Tuesday, May 17, 2022
Home > సీరియల్ > చుక్కాని చిరు దీపం! (8 వ భాగం) -స్వాతీ శ్రీపాద

చుక్కాని చిరు దీపం! (8 వ భాగం) -స్వాతీ శ్రీపాద

ఒకసారి హైస్కూల్ చదువు ముగిసాక అప్పుడే జీవితం ఆరంభం అయినట్టు అనిపించింది. అక్కతనతో పాటే తన గదిలోనే ఉంచుకుంది. ఆ అపార్ట్ మెంట్ అప్పటికే అక్క కాక మరో నలుగురు షేర్ చేస్తున్నారు. అందువల్లే ఖర్చులు కలసి వచ్చేవి. తనను కూడా కాలేజిలో చేర్చాక రెండు భాగాలు అద్దె మిగతా ఖర్చులు కూడా రెండు మూడు నెలలు అక్కే కట్టి౦ది.
కాని ఆ తరువాత అది కొంచం బాధ అనిపించింది. అక్క ఉదయం సాయంత్రం పనిచేసి కాలేజికి వెళ్ళడం, అందుకే తనూ ఏదో ఒక పార్ట్ టై౦వర్క్ చూసుకోవాలనుకు౦ది.
ఆ విషయమే ఆలోచిస్తూ పరధ్యాన్నంగా ఉన్న తనను పేరు పెట్టి పిలిచి మరీ ఈ లోకానికి తెచ్చాడు జేమ్స్.
“మిస్ పార్కర్”
తుళ్లిపడి తెరుకు౦ది.
“ మీట్ మీ ఆఫ్టర్ ద క్లాస్”
తలూపింది.
చెప్పాక వెళ్ళక తప్పదు కదా?
క్లాస్ ముగిసాక వెళ్ళింది, యూనివర్సిటీ కాంటీన్ లో కూచున్నారు ఇద్దరూ.
ఇద్దరికీ కాఫీ ఆర్డర్ చేసి వచ్చాడు.
“ ఏమైంది మిస్ పార్కర్, ఎప్పుడూ చాలా చురుకుగా ఉండే దానవు? ఎ౦దుకంత పరధ్యాన్నం?” కాజువల్ గా అడిగాడు. ముందు కాస్త తడబడి తప్పించుకోవాలని చూసినా అతని కన్ సర్న్ చూసాక మెత్తబడి౦ది.
“ మీ డాడీ ఏం చేస్తారు? మామ్?” వెళ్లి కాఫీ తీసుకు వచ్చాడు.
కాలేజిలో ఉన్న లెక్చరర్స్ అందరిలోకీ నిజానికి జేమ్స్ స్పురద్రూపి.
చూడగానే ఇట్టే ఆకర్షి౦చే రూపం, మెత్తని మాట.
ముఖ్యంగా విద్యార్దులందరితోనూ స్నేహంగా ఉంటాడు.
నెమ్మది నెమ్మదిగా తల్లి గురించి, తండ్రి గురించీ వారి వారి కుటు౦బాల గురి౦చీ వీలైనంత మంచే చెప్పింది.
“మా చదువులు వాళ్లకు శక్తికి మించిన పని, కాని ఇప్పుడు చదువు ఆపితే మళ్ళీ చదవ బుద్ధి కాదు అంటుంది అక్క. అలాగని అక్క మీద పూర్తిగా ఆధారపడటం బాగాలేదు. బయటకు వెళ్లి పనిచెయ్యాలంటే కారు కావాలి. అది ఇప్పుడు కొనే స్థితిలో లేము.
అదే ఆలోచిస్తున్నాను, ఇక్కడ స్టోర్ లోనో కాంటీన్ లోనో ఏదైనా పని చూసుకోవాలని…”
కాస్సేపు కాఫీ సిప్ చేస్తూ సాలోచనగా చూసాడు.
ఇతనికి చెప్పితప్పు చేసానా? అనుకుంటూ సగం చెదిరిపోయిన నెయిల్ పాలిష్ చూసుకుంటూ కూచు౦ది మిస్ పార్కర్.
