Monday, August 8, 2022
Home > కథలు > క్షమయా! -వి. సునంద

క్షమయా! -వి. సునంద

మమ్మీ! నా పింక్ డ్రస్ తీసిపెట్టు స్నానానికి వెళ్తున్నా! గట్టిగా కేకవేస్తూ బాత్రూం లో దూరింది సౌందర్య.
టిఫిన్లు, కూరలు తయారుచేసే హడావిడి లో వున్న శ్యామలకు కూతురు మాటలతో కోపం నషాళానికి అంటింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్దితి తనది…. ఏమైనా అంటే కూతురి ముందే తిట్ల దండకం మొదలెడతాడు భర్త కామేశం…
పంటి బిగువున కోపాన్ని అగ్ని పెట్టి షెల్ఫ్ లోంచి డ్రస్సు తీసి గదిలో పెట్టేసి వచ్చింది…

“ఏయ్..! నా సాక్స్ కనపడ్డం లేదు ఎక్కడ పెట్టావ్”.. అన్న మాటలకు పనిమనిషి కూడా పేరు పెట్టి పిలవందే ఒప్పుకోదు.. ఎప్పుడూ ఇంతే.. లోలోపలి బాధను దిగమింగుకుని ఎదురుగానే కనబడుతున్న సాక్స్, షూలను భర్త కూర్చున్న దగ్గర పెట్టి వంటగదిలోకి పరుగెత్తింది. గబగబా భర్తకు కూతురికి బాక్స్ లు సర్ది బ్యాగుల్లో పెట్టింది. కొడుక్కి సెలవిచ్చారు.. లేదంటే తన ప్రాణానికి మరో గండ ముండేది… అనుకుంటుండగానే..

“మమ్మీ! డ్రస్సంటే అదొక్కటే కాదు, అన్నీ మ్యాచింగ్ పెట్టాలని తెలియదా? చూడండి డాడీ”! తండ్రికి కంప్లైంట్ చేసింది… ‘కాలేజీ మొహం చూస్తే గదరా అవన్నీ తెలిసేవి.’పల్లెటూరి మొద్దు అరకొర చదువు ఏం తెలుస్తుంది.. వ్యంగ్యంగా అంటుంటే, అందుకు బిడ్డ గూడా వంత పాడుతుంటే దుఃఖం ముంచుకొచ్చింది. ఇదేమిటని ఎదురంటే ఆ రోజంతా రణ రంగమే. సెలవు పెట్టి మరీ ఏడిపిస్తాడు.. మౌనంగా వుండి పోయింది శ్యామల…

ఎన్ని కలలు కన్నది పెళ్ళి గురించి. ఆకారం చూడగలిగారు గానీ మనో వికారాన్ని కనిపెట్ట లేక పోయారు తల్లిదండ్రులు..

శ్యామలది పల్లెటూరు. తాతల నాటి ఆస్తిని తల్లి దండ్రులు పెంచుకుంటూ వచ్చారు. చాలా కాలానికి కలిగిన బిడ్డనని అల్లారుముద్దుగా పెంచుతూ అత్తారింట్లో ఎలా వుండాలో బుద్దులెన్నో నేర్పారు. పై చదువులకు దూరం వెళ్ళవెలసి వస్తుందని మానిపించారు. పద్దెనిమిది నిండకుండానే పెళ్ళి చేసి చదువుకున్న అల్లుడు దొరికినందుకు మురిసిపోయారు..
మహా పట్నంలో తండ్రి కొనిచ్చిన ఇంట్లో మహారాణి లా బతకుతాననుకుంది.. ఇరవై ఏండ్లకే ఇద్దరు పిల్లల తల్లై కట్టుకున్నవాడికి కట్టుబానిసలా మారాల్సి వస్తుందనుకోలేదు.. పెళ్ళయిన కొన్నేళ్ళకే యాక్సిడెంట్ లో తల్లిదండ్రులను కోల్పోయి అనాధ అయ్యింది.. ఎన్నో సార్లు ‘ఎందుకీ జీవితం’ అనుకుంది.. పేగుబంధం వదులుకోలేక ఎన్నాళ్ళకైనా మారక పోతారా అనే చిన్న ఆశతో బతుకుతోంది.

“డాడీ! ఈ రోజు నాకు బర్త్ డే పార్టీ వుంది లేటుగా వస్తాను బై” అంటున్న బిడ్డ మాటలకు “త్వరగా రా తల్లీ! “అసలే రోజులు బాగా లేవు” అంటున్న భార్యతో “నీలా పిరిగ్గొడ్డు కాదు నా బిడ్డ.. పిరికి మందు నూరి పోయకు” అంటూ బ్యాగేసుకుని ఆఫీసుకు వెళ్తూ అన్న భర్త మాటలకు నివ్వెరపోయి అలాగే నిలుచుండి పోయింది….

“అమ్మా! పనైపోయింది వెళతున్నా” అన్న పనిమనిషి రాజమ్మ మాటలకు ఈలోకంలోకి వచ్చింది..
“రాజమ్మా! నాకెందుకో భయంగా వుంది.. పిల్లవాలకం చూస్తుంటే” చిగురుటాకులా వణికిపోతూ కుర్చీలో కూలబడింది.
“అయ్యో! తల్లీ! నోట్లో నాలికలేని దానివి.. దిగులు పడకు ఏం కాదులే” అంటూ శ్యామల దగ్గరికి వచ్చింది రాజమ్మ.
రెండు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే, తల్లిలా ఓదారుస్తూ అక్కడే కూచుండి పోయింది.. బాధ నుండి కొద్దిగా తేరుకున్న తర్వాత
‘అమ్మా! మల్లొస్తా ధైర్యం చెడకని చెప్పి వెళ్ళింది రాజమ్మ.
ఎప్పుడో పదకొండు గంటలకు లేచిన కొడుకు, ఫ్రెండ్స్ రమ్మన్నారంటూ ఎప్పుడొచ్చేది చెప్పకుండానే బైకేసుకుని వెళ్ళి పోయాడు..

