Monday, January 18, 2021
Home > పుస్తక పరిచయం > అనుభవ సత్యాలు మోపిదేవి రాధాకృష్ణ గారి “ కాంతి కెరటాలు” రెక్కలు… – సబ్బని లక్ష్మీనారాయణ

అనుభవ సత్యాలు మోపిదేవి రాధాకృష్ణ గారి “ కాంతి కెరటాలు” రెక్కలు… – సబ్బని లక్ష్మీనారాయణ

ఇటీవలి కాలములో కవితా జగత్తులో నానీలు, నానోలు, రెక్కలు అనే చిరు కవితలు బహుళ ప్రచారం పొందుతున్నాయి. నానీల సృష్టి కర్త డా. ఎన్. గోపి గారైతే, నానోల సృష్టి కర్త ఈగ హనుమాన్ గారైతే, రెక్కల సృష్టి కర్త సుగంబాబు గారు. వేటి లక్షణాలు వాటికున్నాయి మౌలికంగా. రెక్కల గురించి చెపుతే అవి అంతా ఆశామాషిగా రాసేవి కావు. కవితలకి రెక్కలస్తే అవి విహంగాల్లా ఎగురుతాయి సాహితీ లోకములో. భావస్పోరకంగా, చిక్కగా, తాత్వికంగా, బతుకు లోతుల్లోంచి అనుభవ సత్యాలను వెలువరించే ప్రక్రియ రెక్కలు. రెక్కలు ఆరు లైన్లలో ఉండే చిన్న కవితలు. మొదటి నాలుగు లైన్లలో విషయాన్ని చెప్పి, ఆ నాలుగు లైన్ల సారాన్నంత చివరి రెండు లైన్లలో ఇమిడ్చి చాల లోతుగా కవితను పూర్తిచేయడం. వాల్మీకి రాసినా, బర్త్రుహరిరాసినా, వేమన రాసినా ఊర్కే రాయలేదు. బతుకు మూలాల్లోంచి జీవన సారాన్నిమధించి రాసారు.అలా రెక్కలను సృష్టించాలనుకొంటే అంత జీవితావగాహన, బతుకు మర్మము ఎరిగి ఉండాలి. నిజాయితిగా, సత్యంగా బతుకును ప్రస్పుటింపచేయాలి. సుగంబాబుగారి అడుగు జాడల్లో రెక్కలు ప్రక్రియ వృద్ధి చెంది పలువురి కవులను అది విశేషంగా ఆకర్షిస్తుంది నేడు. ఆ రెక్కల కవిత మార్గములో ఇటీవలి కాలములో వెలువడిన మంచి రెక్కల పుస్తకం మోపిదేవి రాధ కృష్ణ గారి ‘కాంతి కెరటాలు’ ఒకటి. ఏదయినా అనుభవించి పలువరించమన్నాడు మహాకవి శ్రీ శ్రీ. అలా అనుభవించి పలువరించినవే మోపిదేవి రాధ కృష్ణ గారి రెక్కలు. అద్దేపల్లి, సుధామ, విహారిగార్ల ముందు మాటలతో, రెక్కల రూపశిల్పి సుగంబాబు గారి అభినందన వచనాలతో వెలువడిన పుస్తకమిది. పుస్తకము హస్త భూషణము అన్నట్లు ముచ్చటైన గెటపుతో నూటా రెండు పేజీల్లో, పేజికి ఒక్క రెక్క చొప్పున నూటా రెండు రెక్కలు ఉన్నాయి ఇందులో. వారు ఉద్యోగ రీత్య రిటైరైన తర్వాత రెక్కలపై మక్కువతో వెలువరించిన పుస్తకమిది. సత్యాని ప్రకటించడం, ఆవిష్కరించడం కవిత్వం యొక్క లక్షణం. ఆ రెక్కల్లో కొన్ని:

‘తెలియనంత వరకు
అజ్ఞానం
తెలిసిన తర్వాత
జ్ఞానం
పడిలేస్తూ
లేగడూడ పరుగు.’ అంటారు వారు, ఈ బతుకును లేగడూడ పరుగుతో పోలుస్తూ, జ్ఞాన,అజ్ఞానాలను విశ్లేషిస్తూ.
ఇంకో రెక్కలో
‘వ్యసనాలు
మనిషిని
పీక్కు
తింటాయి
జీవితం
భలి పశువు.’ అంటారు.