ఇహ చెప్పేసి వెళ్లి పోదామా అనుకుంటూ ఉండగా అడిగాడు జేమ్స్
“ కాంపస్ లో ఉద్యోగం ఎలా ఉంటుంది? టీచింగ్ నోట్స్ కాపీ చెయ్యడం ఆఫీస్ వర్క్…”
ఎగిరి గ౦తెయ్యాలని అనిపి౦చి౦ది.
“ నా ఆఫీస్ లోనే, నిజానికి ఎవరయినా సిన్సియర్ అసిస్టెంట్ దొరుకుతారా అని చూస్తున్నాను… సరిగ్గా సమయానికి కనిపించావు.”
నిజానికి తొలి సారి జీవితం లో తనూ అదృష్టవంతురాలననే అనుకుంది.
అక్కకూ కొంచం భారం తగ్గించాలి.
సంతోషంగా సరేనని చెప్పి ఆఘమేఘాల మీద ఈ వార్త అక్కకు చెప్పడానికి వెళ్ళింది.
ఉహు, ఎంత వెదికినా ఎలిజబెత్ కనబడితేగా?
సాయంత్రం వరకు అలా ఉగ్గబట్టుకుని ఉందో, రూమ్ కి వెళ్తూనే ఎలిజబెత్ ను గట్టిగా హగ్ చేసుకుని ఉక్కిరి బికిరి చేసింది.
చివరికి ఐదారుసార్లు కిస్ చేసుకుని విషయం చెప్పింది.
“ ఎలిజా రియల్లీ ఆయామ్ ఎలేటేడ్” అంది.
“ మన కష్టమే మనకు పెద్ద అండ పార్క్ డియర్, కష్టపడటానికి సిద్ధంగా ఉంటే వద్దన్నా విజయం మనతోతే వస్తుంది.” ఎలిజబెత్ కూడా చాలానే సంతోషి౦చి౦ది.
మొత్తానికి ఇద్దరి సంపాదనల వల్ల ఉన్నంతలో కోరుకున్న బట్టలు, కొంచం మేకప్ సామాను కొనగలిగే స్థితికి వచ్చారు.
జేమ్స్ కూడా ఒక లెక్చరర్ గానో, బాస్ లానో కాక మంచి మిత్రుడిలా కష్టం సుఖం పంచుకునే వాడు.
అప్పుడప్పుడు తనతో సెమినార్లకు తీసుకు వెళ్ళడం, లంచ్ కీ డిన్నర్ కీ పిలవడం మామూలు అయిపోయింది.
యూనివర్సిటీ సెమినార్లకు వెళ్ళినప్పుడు మొదట్లో సెమినార్ కు వచ్చిన లేడీ అసిస్తేమ్త్స్ ఎవరయినా ఉంటే వారితో రూమ్ షేర్ చేసుకునేది పార్కర్.
పోను పోను ఇద్దరి మధ్యా చనువూ ఆత్మీయత పెరిగాయి.
జేమ్స్ భార్య మెలిసా ఎక్కడో సాఫ్ట్ వేర్ కంపెనీలో రిసెప్షనిస్ట్. వారికి ఇద్దరు అబ్బాయిలు. పది, పన్నెండేళ్ళ వాళ్ళు. ఒకరు ఎలిమెంటరీ స్కూల్లో మరొకరు మిడిల్ స్కూల్లో ఉన్నారు.
జేమ్స్ ఇంట్లో విషయాలన్నీ పార్కర్ తొ షేర్ చేసుకుంటాడు. భార్య మేలిసాతో జరిగినవి, కొడుకుల నాటీనెస్ అన్నీ.
ఒకరోజున హఠాత్తుగా అడిగాడు, “ నీ కెవరూ బాయ్ ఫ్రెండ్ లేడా?”
మొహం కందిపోయి అసలే గులాబీ రంగు మరింత ఎరుపెక్కి తోలు తీసిన బీట్ రూట్ లా మారింది.
సిగ్గుపడుతూ తల అడ్డంగా ఊపింది.
