ మధ్య హాస్పిటల్ డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చి౦ది. దానితో బాటు బాధ్యతలూ పెరిగాయి. రోజులు కొంచం నింపాదిగానే సాగుతున్నాయి.
*****************
పని పూర్తి అయింది, వెళ్దాం అని లేస్తు౦డగా వచ్చిందా కేస్.సూసైడ్ అటెంప్ట్. కొంచం కండిషన్ క్రిటికల్ గానే ఉంది. ఏదో గార్డెన్ పెస్టిసైడ్ తాగేసినట్టు౦ది.
స్త్రేచర్ మీద మనిషి తెల్లగా పొడుగ్గా ఆరడుగులు దాటి ఉన్నట్టుగా అనిపిస్తోంది. మామూలు నైట్ డ్రెస్ లో ఉంది. కాస్త పొడుగూ పొట్టీ కాకుండా వున్నా జుట్టు రబ్బర్ బాండ్ వేసుకుని వుంది. అంటే ఉదయం నుండీ ఆ పిల్ల కనీసం నైట్ డ్రెస్ కూడా మార్చుకోకుండా ఆలోచించి ఆలోచించి ఈ పని చేసిందా?
స్లీవస్ లేని టాంక్ టాప్. మేకప్ వేసుకున్నట్టుగాలేదు. ఇంకా ఇరవై ముప్పై మధ్యే ఉండి ఉంటుంది. మూడింటికి క్లీనర్స్ పదిహేను రోజులకోసారి వెళ్ళే రెగ్యులర్ క్లీనింగ్ కి వెళ్లి సగం ఇల్లు క్లీన్ చేసాక బెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి అపస్మారకంగా పది ఉన్న మిస్ పార్కర్ కనిపి౦చి౦ది. వెంటనే అంబులెన్స్ కి, పోలీస్ కి కాల్ చేసారు.
వెంటనే ఎమర్జెన్సీకి తెచ్చి జాయిన్ చేసారు.
చందన ఈ మధ్యనే ఎమర్జెన్సీకి మారింది. పెద్ద పని ఉండకపోయినా అప్పుడప్పుడు ఇలాటి కేస్ లు వస్తే రెండు మూడు గంటలు ఎక్కువ ఉండాల్సి వస్తుంది. పేషంట్ ను మధ్యలో వదిలి వెళ్ళబుద్ధి కాదు.
ఆ పేషంట్ స్తంక్ ఏమ్ప్తీ చేసి డ్రిప్ తో పాటు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేసే సరికే రెండు గంటలు పట్టి౦ది. కొంచం కొంచం స్పృహలోకి వస్తోంది.
అప్పటికి క్లీనర్స్ వల్ల వివరాలు తెలిసాయి.
మిస్ పార్కర్ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పని చెస్తో౦ది. మంచి పేరు పనితనమూ ఉన్న మనిషి. ఖరీదైన ప్రాంతంలో అన్ని విధాలా అనుకూలమైన ఇల్లు కొనుక్కుంది. దాన్ని అందంగా కళాత్మకంగా తీర్చి దిద్దుకుంది. సాధారణంగా ఉదయం పదికి ఆఫీస్ కి వెళ్తే ఏ రోజూ తొమ్మిదికి ముందు ఇల్లు చేరదు. పనే స్వర్గం పనే జీవితం అనేలా పని చేస్తుంది.
ఆమెతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ టిం ను ఒకటి రెండు సార్లు చూసారట. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉ౦టు౦దనీ, హఠాత్తుగా ఎ౦దుకిలాటి నిర్ణయానికి వచ్చి౦దో అర్ధం కాలేదనీ అన్నారు. నిజానికి ఆమెకు ఇంకా బ్రతికే రోజులు రాసి ఉ౦డబట్టే ఆ రోజున క్లీనింగ్ ద్యూ లేకపోయినా మర్నాడు వేరే పని రావడం వల్ల ఒకరోజు ముందుగానే వెళ్ళారు. గరాజ్ కోడ్ తో తెరిచి పని చేసి వెళ్ళడం వారికి అలవాటే.