రోజురోజుకూ ఒంటరితనం ఎక్కవవుతోంది శ్యామలకు… బిడ్డ బాధ్యత తీరేదాకా బతకాలి తప్పదు అనుకుంటూ టైం చూసింది. ఈపాటికి ఈయన రావాలి ఇంకా రాలేదెందుకో అనుకుంటుండగా ఫోన్ చేసి ముఖ్యమైన పనిమీద ఊరెళ్తున్నా అని చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా పెట్టేశాడు కామేశం.
సౌందర్య కోసం గేటుకు కళ్ళు అతికించి వరండాలో మెట్లమీద కూర్చుండిపోయింది..
రాజమ్మ సాయంత్రం పనికి శ్యామల ఇంటికి
రాగానే విషయం తెలుసుకుని తన కొడుక్కు ఫోను చేయించింది..
రాజమ్మ కొడుకు ఆటో డ్రైవర్. అప్పుడప్పుడు కాలేజీ బస్సు రాకపోతే సౌందర్య ను కాలేజీలో దింపి వస్తుంటాడు..
అమ్మగారి ఆందోళనను కనిపెట్టి
వాళ్ళు ఏ హోటల్లో పార్టీ చేసుకుంటారో నాకు తెలుసమ్మా.. నే వెళ్ళి తీసుకొస్తా.. అనగానే
రాజమ్మా! మనం కూడా వెళ్దాము నాతో వస్తావా! అనగానే పద తల్లీ అంటూ ఆటో ఎక్కింది రాజమ్మ….

రాజమ్మ కొడుకు ఆరా తీశాడు..కాలేజీ పిల్లలు కొందరు స్పెషల్ రూం తీసుకొని అందులో వున్నారని చెప్పాడు.. రాజమ్మతో కలిసి రూమ్ దగ్గరికి వెళ్ళింది శ్యామల.. లోపల నుండి
ఆడామగా గొంతులు ముద్దముద్దగా వినబడుతున్నాయి.. “ప్లీజ్ సంజయ్! నన్నేం చేయొద్దు..” అన్న కూతురి మాటలు వినిపించాయి. ఆ మాటలు వినగానే ఒక్క ఉదుటున లోపలికి పరుగెత్తింది శ్యామల.. తలుపులు వేయబోతున్న మరొక ఫ్రెండ్ శ్యామల వేగానికి కిందపడి పోయాడు.. లోపలంతా అస్తవ్యస్తంగా వున్న బట్టలతో, కూల్డ్రింక్స్ చిప్స్ పాకెట్లతో… జరగబోయే ఘోరానికి హెచ్చరిక లా వుంది… సంజయ్ చెంపల మీద టపాటపా వాయించి

‘ఇదేనా మీ చదువు సంస్కారం’ అంటూ, కూతుర్ని తనవైపు లాక్కుని ఈ చెంపా ఆ చెంపా వాయించింది..
ఊహించని పరిణామానికి విస్తుపోతున్న వాళ్లనలా వదిలేసి సౌందర్యను బరబరా ఈడ్చుకుంటూ రాజమ్మ సాయంతో ఇంటికి తీసుకొచ్చింది…
మత్తు దిగిన సౌందర్యకు జరిగింది గుర్తుకు వచ్చి సిగ్గుతో తలవంచుకుంది….. సమయానికి తల్లి రాకపోతే… ఆ తర్వాత ఊహించలేక పోయింది..

మరుసటి రోజు పతాక వార్త.. పుట్టిన రోజు పేరుతో హోటల్ రూంలో తప్పతాగి పట్టుబడిన కాలేజీ విద్యార్థులు…అందులో తన పేరు లేకపోవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంది సౌందర్య…
ఈ దెబ్బతో కొడుకు బయటికి వెళ్ళకుండా కాలేజీ నుండి నేరుగా ఇంటికి రాసాగాడు.
భర్త కామేశం
పది రోజుల తర్వాత ఆఫీసు డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసరికి,
మారిన పిల్లలతో ఇళ్ళంతా కొత్త
కొత్తగా కనిపిస్తుంటే తట్టుకోలేక పోయాడు… ”ఏం జేసావ్ నా బిడ్డలను ఏం నూరి పోసావు..? ఈ పదిరోజులు..? ” అంటున్న తండ్రిని చూస్తూ..
”అమ్మంటే అర్థం తెలిసేలా చేసింది’ డాడీ!..”తప్పులు తెలిసేలా చేసి, మమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దింది”అంటూ
ఆ రోజు విషయం చెప్పబోతుంటే.. పీడకలను పదే పదే గుర్తుకు తెచ్చుకోవద్దంటూ పిల్లలను గుండెలకు హత్తుకుంది శ్యామల.. విషయమేమిటో తెలియక పులి లాంటి కామేశం కాగితం పులిలా మారిపోయాడు..

ఆ రోజు రాజమ్మ కుటుంబం ఇచ్చిన భరోసా ధైర్యం తన జీవితంలో చీకట్లను తొలగించింది… అమ్మలేని లోటు తీర్చిన రాజమ్మకు శ్యామల మరో కూతురయ్యింది…

-వి. సునంద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!