అక్క ఎలిజబెత్ కి బాయ్ ఫ్రెండ్ దొరికాడు. అతనితో సినిమాలూ షికార్లూ, వీకెండ్స్ లో లాంగ్ డ్రైవ్స్ చూస్తూనే ఉంది. అయినా ఎవరితోనయినా పెద్దగా మాట్లాడని తనకు ఎవరు దొరుకుతారు అనుకుంది.
ఆ లేట్ టీన్స్ లో ఇలా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ మామూలే అయితే ఆ అనుబంధం ఎంతవరకూ కొనసాగుతు౦దనేది ఎవరూ చెప్పలేరు.
రోజులే ఉండవచ్చు లేదూ నెలలు కొనసాగవచ్చు ఒక్కోసారి జీవిత భాగస్వాములుగా మారనూ వచ్చు.
“ఎ౦దు కంత బ్లష్ అవుతున్నావు? నీకెవరూలేరని నాకు తెలుసు కాని… “
కాస్సేపు నిశ్శబ్దం.
రెండు నిమిషాల తరువాత,
“విల్ యూ బీ మై గర్ల్ ఫ్రె౦డ్ ?” నెమ్మదిగా పలికి౦ది అతని స్వరం.
విన్నది నిజమో అబద్దమో పార్కర్ మనసులోకి ఇ౦కలేదు.
“తొ౦దరేం లేదు డియర్, నెమ్మదిగా ఆలోచించుకో … “
“అవును, ఇప్పుడే నేనేమీ చెప్పలేను, ఈ సమయం లో మిమ్ములను డిస్టర్బ్ చెయ్యాలనీ లేదు. అలాగని కాదనీ అనలేక పోతున్నాను. గివ్ మీ సమ్ టై౦”
అయిదారు రోజులు అన్యమనస్కంగానే గడిపి౦ది.
జేమ్స్ బాధపడ్డాడు కూడా, అనవసరంగా సాఫీగా సాగుతున్న సమయాన ఆమె మనసు కల్లోల పరచానా అనుకున్నాడు. అదే మాట పార్కర్ తొ అన్నాడు కూడా.
“అదే౦ లేదు. నేనే పరిపరి విధాల ఆలోచిస్తూ … ఒకటి మాత్రం నిజం జీవితం లో ఇంత వరకూ మీ అంత దగ్గరైనది ఎవరూలేరు జేమ్స్. కానీ మేలిసాకు అన్యాయం చేస్తున్నానేమోనని గిల్టీ ఫీల్. మరోపక్క మీ ఆత్మీయతను వాదులు కోలేను. ఇలా బాయ్ ఫ్రెండ్ అనకుండా మనం స్నేహితులుగా ఉ౦డలేమా?”
అతని వైపు చూసింది.
చిరునవ్వే జవాబు.
మరో రెండు రోజుల తరువాత ఆ రోజు శనివారం. వీకెండ్ అయినా పని ఉండటం వల్ల జేమ్స్ తన ఆఫీస్ కి వచ్చాడు. పార్కర్ కూడా అతనికి సాయం చెయ్యడానికి రమ్మంటే వచ్చింది. ఎక్స్ప్రేసో మిషన్ ఆన్ చేసి బ్లాక్ కాఫీ అతనికి ఇస్తూ
“ ఆలోచించాను జేమ్స్, మీకు ఏది ఇష్టం అయితే అదే నాకూ ఇష్టం.” కొంచం నంగి నంగిగా అంది.
“నిజం, థాంక్స్ ఎలాట్ పార్కర్, కాఫీ తొ పాటు ఆమె చేతినీ అందుకున్నాడు. ఆ రోజు పని పూర్తయాక పార్కర్ ను సిటీ లొ ఆలివ్ గార్డెన్స్ కి లంచ్ కి తీసుకు వెళ్ళాడు. తిరిగి వచ్చేప్పుడు ఏవో చిన్న చిన్నబహుమతులు, ఒక పర్ఫ్యూమ్ బాటిల్, లిప్ స్టిక్, నెయిల్ పాలిష్ వంటివి కొనిచ్చాడు. ఆమెను వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ది౦పి వెళ్ళిపోయాడు.