వారి పేమె౦ట్ రెగ్యులర్ గా బాంక్ కి వెళ్ళిపోతుంది.
ఇహ ఫర్వాలేదని అనుకున్నాక ఇంటికి బయలు దేరి౦ది చందన. రాత్రి ఎనిమిది దాటింది. సాయంత్రమే హరికి చెప్పడం వల్ల ఈ పాటికి ఆటను వచ్చి పిల్లలకు డిన్నర్ తినిపించి నిద్రపుచ్చి ఉంటాడు.
మనసులు ఇంత దుర్భాలంగా ఎలా ఉంటాయో అర్ధం కాలేదు చందనకు. ఎంత కష్టం వచ్చినా ఇలా ఆత్మహత్య ప్రయత్నమేమిటి? ఒకసారి జీవం పోగొట్టుకుని ఏం చేద్దామని? ఏదైనా చెయ్యగలిగితే బ్రతికుండే చెయ్యాలి, లేదూ ఓటమి అంగీకరించి రాజీ పడాలి.
ఎందుకో హఠాత్తుగా చిన్నప్పుడు తనతో చదివిన స్వరాజ్యం గుర్తుకు వచ్చి౦ది.
ఎంతో అందంగా సుకుమారంగా పాలూ తేనే కలగలిపి చేసిన రంగుతో మెరిసిపోతూ ఉండేది.
తొమ్మిదో క్లాస్ లో ఉండగా కాబోలు పక్కి౦టి పరమేశంతో ప్రేమలో పడింది.
అసలా వయసులో ప్రేమ ఏమిటో …
అదే అడిగినట్టు గుర్తు.
“ నీకు తెలియదే చందూ ప్రేమకు వయసూ వర్ణమూ ఉండవు. మనసొక్కటే ముఖ్య౦. ఈ విషయం మనకు ఎన్ని సినిమాలలో చూపి౦చలేదూ, దేవదాసు చూడు, లైలా మజ్నూ చూడు, అనార్కలి చూడు ఎ సినిమా చూసినా ప్రేమ విరహం బాధపడటమేగా?” అనేది.
“అవన్నీ నాకు తెలియవు స్వరాజ్యం. ఇప్పుడు స్కూల్ కి వెళ్లి చదువుకోవలసిన సమయంలో ఇవన్నీ అవసరమా ?” అని అడిగింది.
“ ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఏమిటి అని మనలను అడిగి పుట్టదు కదా చందూ” జాలిగా చూసింది.
“అసలి౦తకూ పరమేశం ని ఎందుకు ప్రేమిస్తున్నావు?”
“ నాకు ఇష్టమైనవన్నీ చేస్తాడు చందూ, మొన్నటికి మొన్న కరణం గారి తోటలో దోర మామిడి కాయలు కోసుకు వచ్చాడా? నీకు తెలుసుగా అక్కడి నుండి తేడం ఎంత కష్టమో
వాటి కోసం ఇంటి నుండి మిరప్పొడి ఉప్పూ కూడా పొట్లాలు కట్టుకు వచ్చాడు. నన్ను తీసుకో మంటే వద్దన్నాను. ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోవద్దని అమ్మ చెప్పిందిగా, నేను తీసుకోకపోతే మొత్తం చెత్తలో పారేస్తానన్నాడు. ఏమైనా చేసుకో అన్నా, అంతే మొత్తం చెత్తలో వేసాడు.
మనసు చివుక్కుమంది. అయ్యో వాడుకూడా తినకు౦డా చేసానే అనిపించింది.
ఇల్లాగే పరమేశం ఏం చేసినా నా కోసమే చేస్తాడు.”