బతుకును తిర్చిదిద్ధుకొనే, లేదా ధ్వంసం చేసుకొనే వీలు ఎవరికి వారి చేతుల్లోనే ఉంది అనే సత్యం ఉంది పై రెక్కలో .

ఇంకో రెక్కలో, ‘గొప్పగా ఎదిగానని
ఇగోను
పెంచుకుంటే
మూర్ఖత్వమే—
వ్యక్తిత్వమే
రత్న కిరీటం’ ఇది అక్షరాలా సత్యం మేము గొప్పవాళ్ళమని విర్రవీగే మనుషులకు, మరీ కవులకు, కళాకారులకు వర్తిస్తుంది వ్యక్తిత్వం ఉండాలని చెపుతూ.

ఇంకో రెక్కలో,
‘స్వయంకృషితో
పొందిన
ఆనందం
వర్ణనాతీతం
తేనెటీగల శ్రమే
తేనే’ ఎంత గొప్ప మాట ఇది. బతుకు ఎవరికి వారు తిర్చిదిద్దుకోనేది, స్వయంకృషితో అందుకొనేది.బతుకు ఒక మధువనం, మంచివాళ్ళ సృష్టి లోకహితానికి.

మనిషి అజ్ఞానాన్నితెలియచేస్తున్నట్లు కింది రెక్కలో,

‘ఎన్ని స్సార్లు
చూసుకున్నా
అద్దంలో కనపడేది
నీ ఆకారమే-
కనిపించనిది
ఆత్మసౌందర్యం.’ ఇది సత్యం కదా! ఆత్మసౌందర్యం తెలిసిన వాళ్ళు ఎందరు?

వారు ఇంకో రెక్కలో మంచి పుస్తకాల సందేశము గురించి చెపుతూ,
‘మంచి పుస్తకం
ఒక్కటి చాలు
నిన్ను
మార్చేయడానికి-
సందేశముతోనే
పరివర్తన !’ అని అంటారు. రామాయణమైనా, మహాభారతమైనా, ఖలీల్ జిబ్రాన్ కవితలైనా, వేమన పద్యాలైనా, బర్త్రుహరి సుభాషితాలైనా గొప్ప సందేశాలు కదా! ఇలా చెప్పుకుంటూపోతే నూటా రెండు రెక్కల్లో నూటా రెండు జీవిత సత్యాలను ఆవిష్కరించారు వారు. నూటా రెండు రెక్కల్లో నూటా రెండు రెక్కలు అన్నీ బాగున్నాయని కాదు కాని వారే ఒక్క రెక్కలో చెప్పినట్లు,
‘అన్నీ రాత్నాలే
ఆ రత్నాల్లో
వజ్రం
చూడాలి
వెరైటియే
మనోహారం’ అని అన్నారు. అలా ఈ రెక్కల్లో కొన్ని వజ్రాలున్నాయి, చదివి చూడాలి. ఇలా మంచి రెక్కలు వెలువరించిన మోపిదేవి రాధాకృష్ణ గారు అభినందనీయులు.

– సబ్బని లక్ష్మీనారాయణ , Mobile: 09247270941.

ప్రాప్తి స్థానం:

కాంతి కెరటాలు (రెక్కలు)
వెల: రూ. 50
మోపిదేవి రాధాకృష్ణ,
Flat. No. 104, G.R.Reddy Nagar Colony,
ECIL, Post: Kapra
Hyderabad-500002.( A.P.)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!