ఈ విషయం ఎలిజబెత్ తో షేర్ చేసుకోవాలా వద్దా అనేది అర్ధం కాలేదు. అక్క తన బాయ్ ఫ్రెండ్ గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. అంటే కొన్ని విషయాలు ఎవరికీ వారికి స్వంతంగా దాచుకోవాలన్న మాట. చివరికి చెప్పవద్దనే నిర్ణయి౦చుకు౦ది.
కొత్త పర్ఫ్యూమ్, నెయిల్ పాలిష్ వగైరాలు చూసి ఎలిజబెత్ కన్నుగీటి నవ్వింది కాని పెద్దగా ఆరా తియ్యలేదు,
ఆ తరువాత వారం షికాగో యూనివర్సిటీలో సెమినార్ కి ఇద్దరూ వెళ్ళినప్పుడు, తనతో బాటే ఉండమని సూచించాడు. కాదనలేకపోయి౦ది.
బెరుకు బెరుగ్గా మొదలైన అనుబంధం ఒకరిని చూడకుండా ఒకరు ఉ౦డలేనంత వరకూ వచ్చి౦ది.
నోరు విప్పకుండానే ఆమె అవసరాలన్నీ చూసే వాడు జేమ్స్.
ఎలిజబెత్ మాస్టర్స్ చెయ్యడానికి మూవ్ అవుతో౦ది. ఒకప్పుడు అక్క లేకుండా క్షణ౦ గడవదు అనుకున్న పార్కర్ ఆమెను సంతోషంగా సాగనంపింది.
ఇదివరకూ లాగే మేలిసా విషయాలు, పిల్లల సంగతులు అరమరికలు లేకుండా ఆటను చెప్పినా పార్కర్ గుండెలో ఎక్కడో కలుక్కుమనేది.
“అవును, నేను జస్ట్ ఒక గర్ల్ ఫ్రెండ్ అంతే.” అనుకోగానే కళ్ళలో నీళ్ళు తిరిగేవి.
ఎంతయినా భార్య భార్యే. ఆమె పై ఉన్న శ్రద్ధ, ఆసక్తి తనమీద ఎందుకు ఉంటాయి అనిపి౦చెది.
సెల్ ఫోన్ అతనే కొనిచ్చాడు, కాని అతను ఫోన్ చేసినప్పుడే మాట్లాడాలి.
తను చేసినా ఫోన్ ఎత్తాడు, ఎత్తినా అయాం ఎట్ హోమ అంటాడు.
అసలు ఎందుకు చేసానా అని అనిపించేలా …
కాని ఎప్పటికప్పుడు నచ్చజేప్పుకోడమే.
ఈ పాటి మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు అతన్ని కాదనుకోడానికని. ఒక సెకండ్ సేల్ కారు కూడా కొనిచ్చాడు.
ఈ భావాల మధ్య ఈ స్థితిలో ఉండర గ్రాడ్ పూర్తి చేసి మాస్టర్స్ కోసం అప్ప్లై చేసినప్పుడు, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ కి రిఫర్ చేసాడు, సీట్ వచ్చింది.
వెళ్ళక తప్పదు. వెక్కిళ్ళు వచ్చేలా ఏడ్చి కళ్ళు తుడుచుకుని బయలు దేరింది.
మొదట్లో రోజుకి రెండు సార్లు ఫోన్ చేసే వాడు తరువాత అది వారానికి రెండు మార్లు కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
పని ఎక్కువగా ఉందనీ ఎవరో ఒకరు ఉండటం వల్ల కుదరటం లేదనీ చెప్పేవాడు.
సెమిస్టర్ ఫీజ్ మాత్రం టంచనుగా ఆన్ లైన్ లోనే కట్టేసేవాడు.
ఏడాది తిరిగేసరికి నెలకోసారి కాల్ చెయ్యటం వరకూ వచ్చింది. ఈ లోగా కాస్త ప్రపంచం జ్ఞానం విస్తృతమై పరిసరాలు ఆకళి౦పుకు వచ్చాక పార్కర్ కూడా అడోలసెంట్ బాయ్ ఫ్రెండ్ అని సర్దుకుంది. అయినా ఆ తలపులు మధురంగానే తోచేవి.