గర్వంగా చెప్పింది. కాబోలుననుకు౦ది ఆ వయసులో చందన. ఆ తరువాత సంవత్సరం పదో క్లాస్ కి వచ్చాక, ఆగస్ట్ లొ కాబోలు పరమేశం పెళ్లి జరిగింది. అతని మేనమామ కూతురు దానికి సరిగ్గా పన్నెండేళ్ళు కూడా లేవు.
ఆ వార్త తెలిసాక దిగులు దిగులుగా ఉండేది స్వరాజ్యం. చిక్కి పోయి, కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉన్నట్టు, ఎప్పుడూ పరధ్యానంగా, ఒక్కోసారి స్కూల్ కి వచ్చేముందు జడ కూడా వేసుకునేది కాదు.
“ ఈ బాధ నేను భరి౦చలేనే, వాడే నా జీవన సర్వస్వం అనుకున్నా, నాకు నీళ్ళు కూడా తాగాలని అనిపి౦చడం లేదు” అనేది.
అక్కడికీ చెప్పి చూసింది
“ మనసు మార్చుకోవే, నాలుగు రోజులు బాధనిపి౦చినా మళ్ళీ ఎవరి బ్రతుకు వారు బ్రతకాలిగా?”
“ దేవదాసు మార్చుకున్నాడా, సలీం అనార్కలి మార్చుకున్నారా? ఈ మధ్యన వచ్చిన సినిమా వాగ్ధానంలో, బాటసారిలో, ఏ సినిమా చూసినా మార్చుకున్నా ఏం సుఖపడ్డారు?”
దీనికి పిచ్చి బాగా ముదిరి౦ది అనుకుంది.
దసరా సెలవల్లో ఇంటిల్లిపాదీ తిరుపతి ప్రయాణం పెట్టుకున్నారు. తిరుపతి, కాళహస్తి అంటూ అన్నీ తిరిగి వారం రోజులకు తిరిగి వచ్చేసరికి భయంకరమైన వార్త. స్వరాజ్యం కాలవలో దూకి చచ్చిపోయింది. అప్పటికి ఏడో రోజు.
హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. దసరా సెలవలకు ముందు రోజు స్కూల్ నుండి ఇంటికి వస్తుంటే ఇంటికెళ్ళి చదవ్వే అంటూ ఒక మడిచిన కాగితం మాత్స్ బుక్ లొ కుక్కి౦ది.
ఇంటికి రాగానే చదువుదామనే అనుకు౦ది. కాని ఇంటికి వచ్చేసరికే ఇల్లు హడావిడిగా వుంది. అత్తలూ వాళ్ళ పిల్లలూ ఆ హడావిడిలో షెల్ఫ్ లొ పారేసిన పుస్తకాలు మళ్ళీ ఇంతవరకూ ముట్టుకోలేదు.
వెంటనే వెళ్లి చదువుదామని ఉన్నా ఇంట్లో జనాలతో వీలు కుదిరేలా లేదు.
స్నానానికి వెళ్తూ ఆ మడిచిన కాగితం జాకెట్లో దోపుకుని బాట్ రూమ్ లోకి వెళ్లి తెరిచింది.
“చందూ
ఈ బాధ నేను భరించలేనే. నిన్న సాయంత్రం పరమేశం కనిపించాడు. మళ్ళీ నా వెనకేనకే వచ్చాడు
ఎందుకు వస్తున్నావ్? పెళ్లి చేసుకున్నావ్ గా అని అడిగాను అది పెద్దవాళ్ళ ఒప్పందం అట. ఎటైనా పారిపోదామా అన్నాడు.
నేనా పని చెయ్యలేను. అందరూ లేచిపోయిందని దుమ్మెత్తి పోస్తారు. అలాగని పరమేశం లేకుండా బ్రతకనూ లేను రేపు గుడికి వెళ్ళినప్పుడు కాలవలో దూకేస్తాను. నాకు ఈత రాదుగా
ఎవరినైనా ప్రేమిస్తే ఇంతేనే చందూ…ఎవరినీ ప్రేమించకు” అది చదివాక కాళ్ళూ చేతులూ ఆడలేదు చందనకు.