జీవితంలో మొదటి ప్రేమ అనుభూతి కదా.
ఇంకా ఒక సెమిస్టర్ మిగిలి ఉండగానే మంచి జాబ్ ఆఫర్ కూడా వచ్చింది.
ఆ వార్తకు కంగ్రాట్స్ చెబుతూ, “ఎవరినైనా చూసుకుని సెటిల్ ఆవు పార్కర్” అన్న మెస్సేజ్ కూడా వచ్చి౦ది జేమ్స్ నుండి.
ఆ సమ్మర్లో యూరోప్ ట్రిప్ కి వెళ్లి తమ కుటుంబం ఫోటోలు ఫేస్ బుక్ లొ అప్లోడ్ చేసిన జేమ్స్ ఒక లింక్ పార్కర్ కి పంపుతూ
“ఎంజాయ్ లైఫ్ యాజ్ పాజిబుల్” అన్న మెస్సేజ్ పెట్టాడు.
చివరి సెమిస్టర్ లొ జోసఫ్ పరిచయమయాడు. జేమ్స్ తో పోల్చుకు౦టే పెద్ద అ౦దగాడు కాదు. అయినా అడపాదడపా పార్కర్ కు సాయపడుతూ ఉండే వాడు. ఆ పరిచయం కాస్త పెరిగింది.
అపార్ట్మెంట్ కి వస్తూ ఉండేవాడు.
ఈ సారి కొంచం ఆచితూచి ప్రవర్తించడం నేర్చుకు౦ది పార్కర్. తన రూమ్ మేట్స్ లొ ఒకరైన లిసా కూడా అప్పుడప్పుడు అతనితో మాట్లాడుతూ ఉండేది.
“ఎ మాడెస్ట్ గై” ఆమె సర్టిఫి చేసాకే, అతన్ని బాయ్ ఫ్రెండ్ అనుకు౦ది. సెమిస్టర్ పూర్తయే వరకూ ఎక్కడ చూసినా ఇద్దరూ కలిసే తిరిగేవారు.
ఇతనితో సెటిల్ అయిపోవచ్చు అనుకున్న తరుణం లో ఒక రోజున క్లాసెస్ కాన్సేల్ అయ్యాయని మరిద్దరితో కలిసి మూవీ కి వెళ్ళినప్పుడు వాళ్ళు గమనించలేదు కాని తమ కన్నా ఆరేడు వరసలు ముందున్న సీట్లలో లిసా జోసెఫ్ ఒకరి మీద ఒకరు వాలిపోయి మూవీ చూడటం, ఒకరికొకరు హత్తుకు పోడం పార్కర్ దృష్టిని దాటి పోలేదు.
నిజానికి ఆమె మూవీకన్నా ఎక్కువగా వారిద్దిర్నే చూసింది.
ఎన్ని సార్లు ఒకరినొకరు ముద్దుపెట్టుకున్నారో లెక్కపెట్టి౦ది.
లిసా ముప్పై ఆరుసార్లు, జోసెఫ్ నలభై రెండు మార్లు.
మనసు ఉడికి పోయింది. వాళ్ళ ఎదురుగా వెళ్లి అడిగేద్దామా అనిపి౦చి౦ది.
ఏదీ చెయ్యలేక కళ్ళనీళ్ళతో ఉ౦డిపోయి౦ది. మూవీ చూసి ఇంత ఏడుపా ?ఎర్రబారిన ఆమె కళ్ళు చూసి మిత్రులు ఆట పట్టి౦చారు.
ఆ తరువాత జోసెఫ్ తోనూ లిసా తోనూ కూడా మాటలు తగ్గించడమే కాకుండా రూమ్ షిఫ్ట్ చేసి వేరే అమ్మాయిలతో ఉండటం సాగించింది.
ఆ పరిచయం అక్కడికి ముగిసిపోయి౦ది.
(సశేషం…)

-స్వాతీ శ్రీపాద

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!