“అమ్మా అమ్మా” అని అరుస్తూ పరుగెత్తుకు వెళ్లి వంటింట్లో కాఫీ చేస్తున్న తల్లి చేతిలో ఉ౦చి౦దా కాగితం.
దాన్ని చదివి పూర్వాపరాలు తెలుసుకుని
“ఈ విషయం ఎక్కడా చెప్పకు” అంటూ దాన్ని కాల్చి పారేసి౦దావిడ.
కాలవలో గజఈతగాళ్ళను పిలిచి వెతికించినా మూడో రోజుకు కాని శవం దొరకలేదట.
ఉబ్బిపోయి చూడలేకుండా ఉన్న శవాన్ని వెంటనే ఓ చెట్టుకు పెళ్లి చేసి మరీ అంత్యక్రియలు చేసారట.
పని మనిషి చెప్పిన వార్తా అది.
అక్కడితో ఆగిందా,
“ ఏ కడుపో కాలో వచ్చి ఉంటుంది. అందుకే కాలవలో దూకేసి౦ది ” అంది.
అలాటిది లేదని తనకు తెలుసు.
కనీసం వాడి చిటికెన వేలు కూడా తగలనిచ్చి ఉండదు. కాని ప్రేమ అనే భ్రమకు బలి అయిపోయింది.
ఆలోచిస్తూనే ఇల్లు చేరే సరికి హరి వార్తలు చూస్తూ టీ తాగుతున్నాడు.
వెళ్లి సోఫాలో వాలిపోయిన చందనను చూస్తూనే లేచి వెళ్లి ఆరెంజ్ జ్యూస్ తెచ్చి ఇస్తూ
“అలసిపోయావా?” అడిగాడు.
హాస్పిటల్ లొ కేస్ గురించి చెప్పింది.
“ముందు వెళ్లి స్నానం చేసిరా, కాస్త తిన్నాక మాట్లాడుకుందాం” అంటూ ఆమెను చెయ్యిపట్టుకు లేవదీసి
బాత్ రూమ్ వరకూ నడిపించుకు వెళ్ళాడు.
తను స్నానం చేసి వచ్చేలోగా టేబుల్ సెట్ చేసి అన్నీ మైక్రో వేవ్ లో పెట్టి వేడి చేసి సిద్ధంగా కూచున్నాడు.
తలతుడుచుకు౦టూ వచ్చింది చందన.
“మనసు అస్సలు బాగాలేదు హరీ. ఆ పిల్ల సూసైడ్ అటెంప్ట్ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసింది.”
అంటూ స్వరాజ్యం గురి౦చి చెప్పి౦ది.
“ అందుకేనా నా ప్రేమను శ౦కి౦చావు, మీ మిత్రురాలి సలహామేరకేనా?”
“ఛ ఏదో తెలిసీ తెలియని వయసులో, అయినా అది ప్రేమ కాదు కాని సినిమాలు చూసీ, నవలలు చదివీ దాని మెదడు చెడిపొయి౦ది. ఎవరితోనూ పంచుకోలేక, సరిపెట్టుకోలేక సరిగ్గా చెప్పే వారులేక… అనవసరంగా జీవితం ఫణంగా పెట్టింది.
అలాటిది ఇక్కడ అమెరికాలో కూడా ఇలా ఆత్మహత్యలు … ప్చ్ ”
“ఎక్కడయినా మానవ మనస్తత్వం ఒకటే చందూ, కొందరు బలహీనులు , కొందరు ధృఢమైన వారు, ఏదో ఒక బలహీన క్షణంలో అలా పిచ్చిగా ప్రవర్తిస్తారు, తాము అనుకున్నది చెయ్యగలమని ఎదుటి వాళ్లకు చెప్పడానికి. అయినా తలిదండ్రుల బాధ్యత కనిపె౦చడం ఒకటే కాదు. సరైన విధానంలో ఆలోచించటం నేర్పాలి. అనుకున్నవి అనుకున్నట్టు జరగవని తెలియజెయ్యాలి. అలా జరగకపోవడం అందరికీ జరుగుతుందనీ, మనొక్కరికే కాదనీ, ఎవరికీ వారు ఎంత ప్రత్యేకమో, అంత సాధారణం అని తెలియజెయ్యాలి.
చిన్నప్పటినుండీ ఏడ్చి సాధించాలని చూస్తారు. అయినా లొ౦గి పోకూడదు. తెలుసుకుంటారు. ఏడిస్తే రావని.
సరే రా నాకు ఆకలిగా వుంది”
భోజనాలయాక “నేను సర్దేసి వస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో ” అన్నాడు గాని చందన సోఫాలో నే వాలి కళ్ళు మూసుకుంది.
ఈ పిచ్చి పిల్లకు ఏం సమస్యలు ఉన్నాయో. మంచి ఉద్యోగం మంచి ఇల్లు ఉన్నా ఏం తక్కువై౦దో?
********************
ఐసీ యూ లొ పార్కర్ కళ్ళవెంట నీళ్ళు కారిపోతున్నాయి.
ఆమెకు తనమీద తనకే రోత అనిపించింది.
జీవితం ముగిసిపోతుమ్దని అనుకుంది కాని ఇలా మళ్ళీ అందరికీ తెలిసేలా… ఓ గాడ్.
తెలిసీ తెలియని వయసులోనే ఎందుకు అనేది కూడా తెలియదు, తల్లి తండ్రీ విడిపోయారు.
ఆరు నెలల్లోనే తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకుంటే తల్లి ఆరేళ్ళ తరువాత మరో మనిషికి భార్య అయి౦ది.
అవును. కస్టడీ తల్లికి ఇచ్చ్సినా తండ్రి దగ్గరకు తాము వెళ్లడమో , అతను వచ్చి చూసిపోదమో జరిగేది.
కాని అటు కన్నతంద్రికీ ఇటు తల్లికీ వారి కుటుంబాలు వారికున్నాయి.
తానూ, తన అక్క ఎక్కడ ఉన్న ఏదో ఒక అయిష్టత ఎదుర్కోవలసి వచ్చేది. అక్క ఎలిజబెత్ చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి.
“ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికీ లేకున్నా మనం మేజర్లం అయే వరకూ మన బాధ్యత అమ్మదీ నాన్నదీ. మనమేమీ పుడతాం పుడతాం అనలేదుగా ఇష్టంగానో అయిష్టంగానో మనకు జన్మ నిచ్చారు. బాధ్యతా వహి౦చవలసి౦దే” అనేది.
హైస్కూల్ అవగానే అక్క సంపాదన మొదలెట్టింది.
బేబీ సిట్టింగ్ చేసీ, హెల్పర్ గా పని చేసీ, డ్రైవింగ్ వచ్చాక తన వెంట చేల్లెలినీ తీసుకు వెళ్ళేది.
అక్క కాలేజీ చదువుకు వెళ్ళిపోయాక ఒంటరి తనం గొప్పగా బాధించేది పార్కర్ ను.
రె౦డేళ్ళు ఒంటరి తనం అంటే ఏమిటో తెలిసి వచ్చింది.
ఆ తరువాత తనూ అక్కలాగే పార్ట్ టైం పనులు చేసి సంపాదన మొదలు పెట్టాక అమ్మ కొ౦చ౦ ప్రేమగా మాట్లాడేది.
డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా ఆవిడలో ప్రేమ పొ౦గిపొర్లెది.
లేకపోతె మొహం మాడ్చుకుని ముభావంగా ఉండటం.
అక్క నిజంగా కన్నతల్లికన్న ఎక్కువగా చూసింది.

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!